పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవత పారాయణ - 3 : దశమ ఉత్తర 230 - 345

రుక్మిణీదేవి విప్రలంభంబు

(230) పతి యే రూపము దాల్చినం దదనురూపంబైన రూపంబుతో ¯ సతి దా నుండెడు నట్టి రూపవతి నా చంద్రాస్య నా లక్ష్మి నా ¯ సుతనున్ రుక్మిణి నా యనన్యమతి నా శుద్ధాంతరంగం గళా ¯ చతురత్వంబున శౌరి యిట్లనియెఁ జంచన్మందహాసంబుతోన్. (231) "బలశౌర్యంబుల భోగమూర్తి కులరూపత్యాగ సంపద్గుణం ¯ బుల దిక్పాలురకంటెఁ జైద్యముఖరుల్‌ పూర్ణుల్‌ ఘనుల్‌; వారికిన్ ¯ నెలఁతా! తల్లియుఁదండ్రియుం సహజుఁడున్ నిన్నిచ్చినంబోక యీ ¯ బలవద్భీరుల వార్ధిలీనుల మముం బాటింప నీ కేటికిన్? (232) లోకుల నడవడిలోని వారము గాము¯ పరులకు మా జాడ బయలు పడదు; ¯ బలమదోపేతులు పగగొండ్రు మా తోడ¯ రాజపీఠములకు రాము తఱచు; ¯ శరణంబు మాకు నీ జలరాశి సతతంబు¯ నిష్కించనుల మేము; నిధులు లేవు; ¯ కలవారు చుట్టాలు గారు; నిష్కించన¯ జనబంధులము; ముక్తసంగ్రహులము; (232.1) గూఢవర్తనులము; గుణహీనులము; భిక్షు ¯ లైన వారిఁ గాని నాశ్రయింప; ¯ మిందుముఖులు దగుల; రిటువంటి మముబోఁటి ¯ వారి నేల దగుల వారిజాక్షి! (233) సిరియును వంశము రూపును ¯ సరియైన వివాహసఖ్య సంబంధంబుల్‌ ¯ జరుగును; సరి గాకున్నను ¯ జరగవు; లోలాక్షి! యెట్టి సంసారులకున్. (234) తగదని యెఱుఁగవు మమ్ముం ¯ దగిలితివి మృగాక్షి! దీనఁ దప్పగు; నీకుం ¯ దగిన మనుజేంద్రు నొక్కనిఁ ¯ దగులుము; గుణహీనజనులఁ దగునే తగులన్? (235) సాల్వ జరాసంధ చై ద్యాది రాజులు¯ చెలఁగి నన్ వీక్షించి మలయుచుండ ¯ నది గాక రుక్మి నీ యన్నయు గర్వించి¯ వీర్యమదాంధుఁ డై వెలయుచున్న ¯ వారి గర్వంబులు వారింపఁగాఁ గోరి¯ చెలువ! నిన్నొడిచి తెచ్చితిమి; గాని ¯ కాంతా తనూజార్థ కాముకులము గాము¯ కామమోహాదులఁ గ్రందుకొనము; (235.1) విను; ముదాసీనులము; క్రియావిరహితులము ¯ పూర్ణులము మేము; నిత్యాత్మబుద్ధితోడ ¯ వెలుఁగుచుందుము గృహదీపవిధము మెఱసి; ¯ నవలతాతన్వి! మాతోడ నవయ వలదు." (236) అని యిట్లు భగవంతుడైన హరి దన్నుఁ బాయక సేవించుటం బ్రియురాలను, పట్టంపుదేవి ననియెడి రుక్మిణి దర్పంబు నేర్పున నుపసంహరించి యూరకుండిన నమ్మానవతి యప్రియంబులు నపూర్వంబులు నైన మనోవల్లభు మాటలు విని దురంతంబైన చింతాభరంబున సంతాపంబు నొందుచు. (237) కాటుక నెఱయంగఁ గన్నీరు వరదలై¯ కుచకుంభయుగళ కుంకుమము దడియ ¯ విడువక వెడలెడు వేఁడినిట్టూర్పుల¯ లాలితాధర కిసలయము గందఁ ¯ జెలువంబు నెఱిదప్పి చిన్నఁవోవుచు నున్న¯ వదనారవిందంబు వాడు దోఁప ¯ మారుతాహతిఁ దూలు మహిత కల్పకవల్లి¯ వడువున మేన్ వడవడ వడంకఁ (237.1) జిత్త మెఱియంగఁ జెక్కిటఁ జేయ్యి సేర్చి ¯ కౌతుకం బేది పదతలాగ్రమున నేల ¯ వ్రాసి పెంపుచు మో మరవాంచి వగలఁ ¯ బొందె మవ్వంబు గందిన పువ్వుఁబోలె. (238) అలికుల వేణి తన్నుఁ బ్రియుఁ డాడిన యప్రియభాష లిమ్మెయిన్ ¯ సొలవక కర్ణరంధ్రముల సూదులు సొన్పిన రీతిఁగాఁగ బె¯ బ్బులి రొద విన్న లేడి క్రియఁ బొల్పఱి చేష్టలు దక్కి నేలపై ¯ వలనఱి వ్రాలెఁ గీ లెడలి వ్రాలిన పుత్తడిబొమ్మ కైవడిన్. (239) ఇట్లు వ్రాలిన. (240) ప్రణతామ్నాయుఁడు కృష్ణుఁ డంతఁ గదిసెన్ బాష్పావరుద్ధారుణే ¯ క్షణ విస్రస్త వినూత్నభూషణ దురుక్తక్రూర నారాచ శో ¯ షణ నాలింగితధారుణిన్ నిజకులాచారైక సద్ధర్మ చా ¯ రిణి విశ్లేషిణి వీతతోషిణిఁ బురంధ్రీగ్రామణిన్ రుక్మిణిన్. (241) కని సంభ్రమంబునఁ దనువునం దనువుగా¯ ననువునఁ జందనం బల్ల నలఁది ¯ కన్నీరు పన్నీటఁ గడిగి కర్పూరంపుఁ¯ బలుకులు సెవులలోఁ బాఱ నూఁది ¯ కరమొప్ప ముత్యాలసరుల చి క్కెడలించి¯ యురమునఁ బొందుగా నిరవుకొలిపి ¯ తిలకంబు నునుఫాలఫలకంబుపైఁ దీర్చి¯ వదలిన భూషణావళులఁ దొడిగి (241.1) కమలదళ చారు తాలవృంతమున విసరి ¯ పొలుచు పయ్యెదఁ గుచములఁ బొందుపఱిచి ¯ చిత్త మిగురొత్త నొయ్యన సేదఁదీర్చి ¯ బిగియఁ గౌఁగిటఁ జేర్చి నె మ్మొగము నిమిరి. (242) నెరులుగల మరునీలంపు టురుల సిరుల ¯ నరులుగొనఁ జాలి నరులను మరులు కొలుపు ¯ యిరులు గెలిచిన తుమ్మెద గఱులఁ దెగడు ¯ కురుల నులిదీర్చి విరు లిడి కొప్పువెట్టి. (243) మురసంహరుఁ డిందిందిర ¯ గరుదనిలచలత్ప్రసూనకలికాంచిత సుం ¯ దరశయ్యఁ జేర్చె భీష్మక ¯ వరపుత్రిన్ నుతచరిత్ర వారిజనేత్రన్. (244) ఇట్లు పానుపునం జేర్చి మృదుమధుర భాషణంబుల ననునయించిన. (245) పురుషోత్తము ముఖకోమల ¯ సరసిజ మయ్యిందువదన సవ్రీడా హా ¯ సరుచిస్నిగ్ధాపాంగ¯ స్ఫుర దవలోకనము లొలయఁ జూ చిట్లనియెన్.

రుక్మిణిదేవి స్తుతించుట

(246) “మురహర! దివసాగమ దళ ¯ దరవిందదళాక్ష! తలఁప నది యట్టి దగున్ ¯ నిరవధిక విమలతేజో ¯ వరమూర్తివి; భక్తలోకవత్సల! యెందున్. (247) సంచితజ్ఞాన సుఖ బలైశ్వర్య శక్తు ¯ లాదిగాఁ గల సుగుణంబు లమరు నీకు; ¯ నేను దగుదునె? సర్వలోకేశ్వరేశ! ¯ లీలమై సచ్చిదానందశాలి వనఘ! (248) రూఢిమైఁ బ్రకృతి పూరుష కాలములకు నీ¯ శ్వరుఁడవై భవదీయ చారుదివ్య ¯ లలితకళా కౌశలమున నభిరతుఁడై¯ కడఁగు నీ రూప మెక్కడ మహాత్మ! ¯ సత్త్వాది గుణసముచ్చయయుక్త మూఢాత్మ¯ నయిన నే నెక్కడ? ననఘచరిత! ¯ కోరి నీ మంగళ గుణభూతి గానంబు¯ సేయంగఁబడు నని చెందు భీతి (248.1) నంబునిధి మధ్యభాగమం దమృత ఫేన ¯ పటల పాండుర నిభమూర్తి పన్నగేంద్ర ¯ భోగశయ్యను బవ్వళింపుచును దనరు ¯ నట్టి యున్నతలీల దివ్యంబు దలఁప. (249) శబ్ద స్పర్శ రూప రస గంధంబు లనియెడు గుణంబులచేతఁ బరిగ్రహింపఁబడిన మంగళ సుందర విగ్రహుండవై, యజ్ఞానాంధకార నివారకంబైన రూపంబుఁ గైకొని, భవదీయులైన సేవకులకు ననుభావ్యుండ వైతి; భవత్పాదారవింద మకరందరసాస్వాద లోలాత్ములైన యోగీంద్రులకైనను భవన్మార్గంబు స్ఫుటంబు గా; దట్లగుటం జేసి యీ మనుజపశువులకు దుర్విభావ్యంబగుట యేమిసెప్ప? నిట్టి యీశ్వరుండవైన నీకు నిచ్ఛ స్వతంత్రంబు గావున నదియును నా కభిమతంబు గావున నిన్ను నే ననుసరింతు; దేవా! నీవకించనుఁడవైతేని బలిభోక్తలయిన బ్రహ్మేంద్రాదు లెవ్వనికొఱకు బలిసమర్పణంబు సేసిరి? నీవు సమస్త పురుషార్థమయుండ వనియును, ఫలస్వరూపి వనియును నీ యందలి ప్రేమాతిశయంబులం జేసి విజ్ఞానదీపాంకురంబున నిరస్త సమస్త దోషాంధకారులై యిహసౌఖ్యంబులు విడిచి సుమతులు భవదీయదాస సంగంబు గోరుచుండుదు; రట్లు సేయనేరక నిజాధికారాంధకారమగ్ను లైన వారు భవత్తత్త్వంబు దెలిసి బలిప్రక్షేపణంబులు సేయంజాలక మూఢులై సంసారచక్రంబునం బరిభ్రమింతు; రదియునుంగాక. (250) వరమునీంద్ర యోగివర సురకోటిచే¯ వర్ణితప్రభావవైభవంబు ¯ గలిగి యఖిలచేతనులకు విజ్ఞాన ప్ర ¯ దుండ వగుదు వభవ! దురితదూర! (251) దేవా! భవదీయ కుటిల భ్రూవిక్షేపోదీరిత కాలవేగంబుచేత విధ్వస్తమంగళు లగు కమలభవ భవ పాకశాసనాదులం దిరస్కరించినట్టి మదీయ చిత్తంబున. (252) నిను వరియించినం బెలుచ నీరజలోచన! శార్‌ఙ్గ సాయకా ¯ సన నినదంబులన్ సకల శత్రుధరాపతులన్ జయించి బో ¯ రన పశుకోటిఁ దోలు మృగరాజు నిజాంశము భూరిశక్తిఁ గై ¯ కొనిన విధంబునన్ నను నకుంఠిత శూరతఁ దెచ్చి తీశ్వరా! (253) అట్టి నృపాల కీటముల నాజి నెదుర్పఁగ లేనివాని య¯ ట్లొట్టిన భీతిమై నిటు పయోధిశరణ్యుఁడ వైతి వింతయున్ ¯ నెట్టన మాయ గాక యివి నిక్కములే? భవదీయ భక్తు లై ¯ నట్టి నరేంద్రమౌళిమణు లంచిత రాజఋషుల్‌ ముదంబునన్. (254) వితత రాజ్యగరిమ విడిచి కాననముల ¯ నాత్మలందు మీ పదాబ్జయుగము ¯ వలఁతి గాఁగ నిలిపి వాతాంబు పర్ణాశ ¯ నోగ్రనియతు లగుచు నుందు రభవ! (255) విమలజ్ఞాననిరూఢులైన జనముల్‌ వీక్షింప మీ పాద కం ¯ జమరందస్ఫుట దివ్యసౌరభము నాస్వాదించి నిర్వాణ రూ ¯ పము సత్పూరుష వాగుదీరితము శోభాశ్రీనివాసంబు నౌ ¯ మిము సేవింపక మానవాధముని దుర్మేధాత్ము సేవింతునే? (256) మఱియును దేవా! భూలోకంబునందును, నిత్యనివాసంబునందును, సకల ప్రదేశంబులందును జగదీశ్వరుండ వయిన నిన్ను నభిమతంబులయిన కామరూపంబులు గైకొని వరియింతు; భవదీయ చరణారవింద మకరందాస్వాదన చాతుర్యధుర్యభృంగియైన కామిని యతి హేయంబైన త్వక్‌ శ్మశ్రు రోమ నఖ కేశంబులచేతఁ గప్పంబడి యంతర్గతంబయిన మాంసాస్థి రక్త క్రిమి విట్కఫ పిత్త వాతంబుగల జీవచ్ఛవంబయిన నరాధముని మూఢాత్మయై కామించునే? యదియునుంగాక. (257) నీరదాగమమేఘనిర్యత్పయః పాన¯ చాతకం బేగునే చౌటి పడెకుఁ? ¯ బరిపక్వ మాకంద ఫలరసంబులు గ్రోలు¯ కీరంబు సనునె దుత్తూరములకు? ¯ ఘనర వాకర్ణనోత్కలిక మయూరము¯ గోరునే కఠిన ఝిల్లీరవంబుఁ? ¯ గరికుంభ పిశిత సద్గ్రాస మోదిత సింహ¯ మరుగునే శునక మాంసాభిలాషఁ (257.1) బ్రవిమలాకార! భవదీయ పాదపద్మ ¯ యుగ సమాశ్రయ నైపుణోద్యోగచిత్త ¯ మన్యుఁ జేరునె తన కుపాస్యంబు గాఁగ? ¯ భక్తమందార! దుర్భర భవవిదూర! (258) వాసవవందిత! భవ కమ ¯ లాసన దివ్యప్రభా సభావలి కెపుడున్ ¯ నీ సమధిక చారిత్ర క ¯ థా సురుచిరగాన మవితథం బయి చెల్లున్. (259) ధరణీనాథులు దమతమ ¯ వరవనితామందిరముల వసియించుచు గో ¯ ఖర మార్జాలంబుల గతి ¯ స్థిరబద్ధు లగుదురు నిన్నుఁ దెలియని కతనన్. (260) జలజనాభ! సకల జగ దంతరాత్మవై ¯ నట్టి దేవ! నీ పదారవింద ¯ యుగళి సానురాగయుక్తమై నా మదిఁ ¯ గలుగునట్లు గాఁగఁ దలఁపు మనఘ! (261) పృథు రజోగుణప్రవృద్ధమైనట్టి నీ ¯ దృష్టిచేత నన్నుఁ దేఱుకొనఁగఁ ¯ జూచు టెల్ల పద్మలోచన! నా మీఁద ¯ ఘనదయార్ద్రదృష్టిగాఁ దలంతు. (262) అదియునుంగాక, మధుసూదనా! నీవాక్యంబులు మిథ్యలుగావు; తల్లి వచనంబు కూఁతున కభిమతంబుగాదె? యౌవనారూఢమదంబున స్వైరిణి యగు కామిని పురుషాంతరాసక్త యగుట విచారించి పరిజ్ఞాని యైనవాఁడు విడుచు; నవివేకి యయిన పురుషుం డింద్రియలోలుండై రతిం దగిలి దాని విడువనేరక పరిగ్రహించి యుభయలోకచ్యుతుండగు; నట్లుగావున నీ యెఱుంగని యర్థంబు గలదే?” యని విన్నవించిన రుక్ష్మిణీదేవి వచనంబులకుఁ గృష్ణుండు సంతసిల్లి యిట్లనియె.

రుక్మిణీదేవి నూరడించుట

(263) "అలికులవేణి! నవ్వులకు నాడినమాటల కింత నీ మదిం ¯ గలఁగఁగ నేల? వేఁటలను గయ్యములన్ రతులందు నొవ్వఁగాఁ ¯ బలికినమాట లెగ్గు లని పట్టుదురే? భవదీయ చిత్తముం ¯ దెలియఁగఁ గోరి యేఁ బలికితిన్ మదిలో నిటు గుంద నేఁటికిన్? (264) అదియునుం గాక. (265) కింకలు ముద్దుఁబల్కులును గెంపుఁగనుంగవ తియ్యమోవియున్¯ జంకెలు తేఱిచూపు లెకసక్కెములున్ నెలవంక బొమ్మలుం ¯ గొంకక వీడనాడుటలుఁ గూరిమియుం గల కాంతఁ గూడుటల్‌ ¯ అంకిలి లేక జన్మఫల మబ్బుట గాదె కురంగలోచనా! " (266) అని మఱియు నిట్లనియె. (267) "నీవు పతివ్రతామణివి నిర్మల ధర్మవివేక శీల స¯ ద్భావవు నీ మనోగతులఁ బాయక యెప్పుడు నస్మదీయ సం ¯ సేవయ కాని యన్యము భజింపవు; పుట్టిన నాఁటనుండి నీ ¯ భావ మెఱింగి యుండియును బల్కిన తప్పు సహింపు మానినీ! (268) అని వెండియు నిట్లనియె “నీవాక్యంబులు శ్రవణసుఖంబుగావించె; నీవు వివిధంబులైన కామంబులు గోరితివేని, నవియన్నియు నాయంద యుండుటం జేసి యేకాంతసేవాచతుర వైన నీకు నవి యన్నియు నిత్యంబులై యుండు; నీ పాతివ్రత్యంబును, నా యందలి స్నేహంబు నతివిశదంబు లయ్యె; నావాక్యములచేత భవ దీయచిత్తంబు చంచలంబు గాక నా యందలి బుద్ధి దృఢంబగుం గావున సకలసంపద్విలసితంబైన ద్వారకానగర దివ్యమందిరంబు లందు నీదు భాగ్యంబునం జేసి సంసారికైవడి నీ యందు బద్ధానురాగుండనై వర్తింతుఁ; దక్కిన ప్రాణేంద్రియ పరవశత్వంబున వికృత శరీరధారిణియైన సతి నన్నుం జెందుట దుష్కరం; బదియునుం గాక మోక్షప్రదుండనైన నన్నుఁ గామాతురలైన యల్పమతులు వ్రతతపోమహిమలచేత దాంపత్య యోగంబుకై సేవింతు; రదియంతయు నా మాయా విజృంభితంబు; దానంజేసి వారు మందభాగ్యలై నిరయంబు నొందుదు; రట్లుగావున నీ సమానయైన కాంత యే కాంతలందైనఁ గలదె? నీ వివాహకాలంబు ననేక రాజన్యవర్యులఁ గైకొనక భవదీయ మధురాలాప శ్రవణాత్మకుండనైన నా సన్నిధికి "నా శరీరం బితర యోగ్యంబు గాదు; నీకు శేషంబనయి యున్న దాన"నని యేకాంతంబునం బ్రాహ్మణుం బుత్తెంచిన నేనును జనుదెంచి, నీ పరిణయసమయంబున భవత్సహోదరుంబట్టి విరూపుం గావించిన నది గనుంగొనియును నా యందలి విప్రయోగ భయంబున నూరకుండితి; వదిగావున బహుప్రకారంబులై వర్తించు నీ సద్గుణంబులకు సంతసింతు!”నని యివ్విధంబున దేవకీసుతుండు నరలోక విడంబనంబుగ గృహస్థునిభంగి నిజగృహకృత్యంబు లాచరించుచుండె"నని శుకుండు మఱియు నిట్లనియె. (269) "అని యిట్లు కృష్ణుఁ డాడిన¯ వినయ వివేకానులాప వితతామృత సే ¯ చన ముదిత హృదయయై య¯ వ్వనితామణి వికచ వదన వనరుహ యగుచున్. (270) నగ వామతించు చూపులు ¯ నగధరు మోమునను నిలిపి నయమునఁ గరముల్‌ ¯ మొగిచి వినుతించెఁ గృష్ణున్ ¯ ఖగవాహున్ రుచిరదేహుఁ గలితోత్సాహున్. (271) అతుల విరాజమానముఖుఁడై వివిధాంబర చారుభూషణ¯ ప్రతతులతోడఁ గోరిన వరంబులు దద్దయుఁ నిచ్చెఁ గృష్ణుఁ డు¯ న్నతశుభమూర్తి దేవగణనందితకీర్తి దయానువర్తియై ¯ యతిమృదువాణికిం గిసలయారుణపాణికి నీలవేణికిన్. (272) ఇట్లుసమ్మానించి కృష్ణుండు రుక్మిణియుందానును దదనంతరంబ. (273) ఎలమి ఘటింపఁగాఁ గలసి యీడెల నీడల మల్లికా లతా ¯ వలిఁ గరవీరజాతి విరవాదుల వీథులఁ గమ్మ దెమ్మెరల్‌ ¯ వొలయు నవీనవాసములఁ బొన్నలఁ దిన్నెలఁ బచ్చరచ్చలం ¯ గొలఁకుల లేఁగెలంకులను గోరిక లీరిక లొత్తఁ గ్రొత్తలై. (274) ఆరామభూములందు వి ¯ హారామల సౌఖ్యలీల నతిమోదముతో ¯ నా రామానుజుఁ డుండెను ¯ నా రామామణియుఁ దాను నభిరామముగన్.

కృష్ణ కుమా రోత్పత్తి

(275) మఱియు, ననేకవిధ విచిత్రమణివితానాభిశోభిత ప్రాసాదోపరిభాగంబులను, లాలిత నీలకంఠ కలకంఠ కలవింక శుక కలాప కలిత తీరంబులను, మకరందపానమదవదిందిందిర ఝంకార సంకుల కమల కహ్లార సుధాసార నీహా పూరిత కాసారంబులను, ధాతు నిర్ఝర రంజిత సానుదేశగిరి కుంజపుంజంబులను, గృతకశైలంబులను, గ్రీడాగృహంబులనుం జెలంగి నందనందనుండు విదర్భరాజనందనం దగిలి కందర్పకేళీలోలాత్ముండయ్యె; ననంతరంబా సుందరీలాలామంబువలనఁ బ్రద్యుమ్నుండు, చారుధేష్ణుండు, చారుదేవుండు, సుధేష్ణుండు, సుచారువు, చారుగుప్తుండు, భద్రచారువు, చారుభద్రుండు, విచారువు, చారువు ననియెడు పదుగురు తనయులం బడసె; నట్లు సత్యభామా జాంబవతీ నాగ్నజితీ కాళిందీ మాద్రి మిత్రవిందా భద్రలకు వేఱువేఱ పదుగురేసి భద్రమూర్తు లైన కుమారు లుదయించి; రవ్విధంబున మఱియును. (276) అనఘ! పదాఱువేల సతులందు జనించిరి వేఱువేఱ నం ¯ దన దశకంబు తత్సుత వితానము గాంచి రనేక సూనుల¯ న్నెనయఁగ నిట్లు పిల్లచెఱ కీనిన కైవడిఁ బుత్త్ర పౌత్త్ర వ¯ ర్ధనమున నొప్పెఁ గృష్ణుఁడు ముదంబునఁ దామరతంపరై భువిన్. (277) అట్లు యదు వృష్ణి భోజాంధకాది వివిధ ¯ నామధేయాంతరముల నెన్నంగ నూట ¯ యొక్కటై చాల వర్ధిల్లె నక్కులంబు ¯ నృపకుమారులఁ జదివించు నేర్పు గలుగు. (278) గురుజనంబులు విను మూఁడుకోట్లమీఁద ¯ నెనుబదెనిమిదివేలపై నెసఁగ నూర్వు ¯ రన్నఁ దద్బాలకావలి నెన్నఁదరమె ¯ శూలికైనను దామరచూలికైన? (279) అందు గోవిందనందనుండయిన ప్రద్యుమ్నునకు రుక్మి కూఁతు వలన ననిరుద్ధుండు సంభవించె ననిన మునివరునకు భూవరుం డిట్లనియె. (280) “బవరమునఁ గృష్ణుచే ము¯ న్నవమానము నొంది రుక్మి యచ్యుతు గెలువం ¯ దివురుచుఁ దన సుత నరిసం ¯ భవునకు నెట్లిచ్చె? నెఱుఁగఁ బలుకు మునీంద్రా!”

ప్రద్యుమ్న వివాహంబు

(281) నావుడు శుకయోగి "నరనాయకోత్తమ!¯ నీవు చెప్పిన యట్ల నెమ్మనమునఁ ¯ బద్మాయతాక్షుచేఁ బడిన బన్నమునకుఁ¯ గనలుచు నుండియు ననుజతోడి ¯ నెయ్యంబునను భాగినేయున కిచ్చెను¯ గూఁతు నంచితపుష్ప కోమలాంగిఁ ¯ దన పూన్కి దప్పినఁ దగ విదర్భేశుండు¯ విను మెఱింగింతు న వ్విధము దెలియఁ (281.1) బరఁగ రుక్మవతీ స్వయంవరమున కొగి ¯ నరుగుదెం డని భీష్మభూవరసుతుండు ¯ వరుస రప్పించె రాజన్యవర కుమార ¯ వరుల నను వార్త కలరి యా హరిసుతుండు. (282) వర మణిభూషణప్రభలవర్గ మనర్గళ భంగిఁ బర్వఁ బ్ర¯ స్ఫురిత రథాధిరోహణవిభూతి దలిర్ప మనోహరైక సు¯ స్థిరశుభలీల నేగె యదుసింహకిశోరము రాజకన్యకా¯ పరిణయవైభవాగత నృపాలక కోటికి రుక్మివీటికిన్. (283) చని పురిఁజొచ్చి వృష్ణికులసత్తముఁ డచ్చట మూఁగియున్న య¯ మ్మనుజవరేణ్యనందనుల మానము దూలి భయాకులాత్ము లై¯ చనఁగ ననేక చండతర సాయకసంపదఁ జూపి రుక్మి నం ¯ దనఁ గొనివచ్చి వేడ్క నిజధామము సొచ్చె నవార్యశౌర్యుఁ డై. (284) ఇట్లు తెచ్చి ప్రద్యుమ్నుండు హరినయనం బరిణయంబంది నిఖిల సుఖంబు లనుభవింపుచుండె; యనంతరంబ. (285) ధీరుఁడు కృతవర్ముని సుకు ¯ మారుఁడు వరియించె రుచిరమండనయుత నం ¯ భోరుహముఖి రుక్మిసుతం ¯ జారుమతీకన్యఁ బ్రకటసజ్జనమాన్యన్. (286) ప్రకటచరితుండు భీష్మభూపాలసుతుఁడు ¯ మనము మోదింపఁ దన కూర్మిమనుమరాలి ¯ రుక్మలోచన నసమాన రుక్మకాంతిఁ ¯ జెలిమి ననిరుద్ధునకుఁ బెండ్లి సేయు నపుడు. (287) పొలుపుగ రత్నవిభూషో¯ జ్జ్వలుఁలయి శుభవేళ నవ్వివాహార్థము ని¯ ర్మల బహు వైభవ శోభన¯ కలితవిదర్భావనీశ కటకంబునకున్. (288) హరియును రుక్మిణీసతియు నా బలభద్రుఁడు శంబరారియు¯ న్నరిమదభేది సాంబుఁడును నాదిగ రాజకుమారకోటి సిం ¯ ధుర రథవాజి సద్భటులతోఁ జని యందు సమగ్రవైభవా ¯ చరిత వివాహయుక్త దివసంబులు వేడుకఁ బుచ్చి యంతటన్. (289) ఒకనాఁడు యదుకుమారకు ¯ లకలంక సమగ్ర వైభవాటోప మహో ¯ త్సుకులై యుండఁగఁ జూపో ¯ పక యెకసెక్కెమున నవనిపాలురు వరుసన్. (290) ఎచ్చరికం గళింగధరణీశుఁడు రుక్మిమొగంబు సూచి నీ ¯ యొచ్చెముఁ దీర్చుకో నిదియ యొప్పగువేళ బలుండు జూదమం ¯ దిచ్చ గలండు; గాని పొలుపెక్కిననేర్పరి గాఁడు; గాన నీ ¯ కిచ్చు నవశ్యమున్ జయము నీఁగుము తొల్లిటఁబడ్డ బన్నమున్. (291) అని పురికొల్పిన రుక్మియుఁ ¯ దన చేటు దలంప లేక తాలాంకునితో ¯ డను జూదమాడఁ దివిరెను ¯ వనజాసను కృతము గడచు వారెవ్వ రిలన్? (292) అంత. (293) కోరి విదర్భుఁడు కుటిల వి ¯ హారుండై పిలిచె జూదమాడ జితారిన్ ¯ హారిన్ సన్నుతసూరిన్ ¯ సీరిన్ రైవతసుతార్ద్ర చిత్తవిహారిన్.

రుక్మి బలరాముల జూదంబు

(294) "పూని మనము గొంత ప్రొద్దువోకకు రామ! ¯ నెత్త మాడ నీవు నేర్తు వనఁగ ¯ విందు; మిపుడు గొంత వెల యొడ్డి యాడుద"¯ మనిన బలుఁడు "లెస్స"యని చెలంగె. (295) మదిలోని చలము డింపక ¯ పది యిరువది నూఱు వేయి పదివే లిదె ప¯ న్నిద మని యొడ్డుచు నాడిరి ¯ మదమున నిద్దఱును దురభిమానము పేర్మిన్. (296) ఆడిన యాట లెల్లను హలాయుధుఁ డోడిన రుక్మి గెల్చుడున్ ¯ దోడి నృపాల కోటి పరితోషముఁ జెందఁ గళింగభూవిభుం ¯ "డోడె బలుం"డటంచుఁ బ్రహసోక్తుల నెంతయు రాముఁ జుల్కఁగా ¯ నాడెను దంతపంక్తి వెలి యై కనుపట్టఁగఁ జాల నవ్వుచున్. (297) బలుఁడు కోపించి యొక లక్ష పణము సేసి ¯ యాడి ప్రకటంబుగా జూద మపుడు గెల్చె; ¯ గెల్చి నను రుక్మి "యిది యేను గెల్చియుండ ¯ గెలుపు నీ దని కికురింప నలవి యగునె?" (298) అనవుడు హలధరుఁ డచ్చటి ¯ జనపాలకసుతులఁ జూచి "సత్యము పలుకుం"¯ డని యడిగిన వారలు రు¯ క్ముని హితులై పలుక రైరి మొగమోటమునన్. (299) అప్పటి యట్ల యొడ్డి ముసలాయుధుఁ డేపున నాడి జూదముం ¯ జొప్పఁడ గెల్చి "యీ గెలుపు సూడగ నాదియొ వానిదో జనుల్‌ ¯ తప్పక చెప్పుఁ"డన్న విదితధ్వనితో నశరీరవాణి తా ¯ నిప్పటియాట రాముఁడె జయించె విదర్భుఁడె యోడె నావుడున్. (300) అనిన విని సకలజనంబులు నద్భుతానందనిమగ్న మానసులైరి; కుటిలస్వభావులయిన భూవరులు రుక్మిం గైకొల్పిన నతండు తన తొల్లింటి పరాభవము దలంచి యెదిరిందన్ను నెఱుంగక బలాబల వివేకంబు సేయనేరక విధివశానుగతుండై చలంబున బలునిం గని "యిప్పటి యాటయు నేన గెల్చియుండ వృథాజల్పకల్పనుండ వయి ‘గెల్చితి’ నని పల్కెద; వక్షవిద్యా నైపుణ్యంబు గల భూపకుమారులతోఁ బసులకాపరు లెత్తువత్తురే"యని క్రొవ్వున నవ్వుచుం బలికిన, నప్పలుకులు సెవులకు ములుకుల క్రియం దాఁకినఁ గోపోద్దీపితమానసుండై పెటపెటం బండ్లుగొఱకుచుం గన్నులనిప్పు లుప్పతిల్లం గినుకం దోఁకత్రొక్కిన మహోరగంబు నోజ రోఁజుచు దండతాడితంబయిన పుండరీకంబులీల హుమ్మని మ్రోయుచుఁ బ్రచండ బాహుదండంబులు సాఁచి పరిఘం బందుకొని పరిపంథి యైన రుక్మిని నతని కనుకూలంబయిన రాజలోకంబును బడలుపడ నడిచె; నయ్యవసరంబున. (301) మును దంతపంక్తి వెలిగాఁ ¯ దను నవ్విన యక్కళింగుఁ దల వట్టి రయం ¯ బునఁ బడఁదిగిచి వదన మే ¯ పునఁ బెడచే వ్రేసి దంతములు వెస డులిచెన్. (302) అంతం బోవక రుక్మిని ¯ దంతంబులు మున్ను డులిచి తను వగలింప¯ న్నంతకుపురి కేగెను వాఁ ¯ డెంతయు భయ మంది రాజు లెల్లం గలఁగన్. (303) అట్లుచేసి యయ్యాదవసింహం బసహ్యవిక్రమంబునం జెలంగె నంత. (304) భూవర! పద్మాక్షుఁడు దన ¯ బావ హతుం డగుట గనియుఁ బలుకక యుండెన్ ¯ భావమున రుక్మిణీ బల ¯ దేవుల కే మనఁగ నెగ్గు దేఱునొ? యనుచున్. (305) అంత నా విదర్భానగరంబు నిర్గమించి. (306) పరమానురాగరస సం ¯ భరితాంతఃకరణు లగుచుఁ బాటించి వధూ ¯ వరులను రథమం దిడి హల ¯ ధర హరి రుక్మిణులఁ గొల్చి తగ యదువీరుల్‌. (307) మంగళతూర్యఘోషము లమందగతిం జెలఁగంగ మత్త మా ¯ తంగ తురంగ సద్భట కదంబముతోఁ జని కాంచి రంత నా ¯ రంగ లవంగ లుంగ విచరన్మదభృంగ సురంగనాద స¯ త్సంగ తరంగిణీకలిత సంతతనిర్మల నా కుశస్థలిన్. (308) ఇట్లు పురోపవనోపకంఠంబునకుం జని. (309) అందు వసించిరి నందిత ¯ చందన మందార కుంద చంద్ర లసన్మా ¯ కందముల నీడ హృదయా ¯ నందము సంధిల్ల నందనందనముఖ్యుల్‌. (310) తదనంతరంబ పురప్రవేశంబు సేసి"రని చెప్పి శుకయోగీంద్రుండు పరీక్షిన్నరేంద్రున కిట్లనియె.

బాణున కీశ్వర ప్రసాద లబ్ధి

(311) "అనఘ! బలినందనులు నూర్వు రందులోన ¯ నగ్రజాతుండు బాణుఁ డత్యుగ్రమూర్తి ¯ చిర యశోహారి విహితపూజిత పురారి ¯ యహిత తిమిరోష్ణకరుఁడు సహస్రకరుఁడు. (312) బాణుఁడు విక్రమజిత గీ ¯ ర్వాణుఁడు సని కాంచె భక్తి వశుఁ డై సగణ¯ స్థాణున్ నిర్దళి తాసమ ¯ బాణుం దాండవధురీణు భక్తత్రాణున్. (313) కని యనురాగ వికాసము ¯ దన మనమునఁ గడలుకొనఁగ ధరఁ జాఁగిలి వం ¯ దన మాచరించి మోదము ¯ దనరఁగఁ దాండవము సలుపు తఱి నయ్యభవున్. (314) సంచిత భూరిబాహుబలసంపద పెంపున నారజంబు వా ¯ యించి యనేకభంగుల నుమేశుఁ ద్రిలోకశరణ్యు నాత్మ మె¯ చ్చించి ప్రమోదియై నిజవశీకృత నిశ్చలితాంతరంగుఁ గా ¯ వించి తదాననాంబురుహ వీక్షణుఁడై తగ మ్రొక్కి యిట్లనున్. (315) "శంకర! భక్తమానసవశంకర! దుష్టమదాసురేంద్ర నా ¯ శంకర! పాండునీలరుచిశంకరవర్ణ నిజాంగ! భోగి రా ¯ ట్కంకణ! పార్వతీహృదయకైరవ కైరవమిత్ర! యోగిహృ¯ త్పంకజ పంకజాప్త! నిజతాండవఖేలన! భక్తపాలనా! " (316) అని వినుతించి. (317) "దేవ! మదీయ వాంఛితము తేటపడన్నిటు విన్నవించెదన్ ¯ నీవును నద్రినందనయు నెమ్మిని నా పురి కోటవాకిటం ¯ గావలియుండి నన్నుఁ గృపఁ గావుము భక్తఫలప్రదాత! యో ¯ భావభవారి! నీ చరణపద్మము లెప్పుడు నాశ్రయించెదన్. " (318) అని యభ్యర్థించినం బ్రసన్నుండై భక్తవత్సలుం డగు పురాంతకుండు గౌరీసమేతుండై తారకాంతక గజాననాది భూతగణంబుల తోడ బాణనివాసం బగు శోణపురంబు వాకిటం గాఁపుండెఁ; బదంపడి యొక్కనాఁడ బ్బలినందనుండు. (319) దర్పమునఁ బొంగి రుచిర మార్తాండ దీప్త ¯ మండలముతోడ మార్పడు మహితశోణ ¯ మణికిరీటము త్రిపురసంహరుని పాద ¯ వనజములు సోఁక మ్రొక్కి యిట్లని నుతించె. (320) "దేవ! జగన్నాథ! దేవేంద్రవందిత!¯ వితతచారిత్ర! సంతత పవిత్ర! ¯ హాలాహలాహార! యహిరాజకేయూర!¯ బాలేందుభూష! సద్భక్తపోష! ¯ సర్వలోకాతీత! సద్గుణసంఘాత!¯ పార్వతీహృదయేశ! భవవినాశ! ¯ రజతాచలస్థాన! గజచర్మపరిధాన!¯ సురవైరివిధ్వస్త! శూలహన్త! (320.1) లోకనాయక! సద్భక్తలోకవరద! ¯ సురుచిరాకార! మునిజనస్తుతవిహార! ¯ భక్తజనమందిరాంగణపారిజాత! ¯ నిన్ను నెవ్వఁడు నుతిసేయ నేర్చు నభవ!" (321) అని స్తుతియించి. (322) "అనిలో నన్ను నెదిర్చి బాహుబలశౌర్యస్ఫూర్తిఁ బోరాడఁ జా ¯ లిన వీరుం డొకఁ డైనఁ బందెమునకున్ లేఁడయ్యె భూమండలి¯ న్ననయంబున్ భవదగ్రదత్తకరసాహస్రంబు కండూతి వా ¯ యునుపాయంబునులేద యీభరము నెట్లోర్తున్నుమానాయకా! (323) హుంకార కంకణ క్రేంకార శింజినీ¯ టంకార నిర్ఘోషసంకులంబు ¯ చండ దోర్దండ భాస్వన్మండలాగ్ర ప్ర¯ కాండ ఖండిత రాజమండలంబు ¯ శూలాహతక్షతోద్వేల కీలాల క¯ ల్లోల కేళీ సమాలోకనంబు ¯ శుంభ దున్మద కుంభి కుంభస్థలధ్వంస¯ సంభూత శౌర్య విజృంభణంబు (323.1) గలుగు నుద్దామ భీమ సంగ్రామ కేళి ¯ ఘన పరాక్రమ విక్రమక్రమము గాఁగ ¯ జరపలేనట్టి కరములు కరము దుఃఖ ¯ కరము లగుఁ గాక సంతోషకరము లగునె? (324) కాన మదీయ చండభుజగర్వ పరాక్రమ కేళికిన్ సముం ¯ డీ నిఖిలావనిం గలఁడె యిందుకళాధర! నీవు దక్కఁగా;"¯ నా నిటలాంబకుండు దనుజాధిపు మాటకుఁ జాల రోసి లో ¯ నూనిన రోషవార్ధి గడ లొత్తఁ గ నిట్లని పల్కె భూవరా! (325) "విను మూఢహృదయ! నీ కే ¯ తన మెప్పు డకారణంబ ధారుణిపైఁ గూ ¯ లును నపుడ నీ భుజావలి ¯ దునియఁగ నా యంత వానితో నని గల్గున్. " (326) అని పలికిన నట్లు సంప్రాప్తమనోరథుండై నిజభుజవినాశకార్య ధురీణుం డగు బాణుండు సంతుష్టాంతరంగుం డగుచు నిజనివాసంబు నకుం జని, తన ప్రాణవల్లభల యుల్లంబులు పల్లవింపఁ జేయుచు నిజధ్వజనిపాతంబు నిరీక్షించుచుండె, తదనంతరంబ.

ఉషాకన్య స్వప్నంబు

(327) ఆ దానవేశ్వరు ననుఁగుఁ గుమారి యు¯ షాకన్య విమలసౌజన్యధన్య ¯ రూపవిభ్రమ కళారుచిర కోమలదేహ¯ యతను నాఱవబాణ మనఁగఁ బరఁగు ¯ సుందరీరత్నంబు నిందునిభానన¯ యలినీలవేణి పద్మాయతాక్షి ¯ యొకనాఁడు రుచిరసౌధోపరివేదికా¯ స్థలమున మృదుశయ్య నెలమిఁ గూర్కి (327.1) మున్ను దన చౌల నెన్నఁడు విన్న యతఁడుఁ ¯ గన్నులారంగఁ దాఁ బొడగన్న యతఁడుఁ ¯ గాని యసమానరూపరేఖావిలాస ¯ కలితు ననిరుద్ధు నర్మిలిఁ గవిసినటులు. (328) కలగని యంత మేలుకని కన్నుల బాష్పకణంబు లొల్కఁగాఁ ¯ గలవలెఁ గాక నిశ్చయముగాఁ గమనీయ విలాస విభ్రమా ¯ కలిత తదీయరూపము ముఖంబున వ్రేలినయట్ల దోఁచినం ¯ గళవళమందుచున్ బిగియఁ గౌఁగిటిచే బయలప్పళించుచున్ (329) మఱియును. (330) సరసమృదూక్తులుం, గుసుమసాయకకేళియు, శాటికా కచా ¯ కరషణముల్‌, నఖక్రియలుఁ, గమ్రకపోల లలాట మేఖలా ¯ కర కుచ బాహుమూలములుఁ గైకొని యుండుట లాదిగాఁ దలో ¯ దరి మది గాఢమై తగిలె దర్పకుఁ డచ్చుననొత్తినట్లయై. (331) కలికిచేష్టలు భావగర్భంబు లైనను¯ బ్రియుమీఁది కూరిమి బయలుపఱుపఁ ¯ బిదపిదనై లజ్జ మదిఁ బద నిచ్చినఁ¯ జెలిమేనఁ బులకలు చెక్కు లొత్త ¯ మదనాగ్ని సంతప్త మానస యగుటకు¯ గురుకుచహారవల్లరులు గందఁ¯ జిత్తంబు నాయకాయత్తమై యుంటకు¯ మఱుమాట లాడంగ మఱపు గదుర (331.1) నతివ మనమున సిగ్గు మోహంబు భయముఁ ¯ బొడమ నునుమంచు నెత్తమ్మిఁ బొదువు మాడ్కిఁ ¯ బ్రథమచింతాభరంబునఁ బద్మనయన ¯ కోరి తలచీర వాటింప నేరదయ్యె. (332) ఇట్లు విరహవేదనా దూయమాన మానసయై యుండె; నంత నెచ్చెలులు డాయం జనుదెంచినం దన మనంబునం బొడము మనోజవికారంబు మఱువెట్టుచు నప్పుడు. (333) పొరిఁబొరిఁ బుచ్చు నూర్పుగమిఁ బుక్కిటనుంచి కుచాగ్రసీమపై ¯ బెరసిన సన్న లేఁజెమటబిందువు లొయ్యన నార్చుఁ గన్నులం ¯ దొరఁగెడు బాష్పపూరములు దొంగలిఱెప్పల నాని చుక్కలం ¯ "దరుణులు! రండు చూత"మని తా మొగ మెత్తును గూఢరాగ యై. (334) ఇవ్విధంబునం జరియించుచుండె నట్టియెడ. (335) అంతకంతకు సంతాప మతిశయించి ¯ వలుఁద చన్నులు గన్నీటి వఱదఁ దడియఁ ¯ జెలులదెసఁ జూడఁ జాల లజ్జించి మొగము ¯ వాంచి పలుకక యుండె న వ్వనరుహాక్షి. (336) అంత. (337) బలితనూభవుమంత్రి కుంభాండుతనయ ¯ తన బహిఃప్రాణ మిది యనఁ దనరునట్టి ¯ కామినీ మణి ముఖపద్మకాంతి విజిత ¯ శిశిరకర చారు రుచిరేఖ చిత్రరేఖ. (338) కదియవచ్చి య బ్బాల నుపలక్షించి. (339) "భామినీమణి! సొబగుని బయల వెదకు ¯ విధమునను నాత్మ విభుఁ బాసి విహ్వలించు ¯ వగను జేతికి లోనైనవానిఁ బాసి ¯ భ్రాంతిఁ బొందిన భావంబు ప్రకటమయ్యె. (340) వనిత! నా కన్న నెనరైన వారు నీకుఁ ¯ గలుగ నేర్తురె? నీ కోర్కిఁ దెలియఁ జెప్ప ¯ కున్న మీయన్నతో" డన్నఁ గన్నుఁగవను ¯ నలరు నునుసిగ్గుతో నగ వామతింప. (341) ఇవ్విధంబునఁ జిత్రరేఖం గనుంగొని యిట్లనియె. (342) “చెలి కలలోన నొక్క సరసీరుహనేత్రుఁడు, రత్నహార కుం¯ డల కటకాంగుళీయక రణన్మణినూపురభూషణుండు, ని¯ ర్మల కనకాంబరుండు, సుకుమారతనుండు, వినీలదేహుఁ, డు¯ జ్జ్వలరుచి నూతనప్రసవసాయకుఁ, డున్నతవక్షుఁ డెంతయున్. (343) నను బిగియారఁ గౌఁగిట మనం బలరారఁగఁ జేర్చి, మోదముం ¯ దనుకఁగ నంచితాధరసుధారస మిచ్చి, మనోజకేళికిం ¯ బనుపడఁ జేసి, మంజుమృదుభాషలఁ దేలిచి యంతలోననే ¯ చనియెను దుఃఖవార్ధిఁ బెలుచన్ ననుఁ ద్రోచి సరోరుహాననా!” (344) అనుచు నమ్మత్తకాశిని చిత్తంబు చిత్తజాయత్తంబయి తత్తరంబున విరహానలం బుత్తలపెట్టఁ గన్నీరుమున్నీరుగా వగచుచు విన్ననైన వదనారవిందంబు వాంచి యూరకున్నఁ జిత్రరేఖ దన మనంబున న య్యింతి సంతాపంబు చింతించి యిట్లనియె. (345) "సరసిజనేత్ర! యేటికి విచారము? నా కుశలత్వ మేర్పడన్ ¯ నర సుర యక్ష కింపురుష నాగ నభశ్చర సిద్ధ సాధ్య కి¯ న్నరవర ముఖ్యులం బటమునన్ లిఖియించినఁ జూచి నీ మనో ¯ హరుఁ గని వీడె పొమ్మనిన నప్పుడె వానిని నీకుఁ దెచ్చెదన్."