పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవత పారాయణ - 3 : దశమ ఉత్తర 1281 - సంపూర్ణం

విప్రుని ఘనశోకంబు

(1281) నరనాథ! యొకనాఁడు నలినాయతాక్షుండు¯ వొలుచు కుశస్థలీపురము నందు ¯ సుఖముండ నొక్క భూసురవర్యు భార్యకుఁ¯ బుత్త్రుండు జన్మించి పుట్టినపుడ ¯ మృతుఁడైన ఘనశోకవితతిచేఁ గ్రాఁగుచు¯ నా డింభకునిఁ గొంచు నవనిసురుఁడు ¯ సనుదెంచి పెలుచ రాజద్వారమునఁ బెట్టి¯ కన్నుల బాష్పాంబుకణము లొలుక(1281.1) "బాపురే! విధి నను దుఃఖపఱుపఁ దగునె?" ¯ యనుచు దూఱుచుఁ దనుఁ దిట్టుకొనుచు వగల ¯ డెంద మందంద యెరియ నాక్రందనంబు ¯ సేయుచును వచ్చి యా విప్రశేఖరుండు.(1282) అధికశోకంబున నలమటఁ బొందుచు¯ నచ్చటి జనులతో ననియెఁ బెలుచ ¯ "బ్రాహ్మణ విద్వేషపరుఁ డయి తగ శాస్త్ర¯ పద్ధతి నడవక పాపవర్తి ¯ యై క్షత్రబంధువుఁ డగు వాని దురితంబు¯ చేత మత్పుత్త్రుండు జాతమైన ¯ యప్పుడ మృతుఁ డయ్యె నక్కట! హింసకు¯ రోయక యెప్పు డన్యాయకారి(1282.1) యగుచు విషయానుగతచిత్తుఁ డైన యట్టి ¯ రాజుదేశంబు ప్రజలు నిరాశు లగుచు ¯ దుఃఖములఁ జాల వనటఁ బొందుదు రటంచు ¯ నేడ్చుచును నట నిల్వక యేగె నపుడు.(1283) ఇవ్విధంబున మఱియు దన సుతులు మృతులయినపు డెల్ల వారలం గొనివచ్చి యవ్విప్రుండు రాజుమొగసాలంబెట్టి రోదనంబు సేయుచు నెప్పటియట్ల కొన్నిగాథలు సదివిపోవుచుండె; నివ్విధంబున నెనమండ్రు సుతులు మృతులైనపిదపం దొమ్మిదవ సుతుండును మృతుండైన వాని నెత్తికొని వచ్చి యెప్పటి విధంబునఁ బలవరించుచున్న యా బ్రాహ్మణునిం గని యర్జునుం డిట్లనియె.(1284) "ఈ పగిది నీవు వగలన్ ¯ వాపోవఁగఁ జూచి యకట! వారింపంగా ¯ నోపిన విలుకాఁ డొక్కం ¯ డీ పురి లేఁ డయ్యె నయ్య! యిది పాపమగున్.(1285) పుత్త్రులఁ గోల్పోయి భూరిశోకంబున¯ వనటఁ బొందుచు విప్రవరులు సాల ¯ నే రాజురాజ్య మందేని వసించుదు¯ రా రాజుఁ దలపోయ నవనిమీఁద ¯ నటునిఁగా నాత్మ నెన్నం దగు; నీ పుత్త్రు¯ నే బ్రతికించెద నిపుడ పూని ¯ యటు సేయనైతి నే ననలంబు సొచ్చెద"¯ నని భూసురుఁడు వెఱఁగందఁ బలుక(1285.1) నతఁడు విని "యీ వెడఁగుమాట లాడఁ దగునె? ¯ భూరివిక్రమశాలి రాముండు మేటి ¯ బలుఁడు హరియును శౌర్యసంపన్ను లనఁగఁ ¯ దనరు ప్రద్యుమ్నుఁ డతని నందనుఁడు మఱియు.(1286) వినుతబలు లైన యాదవ వీరవరులుఁ ¯ గలుగ వారలచేఁ గాని కార్య మీవు ¯ చక్కఁ బెట్టుట యెట్లు? నీచనెడు త్రోవఁ ¯ బొమ్ము"నావుడు నయ్యింద్రపుత్త్రుఁ డపుడు(1287) మనమున దురహంకారము ¯ ఘనముగఁ బొడముటయు, నపుడు కవ్వడి విప్రుం ¯ గనుఁగొని యచ్చటిజనములు ¯ వినఁగా నిట్లనియె రోషవిహ్వలమతియై.(1288) "బలుఁడంగాను; మురాసురాంతకుఁడఁగాఁ; బ్రద్యుమ్నుఁడంగాను; నేఁ ¯ దెలియం దత్తనయుండఁగా"నని "విరోధివ్రాతమున్ భీషణో¯ జ్జ్వలగాండీవ ధనుర్విముక్త నిశితాస్త్రశ్రేణిచేఁ బీన్గుపెం¯ టలు గావించు పరాక్రమప్రకటచండస్ఫూర్తి నేఁ బార్థుఁడన్.(1289) అదియునుం గాక.(1290) బలిమిఁ బురాంతకుం దొడరి బాహువిజృంభణమొప్ప నెక్కటిం ¯ దలపడి పోరినట్టి రణధైర్యుని నన్ను నెఱుంగ వక్కటా! ¯ పెలుకుఱ మృత్యుదేవతను బింకమడంచి భవత్తనూజుల¯ న్నలవుఁజలంబుఁ జూపి కొనియాడఁగ నిప్పుడతెచ్చియిచ్చెదన్. "(1291) అని నమ్మంబలికిన యర్జును ప్రతిజ్ఞకు భూసురుండు మనంబున నూఱడిల్లి యతని నభినందించుచు నిజ మందిరంబునకు జని; కొన్ని దినంబు లుండునంత భార్యకుం బ్రసూతివేదనా సమయంబయినం జనుదెంచి వివ్వచ్చుం గని తద్విధం బెఱింగించిన నయ్యింద్రనందనుం డప్పుడు.(1292) లలిత విశిష్ట సంచిత జలంబుల నాచమనంబు సేసి, సు¯ స్థలమున నిల్చి రుద్రునకు సమ్మతి మ్రొక్కి మహాస్త్రవేది ని¯ ర్మల శుభమంత్ర దేవతల మానసమందుఁ దలంచి గాండివం ¯ బలవడ నెక్కు ద్రోచి బిగియం గదియించి నిషంగయుగ్మమున్.(1293) ఇవ్విధంబునఁ గట్టాయితంబై యప్పుడు.(1294) భూసురు వెంట నిమ్ముల నేగి సూతికా¯ భవనంబు చుట్టును బాణవితతి ¯ నరికట్టి దిక్కులు నాకాశపథము ధ¯ రాతలం బెల్ల నీరంధ్రముగను ¯ శరపంజరముఁ గట్టి శౌర్యంబు దీపింపఁ¯ గడు నప్రమత్తుఁ డై కాచియున్న ¯ యెడ న మ్మహీసురు నింతికిఁ బుత్త్రుండు¯ జనియించె; నప్పు డచ్చటి జనంబు(1294.1) పోయెఁ బోయెఁ గదే యని బొబ్బ లిడఁగ ¯ బొంది తోడన యాకాశమునకు మాయఁ ¯ జెందె నప్పుడు; దుఃఖంబు నొంది, భూమి ¯ సురుఁడు విలపించుచును మురహరుని కడకు.(1295) అప్పుడు సని.(1296) ముందట నిల్చి "ముకుంద! స ¯ నందనమునివినుత! నందనందన! పరమా ¯ నంద! శరదిందు చందన ¯ కుంద యశస్సాంద్ర! కృష్ణ! గోవింద! హరీ!(1297) అవధరింపుము దేవా! యర్జునుం డనెడి పౌరుషవిహీనుం డాడిన వృథాజల్పంబులు నమ్మి పుత్త్రుం గోలువడి బేలనైన నన్ను నే మందు? నిఖిల విశ్వోత్పత్తి స్థితి లయంబులకుఁ బ్రధాన హేతుభూతుండవయిన నీవు సమర్థుండవయ్యు, వారింపంజాలక చూచుచుండ, నొక్క మనుష్యమాతృండు దీర్పంజాలెడువాఁడు గలఁడె?” యని వెండియు.(1298) "ఎక్కడి పాండుతనూభవుఁ? ¯ డెక్కడి విలుకాఁడు? వీని కెక్కడి సత్త్వం? ¯ బెక్కడి గాండీవము? దన ¯ కెక్కడి దివ్యాస్త్ర సమితి? యే మనవచ్చున్? "(1299) అని తను నోడక నిందిం ¯ చిన విని యయ్యర్జునుండు చిడిముడిపడుచుం ¯ దన విద్యమహిమ పెంపునఁ ¯ జనియెన్ వెస దండపాణి సదనంబునకున్.(1300) చని యందు ధారుణీసుర ¯ తనయులు లేకుంటఁ దెలిసి తడయక యింద్రా ¯ గ్ని నిరృతి వరుణ సమీరణ ¯ ధనదేశానాలయములు దగఁ బరికించెన్.(1301) వెండియు.(1302) నర సుర యక్ష కింపురుష నాగ నిశాచర సిద్ధ సాధ్య ఖే ¯ చర విహగేంద్ర గుహ్యక పిశాచ నివాసములందు రోసి భూ ¯ సురసుత లేగినట్టి గతి సొప్పడకుండుటఁ జూచి క్రమ్మఱన్ ¯ ధరణికి నేగుదెంచి బెడిదంబుగ నగ్ని సొరంగఁ బూనినన్.(1303) అవ్విధంబంతయు నెఱింగి యమ్మురాంతకుండు “విప్రనందనుల నీకుం జూపెద” నని యనలంబు సొరకుండ నతని నివారించి యప్పుడు.

మృత విప్రసుతులఁ దెచ్చుట

(1304) సుందరదివ్యరత్నరుచి శోభితమై తనరారు కాంచన¯ స్యందన మంబుజాప్తుఁ డుదయాచల మెక్కు విధంబు దోఁపఁ బౌ ¯ రందరి దాను నెక్కి తను రశ్ములు దిగ్వితతిన్ వెలుంగ గో ¯ విందుఁ డుదారలీలఁ జనె విప్రతనూజ గవేషణార్థియై.(1305) చని పుర గోష్ఠ దుర్గ వన జానపదాచల పక్కణప్రభూ ¯ త నద నదీ సరోవర యుతక్షితి నంతయు దాఁటి సప్త వా ¯ రినిధుల దీవులం గులగిరిప్రకరంబుల నుత్తరించి మే ¯ రునగము నాక్రమించుచు మరుద్గతితో రథ మేగ నత్తఱిన్.(1306) మసలక భూరిసంతమస మండలముం దఱియంగఁ జొచ్చి సా ¯ హసమునఁ బోవఁబోవఁగ భయంకరమై మది గోచరింపమిన్ ¯ వసమఱి మోఁకరిల్లి రథవాజులు మార్గము దప్పి నిల్చినన్ ¯ బిసరుహపత్త్రలోచనుఁ డభేద్యతమఃపటలంబు వాపఁగన్.(1307) బాలభానుప్రభా భాసమానద్యుతిఁ¯ గరమొప్ప నిజ రథాంగంబుఁ బనుప ¯ నమ్మహాస్త్రం బేగి చిమ్మచీఁకటి నెల్ల¯ నఱిముఱి నందంద నఱికి వైచి ¯ యగ్రభాగంబున నతులిత గతి నేగ¯ నా మార్గమున నిజస్యందనంబు ¯ గడువడిఁదోలి యా కడిఁదితమోభూమిఁ¯ గడవ ముందఱకడఁ గానరాక(1307.1) మిక్కుటంబుగ దృష్టి మిర్మిట్లు గొనఁగఁ ¯ జదల వెలుఁగొందు దివ్యతేజంబుఁ జూచి ¯ మొనసి గాండీవి కన్నులు మూసికొనుచు ¯ నాత్మ భయమంది కొంతద వ్వరిగి యరిగి.(1308) కడఁగి దుర్వార మారుతోత్కట విధూత ¯ చటుల సర్వంకషోర్మి భీషణ గభీర ¯ వారిపూరంబు సొచ్చి తన్నీరమధ్య ¯ భాగమునఁ గోటిసూర్యప్రభలు వెలుంగ.(1309) అది మఱియును జారు దివ్యమణి సహస్రస్తంభాభిరామంబును, నాలంబిత కమనీయ నూత్న రత్నమాలికాలంకృతంబును, భాను శశి మయూఖాగమ్యంబును, ననంత తేజోవిరాజితంబును, బునరావృత్తిరహిత మార్గంబును, నిత్యైశ్వర్య దాయకంబును, నవ్యయంబును, నత్యున్నతంబును, ననూనవిభవంబును, బరమయోగీంద్ర గమ్యంబును, బరమభాగవత నివాసంబునునై యొప్పు దివ్యధామంబు నందు.(1310) సాంద్రశరచ్చంద్ర చంద్రికా కర్పూర¯ నీహార హారాభ దేహ మమర ¯ నిందింది రేందీవ రేంద్ర నీలద్యుతిఁ¯ గర మొప్పు మేచక కంఠసమితి ¯ యరుణాంశుబింబ భాసుర పద్మరాగ వి¯ స్యస్త సహస్రోరు మస్తకములు ¯ వివృతాననోద్గత విషధూమరేఖల¯ లీలఁ జూపట్టిన నాలుకలును(1310.1) గలిత సాయంతనజ్వలజ్జ్వలన కుండ ¯ ముల విడంబించు వేఁడి చూపులును గలిగి ¯ భూరి కలధౌత గిరినిభాకార మమరఁ ¯ బరఁగు భోగీంద్రభోగతల్పంబు నందు.(1311) సుఖాసీనుండై యున్నవాని డాయంజని యప్పుడు.(1312) సజల నీలాంబుద శ్యామాయమానాంగు, ¯ నాశ్రితావన ముదితాంతరంగు, ¯ సనకాది యోగిహృద్వనజ మదాళీంద్రు, ¯ ముఖపద్మ రుచిజిత పూర్ణచంద్రుఁ, ¯ గమనీయ నిఖిలజగద్ధితచారిత్రుఁ, ¯ బ్రత్యూషసంఫుల్లపద్మనేత్రు, ¯ నిందిరాహృదయారవిందారుణోల్లాసు, ¯ శ్రీకర పీత కౌశేయవాసు,(1312.1) హార కుండల కటక కేయూర మకుట ¯ కంక ణాంగద మణిముద్రికా వినూత్న ¯ రత్ననూపుర కాంచీ విరాజమాను, ¯ భవమహార్ణవశోషు, సద్భక్తపోషు.(1313) మఱియు సునందాది పరిజన సంతత సేవితు, నానందకందళిత హృదయారవిందు, నరవిందవాసినీ వసుంధరాసుందరీ సమేతు, నారదయోగీంద్రసంకీర్తనానందితు, నవ్యయు, ననఘు, ననంతు, నప్రమేయు, నజితు, నవికారు, నాదిమాధ్యాంతరహితు, భవలయాతీతుఁ, గరుణాసుధాసముద్రు, నచ్యుతు, మహానుభావుఁ, బరమపురుషుఁ, బురుషోత్తము, నిఖిలజగదుత్పత్తి స్థితిలయ కారణుఁ, జిదచిదీశ్వరు, నష్టభుజుఁ, గౌస్తుభశ్రీవత్సవక్షు, శంఖచక్ర గదా పద్మ శార్ఙ్గాది దివ్యసాధను, సర్వ శక్తి సేవితుఁ, బరమేష్ఠి జనకు, నారాయణుం గనుంగొని దండప్రణామంబులు సేసి కరకమలంబులు మొగిచి భక్తి పూర్వకంబుగా నభినందించిన, నయ్యాది దేవుండును వారలం గరుణావలోకనంబులు నిగుడ నవలోకించి, దరహాసపూరంబు దోరంబుగా సాదరంబుగ నిట్లనియె.(1314) "ధరణికి వ్రేఁ గగు దైత్యులఁ ¯ బొరిబొరి వధియించి ధర్మమున్ నిలుపుటకై ¯ ధర జనియించితి రిరువురు ¯ నరనారాయణు లనంగ నా యంశమునన్.(1315) ఆరూఢ నియతితోఁ బెం ¯ పారిన మిము నిమ్మునీంద్రు లర్థిం జూడం ¯ గోరిన మీ వచ్చుటకై ¯ ధారుణిసురసుతుల నిటకుఁ దగఁ దేవలసెన్. "(1316) అని "యా డింభకులను దో ¯ కొని పొం"డని యిచ్చి వీడుకొలిపిన వారల్‌ ¯ వినతు లయి పెక్కు విధముల ¯ వినుతించుచు నచటు వాసి విప్రునిసుతులన్.(1317) తోడ్కొని సంప్రాప్త మనోరథు లయి య బ్బాలకులఁ ద త్తద్వయో రూపంబులతోడఁ దెచ్చి యాబ్రాహ్మణునకు సమర్పించిన నతండు సంతుష్టాంతరంగుం డయ్యె; న య్యవసరంబున.(1318) అనిమిషనాథనందనుఁ, డహర్పతితేజుఁడు గృష్ణుతోడఁ దాఁ ¯ జని యచటం గనుంగొనిన సర్వశరణ్యునిఁ, బుండరీకనే¯ త్రుని, నిజధామ వైభవసదున్నత తన్మహనీయ కీర్తికిన్ ¯ మనమున మోదమంది పలుమాఱును సన్నుతిఁ జేసె భూవరా!(1319) వారిజాక్షుని భక్తమందారు ననఘుఁ ¯ గృష్ణు నఖిలేశుఁ గేశవు జిష్ణుఁ బరము ¯ వినుతి సేయుచుఁ దత్పాదవనజములకు ¯ వందనము లాచరించి యానంద మొందె.(1320) అంత.(1321) హరి, సర్వేశుఁ, డనంతుఁ, డాద్యుఁ, డభవుం, డామ్నాయసంవేది భూ¯ సుర ముఖ్యప్రజలన్ సమస్త ధనవస్తుశ్రేణి నొప్పారఁగాఁ ¯ బరిరక్షించుచు ధర్మమున్ నిలుపుచుం బాపాత్ములం ద్రుంచుచుం¯ బర మోత్సాహ మెలర్ప భూరిశుభ విభ్రాజిష్ణుఁడై ద్వారకన్.(1322) జనవినుతముగాఁ బెక్కు స ¯ వనములు దనుఁ దాన కూర్చి వైదిక యుక్తిం ¯ బొనరించుచు ననురాగము ¯ మనమునఁ దళుకొత్త దైత్యమర్దనుఁ డెలమిన్.

కృష్ణుని భార్యా సహస్ర విహారంబు

(1323) అట్లు కృష్ణుండు ద్వారకానగరంబునఁ బూజ్యం బగు రాజ్యంబు సేయుచుఁ బురందరవిభవంబున నిరవొంది కనక మణిమయ విమాన, మండప, గోపుర, ప్రాసాద, సౌధ, చంద్రశాలాంగణాది వివిధ భవనంబు లందును రంగదుత్తుంగతరంగ డోలావిలోల కలహంస, చక్రవాక, కారండవ, సారస, క్రౌంచముఖ జలవిహంగ విలసదుచ్చలిత గరు దనిల దరదమల కమల, కుముద, కహ్లార సందోహ నిష్యంద మకరందరసపాన మదవదిందిందిరకుల కల గాయక ఝంకార నినదంబులును, నిరంతర వసంతసమయ సముచిత పల్లవిత, కోరకిత బాలరసాలజాల లాలిత కిసలయ విసర ఖాదన జాత కుతూహలాయమాన కషాయకంఠ కలకంఠ కలరవ మృదంగ ఘోషంబులును, నిశిత నిజచంచూపుట నిర్దళిత సకలజన నయనానంద సుందరనందిత మాకంద పరిపక్వ ఫలరంధ్ర విగళిత మధుర రసాస్వాదనముదిత రాజకీర శారికా నికర మృదు మధురవచన రచనావశకృత్యంబులును నమరఁ, బురపురంధ్రీజన పీన పయోధర మండల విలిప్త లలిత కుంకుమ పంక సంకుల సౌగంధ్యానుబంధ బంధురగంధానుమోదితుండును, జందనాచల సానుదేశసంజాత మంజుల మాధవీలతానికుంజ మంజుల కింజల్క రంజిత నివాస విసర విహరమాణ శబరికా కబరికా పరిపూర్ణ సురభి కుసుమమాలికా పరిమళ వహుండును, గళిందకన్యకా కల్లోల సందోహ పరిస్పంద కందళిత మందగమనుండును నగు మందానిల విదూషకునిచేఁ బోషితాభ్యాసిత లాలిత లగు నేలాలతా వితాన నటుల నటనంబుల విరాజితంబులగు కాసారతీర భాసురోద్యానంబులందును, జారు ఘనసార పటీర బాలరసాల సాల నీప తాపింఛ జంబూ జంబీర నింబ కదంబప్రముఖ ముఖ్య శాఖి శాఖాకీర్ణ శీతలచ్ఛాయా విరచిత విమల చంద్రకాంతోపల వేదికాస్థలంబులందును, నుదంచిత పింఛవిభాసిత బాలనీలకంఠ కేకార వాకులీకృత కృతక మహీధరంబు లందును, లలితమణి వాలుకానేక పులినతలంబు లందును, గప్పురంపుం దిప్పలను, గురువేరు చప్పరంబులను, విరచిత దారు యంత్ర నిబద్ధ కలశ నిర్యత్పయో ధారాశీకర పరంపరా సంపాదిత నిరంతర హేమంత సమయ ప్రదేశంబులందును, నిందిరారమణుండు షోడశ సహస్ర వధూయుక్తుండై యందఱ కన్ని రూపులై లలితసౌదామినీలతా సమేత నీలనీరదంబుల విడంబించుచుఁ గరేణుకాకలిత దిగ్గజంబు నోజ రాజిల్లుచు, సలిలకేళీవిహారంబులు మొదలుగా ననేక లీలా వినోదంబులు సలుపుచు, నంతఃపురంబునఁ గొలువున్న యవసరంబున వివిధ వేణువీణాది వాద్యవినోదంబులను, మంజుల గానంబులను, గవి గాయక సూత వంది మాగధజన సంకీర్తనంబులను, నటనటీజన నాట్యంబులను, విదూషక పరిహాసోక్తులను సరససల్లాప మృదుమధుర భాషణంబులను బ్రొద్దుపుచ్చుచు నానందరసాబ్ధి నోలలాడు చుండె; నంత.(1324) అరవిందాక్ష పదాంబుజాత యుగళధ్యానానురాగక్రియా ¯ సరసాలాప విలోకనానుగత చంచత్సౌఖ్య కేళీరతిం ¯ దరుణుల్ నూఱుపదాఱువేలు మహితోత్సాహంబునం జొక్కి త¯ త్పరలై యొండు దలంప కుండిరి సవిభ్రాంతాత్మ లై భూవరా!(1325) అదియునుం గాక.(1326) హరినామాంకితమైన గీత మొకమా టాలించి మూఢాత్ములున్ ¯ విరతిం బొందఁగఁజాలి యుందురట; యా విశ్వాత్ము నీక్షించుచుం¯ బరిరంభించుచు, నంటుచున్నగుచుసంభాషించుచున్నుండు సుం¯ దరు లానంద నిమగ్ను లౌట కిలఁ జోద్యం బేమి? భూవల్లభా! "(1327) అని చెప్పి మఱియు నిట్లనియె.(1328) "వారక కృష్ణుఁ డిప్పగిది వైదికవృత్తి గృహస్థధర్మ మే ¯ పారఁగఁ బూని ధర్మమును నర్థముఁ గామము నందుఁ జూపుచుం ¯ గోరికమీఱ సజ్జనులకుం గతి దాన యనంగ నొప్పి సం ¯ సారిగతిన్ మెలంగె నృపసత్తమ! లోకవిడంబనార్థమై.(1329) హరి యిట్లు గృహమేధి యగుచు శతోత్తర¯ షోడశసాహస్ర సుందరులను ¯ మును నీకు నెఱుఁగఁ జెప్పినరీతి నందఱ¯ కన్నిరూపములు దా నర్థిఁ దాల్చి ¯ కైకొని యొక్కక్క కామినీమణి యందు¯ రమణ నమోఘ వీర్యమునఁ జేసి ¯ పదురేసి కొడుకులం బడసె రుక్మిణ్యాది¯ పట్టమహిషులకుద్భవులు నైన(1329.1) నందనులలోన ధరణి నెన్నంగ బాహు ¯ బల పరాక్రమ విజయ సంపద్విశేష ¯ మాని తాత్ములు పదునెనమండ్రు; వారి ¯ నెఱుఁగ వినిపింతు, వినుము రాజేంద్రచంద్ర! "(1330) అని మఱియు నిట్లను; “వారలు ప్రద్యు మ్నానిరుద్ధ, దీప్తిమ ద్భాను, సాంబ, మిత్ర, బృహద్భాను, మిత్రవింద, వృ కారుణ, పుష్కర, దేవబాహు, శ్రుతదేవ, సునందన, చిత్రబాహు, వరూధ, కవి, న్యగ్రోధ, నామంబులం బ్రసిద్ధు లైరి; వెండియుఁ ద్రివక్ర యందు సంభవించిన యుపశ్లోకుం డనువాఁడు దన జనకుండైన కృష్ణు పాదారవింద సేవారతుండగుచు నారదయోగీంద్రునకు శిష్యుండై యఖండిత దివ్యజ్ఞాన బోధాత్మకుం డగుచు, స్త్రీ శూద్ర దాసజన సంస్కారకంబై స్మరణమాత్రంబున ముక్తిసంభవించునట్టి సాత్త్వత తంత్రం బను వైష్ణవస్మృతిం గల్పించె; నిట్లు మధుసూదననందనులు బహుప్రజలును, నధికాయురున్నతులును, ననల్పవీర్యవంతులును, బ్రహ్మణ్యులునై విఖ్యాతింబొందిరి; వారిని లెక్క వెట్టఁ బదివేల వత్సరంబులకైనం దీఱదు, మున్ను నీకెఱింగించి నట్లు తత్కుమారులకు విద్యావిశేషంబుల నియమించు గురు జనంబులు మూఁడుకోట్లునెనుబదెనిమిదివేలనూర్గు రనం గల్గి యుందు; రక్కుమారుల లెక్కింప నెవ్వరికి శక్యం? బదియునుం గాక యొక్క విశేషంబు సెప్పెద విను"మని యిట్లనియె. (1331) "నరవర! దేవాసుర సం ¯ గరమును మును నిహతులైన క్రవ్యాద సము¯ త్కరము నరేశ్వరులై ద్వా ¯ పరమున జనియించి ప్రజల బాధలఁ బఱుపన్.(1332) హరి తద్వధార్థమై ని¯ ర్జరులను యదుకులము నందు జనియింపింపం ¯ ధర నూటొక్క కులం బై ¯ పరఁగిరి; వారిని గణింప బ్రహ్మకు వశమే?

యదు వృష్ణి భో జాంధక వంశంబు

(1333) అట్టి యన్వయంబు నందు మాధవునకు రుక్మిణీదేవి యందుఁ బితృసముండును, సమగ్ర భుజావిజృంభణుండును నై ప్రద్యుమ్నుండు జనియించె; నతనికి రుక్మికూఁతురగు శుభాంగివలన ననిరుద్ధం డుదయించె; నతనికి మౌసలావశిష్టుండైన ప్రజుండు సంభవించె; నతనికిఁ బ్రతిబాహుండుపుట్టె; వానికి సుబాహుండు జన్మించె; నతనికి నుగ్రసేనుండుప్రభవించె; నతనికి శ్రుతసేనుండు గలిగె; నిట్లు యదు వృష్టి భోజాంధక వంశంబులు పరమ పవిత్రంబులై పుండరీకాక్షుని కటాక్షవీక్షణ శయ్యాసనానుగత సరసాలాప స్నానాశన క్రీడావినోదంబుల ననిశంబునుం జెందుచు, సర్వదేవతార్థంబు సమస్తంబైన క్రతువు లొనరింపుచుఁ బరమానంద కందళిత చిత్తులై యుండి"రని చెప్పి వెండియు.(1334) "పరమోత్సాహముతోడ మాధవుఁడు శుంభల్లీలఁ బూరించు న¯ మ్మురళీగానము వీనులం జిలికినన్ మోదించి గోపాల సుం ¯ దరు లేతెంతు రరణ్యభూములకుఁ; దద్దాస్యంబు గామించి య¯ క్కరుణావార్థి భజింప కుందురె బుధుల్‌ కౌరవ్యవంశాగ్రణీ!(1335) మతినెవ్వాని యమంగళఘ్న మగు నామం బర్థిఁ జింతించినన్ ¯ నుతిగావించిన విన్న మానవులు ధన్యుల్‌; భూరిసంసార దు¯ ష్కృతులం ద్రోతురు; కాలచక్ర మహితాసిం బట్టి యా కృష్ణుఁ డీ ¯ క్షితిభారం బుడుగంగఁ జేయు టిది యే చిత్రంబు? భూవల్లభా!(1336) ఇవ్విధంబున గోపికాజన మనోజాతుండైన కృష్ణుండు లీలామా నుష విగ్రహుండై నిజరాజధాని యైన ద్వారకాపురంబున నమానుష విభవంబు లగు సౌఖ్యంబులం బొదలుచుండె” నని చెప్పి మఱియు నిట్లనియె.(1337) "మనుజేంద్రోత్తమ! యేను నీకుఁ ద్రిజగన్మాంగల్యమై యొప్పఁ జె¯ ప్పిన యీ కృష్ణకథాసుధారసము సంప్రీతాత్ములై భక్తిఁ గ్రో ¯ లిన పుణ్యాత్ములు గాంతు రిందు సుఖముల్‌; నిర్ధూతసర్వాఘులై¯ యనయంబుం దుదిఁ గాంతు రచ్యుతపదం బై నట్టి కైవల్యమున్. "(1338) అని యిట్లు బాదరాయణి ¯ మనమున రాగిల్ల నాభిమన్యునకుం జె¯ ప్పిన విధమున సూతుఁడు ముని ¯ జనుల కెఱింగింప వారు సమ్మతితోడన్.(1339) సూతుని బహువిధముల సం ¯ ప్రీతునిఁ గావించి మహిమఁ బెంపారుచు వి¯ ఖ్యాతికి నెక్కిన కృష్ణక ¯ థాతత్పరు లైరి బుద్ధిఁ దఱుఁగని భక్తిన్.

పూర్ణి

(1340) సరసిజపత్త్రనేత్ర! రఘుసత్తమ! దుష్టమదాసురేంద్రసం ¯ హరణ! దయాపయోధి! జనకాత్మభవాననపద్మమిత్ర! భా¯ స్కరకులవార్ధిచంద్ర! మిహికావసుధాధరసూతిసన్నుత¯ స్ఫురితచరిత్ర! భక్తజనపోషణభూషణ! పాపశోషణా!(1341) మారీచభూరిమాయా ¯ నీరంధ్రమహాంధకారనీరేజహితా! ¯ క్ష్మారమణవినుతపాదాం ¯ భోరుహ! మహితావతార! పుణ్యవిచారా!(1342) శరధిమదవిరామా! సర్వలోకాభిరామా! ¯ సురరిపువిషభీమా! సుందరీలోకకామా! ¯ ధరణివరలలామా! తాపసస్తోత్రసీమా! ¯ సురుచిరగుణధామా! సూర్యవంశాబ్ధిసోమా!(1343) ఇది శ్రీ పరమేశ్వర కరుణాకలిత కవితావిచిత్ర కేసనమంత్రిపుత్ర సహజపాండిత్య పోతనామాత్య ప్రణీతం బైన శ్రీమహాభాగవతం బను మహాపురాణంబు నందుఁ బ్రద్యుమ్న జన్మంబును, శంబరోద్యోగంబును, సత్రాజిత్తునకు సూర్యుండు శమంతకమణి నిచ్చుటయుఁ దన్నిమిత్తంబునం ప్రసేనుని సింహంబు వధియించుటయు, దాని జాంబవంతుండు దునిమి మాణిక్యంబు గొనిపోవుటయు, గోవిందుండు ప్రసేనుని దునిమి మణిఁ గొనిపోయె నని సత్త్రాజిత్తు కృష్ణునందు నింద నారోపించుటయుఁ, గృష్ణుండు దన్నిమిత్తంబున జాంబవంతునిం దొడరి మణియుక్తంబుగా జాంబవతిం గొనివచ్చి వివాహం బగుటయు, సత్త్రాజిత్తునకు మణి నిచ్చుటయు, సత్యభామా పరిణయంబును, బాండవులు లాక్షాగృహంబున దగ్ధులైరని విని వాసుదేవుండు బలభద్ర సహితుం డయి హస్తినాపురంబున కరుగుటయు, నక్రూర కృతవర్మల యనుమతంబున శతధన్వుండు సత్త్రాజిత్తుఁ జంపి మణిఁ గొనిపోవుటయుఁ, దదర్థం బా సత్యభామ కరినగరంబున కేగి కృష్ణునకు విన్నవించిన నతండు మరలి చనుదెంచి శతధన్వుం ద్రుంచుటయు, బలభద్రుండు మిథిలానగరంబునకుం జనుటయు, నందు దుర్యోధనుండు రామునివలన గదావిద్య నభ్యసించుటయుఁ, గృష్ణుండు సత్రాజిత్తునకుం బరలోకక్రియలు నడపుటయు, శమంతకమణిం దాఁచిన వాఁడయి యక్రూరుండు భయంబున ద్వారకానగరంబు విడిచిపోయిన నతని లేమి ననావృష్టి యైనం గృష్ణుం డక్రూరుని మరల రప్పించుటయు, దామోదరుం డింద్రప్రస్థపురంబున కరుగుటయు, నం దర్జున సమేతుం డయి మృగయావినోదార్థం బరణ్యంబునకుం జని, కాళిందిం గొనివచ్చుటయు, ఖాండవ దహనంబును, నగ్నిపురుషుం డర్జునునకు నక్షయతూణీర గాండీవ కవచ రథ రథ్యంబుల నిచ్చుటయు, మయుండు ధర్మరాజునకు సభ గావించి యిచ్చుటయు, నగధరుండు మరలి నిజనగరంబున కరుగుదెంచి కాళిందిని వివాహంబగుటయు, మిత్రవిందా నాగ్నజితీ భద్రా మద్రరాజకన్యలం గ్రమంబునఁ గరగ్రహణం బగుటయు, నరకాసుర యుద్ధంబును, దద్గృహంబున నున్న రాజకన్యకలం బదాఱువేలం దెచ్చుటయు, స్వర్గగమనంబును, నదితికిం గుండలంబు లిచ్చుటయుఁ, బారిజాతాపహరణంబును, బదాఱువేల రాజకన్యలం బరిణయం బగుటయు, రుక్మిణీదేవి విప్రలంభంబును, రుక్మిణీ స్తోత్రంబును, గృష్ణకుమారోత్పత్తియుఁ, దద్గురు జనసంఖ్యయుఁ, బ్రద్యుమ్ను వివాహంబును, ననిరుద్ధు జన్మంబును, దద్వివాహార్థంబు కుండిననగరంబునకుం జనుటయు, రుక్మి బలభద్రుల జూదంబును, రుక్మి వధయు, నుషాకన్య యనిరుద్ధుని స్వప్నంబునం గని మోహించుటయుఁ, ద న్నిమిత్తంబునఁ, జిత్రరేఖ సకలదేశ రాజులఁ బటంబున లిఖించి చూపి యనిరుద్ధునిఁ దెచ్చుటయు, బాణాసుర యుద్ధంబును, నృగోపాఖ్యానంబును, బలభద్రుని ఘోష యాత్రయుఁ, గాళింది భేదనంబును, గృష్ణుండు పౌండ్రక వాసుదేవ కాశీరాజుల వధించుటయుఁ, గాశీరాజపుత్రుం డయిన సుదక్షిణుం డభిచారహోమంబు గావించి కృత్యం బడసి కృష్ణుపాలికిం బుత్తెంచిన సుదర్శనంబుచేతఁ గృత్యను సుదక్షిణ సహితంబుగాఁ గాశీపురంబును భస్మంబు సేయుటయు, బలరాముండు రైవతనగరంబు నందు ద్వివిదుండను వనచరుని వధియించుటయు, సాంబుండు దుర్యోధనుకూఁతు రగు లక్షణ నెత్తికొనివచ్చినఁ గౌరవు లతనిం గొనిపోయి చెఱఁబెట్టుటయుఁ, దద్వృత్తాంతం బంతయు నారదువలన విని బలభద్రుండు నాగనగరంబునకుఁ జనుటయుఁ, గౌరవు లాడిన యగౌరవవచనంబులకు బలరాముండు కోపించి హస్తినాపురంబును గంగం బడఁద్రోయ గమకించుటయుఁ, గౌరవులు భయంబున నంగనాయుక్తంబుగా సాంబునిం దెచ్చి యిచ్చుటయు, బలభద్రుండు ద్వారకానగరంబునకు వచ్చుటయు, నారదుండు హరి పదాఱువేల కన్యకల నొకముహూర్తంబున నందఱ కన్నిరూపులై వివాహంబయ్యె నని విని తత్ప్రభావంబు దెలియంగోరి యరుగుదెంచుటయుఁ, దన్మాహాత్మ్యంబు సూచి మరలి చనుటయు, జరాసంధునిచేత బద్ధు లైన రాజులు కృష్ణు పాలికి దూతం బుత్తెంచుటయు, నారదాగమనంబును, బాండవుల ప్రశంసయును, నుద్ధవ కార్యబోధంబును, నింద్రప్రస్థాగమనంబును, ధర్మరాజు రాజసూయారంభంబును, దిగ్విజయంబును, జరాసంధ వధయును, రాజ బంధమోక్షణంబును, రాజసూయంబు నెఱవేర్చుటయును, శిశుపాల వధయును, నవభృథంబును, రాజసూయ వైభవదర్శ నాసహమాన మానసుం డయి సుయోధనుండు మయనిర్మిత సభామధ్యంబునం గట్టిన పుట్టంబులు దడియం ద్రెళ్ళుటయుఁ, దన్నిమిత్తపరిభవంబు నొంది రారాజు నిజపురి కరుగుటయుఁ, గృష్ణుండు ధర్మరాజ ప్రార్థితుం డయి యాదవుల నిలిపి కొన్ని నెలలు ఖాండవప్రస్థంబున వసియించుటయు, సాళ్వుండు దపంబు సేసి హరుని మెప్పించి సౌభకాఖ్యం బగు విమానంబు వడసి నిజసైన్య సమేతుండై ద్వారకానగరంబు నిరోధించుటయు, యాదవ సాళ్వ యుద్ధంబును, గృష్ణుండు మరలి చనుదెంచి సాల్వుం బరిమార్చుటయును, దంతవక్త్ర వధయును, విదూరథ మరణంబును, గృష్ణుండు యాదవ బల సమేతుండై క్రమ్మఱ నిజపురంబునకుం జనుటయును, గౌరవ పాండవులకు యుద్ధం బగునని బలదేవుండు తీర్థయాత్ర సనుటయు, నందు జాహ్నావీప్రముఖ నదులం గృతస్నానుం డయి నైమిశారణ్యంబునకుం జనుటయు, నచ్చటి మునులు పూజింపం బూజితుం డయి తత్సమీపంబున నున్నతాసనంబున నుండి సూతుండు దన్నుం గని లేవకున్న నలిగి రాముండు గుశాగ్రంబున నతని వధించుటయు, బ్రహ్మహత్యా దోషంబు గలిగె నని మునులు వలికిన సూతుం బునర్జీవితుం జేయుటయు, నమ్మునులకుం బ్రియంబుగాఁ గామపాలుం డిల్వల సుతుండగు పల్వలుం బరిమార్పుటయు, వారిచేత ననుమతుం డయి హలధరుండు దత్సమీప తీర్థంబుల స్నాతుండయి గంగా సాగర సంగమంబునకుం జనుటయు, మహేంద్రనగ ప్రవేశంబును, బరశురామ దర్శనంబును, సప్త గోదావరిం గ్రుంకుటయు, మఱియు మధ్యదేశంబునంగల తీర్థంబులాడి శ్రీశైల వేంకటాచలంబులు దర్శించుటయు, వృషభాద్రి హరి క్షేత్ర సేతుబంధ రామేశ్వరములం గని తామ్రపర్ణీ తీర్థంబు లాడుటయు, గోదానంబు లొనరించి మలయగిరి యందు నగస్త్యునిం గనుటయు, సముద్రకన్యా దుర్గాదేవుల నుపాసించుటయు, నందు బ్రాహ్మణజనంబువలనం బాండవ ధార్తరాష్ట్ర భండనంబున సకల రాజలోకంబును మృతి నొంది రని వినుటయు, వాయునందన సుయోధనులు గదా యుద్ధసన్నద్ధు లగుట విని వారిని వారించుటకై, రౌహిణేయుం డందుల కరుగుటయు, నచట వారిచేతం బూజితుండయి వారిని వారింప లేక మగిడి ద్వారక కరుగుటయుఁ, గొన్ని వాసరంబులకు మరల నైమిశారణ్యంబునకుం బోయి యచట యజ్ఞంబు సేసి రేవతియుం దానును నవభృథంబాడి నిజపురంబున కేతెంచుటయుఁ, గుచేలోపాఖ్యానంబును, సూర్యోపరాగంబునం గృష్ణుఁడు రామునితోఁ జేరి పురరక్షణంబునకుఁ బ్రద్యుమ్నాది కుమారుల నిలిపి షోడశసహస్రాంగనా పరివృతుండయి యక్రూర వసుదేవోగ్రసేనాది యాదవ వీరులు దోడరా శమంతపంచక తీర్థంబున కరిగి కృతస్నానుండయి వసియించి యుండుటయుఁ, బాండవకౌరవాది సకల రాజలోకంబును దత్తీర్థంబునకు వచ్చుటయుఁ, గుంతీదేవి దుఃఖంబును, నందయశోదా సహితు లైన గోపగోపి జనంబులు చనుదెంచుటయుఁ, గుశలప్రశ్నాది సంభాషణంబులును, మద్రకన్యా ద్రౌపదీ సంభాషణంబును, దదనంతరంబ సకల రాజలోకంబును శమంతపంచకతీర్థంబున స్నాతులై రామకృష్ణాది యాదవ వీరుల నామంత్రణంబు చేసి నిజ దేశంబులకుఁ బోవుటయుఁ, గృష్ణుని దర్శించుటకు మునీంద్రు లేతెంచుటయు, వారి యనుమతిని వసుదేవుండు యాగంబు నెరవేర్చుటయు, నంద యశోదాది గోపికానివహంబుల నిజపురంబున కనిచి యుగ్రసేనాది యాదవవీరులుం దానును మాధవుండు నిజపురప్రవేశంబు సేయుటయుఁ, దొల్లి కంసునిచేత హతులై బలిపురంబున నున్న దేవకీదేవి సుతుల రామకృష్ణులు యోగమాయాబలంబునఁ దెచ్చి యామె కిచ్చుటయు, నర్జునుండు సుభద్రను వివాహంబగుటయుఁ, గృష్ణుండు మిథిలానగరంబున కరుగుటయు, శ్రుతదేవ జనకుల చరిత్రంబును, వారలతో బ్రాహ్మణ ప్రశంస సేయుటయు, శ్రుతిగీతలును, హరిహరబ్రహ్మల తారతమ్య చరిత్రంబును, గుశస్థలి నుండు బ్రాహ్మణుని చరిత్రంబును, నతని తనయులు పరలోకంబునకుం బోయినఁ గృష్ణార్జునులు తమ యోగబలంబున వారిం దెచ్చి యవ్విప్రున కిచ్చుటయుఁ గృష్ణుం డర్జునుని వీడ్కొని ద్వారక కరుగుటయు, నందు మాధవుం డయ్యై ప్రదేశంబుల సకల భార్యా పరివృతుండయి విహరించుటయు, యాదవ వృష్ణి భోజాంధక వంశ చరిత్రంబును నను కథలు గల దశమస్కంధంబు నందు నుత్తరభాగము.