పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవత పారాయణ - 3 : దశమ ఉత్తర 994 - 1104

గురుప్రశంస చేయుట

(994) "తివిరి యజ్ఞానతిమిర ప్రదీపమగుచు ¯ నవ్యయంబైన బ్రహ్మంబు ననుభవించు ¯ భరితసత్త్వుండు, సత్కర్మనిరతుఁ, డతుల ¯ భూసురశ్రేష్ఠుఁ, డలఘుండు, బుధనుతుండు. (995) అమ్మహాత్మునివలన సకల వర్ణాశ్రమంబులవారికి నేను విజ్ఞానప్రదుండ నగు గురుండనై యుండియు గురుభజనంబు పరమధర్మం బని యాచరించితి; నదిగావున. (996) భూసురులకెల్ల ముఖ్యుఁడ ¯ నై సకల కులాశ్రమంబు లందును నెపుడున్ ¯ ధీసుజ్ఞానప్రదుఁ డన ¯ దేశికుఁ డన నొప్పుచుందు ధృతి నెల్లెడలన్. (997) అట్టి వర్ణాశ్రమంబులయందు నర్థ ¯ కుశలు లగువారు నిఖిలైక గురుఁడ నైన ¯ నాదు వాక్యంబుచే భవార్ణవము పెలుచ ¯ దాఁటుదురు మత్పదాంబుజ ధ్యానపరులు. (998) అదియునుం గాక, సకల భూతాత్మకుండ నైన యేను దపోవ్రత యజ్ఞ దాన శమ దమాదులచేత సంతసింపను; గురుజనంబులఁ బరమభక్తి సేవించువారలం బరిణమింతు” నని చెప్పి మఱియు “మనము గురుమందిరమున నున్న యెడ నొక్కనాఁడు గురుపత్నీ నియుక్తులమై యింధనార్థం బడవికిం జనిన నయ్యవసరంబున. (999) ఘుమఘుమారావ సంకుల ఘోర జీమూత¯ పటల సంఛన్నాభ్రభాగ మగుచుఁ¯ జటుల ఝంఝానిలోత్కట సముద్ధూత నా¯ నావిధ జంతుసంతాన మగుచుఁ ¯ జండ దిగ్వేదండ తుండ నిభాఖండ¯ వారిధారాపూర్ణ వసుధ యగుచు ¯ విద్యోతమానోగ్రఖద్యోత కిరణజి¯ ద్విద్యుద్ధ్యుతిచ్ఛటావిభవ మగుచు (999.1) నడరి జడిగురియఁగ నినుఁ డస్తమింప ¯ భూరినీరంధ్రనిబిడాంధకార మేచి ¯ సూచికాభేద్యమై వస్తుగోచరంబు ¯ గాని యట్లుండ మనము న వ్వానఁ దడిసి. (1000) బయలు గొందియుఁ బెను మిఱ్ఱుపల్లములును ¯ రహిత సహితస్థలంబు లేర్పఱుపరాక ¯ యున్న యత్తఱి మనము నొండొరుల చేతు ¯ లూతఁగాఁ గొని నడచుచు నుండునంత. (1001) బిసబిస నెప్పుడు నుడుగక ¯ విసరెడి వలిచేత వడఁకు విడువక మనముం ¯ బస చెడి మార్గముఁ గానక ¯ మసలితి మంతటను నంశుమంతుఁడు పొడిచెన్. (1002) తెలతెలవాఱెడి వేళం ¯ గలకల మని పలికెఁ బక్షిగణ మెల్లెడలన్ ¯ మిలమిలని ప్రొద్దుపొడువున ¯ ధళధళ మను మెఱుఁగు దిగ్వితానము నిండెన్. (1003) అప్పుడు సాందీపని మన ¯ చొప్పరయుచు వచ్చి వానసోఁకునను వలిం ¯ దెప్పిఱిలుటఁ గని ఖేదం ¯ బుప్పతిలం బలికె "నకట! యో! వటులారా! (1004) కటకట! యిట్లు మా కొఱకుఁగాఁజనుదెంచి మహాటవిన్ సము¯ త్కటపరిపీడ నొందితిరి; గావున శిష్యులు! మీ ఋణంబు నీఁ¯ గుట కిది కారణంబు సమకూరెడిఁ బో; యిట మీఁద మీకు వి¯ స్ఫుట ధనబంధుదారబహుపుత్త్ర విభూతి జయాయురున్నతుల్‌. " (1005) కని గారవించి యాయన ¯ మనలం దోడ్కొనుచు నాత్మమందిరమునకుం ¯ జనుదెంచుట లెల్లను నీ ¯ మనమునఁ దలఁతే"యటంచు మఱియుం బలికెన్. (1006) “అనఘ! మన మధ్యయనంబు సేయుచు నన్యోన్య స్నేహ వాత్సల్యంబులం జేయు కృత్యంబులు మఱవవు గదా!” యని యవి యెల్లం దలంచి యాడు మాధవు మధురాలాపంబులు విని యతనిం గనుంగొని కుచేలుం డిట్లనియె. (1007) "వనజోదర! గురుమందిర ¯ మున మనము వసించునాఁడు ముదమునఁ గావిం ¯ పని పను లెవ్వియుఁ గలవే? ¯ విను మవి యట్లుండనిమ్ము విమలచరిత్రా! (1008) గురుమతిఁ దలఁపఁగఁ ద్రిజగ¯ ద్గురుఁ డవనం దగిన నీకు గురుఁ డనఁగా నొం ¯ డొరుఁ డెవ్వ? డింతయును నీ ¯ కరయంగ విడంబనంబ యగుఁ గాదె హరీ!" (1009) అని సాభిప్రాయంబుగాఁ బలికిన పలుకులు విని సమస్త భావాభిజ్ఞుండైన పుండరీకాక్షుండు మందస్మితవదనారవిందుం డగుచు నతనిం జూచి “నీవిచ్చటికి వచ్చునప్పుడు నాయందుల భక్తింజేసి నాకు నుపాయనంబుగ నేమి పదార్థంబు దెచ్చితి? వప్పదార్థంబు లేశమాత్రంబైనఁ బదివేలుగా నంగీకరింతు; నట్లుగాక నీచవర్తనుండై మద్భక్తిం దగులని దుష్టాత్ముండు హేమాచలతుల్యంబైన పదార్థంబు నొసంగిన నది నా మనంబునకు సమ్మతంబు గాదు; కావున. (1010) దళమైనఁ బుష్పమైనను ¯ ఫలమైనను సలిలమైనఁ బాయని భక్తిం ¯ గొలిచిన జను లర్పించిన ¯ నెలమిన్ రుచిరాన్నముగనె యేను భుజింతున్. (1011) అని పద్మోదరుఁ డాడిన ¯ వినయోక్తుల కాత్మ నలరి విప్రుఁడు దాఁ దె¯ చ్చిన యడుకులు దగ నర్పిం ¯ పను నేరక మోము వాంచి పలుకక యున్నన్.

అటుకు లారగించుట

(1012) అవ్విప్రుండు సనుదెంచిన కార్యంబు కృష్ణుండు దన దివ్యచిత్తంబున నెఱింగి “యితండు పూర్వభవంబున నైశ్వర్యకాముండై నన్ను సేవింపండైన నిక్కుచేలుండు నిజకాంతాముఖోల్లాసంబుకొఱకు నా యొద్దకుఁ జనుదెంచిన వాఁ; డితనికి నింద్రాదులకుం బడయ రాని బహువిధంబులైన సంపద్విశేషంబు లీక్షణంబ యొడఁగూర్పవలయు” నని తలంచి యతండు జీర్ణవస్త్రంబు కొంగున ముడిచి తెచ్చిన యడుకుల ముడియఁ గని “యిది యేమి” యని యొయ్యన నమ్ముడియఁ దనకరకమలంబుల విడిచి యయ్యడుకులు కొన్ని పుచ్చుకొని “యివియ సకల లోకంబులను, నన్నును బరితృప్తిం బొందింపఁ జాలు” నని యప్పుడు. (1013) మురహరుఁడు పిడికెఁ డడుకులు ¯ గర మొప్పఁగ నారగించి కౌతూహలియై ¯ మఱియునుఁ బిడికెఁడు గొనఁ ద¯ త్కర మప్పుడు పట్టెఁ గమల కరకమలములన్. (1014) "సొం పారఁగ నతనికి బహు ¯ సంపద లందింప నివియ చాలును నిఁక భ¯ క్షింపఁగ వలవదు త్రిజగ¯ త్సంపత్కర! దేవదేవ! సర్వాత్మ! హరీ! " (1015) అని యిట్లు వారించె; నక్కుచేలుండును నా రాత్రి గోవిందు మందిరంబునఁ దనకు హృదయానందకరంబు లగు వివిధ పదార్థంబు లనుభవించి, మృదుల శయ్యాతలంబున నిద్రించి తన మనంబునం దన్ను సమధిక స్వర్గభోగానుభవుంగాఁ దలంచుచు మఱునాఁ డరుణోదయంబున మేల్కని కాలోచితకృత్యంబులు దీర్చి, యిందిరారమణుండు దన్నుఁ గొంత దవ్వనిపి యామంత్రితుం జేయఁ జనుచు నందనందన సందర్శనానంద లోలాత్ముండై తన మనంబున నిట్లనియె. (1016) "నా పుణ్య మరయ నెట్టిదొ¯ యా పుణ్యనిధిం, బ్రశాంతు, నచ్యుతు, నఖిల¯ వ్యాపకు, బ్రహ్మణ్యునిఁ, జి¯ ద్రూపకుఁ, బురుషోత్తమునిఁ, బరుం గనుఁగొంటిన్. (1017) పరికింపఁ గృపణస్వభావుండ నై నట్టి¯ యే నేడ? నిఖిలావనీశ్వరి యగు ¯ నిందిరాదేవికి నెనయంగ నిత్య ని¯ వాసుఁడై యొప్పు న వ్వాసుదేవుఁ ¯ డేడ? న న్నర్థిమైఁ దోడఁబుట్టిన వాని¯ కైవడిఁ గౌఁగిటఁ గదియఁ జేర్చి ¯ దైవంబుగా నన్ను భావించి నిజతల్ప¯ మున నుంచి సత్క్రియల్‌ పూనినడపి (1017.1) చారు నిజవధూ కరసరోజాత కలిత ¯ చామరానిలమున గతశ్రమునిఁ జేసి ¯ శ్రీకుచాలిప్త చందనాంచితకరాబ్జ ¯ తలములను నడ్గు లొత్తె వత్సలత మెఱసి. (1018) కావున. (1019) శ్రీనిధి యిట్లు నన్నుఁ బచరించి ఘనంబుగ విత్త మేమియు¯ న్నీని తెఱంగు గానఁబడె; నెన్న దరిద్రుఁడు సంపదంధుఁడై ¯ కానక తన్నుఁ జేరఁ డని కాక శ్రితార్తి హరుండు సత్కృపాం ¯ భోనిధి సర్వవస్తుపరిపూర్ణునిఁగా ననుఁ జేయకుండునే? " (1020) అని తన మనంబున వితర్కించుచు నిజపురంబునకుఁ జనిచని ముందట. (1021) భానుచంద్రప్రభా భాసమానస్వర్ణ¯ చంద్రకాంతోపల సౌధములునుఁ¯ గలకంఠ శుక నీలకంఠ సముత్కంఠ¯ మానిత కూజితోద్యానములును ¯ ఫుల్లసితాంభోజ హల్లక కహ్లార¯ కైరవోల్లసిత కాసారములును ¯ మణిమయ కనక కంకణ ముఖాభరణ వి¯ భ్రాజిత దాసదాసీజనములుఁ (1021.1) గలిగి చెలువొందు సదనంబుఁ గాంచి విస్మ ¯ యమునుఁ బొందుచు "నెట్టి పుణ్యాత్ముఁ డుండు ¯ నిలయ మొక్కొ! యపూర్వమై నెగడె మహిత ¯ వైభవోన్నత లక్ష్మీనివాస మగుచు." (1022) అని తలపోయుచున్న యవసరంబున. (1023) దివిజ వనితలఁ బోలెడు తెఱవ లపుడు ¯ డాయ నేతెంచి "యిందు విచ్చేయుఁ" డనుచు ¯ విమల సంగీత నృత్య వాద్యములు సెలఁగ ¯ గరిమఁ దోడ్కొని చని రంతిపురమునకును. (1024) ఇట్లు సనుదేర నతని భార్య యైన సతీలలామంబు దన మనంబున నానందరసమగ్న యగుచు. (1025) తన విభురాక ముందటఁ గని మనమున¯ హర్షించి వైభవం బలర మనుజ ¯ కామినీరూపంబు గైకొన్న యిందిరా¯ వనిత చందంబునఁ దనరుచున్న ¯ కలకంఠి తన వాలుఁగన్నుల క్రేవల¯ నానందబాష్పంబు లంకురింప ¯ నతని పాదంబుల కాత్మలో మ్రొక్కి భా¯ వంబున నాలింగనంబు సేసె (1025.1) నా ధరాదేవుఁ డతుల దివ్యాంబరాభ ¯ రణ విభూషితలై రతిరాజు సాయ ¯ కముల గతి నొప్పు పరిచారికలు భజింప ¯ లలిత సౌభాగ్య యగు నిజ లలనఁ జూచి. (1026) ఆ నారీరత్నంబునుఁ¯ దానును ననురాగరసము దళుకొత్తఁగ ని¯ త్యానందము నొందుచుఁ బెం ¯ పూనిన హరిలబ్ధ వైభవోన్నతి మెఱయన్. (1027) కమనీయ పద్మరాగస్తంభకంబులుఁ¯ గొమరారు పటికంపుఁ గుడ్యములును ¯ మరకత నవరత్నమయ కవాటంబులుఁ¯ గీలిత హరి నీల జాలకములు ¯ దీపిత చంద్రకాంతోపల వేదులు¯ నంచిత వివిధ పదార్థములును ¯ దగు హంసతూలికా తల్పంబులును హేమ¯ లాలిత శయనస్థలములుఁ దనరు (1027.1) సమధికోత్తుంగ భద్రపీఠముల సిరులు ¯ మానితోన్నత చతురంతయానములును ¯ వలయు సద్వస్తు పరిపూర్ణ వాటికలును ¯ గలిగి చెలువొందు మందిరం బెలమిఁ జొచ్చి. (1028) సుఖంబున నుండు నట్టియెడం దనకు మనోవికారంబులు వొడమకుండ వర్తించుచు, నిర్మలంబగు తన మనంబున నిట్లను; “నింతకాలం బత్యంత దురంతంబగు దారిద్య్రదుఃఖార్ణవంబున మునింగి యున్న నాకుం గడపటఁ గలిగిన విభవంబున నిప్పుడు. (1029) ఎన్నఁ గ్రొత్త లైన యిట్టి సంపదలు నా ¯ కబ్బు టెల్ల హరిదయావలోక ¯ నమునఁ జేసి కాదె! నళినాక్షుసన్నిధి ¯ కర్థి నగుచు నేను నరుగుటయును. (1030) నను నా వృత్తాంతంబును ¯ దన మనమునఁ గనియు నేమి దడవక ననుఁ బొ¯ మ్మని యీ సంపద లెల్లను ¯ నొనరఁగ నొడఁగూర్చి నన్ను నొడయునిఁ జేసెన్. (1031) అట్టి పురుషోత్తముండు భక్తినిష్ఠులైన సజ్జనులు లేశమాత్రంబగు పదార్థంబైన భక్తి పూర్వకంబుగా సమర్పించిన నది కోటిగుణితంబుగాఁ గైకొని మన్నించుటకు నిదియ దృష్టాంతంబు గాదె! మలిన దేహుండును, జీర్ణాంబరుండు నని చిత్తంబున హేయంబుగాఁ బాటింపక నా చేనున్న యడుకు లాదరంబున నారగించి నన్నుం గృతార్థునిం జేయుట యతని నిర్హేతుక దయయ కాదె! యట్టి కారుణ్యసాగరుండైన గోవిందుని చరణారవిందంబుల యందుల భక్తి ప్రతిభవంబునఁ గలుగుంగాక!” యని యప్పుండరీకాక్షుని యందుల భక్తి తాత్వర్యంబునం దగిలి పత్నీసమేతుండై నిఖిల భోగంబులయందు నాసక్తిం బొరయక, రాగాది విరహితుండును నిర్వికారుండును నై యఖిలక్రియలందు ననంతుని యనంత ధ్యాన సుధారసంబునం జొక్కుచు విగత బంధనుండై యపవర్గ ప్రాప్తి నొందె; మఱియును. (1032) దేవదేవుఁ, డఖిల భావజ్ఞుఁ, డాశ్రిత ¯ వరదుఁ డైన హరికి ధరణిసురులు ¯ దైవతములు గాన ధారుణీదివిజుల ¯ కంటె దైవ మొకఁడు గలడె భువిని? (1033) మురహరుఁ డిట్లు కుచేలుని ¯ చరితార్థునిఁ జేసినట్టి చరితము విను స¯ త్పురుషుల కిహపరసుఖములు ¯ హరిభక్తియు యశముఁ గలుగు నవనీనాథా!"

శమంతకపంచకమున కరుగుట

(1034) అనిన మఱియుం బరాశరపౌత్రున కర్జునపౌత్రుం డిట్లనియె. (1035) "దుష్టశిక్షణంబు దురితసంహరణంబు ¯ శిష్టరక్షణంబుఁ జేయఁ దలఁచి ¯ భువిని మనుజుఁ డగుచుఁ బుట్టిన శ్రీ కృష్ణు ¯ విమలచరిత మెల్ల విస్తరింపు." (1036) అనిన శుకుం డిట్లనియె. (1037) ధరణీశ! బలుఁడును సరసిజోదరుఁడు న¯ వోన్నతసుఖలీల నుండునంతఁ ¯ జటులోగ్రకల్పాంత సమయమందునుఁ బో¯ దృగసహ్యమై సముద్దీప్త మగుచు ¯ రాజిల్లు సూర్యోపరాగంబు సనుదెంచు¯ టెఱిఁగి భూజను లెల్ల వరుసఁ గదలి ¯ మును జమదగ్ని రాముఁడు పూని ముయ్యేడు¯ మాఱులు ఘనబలోదారుఁ డగుచు (1037.1) నిజభుజాదండ మండిత నిబిడ నిశిత ¯ చటుల దంభోళిరుచిరభాస్వత్కుఠార ¯ మహితధారావినిర్భిన్న మనుజపాల ¯ దేహనిర్ముక్త రుధిర ప్రవాహములను. (1038) ఏను మడువులు గావించె నెచటనేని ¯ నట్టి పావనసుక్షేత్రమగు శమంత ¯ పంచకంబున కపుడు సంభ్రమముతోడఁ ¯ జనిరి బలకృష్ణులును సంతసం బెలర్ప. (1039) ఇట్లు నిష్కర్ములైన రామకృష్ణులు లోక ధర్మానుపాలన ప్రవర్తనులై ద్వారకానగర రక్షణంబునకుం బ్రద్యుమ్న, గద, సాంబ, సుచంద్ర, శుక, సారణానిరుద్ధ, కృతవర్మాది యోధవరుల నియమించి తాము నక్రూర వసుదేవోగ్రసేనాది సకల యాదవులుం గాంతాసమేతులై స్రక్చంద నాభరణ వస్త్రాదులు ధరియించి, శోభనాకారంబులతోడం బుష్పక విమానంబులనం బొలుచు నరదంబులను, మేఘంబుల ననుకరించు గజంబులను, మనోవేగంబులైన తురగంబుల నెక్కి వియచ్చరులం బురుడించు పురుషులు దమ్ము సేవింపం జని య ప్పుణ్య తీర్థంబుల నవగాహనంబు సేసి యుపవసించి, యనంతరంబ. (1040) భూసురవరులకు ననుపమ¯ వాసోలంకార ధేను వసు రత్న ధరి¯ త్రీ సుమహిత వస్తువు లు¯ ల్లాసంబున దాన మిచ్చి లాలితు లగుచున్. (1041) పునరవగాహనములు పెం¯ పొనరం గావించి బంధుయుక్తముగా భో ¯ జనకృత్యంబులు దీర్చి స ¯ దనురాగము లుల్లసిల్ల నచ్చోటఁ దగన్. (1042) ఘనశాఖాకీర్ణములై ¯ యినరశ్ములు దూఱనీక యెసకం బెసఁగన్ ¯ ననిచిన పొన్నల నీడల ¯ ననిచిన వేడుకల నందనందన ముఖ్యుల్‌. (1043) తనరిన పల్లవ రుచిరా ¯ సనముల నాసీను లగుచు సత్సుఖగోష్ఠిం ¯ బెనుపొందఁగ నట వసియిం ¯ చినచోఁ దత్పుణ్యతీర్థ సేవారతులై. (1044) మున్న చనుదెంచి యున్న మత్స్యౌశీనర, కోసల, విదర్భ, కురు, సృంజయ, కాంభోజ, కేకయ, మద్ర, కుంత్యారట్ట, కేరళాది భూపతులును; మఱియుం దక్కిన రాజవరులును హితులును; నంద గోపాది గోపాలురును; గోపికాజనంబులును; ధర్మరాజానుగతులై వచ్చిన భీష్మ, ద్రోణ, ధృతరాష్ట్ర, గాంధారీ, కుంతీ, పాండవ, తద్దార నివహ, సంజయ, విదుర, కృప, కుంతిభోజ, విరాట, భీష్మక, నగ్నజి, ద్ద్రుపద, శైబ్య, ధృష్టకేతు, కాశిరాజ, దమఘోష, విశాలాక్ష, మైథిల, యుధామన్యు, సుశర్మలును, సపుత్త్రకుండైన బాహ్లికుండును మొదలుగాననేకులు నుగ్రసేనాది యాదవ ప్రకరంబులం బూజలం దృప్తులం జేసిన వారునుం బ్రముదితాత్ములై; రయ్యెడ. (1045) ఆ రాజులు గాంచిరి నిజ ¯ నారీయుతు లగుచు నంగనాపరివారున్, ¯ ధీరున్, దానవకులసం ¯ హారున్, గోపీమనోవిహారు, నుదారున్. (1046) కని య మ్మాధవ బలదేవులు సేయు సముచిత పూజావిధానంబులం బరితృప్తులై, యమ్ముకుందు సాన్నిధ్యంబు గలిగి, తదీయ సంపద్విభవాభిరాము లై విలసిల్లుచున్న యుగ్రసేనాది యదు వృష్ణి పుంగవులం జూచి, వారలతోడ నా రాజవరులు మాధవుండు విన నిట్లనిరి. (1047) "మనశాస్త్రంబులువాక్కులున్మనములున్మాంగల్యముంబొందిపా ¯ వనమై యొప్పెడి నే రమావిభుని భాస్వత్పాదపంకేజ సే ¯ చనతోయంబుల నే మహాత్ముని పదాబ్జాతంబు లెందేని సోఁ ¯ కినచో టెల్లను ముక్తి హేతువగు, నీ కృష్ణుండె పో! చూడఁగన్. (1048) సనక సనందనాది మునిసత్తము లంచిత యోగదృష్టిచేఁ¯ బనివడి యాత్మలన్ వెదకి పట్ట నగోచరమైన మూర్తి యి¯ ట్లనవరతంబు మాంస నయనాంచల గోచరుఁ డయ్యెనట్టె! యే ¯ మన నగు? వీరిపుణ్యమున కాదట నెట్టితపంబు సేసిరో? (1049) నిరయస్వర్గము లాత్మఁ గైకొనక తా నిర్వాణమూర్తైన యీ ¯ హరిఁ జూడన్, హరితోడఁ బల్క, హరిమే నంటన్, హరిం బాడఁగా ¯ హరితో నేఁగ, సహాసనాస్తరణ శయ్యావాసులై యుండఁగన్ ¯ హరి బంధుత్వసఖిత్వముల్ గలుగు భాగ్యం బెట్లు సిద్ధించెనో?" (1050) అనుచు యాదవ వృష్ణి భోజాంధకులును ¯ హరిదయాలబ్ధనిఖిలార్థు లగుచు నున్న ¯ మనికిఁ దమ చిత్తములఁ బలుమాఱుఁ బొగడి ¯ పరిణమించిరి; యంత న ప్పాండుమహిషి. (1051) అప్పుడు. (1052) తన సుతులకు గాంధారీ ¯ తనయులు గావించు నపకృతంబుల కాత్మన్ ¯ ఘనముగ నెరియుచు నచ్చటఁ ¯ గనుఁగొనె వసుదేవు విగతకల్మషభావున్. (1053) అట్లు గనుంగొని యతనితో నిట్లనియె.

కుంతీదేవి దుఃఖంబు

(1054) "ఓ యన్న! పాండుతనయులు ¯ నీ యల్లుం డ్రడవులందు నెఱి మృగములతోఁ ¯ బాయని యిడుమలఁ బడఁ గరు ¯ ణాయత్తుల రగుచు మీర లరయఁగ వలదే?" (1055) అని బహుప్రకారంబుల సంతాపించుచు మఱియు నిట్లనియె. (1056) "అతిబలవంతపు విధి దాఁ ¯ బ్రతికూలంబైనఁ గలరె బంధువు?"లనుచున్ ¯ ధృతి గలఁగ బాష్పజలపూ ¯ రితలోచన యగు సహోదరిం జూచి యనెన్. (1057) "తల్లి! నీ కేల సంతాపింప మనమునఁ¯ దలవఁక విధినేల సొలసె? దింత ¯ యఖిల నియామకుండగు నీశ్వరుఁడు మాయ¯ యవనికాంతరుఁడైన యట్టి సూత్ర ¯ ధారుని కైవడిఁ దగిలి నటింపఁగ¯ మనుజులు కీలుబొమ్మలు దలంపఁ; ¯ గావున విధిసేఁతఁ గడిచి వర్తింపంగ¯ దేవతలకునైనఁ దీఱ; దట్లు (1057.1) క్రోధచిత్తుండు కంసుఁడు బాధవఱుప ¯ నిలయములు దప్పి నే మడవులఁ జరింప ¯ ఘనకృపానిధి యీ హరి గలుగఁబట్టి ¯ కోరి మా కిండ్లు గ్రమ్మఱఁ జేరఁ గలిగె. " (1058) అని యూరడిలం బలుకు నవసరంబున.

నందాదులు చనుదెంచుట

(1059) నందయశోదలు గోపక ¯ బృందంబులు గోపికలునుఁ బిరిగొని పరమా ¯ నందంబునఁ జనుదెంచిరి ¯ మందరధరుఁ జూచువేడ్క మనములఁ బొడమన్. (1060) ఇట్లు సనుదెంచిన. (1061) అతిచిరకాల సమాగతు ¯ నతని నిరీక్షించి వృష్ణి యాదవ భోజ¯ ప్రతతులు నెదురేఁగి సము¯ న్నతితో నాలింగనములు నడపిరి వరుసన్. (1062) వసుదేవుఁడు వారికి సం ¯ తసమునఁ గావించె సముచితక్రియ లంతన్ ¯ ముసలియు హరియును మ్రొక్కిరి ¯ వెస నందయశోదలకును వినయం బెసఁగన్. (1063) అట్లు నమస్కృతులుసేసి, యాలింగనంబులు గావించి, నయనారవిందంబుల నానందబాష్పంబుల దొరఁగ నఱలేని స్నేహంబులు చిత్తంబుల నత్తమిల్ల నేమియుం బలుకకుండి; రంత నయ్యశోదాదేవి రామకృష్ణుల నిజాంకపీఠంబుల నునిచి యక్కునం గదియందిగిచి, చెక్కిలి ముద్దుగొని, శిరంబులు మూర్కొని, చిబుకంబులు పుడుకుచుఁ, బునఃపునరాలింగనంబులు గావించి, పరమానందంబునం బొందుచు నున్నంతఁ బదంపడి. (1064) స్థిరమతితోడ రోహిణియు దేవకియుం దగ నందగోప సుం ¯ దరిఁ గని కౌఁగిలించికొని తత్కృతులెల్లఁ దలంచి "యింతి! నీ ¯ వరుఁడును నీవు బంధుజనవత్సలతన్ మును చేయుసత్కృతుల్‌ ¯ మఱవఁగ వచ్చునే? తలఁప మా కిఁక నెన్నఁటికిం దలోదరీ! (1065) జననం బందుట మొదలుగ ¯ ఘనమోహముతోడఁ బెంచు కతమునఁ దమకున్ ¯ జననీ జనకులు వీరని ¯ మనములఁ దలపోయలేరు మము నీ తనయుల్‌. (1066) అంటిన ప్రేమను వీరిం ¯ గంటికి ఱెప్పడ్డమైన గతిఁ బెంపఁగ మా ¯ కంటెన్ నెన రౌటను మీ ¯ యింటన్ వసియించి యుండి రిన్నిదినంబుల్‌. " (1067) అని యిట్లు ప్రియాలాపంబులు పలుకుచుండు నవసరంబున గోపాలసుందరు లమందానంద కందళితహృదయ లయి హృదయేశ్వరుం డైన గోవిందుఁడు చిరకాలసమాగతుం డగుటం జేసి, యతనిం జూచు తలంపు లుల్లంబుల వెల్లిగొనం జేరి. (1068) నళినదళాక్షుఁ జూచి నయనంబులు మోడ్వఁగఁ జాల కాత్మలన్¯ వలచి తదీయమూర్తి విభవంబు దలంచుచుఁ గౌఁగిలించుచుం ¯ బులకలు మేన జాదుకొనఁ బొల్తులు సొక్కిరి బ్రహ్మమున్ మనం¯ బులఁ గని చొక్కు యోగిజనముం బురుడింపఁగ మానవేశ్వరా! (1069) పొలఁతుల భావ మాత్మఁ గని ఫుల్లసరోరుహలోచనుండు వా ¯ రలనపు డేకతంబునకు రమ్మని తోకొని పోయి యందు న¯ ర్మిలిఁ బరిరంభణంబు లొనరించి లసద్దరహాసచంద్రికా ¯ కలిత కపోలుఁడై పలికెఁ గాంతల భక్తినితాంతచిత్తలన్. (1070) "వనజదళాక్షులార! బలవద్రిపు వర్గములన్ జయింపఁగాఁ ¯ జని తడవయ్యె; దీనికి భృశంబుగ మీ మది నల్గకుండుఁడీ! ¯ యనయము దైవ మిట్లు సచరాచరజాలము నొక్కవేళఁ గూ ¯ ర్చును నొకవేళఁ బాపును మరుద్ధతతూల తృణంబులం బలెన్. (1071) "తరలాక్షులార! మద్భక్తి చేతనులకుఁ¯ దనరు మోక్షానందదాయకంబు ¯ జప తపో వ్రత దాన సత్కర్మముల ముక్తి¯ కలుగంగ నేరదు కానఁ దలఁప ¯ విధి శివ సనకాది విమలచిత్తంబులఁ¯ బొడమని భక్తి మీ బుద్ధులందు ¯ జనియించె మీ పూర్వ సంచితసౌభాగ్య¯ మెట్టిదో యది తుదముట్టె నింక (1071.1) నటమటము గాదు మీకు నెన్నఁటికి నైనఁ ¯ గలుగనేరవు నిరయసంగతములైన ¯ జన్మకర్మము లిటమీఁద మన్మనీష ¯ సుమహితధ్యానలార! యో! రమణులార! (1072) అభిలభూతములకు ననయంబు నాది మ¯ ధ్యాంతరాంతర్భహిర్వ్యాప్తి నైన ¯ ఘటపటాదిక భూతకార్యంబులకు నుపా¯ దానకారణములై తనరునట్టి ¯ గగనానిలానలకక్షోణులను భూత¯ పంచకం బైక్యత వడయుఁ గాదె ¯ లోకంబులందుఁ బంచీకరణవ్యవ¯ స్థలచేత నట్టి భూతముల రీతి (1072.1) గగనముఖభూత తత్కార్యకారణములఁ ¯ దగిలి యాధార హేతుభూతంబ నైన ¯ నాకుఁ బర మన్య మొక్కఁ డెన్నంగ లేడు ¯ విమలమతులార! మాటలు వేయునేల? " (1073) అనినఁ దెలివొంది వారు దేహాభిమాన ¯ ములు సమస్తంబు విడిచి "యో! నలిననాభ! ¯ నిఖిలజగదంతరాత్మ! మానిత చరిత్ర! ¯ భక్తజనమందిరాంగణపారిజాత! (1074) ఘోరసంసారసాగరోత్తారణంబు ¯ ధీయుతజ్ఞానయోగి హృద్ధ్యేయవస్తు ¯ వగుచుఁ జెలువొందు నీ చరణాంబుజాత ¯ యుగళమును మా మనంబులఁ దగుల నీవె. " (1075) అని వేడినఁ గృష్ణుఁడు ముని ¯ వినతుఁడు కరుణించి వల్లవీజనములుగో ¯ రిన యట్ల యిచ్చెఁ గరుణా ¯ వననిధి సద్భక్త లోకవత్సలుఁ డంతన్. (1076) ధర్మతనూభవుం గని పదంబులకున్ నతుఁడై సపర్యలన్ ¯ నిర్మలభక్తిమై నడపి "నీవునుఁ దమ్ములు బంధుకోటి స¯ త్కర్మ చరిత్రులై తగు సుఖంబుల నొప్పుచునున్న వారె"నా ¯ నర్మిలిఁ బాండవాగ్రజుఁడు నమ్మధుసూదనుతోడ నిట్లనున్. (1077) "సరసిజనాభ! భవత్పద ¯ సరసీరుహ మాశ్రయించు జను లతిసౌఖ్య¯ స్ఫురణం బొలుపారుచు భువిఁ ¯ జరియింపరె! భక్త పారిజాత! మురారీ! (1078) అదియునుం గాక, (1079) సుమహిత స్వప్న సుషుప్తి జాగరములన్¯ మూఁడవస్థలఁ బాసి వాఁడి మిగిలి ¯ వెలినుందు లో నుందు; విశ్వమై యుందువు¯ విశ్వంబు నీయందు వెలుఁగుచుండు; ¯ భవదీయ మహిమచేఁ బాటిల్లు భువనంబు¯ లుదయించు నొక వేళ నుడిగి మఁడుగు; ¯ సంచి తాఖండిత జ్ఞానివై యొప్పుచు¯ నవిహత యోగమాయాత్మఁ దనరి (1079.1) దురితదూరులు నిత్యముక్తులకుఁ జెంద ¯ నలవియై పెంపు దీపింతు వంబుజాక్ష! ¯ ఘనకృపాకర! నఖిలవికారదూర! ¯ నీకు మ్రొక్కెద సర్వలోకైకనాథ!" (1080) అని వినుతించిన నచ్చటి ¯ జనపాలక బంధుమిత్ర సకలజనములున్ ¯ విని యనురాగిల్లిరి నె¯ మ్మనముల నానంద జలధిమగ్నులు నగుచున్. (1081) అట్టి యొప్పగువేళ నెయ్యంబు మెఱసి ¯ యొక్కచోటను సంతోషయుక్తు లగుచు ¯ దానవాంతక సతులును ద్రౌపదియును ¯ గూడి తమలోన ముచ్చట లాడుచుండి.

లక్షణ ద్రౌపదీ సంభాషణంబు

(1082) అట్టియెడఁ గృష్ణకథావిశేషంబులు పరితోషంబున నుగ్గడించుచుఁ బ్రసంగ వశంబున నా రుక్మిణీదేవి మొదలగు శ్రీకృష్ణుభార్యలం గనుంగొని పాంచాలి యిట్లనియె. “మిమ్ముఁ బుండరీకాక్షుండు వివాహంబయిన తెఱంగులు వినిపింపుఁడన వారును దమ పరిణయంబుల తెఱంగులు మున్ను నే నీకుం జెప్పిన విధంబున వినిపించి; రందు సవిస్తరంబుగాఁ దెలియం బలుకని మద్రరాజకన్యకా వృత్తాంతం బా మానిని పాంచాలికిం జెప్పిన విధంబు విను మని శుకుండు పరీక్షిన్నరేంద్రున కిట్లనియె. (1083) పాంచాలితో మద్రపతిసుత యిట్లను¯ "సంగీతవిద్యా విశారదుండు ¯ నారదుచేతి వీణాస్వనకలిత మై¯ నట్టి గోవింద కథామృతంబు ¯ దవిలి యేఁ గ్రోలి చిత్తము దన్మయత్వంబు¯ నొంది మోదించుచు నుండునంత ¯ దుహితృవత్పలుఁడు మద్గురుఁడు దా నది విని¯ సదుపాయ మొక్కటి మదిఁ దలంచి (1083.1) చదల నెబ్భంగి నైన గోచరము గాక ¯ వారి మధ్యములో నభివ్యాప్తి దోఁచు ¯ మత్స్యయంత్రంబు కల్పించి మనుజు లెంత ¯ వారి కై నను దివ్వ మోవంగరాని. (1084) ధనువుఁ బవిచండ నిష్ఠురాస్త్రంబు నచట ¯ సంచితంబై న గంధపుష్పాక్షతలనుఁ ¯ బూజగావించి యునిచి "యే పురుషుఁ డేని ¯ నిద్ధబలమున నీ చాప మెక్కు వెట్టి. (1085) ఈ సాయకంబు నారిం ¯ బోసి వెసన్ మత్స్యయంత్రమున్ ధరఁ గూలన్ ¯ వేసిన శౌర్యధురీణుఁడు ¯ నా సుత వరియించు" నని జనంబులు వినఁగన్. (1086) చాటించిన నవ్వార్తకుఁ ¯ బాటించిన సంభ్రమముల బాణాసన మౌ ¯ ర్వీ టంకార మహారవ ¯ పాటితశాత్రవులు బాహుబల సంపన్నుల్‌. (1087) సుందరతనులు దదుత్సవ ¯ సందర్శన కుతుకు లమిత సైన్యులు భూభృ¯ న్నందను లేతెంచిరి జన ¯ నందితయశు లగుచు మద్రనగరంబునకున్. (1088) చనుదెంచిన వారికి మ¯ జ్జనకుఁడు వివిధార్చనములు సమ్మతిఁ గావిం ¯ చిన నా బాహుబలాఢ్యులు ¯ ధనువుం జేరంగ నరిగి ధైర్యస్ఫూర్తిన్. (1089) ఇట్లు డగ్గఱి యద్ధనువుం గనుంగొని. (1090) కొందఱు పూనలేక చనఁ గొందఱు పూని కదల్పలేక పోఁ, ¯ గొంద ఱొకింత యెత్త నొక కొందఱు మోపిడలేక దక్కఁగాఁ, ¯ గొంద ఱొకింత యెక్కిడుచుఁ గోరి నృపాలకు లిట్లు సిగ్గునుం ¯ జెంది తలంగి పోవుచును "సీ! యిటకేఁగుట నీతి త"ప్పనన్. (1091) అట్టియెడ. (1092) భీముఁడు రాధేయుఁడు ను¯ ద్దామగతిన్నెక్కు ద్రోఁచి తగ నమ్మీనం¯ బేమఱక దిరుగుచుంటయుఁ ¯ దామేమియు నెఱుఁగలేక తలఁగిన పిదపన్. (1093) అమరేంద్ర తనయుఁ డమ్మ¯ త్స్యము నేయ నుపాయ మెఱిఁగి తగ నేసియు మీ ¯ నము ద్రుంపలేక సిగ్గున ¯ విముఖుండై చనియె నంత వికలుం డగుచున్. (1094) ఇట్లు సకల రాజకుమారులుం దమతమ ప్రయత్నంబులు విఫలంబులైన ముఖారవిందంబులు ముకుళించి దైన్యంబున విన్ననై చూచుచున్న యెడ. (1095) సరసిజపత్త్రలోచనుఁడు చాపము సజ్యము సేసి యుల్లస¯ చ్ఛర మరిఁబోసి కార్ముకవిశారదుఁడై యలవోక వోలె ఖే ¯ చరమగు మీనముం దునిమె సత్వరతన్ సుర సిద్ధ సాధ్య ఖే ¯ చర జయశబ్ద మొప్పఁ బెలుచం గురిసెం దివిఁ బుష్పవర్షముల్‌. (1096) అయ్యవసరంబున నేనుం బరితుష్టాంతరంగనై పరమానందవికచ వదనారవింద నగుచు,నిందిందిర సన్నిభంబులగు చికురబృందంబులు విలసదలిక ఫలకంబునం దళుకులొలుకు ఘర్మజల కణంబులం గరంగు మృగమద తిలకంపు టసలున మసలుకొనినం గరకిసలయంబున నోసరించుచు మిసమిస మను మెఱుంగుగములు గిఱికొన నెఱిగౌను వడవడ వడంక నప్పుడు మందగమనంబున. (1097) లలితపదాబ్జ నూపురకలధ్వనితో దరహాస చంద్రికా ¯ కలిత కపోలపాలికలఁ గప్పు సువర్ణవినూత్న రత్నకుం ¯ డల రుచులొప్పఁ గంకణఝణంకృతు లింపెసలార రంగ భూ ¯ తలమున కేగుదెంచి ముఖతామరసం బపు డెత్తి చూచుచున్. (1098) నరపతులం గనుంగొని మనంబున వారిఁ దృణీకరించి మ¯ త్కరజలజాత దివ్యమణి కాంచనమాలిక నమ్మురారి కం ¯ ధరమున లీలమై నిడి పదంపడి నవ్య మధూకదామ మా ¯ హరికబరిం దగిల్చితి నయంబునఁ గన్నుల లజ్జ దేఱఁగన్. (1099) అప్పుడు. (1100) కొలఁదికి మీఱఁగా డమరు, గోముఖ, డిండిమ, మడ్డు, శంఖ, కా ¯ హళ, మురళీ, మృదంగ, పణ, వానక, దుందుభి, ఢక్క, కాంస్య, మ¯ ర్దళ, మురజారజాది వివిధధ్వను లేపున భూనభోంతరం¯ బులఁ జెలఁగెన్ నటీనటనముల్‌ దనరారె మనోహరాకృతిన్. (1101) అంత. (1102) అమరగణంబుఁ దోలి యురగారి సుధాకలశంబుఁ గొన్న చం ¯ దమున సమస్తశత్రువసుధావర కోటిఁ దృణీకరించి య¯ క్కమల విలోచనుండు ననుఁ గౌఁగిట నొప్పుఁగ జేర్చి సింహచం ¯ క్రమణ మెలర్పఁ గొంచుఁ జనెఁ గాంచనచారు రథంబుమీఁదికిన్. (1103) అట్లు రథారోహణంబు సేసిన. (1104) తురగచతుష్కమున్ విమతదుర్దమశూరతఁ బూన్చి దారుకుం¯ డరదము రొప్ప శత్రునికరాంధతమః పటలప్రచండ భా¯ స్కరరుచి నొప్పునట్టి నిజకార్ముక యుక్తగుణప్రఘోష సం ¯ భరిత దిగంతరుం డగుచుఁ బద్మదళాక్షుడు వోవుచుండఁగన్!