పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవత పారాయణ - 3 : దశమ పూర్వ 884 - 999

ఇంద్రయాగ నివారణంబు

(884) అని యిట్లు నొడివిన నందుని పలుకులు విని యింద్రునికిఁ గోపంబు దీపింప దనుజదమనుండు తండ్రి కిట్లనియె. (885) "కర్మమునఁ బుట్టు జంతువు¯ కర్మమునను వృద్ధి బొందుఁ గర్మమునఁ జెడుం¯ గర్మమె జనులకు దేవత¯ కర్మమె సుఖదుఃఖములకుఁ గారణ మధిపా! (886) కర్మములకుఁ దగు ఫలములు¯ కర్ములకు నిడంగ రాజు గాని సదా ని¯ ష్కర్ముఁ డగు నీశ్వరుండును¯ గర్మవిహీనునికి రాజు గాఁడు మహాత్మా! (887) కావునఁ గర్మానుయాతంబులైన భూతంబులకుఁ బురుహూతుని వలని భీతి యేటికిఁ? బురాతన జన్మసంస్కారంబులు కుప్పలుగొని కప్పినఁ గర్మంబులఁ దప్పించి పెంపు వడయ న ప్పరమేశ్వరుండును నేరం; డితరులం జెప్పనేల? సురాసురనరానీకంబులతోడి లోకంబు నిజసంస్కారవశంబై యంద డింది యున్నది; సందేహంబు లేదు; దేహి కర్మవశంబున గురుతను దేహంబులం జొచ్చి వెడలు; నొజ్జ, వేలుపు, నెచ్చలి, పగఱు, చుట్టంబులు కర్మంబులు, జీవుండు కర్మంబుతోడన వర్తించు; నతనికిఁ గర్మంబు దైవతంబు కర్మంబునం బ్రతుకుచు నితర సేవ జేయుట సతి పతిని విడిచి జారుం జేరిన చందంబగు; విప్రుండు వైదికకర్మంబున మెలంగు; నృపతి ధరణీ పాలనంబున సంచరించు; వైశ్యుండు వాణిజ్య కృషి కుసీద గోరక్షాదుల వర్తించు; శూద్రుం డగ్రజన్ముల సేవించి బ్రతుకు; రజ స్సత్వ తమోగుణంబు లుత్పత్తి స్థితి లయ కారణంబు లందు రజంబున జగంబు జన్మించు; రజోగుణప్రేరితంబులై మేఘంబులు వర్షించు; వర్షంబునం బ్రజావృద్ధి యగు; నింద్రుం డేమి చేయంగలవాఁ; డదియునుం గాక. (888) కోపింపం బనిలేదు శక్రునికిఁ; దాఁ గోపించుఁగా కేమి సం¯ క్షేపం బయ్యెడి దేమి? పట్టణములున్ గేహంబులున్ దేశముల్¯ వ్యాపారంబులు మీకుఁ బోయెడినె? శైలారణ్యభాగంబులన్¯ గోపత్వంబున నుండుచున్ మనకు సంకోచింపఁగా నేటికిన్? (889) పసులకుఁ గొండకు బ్రాహ్మణోత్తములకు¯ మఖము గావించుట మంచి బుద్ధి¯ యింద్రయాగంబున కేమేమి దెప్పింతు¯ రవి యెల్లఁ దెప్పింపుఁ డరసి మీరు¯ పాయసంబులు నపూపములు సైఁదపుఁబిండి¯ వంటలుఁ బప్పును వలయు నట్టి¯ ఫలశాకములు వండఁ బంపుఁడు; హోమంబు¯ జేయుడు; ధేనుదక్షిణల నిచ్చి (889.1) బహురసాన్నంబు పెట్టుఁడు బ్రాహ్మణులకు¯ నచలులై పూజ యొనరిపు డచలమునకు; ¯ నధమ చండాల శునక సంహతికిఁ దగిన¯ భక్ష్యములు పెట్టి కసవులు పసుల కిండు. (890) గంధాలంకరణాంబరావళులచేఁ గైచేసి యిష్టాన్నముల్¯ బంధుశ్రేణియు మీరలుం గుడిచి నా భాషారతిన్ వేడుకల్¯ సంధిల్లన్, గిరి గో ద్విజానల నమస్కారంబు గావింపుఁడీ; ¯ సంధిల్లున్ సకలేప్సితంబులును మీ జన్మంబు ధన్యం బగున్. " (891) అని మఱియు నిలింపపతి సొంపు దింపు తలంపున ని మ్మఖంబు తనకు సమ్మతం బని గోవిందుండు పలికిన నందాదులు మేలుమేలని తద్వచన ప్రకారంబునం బుణ్యాహవాచనంబులు చదివించి ధరణీసురులకు భోజనంబు లిడి పసులకుం గసవు లొసంగిరి; అప్పుడు.

పర్వత భంజనంబు

(892) సకలాభీరులు వీఁడె కృష్ణుఁ డన నైజంబైన రూపంబుతో¯ నకలంకస్థితి నుండి "శైల మిదె మీరర్చింప రం"డంచుఁ దా¯ నొక శైలాకృతిఁదాల్చి గోపకులతో నొండొండఁ బూజించి గో¯ పక దత్తాన్నము లాహరించె విభుఁ డా ప్రత్యక్ష శైలాకృతిన్. (893) "వినుఁ డీ శైలము కామరూపి; ఖలులన్ వేధించు; నాజ్యాన్నముల్¯ మన మొప్పింపఁగ నాహరించె; మనలన్ మన్నించెఁ; జిత్తంబులో¯ ననుకంపాతిశయంబు చేసె మనపై"నంచున్ సగోపాలుఁడై¯ వనజాక్షుండు నమస్కరించె గిరికిన్ వందారు మందారుఁడై. (894) ఇట్లు గోపకులు హరిసమేతులై గిరికిం బూజనోపహారంబులు సమర్పించి, గోధనంబులం బురస్కరించుకొని భూసురాశీర్వాద వచనంబులతో గిరికిం బ్రదక్షిణంబు చేసి, రా సమయంబున. (895) గుఱ్ఱముల పరువు మెచ్చని¯ నఱ్ఱల గట్టిన రథంబు నందప్రముఖుల్¯ గుఱ్ఱ ల యార్పులు చెలఁగఁగఁ¯ దొఱ్ఱలగమి వెంట నంటఁ దోలి రిలేశా! (896) పాటించి గానవిద్యా¯ పాటవమునఁ దేరు లెక్కి బహుతానములం¯ బాటలగంధులు కృష్ణుని¯ పాటలు పాడిరి విరోధిపాటనుఁ డనుచున్. (897) కుండ నిభాపీనంబులు¯ మండితవర్ణములు వివిధమహితాకృతులున్¯ నిండిన కడుపులుఁ గన్నుల¯ పండువులుగఁ బాఁడి కుఱ్ఱిపదువులు జరగెన్. (898) పొగరెక్కిన మూఁపురములు; ¯ దెగ గల వాలములు, శైల దేహంబులు, భూ¯ గగనములు నిండు ఱంకెలు¯ మిగుల మెఱయు వృషభగణము మెల్లన నడచెన్.

పాషాణ సలిల వర్షంబు

(899) ఇట్లు పర్వతప్రదక్షిణంబు చేసి గోపకులు మాధవసమేతులై మందకుం జని; రంత మహేంద్రుం డంతయు నెఱింగి మహాకోపంబునఁ బ్రళయ ప్రవర్తకంబు లగు సంవర్తకాది మేఘంబులం జీఱి యిట్లనియె. (900) "పెరుగుల్ నేతులు ద్రావి క్రొవ్వి, భువి నాభీరుల్ మదాభీరులై¯ గిరిసంఘాత కఠోరపత్రదళనక్రీడా సమారంభ దు¯ ర్భర దంభోళిధరుం బురందరు ననుం బాటించి పూజింప క¯ గ్గిరికిం బూజలు చేసి పోయి రిదిగో కృష్ణుండు ప్రేరేఁపఁగన్. (901) గురు దేవ హీను బాలుని¯ గిరిభూజ ప్రముఖ వాసుఁ గృష్ణు ననీశుం¯ బరిమాణశీల కుల గుణ¯ విరహితుఁ జేపట్టి యింద్రు విడిచిరి గొల్లల్. (902) విమల ఘనతరాత్మవిజ్ఞానవిద్యచే¯ నిగుడలేక యుడుప నిభము లగుచుఁ¯ గర్మమయములైన క్రతువుల భవ మహా¯ ర్ణవముఁ గడవఁ గోరినారు వీరు. (903) ఉద్యత్సంపద నమ్మి నందతన యోద్యోగంబునన్ వెఱ్ఱులై¯ మద్యాగంబు విసర్జనీయ మని రీ మర్త్యుల్ వడిన్ మీరు మీ¯ విద్యుద్వల్లులఁ గప్పి గర్జనములన్ వేధించి గోవుల్ జనుల్¯ సద్యోమృత్యువుఁ బొంద ఱాల్ గురియుఁడీ; శౌర్యం బవార్యంబుగన్. (904) మీవెంట వత్తు నే నై¯ రావణనాగంబు నెక్కి రయ మొప్పంగా¯ దేవగణంబులతోడను¯ గోవిందుని మంద లెల్లఁ గొందలపెట్టన్. " (905) అని యిట్లు పలికి జంభవైరి సంరంభంబున దంభోళి జళిపించి, బింకంబున శంకింపక, కిన్కతోడ సంకెలలు విప్పించిన, మహానిలప్రేరితంబులై చని, నందుని మందమీఁద నమోఘంబులైన మేఘంబులు మహౌఘంబులై పన్ని, ప్రచండగతిఁ జండమరీచి మండలంబుఁ గప్పి, దివినిండి, దిశ లావరించి, రోదోంతరాళంబు నిరంతర నీరంధ్ర నిబిడాంధకార బంధురంబుగ నిరోధించి, బలిభంజన ద్వితీయ పాదపల్లవభగ్నంబైన బ్రహ్మాండభాండంబు చిల్లుల జల్లించినఁ, దొరఁగు బహిస్సముద్ర సలిలనిర్ఝరంబుల వడుపున నెడతెగక తోరంబులైన నీరధారలం గురియుచు శిలల వర్షించుచు, బిడుగుల ఱువ్వుచు, మిఱ్ఱుపల్లంబులు సమతలంబులై, యేకార్ణవంబు రూపున చూపిన, నందు దుడు కడఁచుచు వీచుచు, విలయశిఖి శిఖాసంరంభ విజృంభమాణ విద్యుల్లతా విలోకనంబుల మిఱుమిట్లుగొని, సొమ్మసిలంబోవు లేగలును, లేఁగలకు మూతు లడ్డంబులిడి ప్రళయభైరవ భేరీభాంకార భీషణంబు లగు గర్జనఘోషణంబులఁ జెవుడుపడి చిందఱవందఱ లైన డెందంబులం గంది కుంది వ్రాలు ధేనువులును, ధేనువుల వెనుక నిడుకొని దురంత కల్పాంత కాలకేళీ కీలి కరాళ కాలకంఠ కర విశాల గదా ఘాత ప్రభూతంబు లైన నిర్ఘాతపాతంబులకు భీతంబులై హరికి మ్రొక్కి, రక్షరక్షేతి శబ్దంబులు చేయు కైవడి విడువని జడింబడి, సైరింపక శిరంబులు వంచుకొని, గద్గదకంఠంబుల నంభారవంబులు చేయు వృషభంబులును, వృషభాది గోరక్షణంబు చేయుచు దుర్వారఘోర శిలా సారంబుల సారంబులు సెడి శరీరంబులు భారంబులైన మ్రానుపడు గోపకులును, గోపకులం బట్టుకొని దట్టంబైన వానగొట్టునం బెట్టుపడి బడుగు నడుములు నుసులుపడ వడవడ వడంకుచు గోవిందునిం జీరు గోపికలును, గోపికాజన కఠిన కుచ కలశ యుగళంబుల మఱుంగునం దలలు పెట్టుకొని పరవశులైన శిశువులునుం గలిగి, మహాఘోషంబుతోడ నష్టంబైన ఘోషంబుఁ జూచి ప్రబుద్ధులైన గోపవృద్ధులు కొందఱు దీనజనరక్షకుండైన పుండరీకాక్షునకు మ్రొక్కి యిట్లనిరి. (906) "అక్కట! వానఁ దోగి వ్రజ మాకుల మయ్యెఁ గదయ్య! కృష్ణ! నీ¯ వెక్కడనుంటి? వింత తడవేల సహించితి? నీ పదాబ్జముల్¯ దిక్కుగ నున్న గోపకులు దీనత నొంద భయాపహారివై¯ గ్రక్కునఁ గావ కిట్లునికి కారుణికోత్తమ! నీకుఁ బాడియే? (907) ఈ యుఱుములు నీ మెఱుములు¯ నీ యశనీఘోషణములు నీ జలధారల్¯ నీ యాన తొల్లి యెఱుఁగము¯ కూయాలింపం గదయ్య! గుణరత్ననిధీ! (908) వారి బరు వయ్యె మందల¯ వారికి; నిదె పరులు లేరు వారింపంగా; ¯ వారిద పటల భయంబును¯ వారిరుహదళాక్ష! నేడు వారింపఁగదే. " (909) అనిన విని సర్వజ్ఞుండైన కృష్ణుం డంతయు నెఱింగి. (910) తన్నొక యింతగైకొనరు; తప్పిరి; యాగము చేసి రంచుఁ దా¯ మిన్నుననుండి గోపకులమీఁద శిలల్ గురియించుచున్న వాఁ¯ డున్నత నిర్జరేంద్ర విభవోద్ధతి గర్వనగాధిరూఢుడై¯ కన్నులఁ గానఁ డింద్రుఁ డిటు; గర్వపరుం డొరుఁ గాన నేర్చునే? (911) దేవత లందఱు నన్నునె¯ సేవింతురు; రాజ్యమదముఁ జెందరు; చెఱుపం¯ గా వలదు; మానభంగముఁ¯ గావింపఁగ వలయు శాంతి గలిగెడుకొఱకై." (912) అని చింతించి శిలావర్షహతులై శరణాగతులైన ఘోషజనుల రక్షించుట తగవని, సకలలోక రక్షకుండైన విచక్షణుండు. (913) "కలఁగకుఁడీ వధూజనులు; కంపము నొందకుఁడీ వ్రజేశ్వరుల్; ¯ తలఁగకుఁడీ కుమారకులు; తక్కినవారలు ఱాలవానచే¯ నలయకుఁడీ; పశువ్రజము నక్కడ నక్కడ నిల్వనీకుఁడీ; ¯ మెలుపున మీకు నీశ్వరుఁడు మేలొసఁగుం గరుణార్ద్రచిత్తుఁడై."

గోవర్ధనగిరి నెత్తుట

(914) అని పలికి. (915) కిరి యై ధర యెత్తిన హరి¯ కరి సరసిజముకుళ మెత్తుగతిఁ ద్రిభువన శం¯ కరకరుఁడై గోవర్థన¯ గిరి నెత్తెం జక్క నొక్క కేలన్ లీలన్. (916) దండిని బ్రహ్మాండంబులు¯ చెండుల క్రియఁ బట్టి యెగురఁ జిమ్మెడు హరికిన్¯ గొండఁ బెకలించి యెత్తుట¯ కొండొకపని గాక యొక్క కొండా తలఁపన్? (917) ఇట్లు గిరి యెత్తి. (918) బాలుం డాడుచు నాతపత్ర మని సంభావించి పూగుత్తి కెం¯ గేలం దాల్చిన లీల లేనగవుతోఁ గృష్ణుండు దా నమ్మహా¯ శైలంబున్ వలకేలఁ దాల్చి విపులచ్ఛత్రంబుగాఁ బట్టె నా¯ భీలాభ్రచ్యుత దుశ్శిలాచకిత గోపీగోపగోపంక్తికిన్. (919) ఇట్లు గోత్రంబు ఛత్రంబుగాఁ బట్టి గోపజనులకు గోపాలశేఖరుం డిట్లనియె. (920) "రా తల్లి! రమ్ము తండ్రీ! ¯ వ్రేతలు గోపకులు రండు; వినుఁ; డీ గర్త¯ క్ష్మాతలమున నుండుఁడు గో¯ వ్రాతముతో మీరు మీకు వలసిన యెడలన్. (921) బాలుం డీతఁడు; కొండ దొడ్డది; మహాభారంబు సైరింపఁగాఁ¯ జాలండో; యని దీని క్రింద నిలువన్ శంకింపఁగా బోల; దీ¯ శైలాంభోనిధి జంతు సంయుత ధరాచక్రంబు పైఁబడ్డ నా¯ కే లల్లాడదు; బంధులార! నిలుఁ డీ క్రిందం బ్రమోదంబునన్. " (922) ఇట్లు పలుకుచున్న హరిపలుకులు విని నెమ్మనమ్ముల నమ్మి కొండ యడుగున తమతమ యిమ్ములం బుత్ర మిత్ర కళత్రాది సమేతులై గోవులుం దారును గోపజనులు జనార్దన కరుణావలోక నామృతవర్షంబున నాఁకలి దప్పుల చొప్పెఱుంగక కృష్ణకథా వినోదంబుల నుండి; రివ్విధంబున. (923) హరిదోర్దండము గామ, గుబ్బశిఖరం, బాలంబి ముక్తావళుల్¯ పరఁగం జారెడు తోయబిందువులు, గోపాలాంగ నాపాంగ హా¯ సరుచుల్ రత్నచయంబు గాఁగ, నచలచ్ఛత్రంబు శోభిల్లెఁ ద¯ ద్గిరిభిద్దుర్మదభంజి యై జలధరాఖిన్న ప్రజారంజి యై. (924) రాజీవాక్షునిచే నొక¯ రాజీవముభంగి శైలరాజము మెఱసెన్; ¯ రాజేంద్ర! మీఁద మధుకర¯ రాజి క్రియన్ మేఘరాజి రాజిల్లెఁ గడున్. (925) వడిగొని బలరిపు పనుపున¯ నుడుగక జడి గురిసె నే డహోరాత్రము; ల¯ య్యెడ గోపజనులు బ్రతికిరి¯ జడిఁ దడియక కొండగొడుగు చాటున నధిపా! (926) ఇట్లు హరి యే డహోరాత్రంబులు గిరి ధరించిన గిరిభేది విసిగి వేసరి కృష్ణు చరితంబులు విని వెఱఁగుపడి విఫలమనోరథుండై మేఘంబుల మరలించుకొని చనియె నంత నభోమండలంబు విద్యోతమాన ఖద్యోతమండలం బగుట విని గోవర్థనధరుండు గోపాలకుల కిట్లనియె. (927) "ఉడిగెను వానయు గాలియు¯ వడిచెడి నదులెల్లఁ బొలుప వఱద లిగిరెఁ; గొం¯ డడుగున నుండక వెడలుఁడు¯ కొడుకులుఁ గోడండ్రు సతులు గోవులు మీరున్. " (928) అనిన విని సకల గోపజనులు శకటాద్యుపకరణ సమేతులై గోవులుం దారును గొండ యడుగు విడిచివచ్చి రచ్యుతుండును జెచ్చెరఁ దొల్లింటి యట్ల నిజస్థానంబున గిరినిలిపె; నంత వల్లవులెల్లం గృష్ణునిఁ గౌగలించుకొని సముచిత ప్రకారంబుల సంభావించి దీవించిరి; గోపికలు సేసలిడి, దధ్యన్నకబళంబు లొసంగుచు నాశీర్వదించిరి; నంద బలభద్ర రోహిణీ యశోద లాలింగనంబుజేసి భద్రవాక్యంబులు పలికిరి; సిద్ధసాధ్యగంధర్వవరులు విరులుగురియించిరి సురలు శంఖ దుందుభులు మ్రోయించిరి; తుంబురు ప్రముఖులయిన గంధర్వులు పాడి; రప్పుడు. (929) వల్లవకాంతలు దన కథ¯ లెల్లను బాడంగ నీరజేక్షణుఁ డంతన్¯ వల్లవబలసంయుతుఁడై¯ యల్లన గోష్ఠంబుఁ జేరె నవనీనాథా!

గోపకులు నందునికి జెప్పుట

(930) అ య్యవసరంబునఁ గృష్ణు చరిత్రంబులు తలంచి వెఱఁగుపడి గోపజనులు నందున కిట్లనిరి. (931) "కన్నులు దెఱవని కడుచిన్ని పాపఁడై¯ దానవిఁ జనుఁబాలు ద్రాగి చంపె; ¯ మూడవ నెలనాఁడు ముద్దుల బాలుఁడై¯ కోపించి శకటంబుఁ గూలఁ దన్నె; ¯ నేఁడాది కుఱ్ఱఁడై యెగసి తృణావర్తు¯ మెడఁ బట్టుకొని కూల్చి మృతునిఁ జేసెఁ; ¯ దల్లి వెన్నలకునై తను ఱోలఁ గట్టినఁ¯ గొమరుఁడై మద్దులు గూల నీడ్చెఁ; (931.1) బసుల క్రేపులఁ గాచుచు బకునిఁ జీరె; ¯ వెలఁగతో వత్సదైత్యుని వ్రేసి గెడపె; ¯ సబలుఁడై ఖరదైత్యుని సంహరించె; ¯ నితఁడు కేవల మనుజుఁడే యెంచిచూడ! (932) తెంపరి యై రామునిచేఁ¯ జంపించెఁ బ్రలంబు; మ్రింగెఁ జటుల దవాగ్నిన్; ¯ సొంపు చెడఁ ద్రొక్కి కాళియుఁ ¯ ద్రుంపక కాళింది వెడలఁ దోలెన్ లీలన్. (933) ఏడేండ్ల బాలుఁ డెక్కడ? ¯ క్రీడం గరి తమ్మి యెత్తు క్రియ నందఱముం¯ జూడ గిరి యెత్తు టెక్కడ? ¯ వేడుక నొక కేల నేడు వెఱఁగౌఁ గాదే. (934) ఓ! నంద! గోపవల్లభ! ¯ నీ నందనుఁ డాచరించు నేర్పరితనముల్¯ మానవులకు శక్యంబులె? ¯ మానవమాతృండె? నీ కుమారుఁడు తండ్రీ!" (935) అనిన విని నందుండు వారలం జూచి మున్ను తనకు గర్గమహాముని చెప్పిన సంకేతంబు తెలిపి “శంకలేదు; కృష్ణుండు లోకరక్షకుండైన పుండరీకాక్షుని నిజాంశంబనుచు నంతరంగంబునం జింతింతు” నని పలికిన వెఱఁగుపడి గోపకులు కృష్ణుం డనంతుండని పూజించి; రంత.

ఇంద్రుడు పొగడుట

(936) హరి కేలన్ గిరి యెత్తి వర్షజలఖిన్నాభీర గోరాజికిన్¯ శరణంబైనఁ ద్రిలోక రాజ్యమదముం జాలించి నిర్గర్వుఁడై¯ సురభిం గూడి బలారివచ్చి కనియెన్ సొంపేది దుష్టప్రజే¯ శ్వరదుర్మాన నిరాకరిష్ణు కరుణావర్ధిష్ణు శ్రీకృష్ణునిన్. (937) కని యింద్రుఁడు పూజించెను¯ దినకరనిభ నిజకిరీట దీధితిచేతన్¯ ముని హృదలంకరణంబులు¯ సునతోద్ధరణములు నందసుతు చరణంబుల్. (938) ఇట్లు నమస్కరించి కరకమలంబులు ముకుళించి హరికి హరిహయుం డిట్లనియె. (939) "పరమ! నీ ధామంబు భాసుర సత్వంబు¯ శాంతంబు; హత రజస్తమము; నిత్య¯ మధిక తపోమయ; మట్లు గావున మాయ¯ నెగడెడి గుణములు నీకు లేవు¯ గుణహీనుఁడవు గాన గుణముల నయ్యెడి¯ లోభాదికములు నీలోనఁ జేర¯ వైన దుర్జననిగ్రహము శిష్టరక్షయుఁ¯ దగిలి సేయఁగ దండధారి వగుచు (939.1) జగముభర్తవు; గురుడవు; జనకుఁడవును¯ జగదధీశుల మను మూఢజనులు దలఁక¯ నిచ్చ పుట్టిన రూపంబు లీవు దాల్చి¯ హితము జేయుదు గాదె లోకేశ్వరేశ! (940) నావంటి వెఱ్ఱివారిని ¯ శ్రీవల్లభ! నీవు శాస్తి చేసితివేనిం¯ గావరము మాని పెద్దల ¯ త్రోవన్ జరుగుదురు బుద్ధితోడుత నీశా! (941) ఒక్కొక లోకముఁ గాచుచు¯ నెక్కుడు గర్వమున "నేమె యీశుల"మనుచుం¯ జొక్కి ననుబోటి వెఱ్ఱులు¯ నిక్కము నీ మహిమ దెలియనేర రనంతా! (942) వాసుదేవ! కృష్ణ! వరద! స్వతంత్ర! వి¯ జ్ఞానమయ! మహాత్మ! సర్వపుణ్య¯ పురుష! నిఖిలబీజభూతాత్మకబ్రహ్మ! ¯ నీకు వందనంబు నిష్కళంక! (943) నీ సామర్థ్య మెఱుంగ మేఘములచే నీ ఘోషమున్ భీషణో¯ గ్రాసారంబున ముంచితిన్ మఖము నాకై వల్లవుల్ చేయ రం¯ చో సర్వేశ! భవన్మహత్త్వమున నా యుద్యోగ మిట్లయ్యె; నీ¯ దాసున్ నన్నుఁ గృతాపరాధుఁ గరుణన్ దర్శింపవే మాధవా! (944) నిను బ్రహ్మాదు లెఱుంగలేరు; జడతానిష్ఠుండ లోకత్రయా¯ వన దుర్మాన గరిష్ఠుఁడన్; విపులదుర్వైదుష్య భూయిష్ఠుఁడన్; ¯ వినయ త్యాగ కనిష్ఠుడం; గుజనగర్వి శ్రేష్ఠుఁడన్; దేవ! నీ¯ ఘనలీలా విభవంబు పెంపుఁ దెలియంగా నెవ్వఁడన్? సర్వగా!" (945) అనిన విని నగుచు జలధరగంభీర రవంబున శక్రునకుం జక్రి యిట్లనియె. (946) "అమరాధీశ్వర! లక్ష్మితోఁ దగిలి యిట్లంధుండవై యున్న నీ¯ సమదోద్రేకముఁ ద్రుంచివైచుటకు నీ జన్నంబుఁ దప్పించితిం¯ బ్రమదశ్రీరత దండధారి నగు నన్ భావింపఁ; రెవ్వాని ని¯ క్కము రక్షింపఁ దలంతు వాని నధనుం గావింతు జంభాంతకా! (947) నా యాజ్ఞ సేయుచుండుము¯ నీ యధికారంబునందు నిలువు; సురేంద్రా! ¯ శ్రీయుతుఁడవై మదింపకు ¯ శ్రేయంబులు గల్గుఁ; బొమ్ము సితకరిగమనా!"

కామధేనువు పొగడుట

(948) అని యిట్లు జిష్ణునిం బలుకుచున్న కృష్ణునికి మ్రొక్కి గోగణసమేత యయిన కామధేనువు భక్తజనకామధేనువైన యీశ్వరున కిట్లనియె. (949) "విశ్వేశ! విశ్వభావన! ¯ విశ్వాకృతి! యోగివంద్య! విను నీచేతన్¯ శాశ్వతుల మైతి మిప్పుడు¯ శాశ్వతముగఁ గంటి మధిక సౌఖ్యంబు హరీ! (950) దేవా! మాకుం బరమదైవంబ; వింద్రుండవు; భూసుర గో సురసాధు సౌఖ్యంబుల కొఱకు నిన్నింద్రునిం జేసి పట్టంబు గట్టుమని విరించి నియమించి పుత్తెంచె నీవు భూతల భూరిభార నివారణంబు సేయ నవతరించిన హరి” వని పలికి; యంత. (951) సురభిక్షీరములన్ సురద్విప మహాశుండా లతానీత ని¯ ర్జరగంగాంబువులన్ నిలింపజననీ సన్మౌనిసంఘంబుతో¯ సురనాథుం డభిషిక్తుఁ జేసి పలికెన్ సొంపార "గోవిందుఁ" డం¯ చు రణాక్రాంతవిపక్షుఁ దోయజదళాక్షున్ సాధుసంరక్షణున్! (952) తుంబురు నారదాదులు సిద్ధచారణ¯ గంధర్వులును హరికథలు పాడి¯ రమరకాంతలు మింట నాడిరి వేల్పులు¯ కురియించి రంచిత కుసుమవృష్టి¯ జగములు మూఁడును సంతోషమును బొందెఁ¯ గుఱ్ఱుల చన్నులం గురిసెఁ బాలు¯ నవజలంబులతోడ నదులెల్లఁ బ్రవహించె¯ నిఖిల వృక్షములు దేనియలు వడిసె (952.1) సర్వలతికల ఫల పుష్ప చయము లమరెఁ¯ బర్వతంబులు మణిగణప్రభల నొప్పెఁ ¯ బ్రాణులకునెల్ల తమలోని పగలుమానె¯ వాసుదేవుని యభిషేక వాసరమున. (953) ఇట్లు "గోప గోగణ పతిత్వంబునకు గోవిందు నభిషిక్తుంజేసి" వీడ్కొని పురందరుండు, దేవగణంబులతో దివంబున కరిగె; నంత.

వరుణునినుండి తండ్రి దెచ్చుట

(954) నందుఁ డేకాదశినాఁ డుపవాసంబు¯ చేసి శ్రీహరిఁబూజ చేసి దనుజ¯ వేళ యెఱుంగక వేగక ముందర¯ ద్వాదశీస్నానంబుఁ దగ నొనర్ప¯ యమునాజలము చొర నందొక్క దైత్యుండు¯ నందుని వరుణుని నగరమునకుఁ¯ గొనిపోవఁ దక్కిన గోపకు లందఱు¯ నందగోపకునిఁ గానక కలంగి (954.1) రామకృష్ణులఁ బేర్కొని రవము సేయఁ¯ గృష్ణుఁ డీశుండు తమ తండ్రిఁ గికురుపెట్టి¯ వరుణభృత్యుండు గొనిపోయి వరుణుఁ జేర్చు¯ టెఱిఁగి రయమున నచ్చోటి కేఁగె నధిప! (955) అప్పుడు. (956) వచ్చిన మాధవుఁ గనుఁగొని¯ చెచ్చెర వరుణుండు పూజ చేసి వినతుఁడై¯ యచ్చుగ నిట్లని పలికెను¯ "విచ్చేసితి దేవ! నా నివేశంబునకున్, (957) ఏ విభు పాదపద్మరతు లెన్నఁడు నెవ్వరుఁ బొందలేని పెం¯ ద్రోవఁ జరింతు రట్టి బుధతోషక! నీ వరుదెంచుటం బ్రమో¯ దావృత మయ్యెఁ జిత్తము కృతార్థత నొందె మనోరథంబు నీ¯ సేవఁ బవిత్రభావమునుఁ జెందె శరీరము నేఁడు మాధవా! (958) ఏ పరమేశ్వరున్ జగములిన్నిటిఁ గప్పిన మాయ గప్పఁగా¯ నోపక పారతంత్ర్యమున నుండు మహాత్మక! యట్టి నీకు ను¯ ద్దీపిత భద్రమూర్తికి సుధీజన రక్షణవర్తికిం దనూ¯ తాపము వాయ మ్రొక్కెద నుదార తపోధన చక్రవర్తికిన్. (959) ఎఱుఁగఁడు వీఁడు నా భటుఁ డొకించుక యైన మనంబులోపలం¯ దెఱకువ లేక నీ జనకుఁదెచ్చె; దయం గొనిపొమ్ము; ద్రోహమున్¯ మఱవుము; నన్ను నీ భటుని మన్నన చేయుము; నీదు సైరణన్¯ వఱలుదుఁ గాదె యో! జనకవత్సల! నిర్మల! భక్తవత్సలా! " (960) అని ఇట్లు పలుకుచున్న వరుణునిం గరుణించి, తండ్రిం దోడ్కొని హరి తిరిగివచ్చె; నంత నందుండు తన్ను వెన్నుండు వరుణ నగరంబున నుండి విడిపించి తెచ్చిన వృత్తాంత బంతయు బంధువుల కెఱింగించిన వారలు కృష్ణుం డీశ్వరుండని తలంచి; రఖిలదర్శనుం డయిన యీశ్వరుండును వారల తలంపెఱింగి వారి కోరిక సఫలంబు చేయుదునని వారి నందఱ బ్రహ్మహ్రదంబున ముంచి యెత్తి. (961) ప్రకృతిఁ గామకర్మ పరవశమై యుచ్చ¯ నీచగతులఁ బొంది నెఱయ భ్రమసి¯ తిరుగుచున్న జనము తెలియనేరదు నిజ¯ గతివిశేష మీ జగంబు నందు. (962) అని చింతించి దయాళుఁడైన హరి మాయాదూరమై, జ్యోతియై, ¯ యనిరూప్యంబయి, సత్యమై, యెఱుకయై, యానందమై, బ్రహ్మమై, ¯ యనఘాత్ముల్ గుణనాశమందుఁ గను నిత్యాత్మీయ లోకంబు గ్ర¯ క్కునఁ జూపెం గరుణార్ద్రచిత్తుఁ డగుచున్ గోపాలకశ్రేణికిన్. (963) ఇట్లు హరి ము న్నక్రూరుండు పొందిన లోకమంతయుం జూపి, బ్రహ్మలోకంబునుం జూపినం జూచి, నందాదులు పరమానందంబునుం బొంది వెఱఁగుపడి హంసస్వరూపకుండైన, కృష్ణునిం బొడగని పొగడి పూజించి; రంత.

శరద్రాత్రి గోపికలు జేరవచ్చుట

(964) కలువలమేలికందువలు, కాముని కయ్యపు నేలలున్, విర¯ క్తులు దలడించువేళలు, చకోరక పంక్తుల భోగకాలముల్, ¯ చెలువలు సైరణల్ విడిచి చిక్కు తఱుల్, ఘనచంద్ర చంద్రికా¯ జ్వలిత దిశల్, శరన్నిశలు, జారక దుర్దశ లయ్యె నయ్యెడన్. (965) కామతంత్రటీక, కలువల జోక, కం¯ దర్పు డాక, విటులతాల్మి పోక, ¯ చకిత చక్రవాక, సంప్రీత జనలోక, ¯ రాక వచ్చె మేలురాక యగుచు. (966) పతి తన కరముల కుంకుమ¯ సతి మొగమున నలఁదుభంగి సముదయ వేళాం¯ చిత కరరాగమున నిశా¯ పతి రంజించెన్ నరేంద్ర! ప్రాక్సతి మొగమున్. (967) విటసేనపై దండువెడలెడు వలఱేని¯ గొల్లెనపై హేమకుంభ మనఁగఁ¯ గాముకధృతి వల్లికలు ద్రెంపనెత్తిన¯ శంబరాంతకు చేతి చక్ర మనఁగ¯ మారుండు పాంథుల మానాటవుల గాల్పఁ¯ గూర్చిన నిప్పుల కుప్ప యనఁగ¯ విరహిమృగమ్ముల వేటాడ మదనుండు¯ దెచ్చిన మోహన దీమ మనఁగ (967.1) వింతనునుపు గల్గి వృత్తమై యరుణమై¯ కాంతితోఁ జకోరగణము లుబ్బఁ¯ బొడుపుకొండ చక్కిఁ బొడిచె రాకాచంద్ర¯ మండలంబు గగనమండలమున. (968) ఇట్లు పొడమిన నవకుంకుమాంకిత రమా ముఖమండలంబునుం బోలె నఖండంబైన చంద్రమండలంబుం పొడగని పుండరీకనయనుండు యమునాతట వనంబున జగన్మోహనంబుగ నొక్క గీతంబు పాడిన విని, తదాయత్తచిత్తలై తత్తఱంబున వ్రేత లే పనులకుం జేతు లాడకయు, గోవులకుం గ్రేపుల విడువకయు విడిచి విడిచి యీడకయు నీడి యీడియు, నీడినపాలు కాఁపకయుఁ గాఁచి కాఁచియుఁ, గాఁగిన పాలు డింపకయు డించి డించియు, డించినపాలు బాలురకుఁ బోయకయుఁ బోసి పోసియుఁ, బతులకుఁ బరిచర్యలు చేయకయుఁ జేసి చేసియు, నశనంబులు గుడువకయుఁ గుడిచి కుడిచియుఁ, గుసుమంబులు ముడువకయు ముడిచి ముడిచియుఁ, దొడవులు దొడగకయు దొడిగి తొడిగియు, గోష్ఠంబుల పట్టుల నుండకయుఁ, బాయసంబులు నెఱయ వండకయు, నయ్యైయెడల నిలువం బడకయుఁ, గాటుకలు సూటినిడకయుఁ, గురులు చక్కనొత్తకయుఁ, గుచంబుల గంధంబులు కలయ మెత్తకయుఁ, బయ్యెదలు విప్పి కప్పకయు, సఖులకుం జెప్పకయు, సహోదరులు మగలు మామలు మఱందులు బిడ్డలు నడ్డంబుచని నివారింపం దలారింపక సంచలించి, పంచభల్లుని భల్లంబుల మొల్లంపు జల్లుల పెల్లునం దల్లడిల్లి డిల్లపడి, మొగిళ్ళగమి వెలువడి; యుల్లసిల్లు తటిల్లతల పొందున మందగమన లమందగమనంబుల మంద వెలువడి గోవింద సందర్శనంబునకుం జని; రప్పుడు. (969) తరుణుల్ గొందఱు మూలగేహముల నుద్దండించి రారాక త¯ ద్విరహాగ్నిం బరితాప మొందుచు మనోవీధిన్ విభున్ మాధవుం¯ బరిరంభంబులు చేసి జారుఁ డనుచున్ భావించియుం జొక్కి పొం¯ దిరి ముక్తిన్ గుణదేహముల్ విడిచి ప్రీతిన్ బంధనిర్ముక్తలై. " (970) అనిన నరేంద్రుం డిట్లనియె. (971) "జారుఁడని కాని కృష్ణుఁడు¯ భూరిపరబ్రహ్మ మనియు బుద్ధిఁ దలంపన్¯ నేరరు; గుణమయదేహము¯ లే రీతిన్ విడిచి రింతు? లెఱిఁగింపు శుకా!” (972) అనిన శుకుం డిట్లనియె. (973) “మును నేఁ జెప్పితిఁ జక్రికిం బగతుఁడై మూఢుండు చైద్యుండు పెం¯ పునఁ గైవల్యపదంబు నొందెఁ; బ్రియలై పొందంగ రాకున్నదే? ¯ యనఘుం డవ్యయుఁ డప్రమేయుఁ డగుణుం డైనట్టి గోవిందమూ¯ ర్తి నరశ్రేణికి ముక్తిదాయిని సుమీ! తెల్లంబు భూవల్లభా! (974) భాంధవమున నైనఁ బగనైన వగనైనఁ ¯ బ్రీతినైనఁ బ్రాణభీతినైన¯ భక్తినైన హరికిఁ బరతంత్రులై యుండు¯ జనులు మోక్షమునకుఁ జనుదు రధిప! (975) అటు గావునఁ బరమపురుషుండును, నజుండును, యోగీశ్వరేశ్వరుండును నైన హరిని సోకిఁన స్థావరం బైన ముక్తం బగు; వెఱఁగుపడ వలవ, ది వ్విధంబున.

గోపికలకు నీతులు చెప్పుట

(976) ఘన మధుర గీత నినదము¯ విని వచ్చిన గోపికలను వీక్షించి నయం¯ బున మేటి సుగుణి నేర్పరి¯ తన వాగ్వైభవము మెఱయఁ దగ నిట్లనియెన్. (977) "మేలా మీకు? భయంబు పుట్టదుగదా మీ మందకున్? సింహశా¯ ర్దూలానేకప ముఖ్యముల్ దిరిగెడిన్ దూరంబు లేతెంతురే? ¯ యేలా వచ్చితి? రీ నిశా సమయమం దిచ్చోట వర్తింతురే? ¯ చాలుంజాలు లతాంగులార! చనుఁడీ సంప్రీతితో మందకున్. (978) మీరేతెంచిన జాడఁ గానక వగన్ మీ తల్లులుం దండ్రులున్¯ మీ రాముల్ మఱదుల్ తనూజులు గురుల్ మీసోదరుల్ బంధువుల్¯ "మేరల్ మీఱిరి లేరు పోయి"రనుచున్ మీ ఘోష భూభాగమం¯ దేరీతిం బరికించిరో తగవులే యీ సాహసోద్యోగముల్? (979) ఇలువడి సున్నఁజేసి, హృదయేశుల సిగ్గులు పుచ్చి, యత్తమా¯ మల నెరియించి, సోదరులమానము సూఱలు పుచ్చి, తల్లిదం¯ డ్రుల రుచిమాన్చి, బంధులకు రోఁత యొనర్చుచు జారవాంఛలన్¯ వలనఱి సత్కులాంగనలు వత్తురె? లోకులు సూచి మెత్తురే? (980) ప్రాణేశుఁ డెఱిఁగినఁ బ్రాణంబునకుఁ దెగు¯ దండించు నెఱిఁగిన ధరణివిభుఁడు¯ మామ యెఱింగిన మనువెల్లఁ జెడిపోవుఁ¯ దలవరి యెఱిఁగినఁ దగులు సేయు¯ దలిదండ్రు లెఱిఁగినఁ దలలెత్తకుండుదు¯ రేరా లెఱింగిన నెత్తిపొడుచు¯ నాత్మజు లెఱిఁగిన నాదరింపరు చూచి¯ బంధువు లెఱిఁగిన బహి యొనర్తు (980.1) రితరు లెఱిఁగిరేని నెంతయుఁ జుల్కఁగాఁ¯ జూతు; రిందు నందు సుఖము లేదు; ¯ యశము లేదు నిర్భయానందమును లేదు¯ జారుఁ జేరఁ జనదు చారుముఖకి. (981) నడవడి కొఱ గాకున్నను¯ బడుగైనఁ గురూపియైనఁ బామరుఁ డైనన్¯ జడుడైన రోగియైనను¯ విడుచుట మర్యాద గాదు విభు నంగనకున్. (982) ఇది యమునానదీజల సమేధిత పాదప పల్లవ ప్రసూ¯ న దళవిరాజితం బగు వనంబు; మనంబుల మేర దప్పెనో? ¯ పొదిఁగిట నేడ్చు బిడ్డలకుఁ బోయుఁడు పాలు; విడుండు లేఁగలన్¯ మొదవులకున్; నిజేశ్వరుల ముద్దియలార! భజింపుఁ డొప్పుగన్. (983) వనితలు! నన్నుఁ గోరి యిట వచ్చితి, రింతఁ గొఱంత లేదు మే¯ లొనరె; సమస్త జంతువులు నోలిఁ బ్రియంబులుగావె? నాకు నై¯ నను నిలువంగఁ బోలదు, సనాతన ధర్మము లాఁడువారికిం¯ బెనిమిటులన్ భజించుటలు పెద్దలు చెప్పుచు నుందు రెల్లెడన్. (984) ధ్యానాకర్ణన దర్శన ¯ గానంబుల నా తలంపు గలిగినఁ జాలుం¯ బూనెదరు కృతార్థత్వము¯ మానవతుల్! చనుఁడు మరలి మందిరములకున్." (985) అనిన విని.

గోపికల దీనాలాపములు

(986) విరహాగ్ని శిఖలతో వెడలు నిట్టూర్పుల¯ ముమ్మరంబులఁ గంది మోము లెండఁ¯ గన్నుల వెడలెడి కజ్జలధారలు¯ కుచకుంకుమంబులు గ్రుచ్చిపాఱఁ¯ జెక్కులఁ జేర్చిన చేతుల వేఁడిమి¯ మోముఁదమ్ముల మేలి మురువు డిందఁ¯ బొరిఁ బొరిఁ బుంఖానుపుంఖంబులై తాఁకు¯ మదను కోలల ధైర్యమహిమ లెడల (986.1) దుఃఖభరమున మాటలు దొట్రుపడఁగఁ ¯ బ్రియము లాడని ప్రియుఁ జూచి బెగ్గడిల్లి¯ చరణముల నేల వ్రాయుచు సంభ్రమమునఁ¯ గాంత లెల్లను వగల నాక్రాంత లగుచు. (987) ఇట్లనిరి. (988) "అకటా! నమ్మితి మేము; క్రూరుఁడన ని న్నర్హంబె; మా యిండ్లలో¯ సకలవ్యాప్తుల డించి నీ పదసరోజాతంబు లర్చింపఁ జి¯ క్కక యేతెంచితి, మీశుఁ; డాఢ్యుఁడవు; మోక్షాసక్తులం గాచు పో¯ లికఁ గావందగు గావవే? విడువ మేలే కాంతలన్ భ్రాంతలన్. (989) పతులన్ బిడ్డల బంధులన్ సతులకుం బాటించుటే ధర్మప¯ ద్ధతి యౌ నంటివి; దేహధారిణులకున్ ధర్మజ్ఞ! చింతింపుమా; ¯ పతి పుత్రాదిక నామమూర్తి వగుచున్ భాసిల్లు నీ యందుఁ ద¯ త్పతి పుత్రాదిక వాంఛలన్ సలిపి సంభావించు టన్యాయమే? (990) నీ పయిన్ రతి చేయుచుందురు నేర్పరుల్; సతతప్రియో¯ ద్దీపకుండవు; గాన నెవ్వగ దెచ్చు నాథ సుతాదులం¯ జూప నేటికి? మన్మహాశలు చుట్టి నీకడ నుండఁగాఁ¯ బాప నేల? మదీయ తాపముఁ బాపఁ బోలు కృపానిథీ! (991) నీ పాదకమలంబు నెమ్మి డగ్గఱఁ గాని¯ తరలి పోవంగఁ బాదములు రావు; ¯ నీ కరాబ్జంబులు నెఱి నంటి తివఁ గాని¯ తక్కిన పనికి హస్తములు చొరవు; ¯ నీ వాగమృతధార నిండఁ గ్రోలనె గాని¯ చెవు లన్యభాషలఁ జేరి వినవు; ¯ నీ సుందరాకృతి నియతిఁ జూడఁగఁ గాని¯ చూడ వన్యంబులఁ జూడ్కి కవలు; (991.1) నిన్నెకాని పలుకనేరవు మా జిహ్వ; ¯ లొల్ల ననుచుఁ బలుకనోడ వీవు¯ మా మనంబు లెల్ల మరపించి దొంగిలి¯ తేమి చేయువార మింకఁ? గృష్ణ! (992) సిరికి నుదార చిహ్నములు చేయు భవచ్చరణారవిందముల్¯ సరసిజనేత్ర! మా తపము సంపదఁ జేరితి మెట్టకేలకున్¯ మరలఁగ లేము మా మగల మాటల నొల్లము; పద్మగంధముల్¯ మరగినతేఁటు లన్య కుసుమంబుల చెంతనుఁ జేరనేర్చునే? (993) సవతు లేక నీ విశాల వక్షఃస్థలిఁ¯ దొళసితోడఁ గూడఁ దోయజాక్ష! ¯ మనుపు మనుచు నెపుడు మాకాంత నీ పాద¯ కమలరజముఁ గోరుఁ గాదె కృష్ణ! (994) అత్తలు మామలున్ వగవ నాఱడి కోడక నాథులన్ శుగా¯ యత్తులఁ జేసి యిల్వరుస లాఱడి పోవఁగ నీదు నవ్వులన్¯ మెత్తని మాటలన్ మరుఁడుమేల్కొని యేఁచిన వచ్చినార మే¯ పొత్తుల నొల్లమో పురుషభూషణ! దాస్యము లిచ్చి కావవే. (995) మగువల్ చిక్కరె తొల్లి వల్లభులకున్? మన్నించి తద్వల్లభుల్¯ మగపంతంబు తలంపరే? తగులముల్ మా పాలనే పుట్టెనే? ¯ మగవారాడెడి మాటలే తగవు నీ మాటల్ మనోజాగ్నిచేఁ¯ బొగులం జాలము; కౌఁగలింపుము మముం బుణ్యంబు పుణ్యాత్మకా! (996) కుండలదీప్త గండమును గుంచితకుంతల ఫాలమున్ సుధా¯ మండిత పల్లవాధరము మంజులహాస విలోకనంబునై¯ యుండెడు నీ ముఖంబుఁ గని యుండఁగ వచ్చునె? మన్మథేక్షు కో¯ దండ విముక్త బాణముల దాసుల మయ్యెద; మాదరింపవే. (997) నీ యధరామృత నిర్ఝరంబులు నేడు¯ చేరి వాతెఱలపైఁ జిలుకకున్న¯ నీ విశాలాంతర నిర్మలవక్షంబుఁ¯ గుచకుట్మలంబులఁ గూర్పకున్న¯ నీ రమ్యతర హస్తనీరజాతంబులు¯ చికురబంధంబులఁ జేర్పకున్న¯ నీ కృపాలోకన నివహంబు మెల్లన¯ నెమ్మొగంబుల మీఁద నెఱపకున్న (997.1) నీ నవీన మాననీయ సల్లాపంబు¯ కర్ణరంధ్రదిశలఁ గప్పకున్న¯ నెట్లు బ్రతుకువార? మెందుఁ జేరెడువార? ¯ మధిప! వినఁగఁ దగదె యాఁడుకుయులు (998) భవదాలోకన హాస గీతజములై భాసిల్లు కామాగ్నులన్¯ భవదీయాధరపల్ల వామృతముచేఁ బాఁపం దగుం, బాఁపవే¯ ని వియోగానల హేతిసంహతులచే నీఱై, భవచ్చింతలన్¯ భవదంఘ్రిద్వయవీధిఁ బొందెదము నీ పాదంబులాన ప్రియా! (999) తరు మృగ ఖగ గో గణములు¯ కర మొప్పెడు నిన్నుఁ గన్నఁ గానము విన్నం¯ గరఁగి పులకించు, నబలలు¯ గరఁగరె నినుఁ గన్న నీదు గానము విన్నన్?