పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవత పారాయణ - 3 : దశమ ఉత్తర 1 - 123


పోతన తెలుగు భాగవతం
దశమ స్కంధము ఉత్తరభాగము

ఉపోద్ఘాతము

(1) శ్రీకర! పరిశోషిత ర¯ త్నాకర! కమనీయగుణగణాకర! కారు¯ ణ్యాకర! భీకరశర ధా¯ రాకంపితదానవేంద్ర! రామనరేంద్రా! (2) మహనీయగుణగరిష్ఠులగు నమ్మునిశ్రేష్ఠులకు నిఖిల పురాణవ్యాఖ్యాన వైఖరీసమేతుండైన సూతుం డిట్లనియె; "నట్లు ప్రాయోపవిష్టుండైన పరీక్షిన్నరేంద్రుండు "రుక్మిణీపరిణయానంతరంబున నైన కథావృత్తాంతం బంతయు వినిపింపు"మనిన శుకయోగీంద్రుం డిట్లనియె.

ప్రద్యుమ్న జన్మంబు

(3) “తామరసాక్షునంశమున దర్పకుఁ డీశ్వరుకంటిమంటలం¯ దా మును దగ్ధుఁడై; పిదపఁ దత్పరమేశుని దేహలబ్ధికై, ¯ వేమఱు నిష్ఠఁ జేసి, హరి వీర్యమునం బ్రభవించె రుక్మిణీ¯ కామిని గర్భమం దసురఖండను మాఱట మూర్తియో యనన్. (4) అంత నా డింభకుండు ప్రద్యుమ్నుండను పేర విఖ్యాతుం డయ్యె; నా శిశువు సూతికాగృహంబునం దల్లి పొదిఁగిట నుండం, దనకు శత్రుండని యెఱింగి, శంబరుండను రాక్షసుండు దన మాయాబలంబునం గామరూపి యై వచ్చి, కొనిపోయి సముద్రంబులో వైచి, తన గృహంబునకుం జనియె; నంత నా శాబకుండు జలధిజలంబున దిగఁబడ నొడిసి యొక మహామీనంబు మ్రింగె; నందు. (5) జాలిఁ బడి పాఱు జలచర¯ జాలంబులఁ బోవనీక, చని రోషాగ్ని¯ జ్వాలలు నిగుడఁగ, నూరక¯ జాలంబులు వైచిపట్టు జాలరు లంతన్. (6) సముద్రంబులోన నా మీనంబును, దత్సహచరంబులైన మీనంబులనుం బట్టికొని తెచ్చి, శంబరునకుం గానికఁగా నిచ్చిన, నతండు “వండి తెండ”ని మహానస గృహంబునకుం బంచిన. (7) రాజునగరి యడబాలలు¯ రాజీవముకడుపు వ్రచ్చి, రాజనిభాస్యున్¯ రాజశిశువుఁ గని, చెప్పిరి¯ రాజీవదళాక్షియైన రతికి; నరేంద్రా! (8) అంత నారదుండు వచ్చి, బాలకుని జన్మంబును, శంబరోద్యోగంబును, మీనోదరప్రవేశంబునుం జెప్పిన విని, యా రతి మాయావతి యను పేర శంబరునియింట బాతివ్రత్యంబు సలుపుచు, దహన దగ్ధుండయిన తన పెనిమిటి శరీర ధారణంబు సేయుట కెదురు చూచుచున్నది గావున; నయ్యర్భకుండు దర్పకుండని తెలిసి, మెల్లన పుత్రార్థినియైన తెఱంగున శంబరుని యనుమతి వడసి, సూపకారుల యొద్ద నున్న పాపనిం దెచ్చి పోషించుచుండె; నా కుమారుండును శీఘ్రకాలంబున నారూఢ యౌవనుండై. (9) సుందర మగు తన రూపము¯ సుందరు లొకమాఱు దేఱి చూచినఁ జాలున్, ¯ సౌందర్య మేమి చెప్పను? ¯ బొందెద మని డాయు బుద్ధిఁ బుట్టించు; నృపా! (10) "చక్కని వారల చక్కఁ దనంబున¯ కుపమింప నెవ్వండు యోగ్యుఁ డయ్యె? ¯ మిక్కిలి తపమున మెఱయు నంబికకు నై¯ శంకరు నెవ్వండు సగము సేసె? ¯ బ్రహ్మత్వమును బొంది, పరఁగు విధాతను¯ వాణికై యెవ్వఁడు వావి సెఱిచె? ¯ వేయిడాఁగులతోడి విబుధ లోకేశుని¯ మూర్తికి నెవ్వఁడు మూల మయ్యె? (10.1) మునుల తాలిమి కెవ్వఁడు ముల్లు సూపు¯ మగల మగువల నెవ్వండు మరులుకొలుపు? ¯ గుసుమధనువున నెవ్వండు గొను విజయము¯ చిగురువాలున నెవ్వండు సిక్కువఱుచు?" (11) అని, తన్ను లోకులు వినుతించు ప్రభావంబులు గలిగి, పద్మదళలోచనుండును, బ్రలంబబాహుండును, జగన్మోహనాకారుండును నైన పంచబాణునిం గని లజ్జాహాస గర్భితంబు లైన చూపులం జూచుచు, మాయావతి సురత భ్రాంతిఁ జేసినం జూచి, ప్రద్యుమ్నుం డిట్లనియె. (12) "నా తనూభవుఁ డీతఁ డంచును, నాన యించుక లేక యో! ¯ మాత! నీ విది యేమి? నేఁ డిటు మాతృ భావము మాని సం¯ ప్రీతిఁ గామినిభంగిఁ జేసెదు పెక్కు విభ్రమముల్‌; మహా ¯ ఖ్యాత వృత్తికి నీకు ధర్మము గాదు మోహము సేయఁగాన్." (13) అనిన రతి యిట్లనియె; “నీవు నారాయణనందనుండ వైన కందర్పుండవు; పూర్వకాలంబున నేను నీకు భార్య నైన రతిని; నీవు శిశువై యుండునెడ నిర్దయుండై దొంగిలి, తల్లిం దొఱంగఁజేసి, శంబరుండు కొని వచ్చి, నిన్ను నీరధిలో వైచిన, నొక్క మీనంబు మ్రింగె; మీనోదరంబు వెడలి తీవు; మీఁదటి కార్య మాకర్ణింపుము. (14) మాయావి వీఁడు; దుర్మతి¯ మాయఁడు సంగరములం; దమర్త్యుల గెలుచున్;¯ మాయికరణమున వీనిన్¯ మాయింపుము, మోహనాది మాయలచేతన్. (15) పాపకర్ముఁడు వీఁడు; నిన్నిఁటఁ బట్టి తెచ్చిన, లేచి "నా¯ పాపఁ డెక్కడఁ బోయెనో? సుతుఁ బాపితే విధి!"యంచుఁ దాఁ¯ గ్రేపుఁ బాసిన గోవు భంగిని ఖిన్నయై, పడి గాఢ సం¯ తాపయై, నిను నోఁచి కాంచిన తల్లి కుయ్యిడ కుండునే? (16) అని పలికి మాయావతి మహానుభావుండైన ప్రద్యుమ్నునికి సర్వ శత్రు మాయా వినాశిని యైన మహామాయ విద్య నుపదేశించె; నివ్విధంబున.

శంబరోద్యగంబు

(17) గురు మాయారణవేదియై, కవచియై, కోదండియై, బాణియై¯ హరిజుం "డోరి! నిశాట! వైచితివి నాఁ డంభోనిధిన్ నన్ను, ఘో¯ రరణాంభోనిధి వైతు నిన్ను నిదె వే ర"మ్మంచుఁ జీరెన్ మనో¯ హర దివ్యాంబరు నుల్లసద్దనుజ సేనాడంబరున్ శంబరున్. (18) అదలిచి యిట్టు కృష్ణసుతుఁ డాడిన నిష్ఠుర భాషణంబులం¯ బదహతమై వడిం గవియు పన్నగరాజముఁ బోలి శంబరుం¯ డదరుచు లేచి వచ్చి గద నచ్యుతనందను వ్రేసె నుజ్జ్వల¯ ద్భిదురకఠోరఘోష సమభీషణనాదము చేసి యార్చుచున్. (19) దనుజేంద్రుఁడు వ్రేసిన గదఁ¯ దన గదచేఁ బాయ నడిచి దనుజులు బెదరన్¯ దనుజాంతకుని కుమారుఁడు¯ దనుజేశుని మీఁద నార్చి తన గద వైచెన్. (20) అంత నా రక్కసుండు వెక్కసంబగు రోషంబునఁ దనకు దొల్లి మయుం డెఱింగించిన దైతేయమాయ నాశ్రయించి మింటికి నెగసి, పంచబాణునిపై బాణవర్షంబు గురిసిన; నమ్మహారథుండు నొచ్చియు సంచలింపక మచ్చరంబున సర్వమాయా వినాశిని యైన సాత్త్విక మాయం బ్రయోగించి దనుజుని బాణవృష్టి నివారించె; మఱియు వాఁడు భుజగ గుహ్యక పిశాచ మాయలు పన్ని నొప్పించిన నన్నియుం దప్పించి. (21) దండధర మూర్తిఁ గైకొని¯ యొండాడక చక్రిసూనుఁ డుగ్రతరాసిన్¯ ఖండించె శంబరుని తలఁ¯ గుండల కోటీర మణులు గుంభిని రాలన్. (22) చిగురాకడిదపు ధారను¯ జగములఁ బరవశము సేయు చలపాదికి దొ¯ డ్డగు నుక్కడిదంబునఁ దన¯ పగతుం దెగ వ్రేయు టెంత పని చింతింపన్? (23) బెగడుచు నుండఁగ శంబరుఁ¯ దెగడుచుఁ బూవింటిజోదు ధీరగుణంబుల్‌¯ వొగడుచుఁ గురిసిరి ముదమున¯ నెగడుచుఁ గుసుమముల ముసురు నిర్జరు లధిపా!

రతీ ప్రద్యుమ్ను లాగమనంబు

(24) ఇట్లు శంబరుని వధియించి విలసిల్లుచున్న యించువిలుకానిం గొంచు నాకాశచారిణియైన యా రతీదేవి, గగనపథంబుఁ బట్టి ద్వారకా నగరోపరిభాగమునకుం జనుదెంచిన. (25) మెఱుఁగుఁదీగెతోడి మేఘంబు కైవడి¯ యువిదతోడ మింటి నుండి కదలి¯ యరుగుదెంచె మదనుఁ డంగనాజనములు¯ మెలఁగుచున్న లోనిమేడకడకు. (26) జలదశ్యాముఁ బ్రలంబబాహుయుగళుం జంద్రాననున్ నీల సం¯ కులవక్రాలకుఁ బీతవాసు ఘనవక్షున్ సింహమధ్యున్ మహో¯ త్పలపత్త్రేక్షణు మందహాసలలితుం బంచాయుధున్ నీరజా¯ క్షులు దారేమఱుపాటఁ జూచి హరి యంచుం డాఁగి రయ్యైయెడన్. (27) కొందఱు హరి యగు నందురు, ¯ కొందఱు చిహ్నములు కొన్నికొన్ని హరికి లే¯ వందురు, మెల్లనె తెలియుద¯ మందురు మరుఁ జూచి కొంద ఱబలలు గుములై. (28) హరి యని వెనుచని పిదపన్¯ హరిఁ బోలెడువాఁడు గాని హరి గాఁ డనుచున్¯ హరిమధ్య లల్లనల్లన¯ హరినందను డాయ వచ్చి రాశ్చర్యమునన్. (29) అన్నులు సేర వచ్చి మరు నందఱుఁ జూడఁగఁ దాను వచ్చి సం¯ పన్న గుణాభిరామ హరిపట్టపుదేవి విదర్భపుత్రి క్రే¯ గన్నుల నా కుమారకుని కైవడి నేర్పడఁ జూచి బోటితోఁ¯ జన్నులు సేఁప నిట్లనియె సంభ్రమదైన్యము లుల్లసిల్లఁగన్. (30) "ఈ కంజేక్షణుఁ డీ కుమారతిలకుం డీ యిందుబింబాననుం¯ డీ కంఠీరవమధ్యుఁ డిచ్చటికి నేఁ డెందుండి యేతెంచెనో¯ యీ కల్యాణునిఁ గన్న భాగ్యవతి మున్నే నోములన్ నోఁచెనో¯ యే కాంతామణియందు వీని కనెనో యేకాంతుఁ డీ కాంతునిన్. (31) ఆళీ! నా తొలుచూలి పాపనికి బోర్కాడించి నే సూతికా ¯ శాలామధ్య విశాలతల్పగత నై చన్నిచ్చి నిద్రింప నా¯ బాలున్ నా చనుఁబాలకుం జెఱిచి యే పాపాత్ములే త్రోవ ము¯ న్నే లీలం గొనిపోయిరో? శిశువుఁ దా నే తల్లి రక్షించెనో! (32) కొడుకఁడు నా పొదిగిఁటిలోఁ¯ జెడిపోయిన నాఁటనుండి చెలియా! తెలియం¯ బడ దే వార్తయు నతఁడే¯ వడువున నెచ్చోట నిలిచి వర్తించెడినో! (33) ఇందాఁక వాఁడు బ్రదికిన¯ సందేహము లేదు దేహచాతుర్యవయ¯ స్సౌందర్యంబుల లోకులు¯ వందింపఁగ నితనియంతవాఁ డగుఁ జుమ్మీ! (34) అతివా! సిద్ధము నాఁటి బాలకున కీ యాకార మీ వర్ణ మీ¯ గతి యీ హాసవిలోకనస్వరము లీ గాంభీర్య మీ కాంతి వీఁ¯ డతఁడే కాఁదగు నున్నవారలకు నా యాత్మేశు సారూప్య సం¯ గతి సిద్ధింపదు; వీనియందు మిగులం గౌతూహలం బయ్యెడిన్. (35) పొదలెడి ముదమునఁ జిత్తము¯ గదలెడి నా యెడమమూఁపు, గన్నుల వెంటం¯ బొదలెడి నానందాశ్రులు¯ మెదలెడిఁ బాలిండ్లఁ బాలు; మేలయ్యెడినో!" (36) అని డోలాయమాన మానసయై వితర్కించుచు. (37) తనయుఁ డని నొడువఁ దలఁచును; ¯ దనయుఁడు గా కున్న మిగులఁ దతిగొని సవతుల్‌¯ తను నగియెద రని తలఁచు; న¯ తను సంశయ మలమికొనఁగఁ దనుమధ్య మదిన్. (38) ఇట్లు రుక్మిణీదేవి విచారించుచుండ లోపలినగరి కావలివారివలన విని కృష్ణుండు దేవకీవసుదేవులం దోడ్కొని చనుదెంచి సర్వజ్ఞుం డయ్యు నేమియు వివరింపక యూరకుండె; నంత నారదుండు సనుదెంచి శంబరుఁడు గుమారునిం గొనిపోవుట మొదలైన వార్త లెఱింగించిన. (39) "చచ్చినబాలుఁడు గ్రమ్మఱ¯ వచ్చిన క్రియ వచ్చెఁ బెక్కువర్షములకు నీ¯ సచ్చరితు నేఁడు గంటిమి; ¯ చెచ్చెర మున్నెట్టి తపము సేయంబడెనో?" (40) అని యంతఃపుర కాంతలును, దేవకీవసుదేవ రామకృష్ణులును యథోచితక్రమంబున నా దంపతుల దివ్యాంబరాభరణాలంకృతుల సత్కరించి సంతోషించిరి; రుక్మిణీదేవియు నందనుం గౌఁగిలించు కొని. (41) "అన్నా! నా చనుఁ బాపి నిన్ను దనుజుం డంభోనిధిన్ వైచెనే¯ యెన్నే వర్షము లయ్యెఁ బాసి సుత! నీ వేరీతి జీవించి యే¯ సన్నాహంబున శత్రు గెల్చితివొ? యాశ్చర్యంబు సంధిల్లెడిన్¯ నిన్నుం గాంచితి నింతకాలమునకున్ నే ధన్యతం జెందితిన్. " (42) అని కొడుకుం జూచి సంతోషించి కోడలిగుణంబులు కైవారంబు సేసి, వినోదించుచుండె; నంత ద్వారకానగరంబు ప్రజలు విని హర్షించి; రందు. (43) సిరిపెనిమిటి పుత్త్రకుఁ డగు¯ మరుఁ గని హరిఁ జూచినట్ల మాతలు దమలోఁ¯ గరఁగుదు రఁట, పరకాంతలు¯ మరుఁ గని మోహాంధకార మగ్నలు గారే? " (44) అని చెప్పి శుకుం డిట్లనియె (45) "సత్రాజిత్తు నిశాచర¯ శత్రునకుం గీడు సేసి సద్వినయముతోఁ¯ బుత్రి, శమంతకమణియును¯ మైత్రిం గొని తెచ్చి యిచ్చె మనుజాధీశా! " (46) అనిన విని రా జిట్లనియె. (47) "శౌరి కేమి తప్పు సత్రాజితుఁడు సేసెఁ? ¯ గూఁతు మణిని నేల కోరి యిచ్చె? ¯ నతని కెట్లు కలిగె నా శమంతకమణి¯ విప్రముఖ్య! నాకు విస్తరింపు. "

శమంతకమణి పొందుట

(48) అనిన విని శుకయోగివర్యుం డిట్లనియె. "సత్రాజిత్తనువాఁడు సూర్యునకు భక్తుండై చెలిమి సేయ, నతనివలన సంతసించి సూర్యుండు శమంతకమణి నిచ్చె; నా మణి కంఠంబున ధరియించి సత్రాజిత్తు భాస్కరుని భంగి భాసమానుం డై ద్వారకానగరంబునకు వచ్చిన; దూరంబున నతనిం జూచి జనులు మణిప్రభాపటల తేజోహృతదృష్టులయి సూర్యుం డని శంకించి వచ్చి; హరి కిట్లనిరి. (49) "నారాయణ! దామోదర! ¯ నీరజదళనేత్ర? చక్రి! నిఖిలేశ! గదా¯ ధారణ! గోవింద! నమ¯ స్కారము యదుపుత్త్ర! నిత్యకల్యాణనిధీ! (50) దివిజాధీశ్వరు లిచ్చగింతురు గదా దేవేశ! నిన్ జూడ యా¯ దవ వంశంబున గూఢమూర్తివి జగత్త్రాణుండవై యుండఁగా¯ భవదీయాకృతిఁ జూడ నేఁడిదె రుచిప్రచ్ఛన్న దిగ్భాగుఁడై¯ రవియో, నీరజగర్భుఁడో యొకఁడు సేరన్ వచ్చె మార్గంబునన్. " (51) అని యిట్లు పలికిన మూఢజనులఁ జూచి గోవిందుండు నగి మణి సమేతుండైన సత్రాజితుండుగాని సూర్యుండు గాఁడని పలికె; నంత సత్రాజితుండు శ్రీయుతంబయి మంగళాచారంబైన తన గృహంబునకుం జని, మహీసురులచేత నిజదేవతా మందిరంబున నమ్మణి శ్రేష్ఠంబు ప్రవేశంబు సేయించె; నదియును బ్రతిదినంబు నెనిమిది బారువుల సువర్ణంబు గలిగించు చుండు. (52) ఏ రా జేలెడు వసుమతి¯ నా రత్నము పూజ్యమానమగు నక్కడ రో¯ గారిష్ట సర్వ మాయిక¯ మారీ దుర్భిక్ష భయము మాను; నరేంద్రా! (53) అమ్మణి యాదవ విభునకు¯ నిమ్మని హరి యడుగ నాతఁ డీక ధనేచ్ఛం¯ బొమ్మని పలికెను, జక్రికి¯ నిమ్మణి యీకున్న మీఁద నేమౌ ననుచున్.

ప్రసేనుడు వధింపబడుట

(54) అంత. (55) అడరెడు వేడ్కఁ గంఠమున నమ్మణిఁ దాల్చి, ప్రసేనుఁ డొక్క నాఁ¯ డడవికి ఘోరవన్యమృగయారతి నేగిన, వానిఁ జంపి పైఁ¯ బడి మణిఁ గొంచు నొక్క హరి పాఱఁగ, దాని వధించి డాసి యే¯ ర్పడఁ గనె జాంబవంతుఁడు ప్రభాత్తదిగంతము నా శమంతమున్. (56) కని జాంబవంతుఁ డా మణిఁ¯ గొనిపోయి సమీప శైలగుహఁ జొచ్చి ముదం¯ బునఁ దన కూరిమిసుతునకు¯ ఘనకేళీకందుకంబుగాఁ జేసె, నృపా!

సత్రాజితుని నిందారోపణ

(57) అంత సత్రాజితుండు తన సహోదరుండైన ప్రసేనునిం గానక దుఃఖించుచు. (58) "మణి కంఠంబునఁ దాల్చి నేఁ డడవిలో మావాఁడు వర్తింపఁగా¯ మణికై పట్టి వధించినాఁడు హరికిన్ మర్యాద లే" దంచు దూ¯ షణముం జేయఁగ వాని దూషణముఁ గంసధ్వంసి యాలించి యే¯ వ్రణమున్ నా యెడ లేదు, నింద గలిగెన్ వారించు టే రీతియో? (59) అని వితర్కించి. (60) తనవారెల్లఁ బ్రసేనుజాడఁ దెలుపం దర్కించుచున్ వచ్చి, త¯ ద్వనవీథిం గనె నేలఁ గూలిన మహాశ్వంబుం బ్రసేనుం, బ్రసే¯ నుని హింసించినసింహమున్, మృగపతిన్ నొప్పించిఖండించి యేఁ¯ గిన భల్లూకము సొచ్చియున్న గుహయుం గృష్ణుండు రోచిష్ణుఁడై. (61) కని తన వెంట వచ్చిన ప్రజల నెల్ల గుహాముఖంబున విడిచి, సాహసంబున మహానుభావుం డైన హరి నిరంతర నిబిడాంధకార బంధురంబయి, భయంకరంబై, విశాలంబయిన గుహాంతరాళంబు సొచ్చి; చని యక్కడ నొక్క బాలున కెదురు దర్శనీయ కేళీకందుకంబుగా వ్రేలంగట్టఁబడిన యమ్మణి శ్రేష్ఠంబుఁ గని హరింప నిశ్చయించి. (62) మెల్లన పదము లిడుచు యదు¯ వల్లభుఁ డా శిశువుకడకు వచ్చిన, గుండెల్‌¯ జల్లనఁగఁ జూచి, కంపము¯ మొల్లంబుగ దానిదాది మొఱపెట్టె నృపా!

జాంబవతి పరిణయంబు

(63) అంత నా ధ్వని విని బలవంతుండైన జాంబవంతుఁడు వచ్చి తన స్వామి యని కృష్ణు నెఱుంగక ప్రాకృత పురుషుండని తలంచి కృష్ణునితో రణంబు చేసె; నందు. (64) పలలమునకుఁ బోరెడు డే¯ గల క్రియ శస్త్రములఁ దరులఁ గరముల విజయే¯ చ్ఛల నిరువదియెనిమిది దిన¯ ములు వోరిరి నగచరేంద్రముఖ్యుఁడు హరియున్. (65) అడిదములుఁ దరులు విఱిగిన¯ బెడిదము లగు మగతనములు బిఱుతివక వడిం¯ బిడుగులవడువునఁ బడియెడి¯ పిడికిటిపోటులను గలన బెరసి రిరువురున్. (66) స్పష్టాహంకృతు లుల్లసిల్ల హరియున్ భల్లూకలోకేశుఁడున్¯ ముష్టాముష్టి నహర్నిశంబు జయసమ్మోహంబునం బోరుచోఁ¯ బుష్టిం బాసి ముకుంద ముష్టిహతులం బూర్ణశ్రమోపేతుఁడై¯ పిష్టాంగోరు శరీరుఁడై యతఁడు దా భీతాత్ముఁడై యిట్లనున్. (67) “దేవా! నిన్నుఁ బురాణపురుషు నధీశ్వరు విష్ణుం బ్రభవిష్ణు నెఱుంగుదు; సర్వభూతంబులకుం బ్రాణ ప్రతాప ధైర్యబలంబులు నీవ; విశ్వంబునకు సర్గస్థితిలయంబు లెవ్వరాచరింతురు, వారికి సర్గ స్థితిలయంబులఁ జేయు నీశ్వరుండవు నీవ; యాత్మవు నీవ” యని మఱియును. (68) "బాణాగ్ని నెవ్వఁడు పఱపి పయోరాశి¯ నింకించి బంధించి యేపు మాపెఁ¯ బరఁగ నెవ్వఁడు ప్రతాపప్రభారాశిచే¯ దానవగర్వాంధతమస మడఁచెఁ¯ గంజాతములు ద్రెంచు కరిభంగి నెవ్వఁడు¯ దశకంఠుకంఠబృందములు ద్రుంచె¯ నా చంద్రసూర్యమై యమరు లంకారాజ్య¯ మునకు నెవ్వఁడు విభీషణుని నిలిపె (68.1) నన్ను నేలిన లోకాధినాథుఁ డెవ్వఁ¯ డంచితోదారకరుణారసాబ్ధి యెవ్వఁ¯ డాతఁడవు నీవ కావె; మహాత్మ! నేఁడు¯ మాఱుపడి యెగ్గు సేసితి మఱవవలయు. " (69) అని యిట్లు పరమభక్తుండయిన జాంబవంతుండు వినుతించిన నతని శరీర నిగ్రహ నివారణంబుగా భక్తవత్సలుండైన హరి దన కరంబున నతని మేను నిమిరి గంభీరభాషణంబుల నిట్లనియె. (70) "ఈ మణి మాచేఁ బడె నని¯ తామసు లొనరించు నింద దప్పెడు కొఱకై¯ నీ మందిర మగు బిలమున¯ కే మరుదెంచితిమి భల్లుకేశ్వర! వింటే! " (71) అనిన విని సంతసించి జాంబవంతుఁడు మణియునుం, దన కూఁతు జాంబవతి యను కన్యకామణియునుం దెచ్చి హరికిం గానికఁగా సమర్పించె; నటమున్న హరివెంట వచ్చిన వారలు బిలంబువాకిటం బండ్రెండు దినంబులు హరిరాక కెదురుచూచి వేసరి వగచి పురంబునకుం జని; రంత దేవకీవసుదేవులును రుక్మిణియును మిత్ర బంధు జ్ఞాతి జనులును గుహ సొచ్చి కృష్ణుండు రాక చిక్కె నని శోకించి. (72) "దుర్గమ మగు బిలమున హరి¯ నిర్గతుఁడై చేరవలయు నేఁ" డని పౌరుల్‌¯ వర్గములై సేవించిరి¯ దుర్గం గృతకుశలమార్గఁ దోషితభర్గన్. (73) డోలాయిత మానసులై¯ జాలింబడి జనులు గొలువఁ జండిక పలికెన్¯ "బాలామణితో మణితో¯ హేలాగతి వచ్చు నంబుజేక్షణుఁ" డనుచున్. (74) యత్నము సఫలం బయిన స¯ పత్న సమూహములు బెగడఁ బద్మాక్షుం డా¯ రత్నముతోఁ గన్యాజన¯ రత్నముతోఁ బురికి వచ్చె రయమున నంతన్. (75) మృతుఁ డైనవాఁడు పునరా¯ గతుఁడైన క్రియం దలంచి కన్యామణి సం¯ యుతుఁడై వచ్చిన హరిఁ గని¯ వితతోత్సవ కౌతుకముల వెలసిరి పౌరుల్‌.

సత్రాజితునకు మణి దిరిగి యిచ్చుట

(76) ఇట్లు హరి దన పరాక్రమంబున జాంబవతీదేవిం బరిగ్రహించి, రాజసభకు సత్రాజిత్తుం బిలిపించి, తద్వృత్తాంతం బంతయు నెఱిగించి, సత్రాజిత్తునకు మణి నిచ్చె; నతండును సిగ్గువడి మణిం బుచ్చుకొని పశ్చాత్తాపంబు నొందుచు, బలవద్విరోధంబునకు వెఱచుచు నింటికిఁ జని. (77) "పాపాత్ముల పాపములం¯ బాపంగా నోపునట్టి పద్మాక్షునిపైఁ¯ బాపము గల దని నొడివిన¯ పాపాత్ముని పాపమునకుఁ బారము గలదే? (78) మితభాషిత్వము మాని యేల హరిపై మిథ్యాభియోగంబు సే¯ సితిఁ? బాపాత్ముఁడ, నర్థలోభుఁడను, దుశ్చిత్తుండ, మత్తుండ, దు¯ ర్మతి నీ దేహముఁ గాల్పనే? దురితమే మార్గంబునం బాయు? నే¯ గతిఁ గంసారి ప్రసన్నుఁ డై మనుచు నన్ గారుణ్య భావంబునన్? (79) మణిని గూఁతు నిచ్చి మాధవు పదములు¯ పట్టుకొంటినేని బ్రదుకు గలదు¯ సంతసించు నతఁడు సదుపాయమగు నిది¯ సత్య మితర వృత్తిఁ జక్కఁబడదు. "

సత్యభామా పరిణయంబు

(80) అని యిబ్భంగి బహుప్రకారముల నేకాంతస్థుఁడై యింటిలోఁ¯ దన బుద్ధిం బరికించి నీతి గని, సత్రాజిత్తు సంప్రాప్త శో¯ భనుఁడై యిచ్చె విపత్పయోధితరికిన్ భామామనోహారికిన్¯ దనుజాధీశవిదారికిన్ హరికిఁ గాంతారత్నమున్ రత్నమున్. (81) తామరసాక్షుఁ డచ్యుతుఁ డుదారయశోనిధి పెండ్లియాడె నా¯ నా మనుజేంద్ర నందిత గుణస్థితి లక్షణ సత్యభామ ను¯ ద్దామ పతివ్రతాత్వ నయ ధర్మ విచక్షణతా దయా యశః¯ కామను సత్యభామను ముఖద్యుతినిర్జితసోమ నయ్యెడన్. (82) "మణి యిచ్చినాఁడు వాసర¯ మణి నీకును; మాకుఁ గలవు మణులు; కుమారీ¯ మణి చాలు నంచుఁ గృష్ణుఁడు¯ మణి సత్రాజిత్తునకును మరలఁగ నిచ్చెన్. " (83) అంత నక్కడఁ గుంతీసహితులయిన పాండవులు లాక్షాగారంబున దగ్ధులైరని విని నిఖిలార్థ దర్శనుండయ్యును, గృష్ణుండు బలభద్ర సహితుండై కరినగరంబునకుం జని కృప విదుర గాంధారీ భీష్మ ద్రోణులం గని దుఃఖోపశమనాలాపంబు లాడుచుండె; నయ్యెడ.

శతధన్వుఁడు మణి గొనిపోవుట

(84) జగతీశ! విన వయ్య శతధన్వుఁ బొడగని¯ యక్రూర కృతవర్మ లాప్తవృత్తి¯ "మన కిత్తు ననుచు సమ్మతిఁ జేసి తన కూఁతుఁ¯ బద్మాక్షునకు నిచ్చి పాడి దప్పె¯ ఖలుఁడు సత్రాజిత్తుఁ, డలయ కే క్రియ నైన¯ మణిపుచ్చుకొనుము నీమతము మెఱసి"¯ యని తన్నుఁ బ్రేరేఁప నా శతధన్వుఁడు¯ పశువుఁ గటికివాఁడు పట్టి చంపు (84.1) కరణి నిదురవోవఁ గడఁగి సత్రాజిత్తుఁ¯ బట్టి చంపి, వాని భామ లెల్ల¯ మొఱలువెట్ట లోభమునఁ జేసి మణి గొంచుఁ¯ జనియె నొక్క నాఁడు జనవరేణ్య! (85) ఇట్లు హతుం డైన తండ్రిం గని శోకించి సత్యభామ యతనిం దైలద్రోణియందుఁ బెట్టించి హస్తిపురంబునకుం జని సర్వజ్ఞుండైన హరికి సత్రాజిత్తు మరణంబు విన్నవించిన హరియును బలభద్రుండు నీశ్వరులయ్యును మనుష్య భావంబుల విలపించి; రంత బలభద్ర సత్యభామా సమేతుండై హరి ద్వారకా నగరంబునకు మరలివచ్చి శతధన్వుం జంపెద నని తలంచిన; నెఱింగి శతధన్వుండు ప్రాణభయంబునఁ గృతవర్ము నింటికిం జని తనకు సహాయుండవు గమ్మని పలికినం గృతవర్మ యిట్లనియె. (86) "అక్కట! రామకృష్ణులు మహాత్ములు వారల కెగ్గు సేయఁగా¯ నిక్కడ నెవ్వఁ డోపు? విను మేర్పడఁ గంసుఁడు బంధుయుక్తుఁడై¯ చిక్కఁడె? మున్ను మాగధుఁడు సేనలతోఁ బదియేడు తోయముల్‌¯ దిక్కులఁ బాఱఁడే! మనకు దృష్టము, వారల లావు వింతయే? " (87) అని యుత్తరంబు సెప్పిన విని శతధన్వుం డక్రూరుని యింటికిం జని హరితోడ పగకుందోడు రమ్మని చీరిన నక్రూరుండు హరి బలపరాక్రమ ధైర్యస్థైర్యంబు లుగ్గడించి మఱియు నిట్లనియె. (88) "ఎవ్వఁడు విశ్వంబు నెల్ల సలీలుఁడై¯ పుట్టించు రక్షించుఁ బొలియఁ జేయు, ¯ నెవ్వనిచేష్టల నెఱుఁగరు బ్రహ్మాదు¯ లెవ్వని మాయ మోహించు భువన, ¯ మేడేండ్లపాపఁడై యే విభుఁ డొకచేత¯ గో రక్షణమునకై కొండ నెత్తె, ¯ నెవ్వఁడు కూటస్థుఁ డీశ్వరుఁ డద్భుత¯ కర్ముఁ డనంతుండు కర్మసాక్షి, (88.1) యట్టి ఘనునకు శౌరికి ననవరతము ¯ మ్రొక్కెదము గాక; విద్వేషమునకు నేము¯ వెఱతు మొల్లము నీ వొండు వెంటఁ బొమ్ము¯ చాలు పదివేలువచ్చె నీ సఖ్యమునను."

శతధన్వుని ద్రుంచుట

(89) అని యిట్లక్రూరుం డుత్తరంబు పలికిన నమ్మహామణి యక్రూరుని యొద్ద నునిచి, వెఱచి శతధన్వుండు తురగారూఢుండై శతయోజన దూరంబు సనియె; గరుడ కేతనాలంకృతంబైన తేరెక్కి రామ కృష్ణులు వెనుచని; రంత నతండును మిథిలానగరంబుఁజేరి తత్సమీపంబు నందు. (90) తురగము డిగ్గి తల్లడముతో శతధన్వుఁడు పాదచారియై¯ పరువిడఁ బోకు పోకు మని పద్మదళాక్షుఁడు గూడఁ బాఱి భీ¯ కరగతి వాని మస్తకము ఖండితమై పడ వ్రేసెఁ జక్రముం ¯ బరిహతదైత్యచక్రముఁ బ్రభాచయ మోదితదేవశక్రమున్. (91) ఇట్లు హరి శతధన్వుని వధియించి వాని వస్త్రంబులందు మణి వెదకి లేకుండటఁ దెలిసి బలభద్రునికడకు వచ్చి “శతధన్వుం డూరక హతుం డయ్యె, మణి లే” దనిన బలభద్రుం డిట్లనియె. (92) "ఆ మణి శతధన్వుఁ డపహరించుట నిక్క¯ మెవ్వరిచే దాఁప నిచ్చినాఁడొ? ¯ వేగమె నీ వేఁగి వెదకుము పురిలోన¯ వైదేహు దర్శింప వాంఛ గలదు, ¯ పోయి వచ్చెద, నీవు పొ"మ్మని వీడ్కొని¯ మెల్లన రాముండు మిథిలఁ జొచ్చి¯ పోయిన జనకుండు పొడగని హర్షించి¯ యెంతయుఁ బ్రియముతో నెదురు వచ్చి (92.1) యర్ఘ్యపాద్యాది కృత్యంబు లాచరించి¯ యిచ్చగించిన వస్తువు లెల్ల నిచ్చి¯ యుండు మని భక్తి చేసిన నుండె ముసలి; ¯ కువలయేశ్వర! మిథిలలోఁ గొన్ని యేండ్లు. (93) అంత దుర్యోధనుండు మిథిలానగరంబునకుం జనుదెంచి జనకరాజుచేత సమ్మానితుండై.

దుర్యోధనుని గదా విధ్యాభ్యాసము

(94) చలమున గాంధారేయుఁడు¯ లలిత గదాయుద్ధగౌశలము నేర్చెఁ దగన్¯ హలిచే నాశ్రితనిర్జర¯ ఫలిచేఁ ద్రైలోక్యవీరభటగణబలిచేన్. (95) అటఁ గృష్ణుండును ద్వారకానగరంబునకుం జని శతధన్వుని మరణంబును మణి లేకుండుటయును, సత్యభామకుం జెప్పి, సత్యభామాప్రియకరుండు గావున సత్రాజిత్తునకుఁ బరలోకక్రియలు సేయించె; నక్రూర కృతవర్మలు శతధన్వు మరణంబు విని వెఱచి ద్వారకానగరంబు వెడలి బహుయోజన దూరభూమికిం జని; రక్రూరుండు లేమిం జేసి వానలు లేక మహోత్పాతంబులును, శరీర మానస తాపంబులును ద్వారకావాసులకు సంభవించిన నందుల వృద్ధజనులు బెగడి హరి కిట్లనిరి. (96) "కమలాక్ష! వినవయ్య! కాశీశుఁ డేలెడి¯ కుంభిని వానలు గురియకున్నఁ¯ గోరి శ్వఫల్కునిఁ గొనిపోయి యతనికిఁ¯ గాందిని యనియెడు కన్య నిచ్చి¯ కాశీవిభుండు సత్కారంబు సేసిన¯ వానలు గురిసె నా వసుధమీఁద; ¯ నాతని పుత్త్రకుఁ డయిన యక్రూరుండు¯ నంతటివాఁడు, మహాతపస్వి (96.1) మరలి వచ్చెనేని మాను నుత్పాతంబు¯ లెల్ల; వాన గురియు నీ స్థలమున; ¯ దేవ! యతనిఁ దోడితెప్పింపు; మన్నింపు; ¯ మానవలయుఁ బీడ మానవులకు." (97) అని పలుకు పెద్దల పలుకు లాకర్ణించి దూతలం బంపి కృష్ణుం డక్రూరుని రావించి పూజించి ప్రియకథలు కొన్ని సెప్పి సకలలోకజ్ఞుండు గావున మృదుమధుర భాషణంబుల నతని కిట్లనియె. (98) "తా నేగుతఱి శతధన్వుండు మణిఁ దెచ్చి¯ నీ యింటఁ బెట్టుట నిజము తెలిసి¯ నాఁడ, సత్రాజిత్తునకుఁ బుత్త్రకులు లేమి¯ నతనికిఁ గార్యంబు లాచరించి¯ విత్తంబు ఋణమును విభజించుకొనియెద¯ రతని పుత్త్రిక లెల్ల, నతఁడు పరుల¯ చేత దుర్మరణంబుఁ జెందినాఁ, డతనికై¯ సత్కర్మములు మీఁద జరుపవలయు, (98.1) మఱి గ్రహింపు మీవ, మా యన్న నను నమ్మఁ¯ డెలమి బంధుజనుల కెల్లఁ జూపు¯ మయ్య! నీ గృహమున హాటక వేదికా¯ సహితమఖము లమరు సంతతమును. " (99) అని యిట్లు సామవచనంబులు హరి పలికిన నక్రూరుండు వస్త్రచ్ఛన్నంబైన మణిం దెచ్చి హరి కిచ్చిన. (100) సంతసమంది బంధుజనసన్నిధికిన్ హరి దెచ్చి చూపె; న¯ శ్రాంతవిభాసమాన ఘృణిజాలపలాయిత భూనభోంతర¯ ధ్వాంతము, హేమభారచయవర్షణవిస్మిత దేవ మానవ¯ స్వాంతముఁ, గీర్తి పూరితదిశావలయాంతము నా శమంతమున్. (101) చక్రాయుధుఁ డీ క్రియఁ దన¯ యక్రూరత్వంబు జనుల కందఱకును ని¯ ర్వక్రముగఁ దెలిపి క్రమ్మఱ¯ నక్రూరుని కిచ్చె మణిఁ గృపా కలితుండై. (102) ఘనుఁడు భగవంతుఁ డీశ్వరుఁ¯ డనఘుఁడు మణి దెచ్చి యిచ్చినట్టి కథనమున్¯ వినినఁ బఠించినఁ దలఁచిన¯ జనులకు దుర్యశముఁ బాపసంఘముఁ దలఁగున్.

ఇంద్రప్రస్థంబున కరుగుట

(103) అంత నొక్కనాఁడు పాండవులం జూడ నిశ్చయించి సాత్యకి ప్రముఖ యాదవులు గొలువఁ బురుషోత్తముం డింద్రవ్రస్థపురంబునకుం జనినం బ్రాణంబులంగనిన యింద్రియంబులభంగి వారఖిలేశ్వరుం డైన హరిం గని కౌఁగిలించుకొని; కృష్ణుని దివ్యదేహసంగమంబున నిర్ధూతకల్మషులై యనురాగహాసవిభాసితం బైన ముకుంద ముఖారవిందంబు దర్శించి యానందంబు నొందిరి; గోవిందుండును యుధిష్ఠిర భీమసేనుల చరణంబులకు నభివందనంబులు సేసి యర్జును నాలింగనంబున సత్కరించి, నకుల సహదేవులు మ్రొక్కిన గ్రుచ్చియెత్తి, యుత్తమ పీఠంబున నాసీనుండై యుండె; నప్పుడు. (104) చంచద్ఘనకుచభారా¯ కుంచితయై క్రొత్త పెండ్లికూఁతు రగుట నిం¯ చించుక సిగ్గు జనింపఁగఁ¯ బాంచాలతనూజ మ్రొక్కెఁ బద్మాక్షునకున్. (105) అంత సాత్యకి పాండువులచేతం బూజితుండై యొక్క పీఠంబున నాసీనుండై యుండెఁ; దక్కిన యనుచరులును వారిచేతఁ బూజితులై కొలిచి యుండిరి; హరియుం గుంతీదేవి కడకుం జని నమస్కరించి యిట్లనియె. (106) "అత్తా! కొడుకులుఁ గోడలుఁ¯ జిత్తానందముగఁ బనులు సేయఁగ నాత్మా¯ యత్తానుగవై యాజ్ఞా¯ సత్తాదులు గలిగి మనుదె సమ్మోదమునన్? " (107) అనవుడుఁ బ్రేమ విహ్వలత నందుచు గద్గదభాషణంబులం¯ గనుఁగవ నశ్రుతోయములు గ్రమ్మఁగఁ గుంతి సుయోధనుండు సే¯ సిన యపచారముం దలఁచి చెందిన దుఃఖములెల్లఁ జెప్పి యా¯ దనుజవిరోధి కిట్లనియెఁ దద్దయుఁ బెద్దఱికంబు సేయుచున్. (108) "అన్న! నీ చుట్టాల నరయుదు! మఱవవు¯ నీవు పుత్తెంచిన నెమ్మితోడ¯ మా యన్న యేతెంచి మముఁ జూచి పోయెను¯ నిల్చి యున్నారము నీ బలమున; ¯ నా పిన్నవాండ్రకు నాకు దిక్కెవ్వరు¯ నేఁ డాదిగా నింక నీవె కాక? ¯ యఖిల జంతువుల కీ వాత్మవు గావునఁ¯ బరులు నా వారని భ్రాంతి సేయ; (108.1) వయ్య! నా భాగ్యమెట్టిదో? యనవరతముఁ ¯ జిత్తమున నుండి కరుణ మా చిక్కులెల్లఁ¯ వాపుచుందువు గాదె! యో! పరమపుణ్య! ¯ యదుకుమారవరేణ్య! బుధాగ్రగణ్య! ." (109) అనిన యుధిష్ఠిరుం డిట్లనియె. (110) "పట్టఁగ లేరు నిన్నుఁ దమభావము లందు సనందనాదు లే¯ పట్టుననైన, నట్టి గుణభద్రచరిత్రుఁడ వీవు, నేఁడు మా¯ చుట్టమ వంచు వచ్చెదవు; చూచెద వల్పులమైన మమ్ము; నే¯ మెట్టి తపంబు చేసితి మధీశ్వర! పూర్వశరీర వేళలన్? " (111) అని ధర్మజుండు దన్నుఁ బ్రార్థించిన నింద్రప్రస్థపురంబు వారలకు నయనానందంబు సేయుచు హరి గొన్ని నెలలు వసియించి యుండె; నందొక్కనాఁడు.

అర్జునితో మృగయావినోదంబు

(112) తురగశ్రేష్ఠము నెక్కి కంకటధనుస్తూణీశరోపేతుఁడై¯ హరితోడన్ వనభూమి కేగి విజయుం డాసక్తుఁడై చంపె శం¯ బర శార్దూల తరక్షు శల్య చమరీ భల్లూక గంధర్వ కా¯ సర కంఠీరవ ఖడ్గ కోల హరిణీ సారంగ ముఖ్యంబులన్. (113) అచ్చోటఁ బవిత్రములై¯ చచ్చిన మృగరాజి నెల్ల జననాథునకుం¯ దెచ్చి యొసంగిరి మెచ్చుగఁ¯ జెచ్చెర నరుఁ గొల్చి యున్న సేవకు లధిపా! (114) అంత నర్జునుండు నీరుపట్టున డస్సిన, యమునకుం జని, య మ్మహారథులైన నరనరాయణు లందు వార్చి జలంబులు ద్రావి, యొక పులినప్రదేశంబున నుండి. (115) ఉపగతు లైన యట్టి పురుషోత్తమ పార్థులు గాంచి రాపగా¯ విపుల విలోల నీలతర వీచికలందు శిరోజభార రు¯ చ్యపహసితాళిమాలిక నుదంచిత బాల శశిప్రభాలికం¯ దపనుని బాలికన్ మదనదర్పణతుల్య కపోలపాలికన్. (116) కని యచ్యుతుండు పంచిన వివ్వచ్చుండు సని యా కన్య కిట్లనియె. (117) "సుదతీ! యెవ్వరి దాన? వేమికొఱ కిచ్చోటం బ్రవర్తించె? దె¯ య్యది నీ నామము? కోర్కి యెట్టిది? వివాహాకాంక్షతోఁగూడి యీ¯ నదికిన్ వచ్చినజాడ గానఁబడె? ధన్యంబయ్యె నీ రాక, నీ¯ యుదయాదిస్థితి నెల్లఁ జెప్పు మబలా! యుద్యత్కురంగేక్షణా! " (118) అనిన నర్జునునకుఁ గాళింది యిట్లనియె. (119) "నరవీరోత్తమ! యేను సూర్యుని సుతన్; నాపేరు కాళింది; భా¯ స్కర సంకల్పితగేహమందు నదిలోఁ గంజాక్షు విష్ణుం బ్రభున్¯ వరుగాఁ గోరి తపంబుసేయుదు; నొరున్ వాంఛింపఁ; గృష్ణుండు వ¯ న్యరతిన్ వచ్చి వరించునంచుఁ బలికెన్ నా తండ్రి నాతోడుతన్. " (120) అనిన విని ధనంజయుఁ డా నీలవేణి పలుకులు హరికిం జెప్పిన విని సర్వజ్ఞుండైన హరియు హరిమధ్యను రథంబుమీఁద నిడుకొని ధర్మరాజు కడకుం జని వారలు గోరిన విశ్వకర్మను రావించి వారి పురం బతివిచిత్రంబు సేయించె. (121) దేవేంద్రుని ఖాండవ మ¯ ప్పావకునకు నీఁ దలంచి పార్థుని రథికుం¯ గావించి సూతుఁ డయ్యెను¯ గోవిందుఁడు మఱఁదితోడఁ గూరిమి వెలయన్. (122) ఇట్లు నర నారాయణులు సహాయులుగా దహనుండు ఖాండవవనంబు దహించిన సంతసించి విజయునకు నక్షయ తూణీరంబులు, నభేద్యకవచంబును, గాండీవమనియెడి బాణాసనంబును దివ్యరథంబును ధవళరథ్యంబులను నిచ్చె నందు. (123) వాసవసూనుచేఁ దనకు వహ్నిశిఖాజనితోగ్రవేదనల్¯ పాసినఁ జేసి యొక్క సభ పార్థున కిచ్చె మయుండు ప్రీతుఁడై¯ యా సభలోనఁ గాదె గమనాగమనంబులఁ గౌరవేంద్రుఁ డు¯ ల్లాసముఁ బాసి యుండుట జలస్థలనిర్ణయ బుద్ధి హీనుఁడై.