పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవత పారాయణ - 3 : దశమ ఉత్తర 887-993

కృష్ణ సాళ్వ యుద్ధంబు

(887) "కంటే దారుక! దుర్నిమిత్తము లనేకంబుల్‌ మహాభీలముల్‌ ¯ మింటన్ మేదినిఁ దోఁచుచున్నయవి; నెమ్మిన్ ఖాండవప్రస్థ మే¯ నుంటం జైద్యహితక్షితీశ్వరులు మాయోపాయులై మత్పురిం ¯ గెంటింపం జనుదేరఁ బోలుదురు; పోనీ తేరు వేగంబునన్." (888) అని యతిత్వరితగతిం జనుదెంచి తత్పురంబు డగ్గఱి మహాబల పరాక్రమంబులం బ్రతిపక్షబలంబులతోడం దలపడి పోరు యదు బలంబులును నభోవీథి నభేద్య మాయా విడంబనంబునం బ్రతివీరు లెంతకాలంబునకు నే యుపాయంబునను సాధింప నలవి గాని సౌభకవిమానంబు నందున్న సాల్వునిం గని తద్విమానంబు డాయం దన తేరు దోల సారథిని నియమించి కదియంజను మురాంతకుని వీక్షించి యదు సైనిక ప్రకరంబులు పరమానందంబునం బొందిరి; మృతప్రాయంబులై యున్న సైన్యంబులం గనుంగొని సౌభకపతి విక్రమక్రియాకలాపుం డగుచు నురవడించి. (889) మిణుఁగుఱు లెల్లెడం జెదర; మింటను మంటలు పర్వ; ఘంటికా¯ ఘణఘణ భూరినిస్వన నికాయమునన్ హరిదంతరాళముల్‌¯ వణఁక; మహోగ్రశక్తిఁ గొని వారక దారుకుమీఁద వైవ దా ¯ రుణగతి నింగినుండి నిజరోచులతోఁ బడు చుక్కకైవడిన్. (890) వడిఁ జనుదేరఁగఁ గని య¯ ప్పుడు నగధరుఁ డలతి లీలఁ బోలెన్ దానిం ¯ బొడిపొడియై ధరఁ దొరఁగఁగఁ ¯ నడుమన వెసఁ ద్రుంచె నొక్క నారాచమునన్. (891) గురుభుజుఁ డంతఁ బోవక యకుంఠిత శూరత శత్రుసైన్యముల్‌ ¯ దెరలఁగ నుగ్రతం గొఱవిఁ ద్రిప్పిన కైవడి మింట దిర్దిరం ¯ దిరుగుచు దుర్నిరీక్ష్యమగు దీపితసౌభము సాల్వుఁ జండభా ¯ స్కర కిరణాభ షోడశ నిశాతశరంబులఁ గాఁడ నేసినన్. (892) కడు వడి నల్గి వాఁడు నిజకార్ముకమున్ జలదస్వనంబుకై ¯ వడి మొరయించుచున్ వెడఁద వాతి శరంబులఁ బద్మలోచను¯ న్నెడమభుజంబు గాఁడ వడి నేసినఁ దెంపఱి చేతి శార్‌ఙ్గమున్ ¯ విడిచె రథంబుపై గగనవీథి సురల్‌ భయమంది చూడఁగన్. (893) హాహా యని భూతావళి ¯ హాహాకారములు సేయ నంతట దేఱ¯ న్నాహరిఁ గనుఁగొని యతఁ డు¯ త్సాహంబునఁ బలికె బాహుశౌర్యస్ఫూర్తిన్. (894) "నళినదళాక్ష! మత్సఖుఁడు నాఁ దగు చైద్యుఁడు గోరినట్టి కో ¯ మలి నవినీతిమైఁ దగవుమాలి వరించితి; వంతఁ బోక దో ¯ ర్బలమున ధర్మనందును సభాస్థలి నేమఱి యున్న వాని న¯ చ్చలమునఁ జంపి తట్టి కలుషంబున నేఁడు రణాంగణంబునన్. (895) తల చెడి పాఱక బాహా ¯ బల మొప్పఁగ నాదు దృష్టిపథమున ధృతితో ¯ నిలిచిన నిష్ఠుర విశిఖా ¯ ర్చుల ముంచి మదీయసఖుని సూ డిటు దీర్తున్. " (896) అనిన మురాంతకుండు దరహాసము మోమునఁ దొంగలింప సా¯ ల్వునిఁ గని "యోరి! లావు బలుపుంగల పోటరి వోలెఁ బ్రేలె దే ¯ మనినను బాటు సన్నిహితమౌట యెఱుంగవు మూఢచిత్త! వొ¯ "మ్మని గదఁ గేలఁ ద్రిప్పి యభియాతిని శత్రుని వ్రేసె నుద్ధతిన్. (897) అట్లు వ్రేసిన. (898) పెనుమూర్ఛ నొంది వెస ము¯ క్కున వాతను నెత్తురొల్కఁ గొంతవడికి నొ¯ య్యన తెలిసి నిలువరింపక¯ చనె వాఁడు నదృశ్యుఁ డగుచు సౌభముఁ దానున్. (899) అయ్యవసరంబున. (900) గగన మందుండి యొకఁ డార్తుఁ డగుచు వచ్చి ¯ నందనందను పాదారవిందములకు ¯ వందనము సేసి యానకదుందుభిని మ ¯ హోగ్రుఁడై పట్టితెచ్చె సాల్వుండు గడఁగి. (901) దేవ! మీ కెఱిఁగింపఁగాఁ దివిరి యిటకు ¯ దేవకీదేవి నన్నుఁ బుత్తెంచె ననఁగ ¯ విని సరోరుహనాభుఁడు ఘన విషాద ¯ మగ్నుఁ డయ్యెను గురుమీఁది మమతఁ జేసి. (902) నర గంధర్వ సురాసుర ¯ వరులకు నిర్జింపరాని వాఁడు బలుం డే ¯ మఱ కరయ హీనబలుచేఁ ¯ బరికింపఁగ నెట్లు పట్టువడు నొకొ యనుచున్ (903) మఱియును. (904) భావంబు గలఁగ "నాహా! ¯ దైవకృతం బెవ్వరికినిఁ దప్పింపఁగ రా ¯ దే విధి నైనను" నని శో ¯ కావిలమతిఁ బలుకుచున్న నత్తఱి వాఁడున్. (905) తన మాయాబలంబునఁ గ్రమ్మఱం దోఁచి కృతక వసుదేవునిం గల్పించి యతనిం బంధించి కొనితెచ్చి “పుండరీకాక్ష! నిరీక్షింపు భవజ్జనకుండు వీఁడె; యిప్పుడు నీవు గనుంగొన వీని తలఁద్రుంతు నింక నెవ్వనికింగా మనియెదు? కావంగల శక్తిగలదేనిం గావు” మని దురాలాపంబు లాడుచు మృత్యుజిహ్వాకరాళంబైన కరవాలంబు గేలంబూని జళిపించుచు నమ్మాయావసుదేవుని శిరంబు దునిమి తన్మస్తకంబు గొని వియద్వర్తి యై చరియించు సౌభక విమానంబు సొచ్చె; నంత గోవిందుండు గొంతతడవు మనంబున ఘనంబగు శోకంబునం గుందుచుండి యాత్మసైనికులు దెలుపం దెలివొంది యది మయోదితంబైన సాల్వుని మాయోపాయం బని యెఱింగె; నంతం దనకు వసుదేవుండు పట్టువడె నని చెప్పిన దూతయు నమ్మాయాకళేబరంబును నా క్షణంబ విచిత్రంబుగా మాయంబై పోయె; ననంతరంబ. (906) మును లపుడు గొంద ఱచటికిఁ ¯ జనుదెంచి విమోహియైన జలజదళాక్షుం ¯ గనుఁగొని సమధికభక్తిన్ ¯ వినయంబునఁ బలికి రంత విష్ణున్ జిష్ణున్. (907) “కమలాక్ష! సర్వలోకములందు సర్వ మా¯ నవులు సంసార నానావిధైక ¯ దుఃఖాబ్ధిమగ్నులై తుదిఁ జేరనేరక¯ వికలత్వమునఁ బొందు వేళ నిన్నుఁ ¯ దలఁచి దుఃఖంబులఁ దరియింతు రట్టి స¯ ద్గుణనిధి వై దేవకోటికెల్లఁ ¯ బట్టుగొమ్మై పరబ్రహ్మాఖ్యఁ బొగడొంది¯ పరమయోగీశ్వర ప్రకరగూఢ (907.1) పరచిదానంద దివ్యరూపమున వెలుఁగు ¯ దనఘ! నీ వేడ? నీచజన్మాత్మ జనిత ¯ ఘన భయస్నేహ మోహశోకంబు లేడ?" ¯ ననుచు సంస్తుతి సేసి వారరిగి రంత.

సాళ్వుని వధించుట

(908) హరి దనమీఁద ఘోరనిశితాశుగజాలము లేయు సాల్వభూ ¯ వరు వధియింపఁ గోరి బహువారిద నిర్గతభూరివృష్టి వి¯ స్ఫురణ ననూన తీవ్రశరపుంజములన్ గగనంబుఁ గప్పి క్ర¯ చ్చఱ రిపు మౌళిరత్నమునుఁ జాపము వర్మముఁ ద్రుంచి వెండియున్. (909) వితతక్రోధముతోడఁ గృష్ణుఁడు జగద్విఖ్యాతశౌర్యక్రియో ¯ ద్ధతశక్తిన్ వడిఁ ద్రిప్పి మింట మెఱుఁగుల్‌ దట్టంబుగాఁ బర్వ ను¯ గ్రతఁ జంచద్గద వైచి త్రుంచె వెసఁ జూర్ణంబై ధరన్ రాల నా ¯ యతభూరిత్రిపురాభమున్ మహితమాయాశోభమున్ సౌభమున్. (910) అట్లు కృష్ణుం డమ్మయనిర్మిత మాయావిమానంబు నిజగదాహతి నింతింతలు తునియలై సముద్రమధ్యంబునం దొరంగం జేసిన సాల్వుండు గోఱలు వెఱికిన భుజంగంబు భంగి గండడంగి విన్ననై విగతమాయాబలుం డయ్యునుఁ బొలివోవని బీరంబున వసుధా తలంబునకు డిగ్గి యాగ్రహంబున. (911) కరమునఁ బవినిభ మగు భీ ¯ కర గద ధరియించి కదియఁగాఁ జనుదేరన్ ¯ మురహరుఁ డుద్ధతి సాల్వుని ¯ కరము గదాయుక్తముగను ఖండించె నృపా! (912) అంతం బోవక కినుక న ¯ నంతుఁడు విలయార్కమండలాయతరుచి దు¯ ర్దాంతంబగు చక్రంబు ని ¯ తాంతంబుగఁ బూన్చి సాల్వధరిణిపుమీఁదన్. (913) గురుశక్తి వైచి వెస భా ¯ సురకుండలమకుటరత్నశోభితమగు త¯ చ్ఛిరము వడిఁ ద్రుంచె నింద్రుఁడు ¯ వరకులిశముచేత వృత్రు వధియించు క్రియన్.

దంతవక్త్రుని వధించుట

(914) ఇట్లు మాయావి యైన సాల్వుండును సౌభకంబును గృష్ణుచేతం బొలియుటఁ గనుంగొని నిజసఖులగు సాల్వ పౌండ్రక శిశుపాలురకుఁ బారలౌకికక్రియలు మైత్రిం గావించి దంతవక్త్రుం డతి భీషణాకారంబుతో నప్పుడు. (915) పెట పెటఁ బండ్లు గీఁటుచును బెట్టుగ మ్రోయుచుఁ గన్నుగ్రేవలం¯ జిటచిట విస్ఫులింగములు సింద మహోద్ధతపాదఘట్టన¯ న్నటనిటనై ధరిత్రి వడఁకాడ వడిన్ గద కేలఁ ద్రిప్పుచున్ ¯ మిటమిట మండు వేసవిని మించు దివాకరుఁ బోలి యుగ్రతన్. (916) వడిఁ జనుదేరఁ జూచి యదువల్లభుఁ డుల్లము పల్లవింప న¯ ప్పుడు గదఁ గేలఁబూని రథమున్ రయమొప్పఁగ డిగ్గి యుగ్రతం¯ గడఁగి విరోధికిన్నెదురుగాఁ జన వాఁ డతినీచవర్తియై ¯ యడరుచు నట్టహాసముఖుడై వలచే గదఁ ద్రిప్పుచున్ హరిన్. (917) కనుంగొని పరిహాసోక్తులుగా నిట్లనియె, “నీవు మదీయభాగ్యంబునం జేసి నేఁడు నా దృష్టిపథంబునకు గోచరుండవైతివి; మిత్రద్రోహివైన నిన్ను మాతులేయుండ వని మన్నింపక దేహంబు నందు వర్తించు నుగ్రవ్యాధి నౌషధాదిక్రియల నివర్తింపఁజేయు చికిత్సకుని చందంబున బంధురూపశాత్రవుండవు గావున నిన్ను దంభోళి సంరంభ గంభీరంబైన మదీయ గదాదండహతిం బరేత నివాసంబున కనిచి మున్ను నీచేత నిహతులైన నాదు సఖుల ఋణంబుఁ దీర్తు” నని దుర్భాషలాడుచు డగ్గఱి. (918) పెనుగదఁ బూన్చి కృష్ణుతల బెట్టుగ మొత్తిన నంకుశాహతిం ¯ గనలెడి గంధసింధురముకైవడి సింధురభంజనుండు పెం ¯ పున పవిభాసమానగదఁ బూని మహోగ్రతఁ ద్రిప్పి దంతవ¯ క్త్రుని యురముంబగిల్చినఁగుదుల్కొనుచున్రుధిరంబు గ్రక్కుచున్ (919) తత్‌క్షణంబ పర్వతాకారంబగు దేహంబుతో నొఱలుచు నేలంగూలి కేశపాశంబులు సిక్కువడఁ దన్నుకొనుచుఁ బ్రాణంబులు విడిచె; నప్పుడు నిఖిల భూతంబులు నాశ్చర్యంబు వొందఁ దద్గాత్రంబున నుండి యొక్క సూక్ష్మతేజంబు వెలువడి గోవిందునిదేహంబుఁ బ్రవేశించె; నయ్యవసరంబున నగ్రజు మరణంబు గనుంగొని కుపితుండై కనుఁగవల నిప్పులుప్పతిల్ల విదూరథుండు గాలానల జ్వాలాభీలకరాళంబైన కరవాలంబును బలకయుం గేలందాల్చి దామోదరు దెసకుఁ గవయుటయుం గనుంగొని. (920) జలరుహలోచనుండు నిజసాధనమై తనరారు చక్రమున్ ¯ వలనుగఁ బూన్చి వైవ నది వారక వాని శిరంబు ద్రుంచె న¯ బ్బలియుఁడు సౌభ సాల్వ శిశుపాల సహోదర తత్సహోదరా ¯ వలుల వధించి తత్కులము వారి ననేకులఁ ద్రుంచె నీ గతిన్. (921) అయ్యవసరంబున. (922) నర ముని యోగి సురాసుర ¯ గరుడోరగ సిద్ధ సాధ్య గంధర్వ నభ¯ శ్చర కిన్నర కింపురుషులు ¯ హరిమహిమ నుతించి రద్భుతానందములన్. (923) మఱియు నప్సరోజనంబులు నృత్యంబులు సలుప, వేల్పులు కుసుమ వర్షంబులు గురియ, దేవతూర్యంబు లవార్యంబులై మొరయ, యదు వృష్ణి ప్రవరులు సేవింపఁ, బరమానందంబునుం బొంది నిజవిజయాంకితంబు లైన గీతంబుల వందిజనంబులు సంకీర్తనంబులు సేయ, నతి మనోహర విభవాభిరామంబును, నూతనాలంకారంబును నైన ద్వారకానగరంబు శుభముహూర్తంబునం బ్రవేశింపం జనునెడ. (924) పురసతులు విరులు లాజలు ¯ గురుసౌధాగ్రములనుండి కురియఁగ వికచాం ¯ బురుహాక్షుం డంతఃపుర ¯ వర మర్థిం జొచ్చె వైభవం బలరారన్. (925) అట్లు యోగీశ్వరేశ్వరుండును, షడ్గుణైశ్వర్యసంపన్నుండును, నిఖిలజగదీశ్వరుండును నైన పురుషోత్తముండు సుఖంబుండె; నంత. (926) కౌరవ పాండవ పృథు సమ ¯ రారంభ మెఱింగి తీర్థయాత్ర నెపముగా ¯ సీరాంకుఁ డుభయకులులకు ¯ నారయ సముఁ డగుటఁ జేసి యరిగె నరేంద్రా!

బలరాముని తీర్థయాత్ర

(927) అట్లు సని మొదలం ప్రభాసతీర్థంబున నవగాహంబు సేసి, యందు దేవర్షిపితృతర్పణంబులు సంప్రీతిం గావించి విమలతేజోధను లగు భూసురప్రవరులు దనతో నరుగుదేరం గదలి చని క్రమంబున సరస్వతియు బిందుసరోవరంబును వజ్రతీర్థంబును విశాలానదియు సరయువును యమునయు జాహ్నవీతీర్థంబును గనుంగొనుచు నచటనచట నవగాహన దేవర్షిపితృతర్పణ బ్రాహ్మణ సంతర్పణంబు లను భూసుర యుక్తుండై నడపుచుం జని సకలలోకస్తుత్యంబును నిఖిలముని శరణ్యంబు నగు నైమిశారణ్యంబు సొచ్చి; యందు దీర్ఘసత్త్రంబు నడపుచున్న ముని జనంబులం గనుం గొనిన; వారును ప్రత్యుత్థానంబు సేసి రామునకు వినతులై యాసన పూజా విధానంబులు గావించిన నతండును బ్రముదిత మానసుం డగుచు సపరివారంబుగాఁ గూర్చున్న యెడ. (928) ఆ నెఱిఁ దనుఁ గని ప్రత్యు¯ త్థాన నమస్కారవిధులు దగ నడపక పెం ¯ పూనిన పీఠముపై నా ¯ సీనుండగు సూతు శేముషీవిఖ్యాతున్. (929) కనుంగొని యతని సమీపంబున నున్న విప్రవరులం జూచి రాముండు రోషించి “వీఁడు నన్నుఁ గని లేవకుండుటకు హేతు వెయ్యదియొకో? ఈ ప్రతిలోమజాతుండు మునిగణ సభాస్థలంబునఁ దానొక్క ముఖ్యుండ పోలె దురభిమానంబున శక్తిమనుమని వలనంగొన్ని కథలు గాథలు గఱచి విద్వద్గణ్యుని విధంబున విఱ్ఱవ్రీఁగెడును; నీచాత్ముం డభ్యసించు విద్య లెల్లను మనంబున విచారించి చూచిన మదకారణంబులు గాని సత్త్వగుణగరిష్ఠంబులు గావు; ధర్మసంరక్షణంబు సేయ నవతరించిన మాకు నిట్టి దుష్టమర్దనం బవశ్యకర్తవ్యం, బని తలఁచి హస్తంబున ధరించిన కుశాగ్రంబున నా సూతుని వధించిన నక్కడి మునీంద్రు లెల్ల హాహాకారంబులతోడం దాలాంకునిఁ జూచి యిట్లనిరి. (930) “అనఘా! యితనికి బ్రహ్మా ¯ సన మే మిచ్చుటను నీవు సనుదే నితఁ డా ¯ సనము దిగఁడయ్యె నింతయు ¯ మును నీమది నెఱుఁగ నర్థముం గలదె? హలీ! (931) ఎఱిఁగెఱిఁగి బ్రహ్మహత్యా ¯ దురితంబున నీమనంబు దూకొనెఁ బాపో ¯ త్తరణప్రాయశ్చిత్తము ¯ దొరఁకొని కావింపు మయ్య దుర్జనహరణా! (932) అదియునుం గాక పరమపావనుండవైన నీవు ధర్మంబుదప్పిన నెవ్వరు మాన్పంగలరు? కావునఁ బ్రాయశ్చిత్తంబు గైకొని నడపకున్న ధర్మంబు నిలువ; దట్లుగావున దీనికిఁ బ్రతీకారంబు పుట్టింపు” మనిన నతండు వారలం గనుంగొని “తామసంబున నిట్టి పాపంబు సేయంబడియె; దీనికి ముఖ్యపక్షంబునఁ బ్రతికృతి యెఱింగింపుండు, వీనికి నాయువును బహుసత్త్వంబును నొసంగిన మీకిష్టంబగునే నట్లు నాయోగమాయచేఁ గావింతు” నన నమ్మునులు "నీయస్త్రమాహాత్మ్యంబునకు మృత్యువునకు మాకు నెవ్విధంబున వైకల్యంబు నొందకుండునట్లు గావింపు"మనిన నతం డందఱం జూచి యప్పుడు. (933) ధాత్రీవర సమధిక చా ¯ రిత్రుఁడు హలపాణి పలికె ధృతి "నాత్మా వై ¯ పుత్రక నామాసి యను ప ¯ విత్రశ్రుతి వాక్యసరణి విశదం బగుటన్. (934) ఈ సూతసూనుఁ డిపుడు మ ¯ హాసత్త్వము నాయువును ననామయమును వి¯ ద్యా సామర్థ్యము గలిగి సు ¯ ధీసత్తములార! యీక్షితిన్ విలసిల్లున్." (935) అని సూతుం బునర్జీవితుంగాఁ జేసి మునులం జూచి యిట్లనియె. (936) "ఏ నెఱుంగక చేసిన యీ యవజ్ఞ ¯ శాంతి వొంద నేయది యభీష్టంబు మీకు ¯ దానిఁ గావింతు" ననిన మోదంబు నొంది ¯ పలికి రత్తాపసులు హలపాణిఁ జూచి. (937) "హలధర! యిల్వలుండను సురారితనూజుఁడు పల్వలుండు నాఁ¯ గలఁడొక దానవుండు బలగర్వమునం బ్రతిపర్వమందు న¯ చ్చలమున వచ్చి మా సవనశాలల మూత్ర సురాస్ర పూయ వి¯ ట్పలలము లోలిమైఁ గురిసి పాడఱఁ జేయును యజ్ఞవాటముల్‌. (938) కావున దుష్టదానవుం ద్రుంచుటయు మాకుం గరంబు సంతసం బగు; నంతమీఁద నీవు విమలచిత్తుండవై భారతవర్షంబునం గల తీర్థంబుల ద్వాదశమాసంబు లవగాహనంబు సేయు; మట్లయిన సర్వపాపనిష్కృతి యగు"నని పలుకునంతఁ బర్వసమాగమంబైన. (939) మునులు యజ్ఞక్రియోన్ముఖు లౌటఁ గనుఁగొని¯ పఱతెంచి యసుర తద్భవనములను ¯ రక్త విణ్మూత్ర సురామాంసజాలంబు¯ నించి హేయంబు గావించి పెలుచఁ ¯ బెంధూళి ఱాలును బెల్లలు నురలెడు¯ చక్రానిలము వీఁచి చదల నపుడు ¯ గాటుకకొండ సంగతిఁ బొల్చు మేను తా¯ మ్రశ్మశ్రు కేశ సమాజములును (939.1) నవ్యచర్మాంబరము భూరినాసికయును ¯ గఱకు మిడి గ్రుడ్లు నిప్పులు గ్రక్కు దృష్టి ¯ వ్రేలు పెదవులు దీర్ఘకరాళ జిహ్వి ¯ కయును ముడివడ్డబొమలును గలుగువాని. (940) కనియెం దాలాంకుఁ డుద్యత్కటచటు; ల నటత్కాలదండాభశూలున్¯ జనరక్తాసిక్తతాలున్ సమధిక; సమరోత్సాహలోలుం గఠోరా ¯ శనితుల్యోదగ్ర దంష్ట్రా జనిత శి; ఖకణాచ్ఛాదితాశాంతరాళున్ ¯ హననవ్యాపారశీలున్నతి; దృఢ ఘనమస్తాస్థిమాలుం గరాళున్ (941) వెండియుఁ గ్రొమ్మెఱుంగు లుడువీథి వెలుంగఁగ నుల్లసద్గదా¯ దండముఁ గేలఁ ద్రిప్పుచు నుదారత రా బలభద్రుఁ డాసురో¯ ద్దండవిఘాతులౌ ముసలదారుణలాంగలముల్‌ దలంప మా¯ ర్తాండనిభంబులై యెదురఁ దత్‌క్షణమాత్రన తోఁచినన్ వెసన్. (942) అట్లు సన్నిహితంబులైన తన కార్యసాధనంబులగు నిజసాధనంబులు ధరియించి యప్పుడు.

బలుడు పల్వలుని వధించుట

(943) గగనమునం జరించు సురకంటకు కంఠము చేఁతినాగటం ¯ దగిలిచి రోఁక లెత్తి బెడిదం బడరన్ నడునెత్తి మొత్తినన్ ¯ బుగబుగ నెత్తు రొల్క నిలఁ బోరగిలం బడె వజ్రధారచేఁ ¯ దెగి ధరఁ గూలు భూరి జగతీధరముం బురుడింప బెట్టుగాన్. (944) అట్లు పల్వలుండు మడిసిన. (945) మునివరులు గామపాలుని ¯ వినుతించిరి వేయువేల విధముల వృత్రుం ¯ దునిమిన యింద్రుని నమరులు ¯ వినుతించిన రీతి నపుడు విమలచరిత్రా! (946) అంత నభిషిక్తుఁ జేసి యత్యంత సురభి ¯ మంజులామ్లాన కంజాత మాలికయును ¯ నంచితాభరణములు దివ్యాంబరములు ¯ నర్థి నిచ్చినఁ దాల్చి యా హలధరుండు. (947) దేవేంద్రుఁ బోలి యొప్పెను ¯ ధీవిలసితుఁ డగుచు మునితతిన్ వీడ్కొని తన్ ¯ సేవించుచుఁ గతిపయ వి¯ ప్రావలి సనుదేరఁ గౌశికాఖ్యంబునకున్. (948) చని యమ్మహానదిం గృతస్నానుండై యచ్చోటు వాసి సరయువు నందుఁ గ్రుంకులిడి ప్రయాగ నవగాహనంబు సేసి దేవర్షి పితృతర్పణంబు లాచరించి పులస్త్యాశ్రమంబు సొచ్చి గోమతిం దర్శించి గండకీనది నుత్తరించి విదళితభవపాశయగు విపాశయందుఁదోఁగి శోణనదంబున నాప్లావితుండై గయనాడి గంగాసాగరసంగమంబు దర్శించి మహేంద్రనగంబున కరిగి. (949) రాముఁడుఁ గనుఁగొనె భార్గవ ¯ రామున్ రజనీశ కులధరావరనగ సు¯ త్రామున్ సన్నుత సుగుణ¯ స్తోముం గారుణ్యసీము సుజనలలామున్. (950) కని నమస్కరించి కౌతుకం బలరార ¯ నతని వీడుకొని హలాయుధుండు ¯ గొమరుమిగిలి సప్తగోదావరికి నేఁగి ¯ యందుఁ దీర్థమాడి యచటు గదలి. (951) వేణీపంపాసరస్సులంజూచి, భీమనదికేఁగి యందుఁ గుమారస్వామిని దర్శించి, శ్రీశైలంబునకుఁ జని, వేంకటాచలంబు దర్శించి, కామకోటి శక్తిని నిరీక్షించి, కాంచీపురంబుం గాంచి, కావేరికిం జని యమ్మహావాహిని నవగాహనంబు సేసి. (952) సేవించెన్ రంగధామున్ శ్రితనివహపయస్సింధుసంపూర్ణసోముం¯ గావేరీ మధ్యసీమున్ ఘనకలుష మహాకాలకూటోగ్ర భీమున్ ¯ దేవారిశ్రీ విరామున్ దివిజవినుత సందీపితానంత నామున్ ¯ ధీవిజ్ఞానాభిరాముం ద్రిభువన విలసద్దేవతా సార్వభౌమున్. (953) అచ్చోటు వాసి వృషభాద్రి నెక్కి, హరిక్షేత్రంబు ద్రొక్కి, మధురాపురంబున కరిగి, సేతుబంధనంబు మెట్టి, యచటం బదివేల పాఁడిమొదవుల భూసురుల కిచ్చి, రామేశ్వరుం దర్శించి, తామ్రపర్ణికిం జని, మలయాచలంబెక్కి, యగస్త్యునింగని నమస్కరించి, దక్షిణసముద్రంబు దర్శించి, కన్యాఖ్యదుర్గాదేవి నుపాసించి, పంచాప్సరంబను తీర్థంబున నాప్లవనం బాచరించి, గోకర్ణంబున నిందుమౌళిని దర్శించి, ద్వీపవతి యైన కామదేవిని వీక్షించి, తాపింబయోష్ణిని దర్శించి, నిర్వింధ్యంబు గడచి, దండకావనంబున కరిగి, మాహిష్మతీపురంబున వసియించి, మనుతీర్థం బాడి, క్రమ్మఱం బ్రభాసతీర్థంబునకు వచ్చి యచ్చటి బ్రాహ్మణ జనంబుల వలనఁ బాండవధార్తరాష్ట్రుల భండనంబు నందు సకలరాజలోకంబు పరలోకగతు లగుటయు, వాయునందన సుయోధనులు గదాయుద్ధ సన్నద్ధులై యుండుటయు నెఱింగి వారల వారించు తలంపున నచటికిం జని. (954) ధర్మనందనుఁ దనకు వందనము సేయు ¯ కృష్ణు నరు మాద్రిసుతుల నీక్షించి యేమి ¯ పలుక కుగ్ర గదాదండపాణు లగుచుఁ ¯ గ్రోధమునఁ బోరు భీమ దుర్యోధనులను. (955) చూచి వారల డాయం జని యిట్లనియె. (956) "వీరపుంగవులార! వినుఁడు; మీలోపల¯ భూరిభుజాసత్త్వమున నొకండు ¯ ప్రకటితాభ్యాస సంపద్విశేషంబున¯ నొక్కండు యధికుఁడై యుంటఁ జేసి ¯ సమబలు; లటు గాన చర్చింపఁగా నిందు¯ జయ మొక్కనికి లేదు సమరమందుఁ; ¯ గాన యూరక పోరఁగా నేల మీ"కని¯ వారింప నన్యోన్య వైరములను (956.1) నడరి తొల్లింటి దుర్భాష లాత్మలందుఁ ¯ దలఁచి తద్భాషణము లపథ్యములు గాఁగ ¯ మొక్కలంబునఁ బోర నా ముష్టికాసు ¯ రారి వీక్షించి "వీరి శుభాశుభములు, (957) ఎట్లుగావలయు నట్ల యయ్యెడుం గాక" యని; యచ్చోట నిలువక యుగ్రసేనాది బంధుప్రకరంబులు పరితోషంబున నెదుర్కొన ద్వారకాపురంబు సొచ్చి; యందుండి మగిడి నైమిశారణ్యంబు నకుం జని; యందుల మునిపుంగవు లనుమతింప నచ్చట నొక మఖంబు గావించి బహుదక్షిణ లొసంగి; యంచితజ్ఞానపరిపూర్ణు లగునట్లుగా వరంబిచ్చి; రేవతియునుం దానును బంధు జ్ఞాతి యుతంబుగా నవభృథస్నానం బాచరించి; యనంతరంబ. (958) విలసిత మాల్య చందన నవీన విభూషణ రత్న వస్త్రముల్‌ ¯ పొలుపుగఁ దాల్చి యంచిత విభూతిఁ దలిర్చెను బూర్ణచంద్రికా ¯ కలిత సుధాంశురేఖ నెసకం బెసఁగన్ నిజబంధులోచనో ¯ త్పలచయ ముల్లసిల్లఁ బరిపాండుర చారు యశోవిలాసుఁడై. (959) ఇవ్విధంబున ననంతుండు నప్రమేయుండును మాయామానుష విగ్రహుండు నసంఖ్యబలశాలియు నైన బలదేవుం డతివైభంబున నిజపురంబు ప్రవేశించి సుఖంబుండె” నని చెప్పి యిట్లనియె.

కుచేలోపాఖ్యాన ప్రారంభంబు

(960) "హలధరు డమర్త్య చరితుం ¯ డలఘు భుజాబలుఁ డొనర్చు నద్భుత కర్మం ¯ బులు పెక్కు నాల్గు మోములు ¯ గల మేటియు లెక్క పెట్టఁ గలఁడె నరేంద్రా! " (961) అనిన మునీంద్రుఁ గన్గొని ధరాధిపుఁ డిట్లను "పద్మపత్త్రలో ¯ చనుని యనంత వీర్యగుణ సంపద వేమఱు విన్న నైననుం ¯ దనియదు చిత్త మచ్యుతకథావిభవం బొకమాటు వీనులన్ ¯ వినిన మనోజపుష్ప శరవిద్ధుఁడు నైన విరామ మొందునే? (962) అదియునుం గాక. (963) హరిభజియించుహస్తములుహస్తము; లచ్యుతుఁగోరి మ్రొక్కు త¯ చ్ఛిరము శిరంబు; చక్రధరుఁ జేరిన చిత్తము చిత్త; మిందిరా ¯ వరుఁగను దృష్టి దృష్టి; మురవైరి నుతించిన వాణి వాణి; య¯ క్షరుకథ లాను కర్ణములు కర్ణములై విలసిల్లుఁబో భువిన్. (964) హరిపాదతీర్థ సేవా ¯ పరుఁడై విలసిల్లునట్టి భాగవతుని వి¯ స్ఫురితాంగము లంగము; లా ¯ పరమేశ్వరు నెఱుఁగ నాకుఁ బలుకు మునీంద్రా! " (965) అనుడు వేదవ్యాసతనయుఁ డా యభిమన్యు¯ తనయునిఁ జూచి యిట్లనియెఁ బ్రీతి ¯ "జనవర! గోవింద సఖుఁడు కుచేలుండు¯ నా నొప్పు విప్రుండు మానధనుఁడు ¯ విజ్ఞాని రాగాది విరహితస్వాంతుండు¯ శాంతుండు ధర్మవత్సలుఁడు ఘనుఁడు ¯ విజితేంద్రియుఁడు బ్రహ్మవేత్త దారిద్య్రంబు¯ బాధింప నొరులఁ గార్పణ్యవృత్తి (965.1) నడుగఁ బోవక తనకుఁ దా నబ్బినట్టి ¯ కాసు పదివేల నిష్కముల్‌ గాఁ దలంచి ¯ యాత్మ మోదించి పుత్రదారాభిరక్ష ¯ యొక విధంబున నడుపుచు నుండు; నంత (966) లలితపతివ్రతా తిలకంబు వంశాభి¯ జాత్య తద్భార్య దుస్సహ దరిద్ర ¯ పీడచేఁ గడు నొచ్చి పెదవులు దడుపుచు¯ శిశువు లాఁకటి చిచ్చుచేఁ గృశించి ¯ మలమల మాఁడుచు మానసం బెరియంగఁ¯ బట్టెఁ డోరెము మాకుఁ బెట్టు మనుచుఁ ¯ బత్త్రభాజనధృతపాణులై తనుఁ జేరి¯ వేఁడిన వీనులుసూఁడినట్ల (966.1) యైన నొకనాఁడు వగచి నిజాధినాథుఁ ¯ జేరి యిట్లని పలికె "నో జీవితేశ! ¯ తట్టుముట్టాడు నిట్టి పేదఱిక మిట్లు ¯ నొంప దీని కుపాయ మూహింప వైతి. " (967) అని మఱియు నిట్లనియె. (968) "బాలసఖుఁడైన యప్పద్మపత్త్రనేత్రుఁ ¯ గాన నేఁగి దారిద్య్రాంధకార మగ్ను ¯ లైన మము నుద్ధరింపుము; హరికృపా క ¯ టాక్ష రవిదీప్తి వడసి మహాత్మ! నీవు. (969) మఱియును. (970) వరదుఁడు సాధుభక్తజనవత్సలుఁ డార్తశరణ్యుఁ డిందిరా ¯ వరుఁడు దయాపయోధి భగవంతుఁడు కృష్ణుఁడు దాఁ గుశస్థలీ ¯ పురమున యాదవప్రకరముల్‌ భజియింపఁగ నున్నవాఁడు; నీ¯ వరిగిన నిన్నుఁ జూచి విభుఁ డప్పుడ యిచ్చు ననూన సంపదల్‌. (971) కలలోనం దను మున్నెఱుంగని మహాకష్టాత్ముడై నట్టి దు¯ ర్బలుఁ డాపత్సమయంబునన్ నిజపదాబ్జాతంబు లుల్లంబులోఁ¯ దలఁపన్నంతన మెచ్చి యార్తిహరుఁడై తన్నైన నిచ్చున్; సుని¯ శ్చలభక్తిన్ భజియించు వారి కిడఁడే సంపద్విశేషోన్నతుల్‌? " (972) అని చెప్పిన నమ్మానిని ¯ సునయోక్తుల కలరి భూమిసురుఁ డా కృష్ణుం ¯ గన నేఁగుట యిహపర సా ¯ ధనమగు నని మదిఁ దలంచి తన సతితోడన్. (973) "నీవు సెప్పిన యట్ల రాజీవనేత్రు ¯ పాదపద్మంబు లాశ్రయింపంగఁ జనుట ¯ పరమశోభన మా చక్రపాణి కిపుడు ¯ గాను కేమైనఁ గొంపోవఁ గలదె మనకు? " (974) అనిన నయ్యింతి "యౌఁగాక"యనుచు విభుని ¯ శిథిల వస్త్రంబు కొంగునఁ బృథుక తండు ¯ లముల నొకకొన్ని ముడిచి నెయ్యమున ననుపఁ ¯ జనియె గోవింద దర్శనోత్సాహి యగుచు. (975) అట్లు సనుచుం దన మనంబున. (976) "ద్వారకానగరంబు నే రీతిఁ జొత్తును?¯ భాసురాంతఃపురవాసి యైన ¯ యప్పుండరీకాక్షు నఖిలేశు నెబ్భంగి¯ దర్శింపఁ గలనొ? తద్ద్వారపాలు ¯ "రెక్కడి విప్రుఁడ? విం దేల వచ్చెద?"¯ వని యడ్డ పెట్టిరే నపుడు వారి ¯ కే మైనఁ బరిదాన మిచ్చి చొచ్చెద నన్న¯ నూహింప నర్థశూన్యుండ నేను; (976.1) నయిన నా భాగ్య; మతని దయార్ద్రదృష్టి ¯ గాక తలపోయఁగా నొండు గలదె? యాతఁ ¯ డేల నన్ను నుపేక్షించు? నేటిమాట?"¯ లనుచు నా ద్వారకాపుర మతఁడు సొచ్చి. (977) ఇట్లు ప్రవేశించి రాజమార్గంబునం జనిచని కక్ష్యాంతరంబులు గడచి చని ముందట. (978) విశదమై యొప్పు షోడశసహస్రాంగనా¯ కలితవిలాస సంగతిఁ దనర్చి ¯ మహనీయ తపనీయ మణిమయగోపుర¯ ప్రాసాద సౌధ హర్మ్యములు సూచి, ¯ మనము బ్రహ్మానందమును బొందఁ గడు నుబ్బి¯ సంతోషబాష్పముల్‌ జడిగొనంగఁ ¯ బ్రకటమై విలసిల్లు నొక వధూమణి మంది¯ రమున నింతులు చామరములు వీవఁ (978.1) దనరు మృదుహంసతూలికా తల్పమందుఁ ¯ దానుఁ బ్రియయును బహు వినోదములఁ దనరి ¯ మహితలావణ్య మన్మథమన్మథుండు ¯ ననఁగఁ జూపట్టు పుండరీకాయతాక్షు. (979) ఇందీవరశ్యాము, వందితసుత్రాముఁ¯ గరుణాలవాలు, భాసుర కపోలుఁ, ¯ గౌస్తుభాలంకారుఁ, గామితమందారు¯ సురుచిరలావణ్యు, సుర శరణ్యు ¯ హర్యక్షనిభమధ్యు, నఖిలలోకారాధ్యు¯ ఘనచక్రహస్తు, జగత్ప్రశస్తు, ¯ ఖగకులాధిపయానుఁ, గౌశేయపరిధానుఁ¯ బన్నగశయను, నబ్జాతనయను, (979.1) మకరకుండల సద్భూషు, మంజుభాషు ¯ నిరుపమాకారు, దుగ్ధసాగరవిహారు, ¯ భూరిగుణసాంద్రు, యదుకులాంభోధి చంద్రు, ¯ విష్ణు, రోచిష్ణు, జిష్ణు, సహిష్ణుఁ, గృష్ణు

కుచేలుని ఆదరించుట

(980) కని డాయం జనునంతఁ గృష్ణుఁడు దళత్కంజాక్షుఁ డప్పేద వి¯ ప్రుని నశ్రాంత దరిద్రపీడితుఁ గృశీభూతాంగు జీర్ణాంబరున్ ¯ ఘనతృష్ణాతురచిత్తు హాస్యనిలయున్ ఖండోత్తరీయుం గుచే ¯ లుని నల్లంతనె చూచి సంభ్రమ విలోలుండై దిగెం దల్పమున్. (981) కర మర్థి నెదురుగాఁ జని ¯ పరిరంభణ మాచరించి, బంధుస్నేహ¯ స్ఫురణం దోడ్తెచ్చి, సమా ¯ దరమునఁ గూర్పుండఁ బెట్టెఁ దన తల్పమునన్. (982) అట్లు గూర్చుండఁ బెట్టి నెయ్యమునఁ గనక ¯ కలశ సలిలంబుచేఁ గాళ్ళు గడిగి భక్తిఁ ¯ దజ్జలంబులు దనదు మస్తమునఁ దాల్చి ¯ లలిత మృగమద ఘనసార మిళిత మైన. (983) మలయజము మేన జొబ్బిల్ల నలఁది యంత ¯ శ్రమము వాయంగఁ దాళవృంతమున విసరి ¯ బంధురామోదకలిత ధూపంబు లొసఁగి ¯ మించు మణిదీపముల నివాళించి మఱియు. (984) సురభికుసుమ మాలికలు సిగముడిం దుఱిమి, కర్పూరమిళిత తాంబూలంబు నిడి, ధేనువు నొసంగి, సాదరంబుగా స్వాగతం బడిగిన నప్పు డవ్విప్రుండు మేనం బులకాంకురంబు లంకురింప నానందబాష్ప జలబిందు సందోహుం డయ్యె; నట్టియెడం బద్మలోచనుండు మన్నించు నంగనామణి యగు రుక్మిణి కరకంకణ రవంబు లొలయం జామరలు వీవం దజ్జాత వాతంబున ఘర్మసలిలంబు నివారించుచుండఁ జూచి శుద్ధాంత కాంతానివహంబులు దమ మనంబుల నద్భుతం బంది యిట్లనిరి. (985) "ఏమి తపంబు సేసెనొకొ! యీ ధరణీదివిజోత్తముండు తొల్ ¯ బామున! యోగివిస్ఫుర దుపాస్యకుఁడై తనరారు నీ జగ¯ త్స్వామి రమాధినాథు నిజతల్పమునన్ వసియించి యున్నవాఁ¯ డీ మహనీయమూర్తి కెనయే మునిపుంగవు లెంతవారలున్? (986) అదియునుం గాక. (987) తన మృదుతల్పమందు వనితామణి యైన రమాలలామ పొం¯ దును నెడఁగాఁ దలంపక యదుప్రవరుం డెదురేఁగి మోదముం ¯ దనుకఁగఁ గౌఁగిలించి యుచితక్రియలం బరితుష్టుఁ జేయుచున్ ¯ వినయమునన్ భజించె; ధరణీసురుఁ డెంతటి భాగ్యవంతుడో? " (988) అను నయ్యవసరంబున (989) మురసంహరుఁడు కుచేలుని ¯ కరము గరంబునఁ దెమల్చి కడఁకన్ "మన మా ¯ గురుగృహమున వర్తించిన ¯ చరితము"లని కొన్ని నుడివి చతురత మఱియున్. (990) "బ్రాహ్మణోత్తమ! వేదపాఠనలబ్ధ ద¯ క్షత గల చారువంశంబు వలనఁ ¯ బరిణయంబైనట్టి భార్య సుశీలవ¯ ర్తనములఁ దగభవత్సదృశ యగునె? ¯ తలఁప గృహక్షేత్ర ధనదార పుత్త్రాదు¯ లందు నీ చిత్తంబు సెందకుంట ¯ తోఁచుచున్నది; యేనుదుది లోకసంగ్రహా¯ ర్థంబు కర్మాచరణంబుసేయు (990.1) గతి, మనంబులఁ గామమోహితులు గాక ¯ యర్థిమై యుక్తకర్మంబు లాచరించి ¯ ప్రకృతి సంబంధములు వాసి భవ్యనిష్ఠ ¯ దవిలియుందురు కొంద ఱుత్తములు భువిని. " (991) అని మఱియు నిట్లనియె. (992) "ఎఱుఁగుదువె? మనము గురు మం ¯ దిరమున వసియించి యతఁడు దెలుపఁగ వరుస¯ న్నెఱుఁగఁగ వలసిన యర్థము ¯ లెఱిఁగి పరిజ్ఞానమహిమ లెఱుఁగుట లెల్లన్. " (993) అని మఱియు గురుప్రశంస సేయం దలంచి యిట్లనియె.