పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవత పారాయణ - 3 : దశమ పూర్వ 760 - 883

వర్షాగమ విహారంబు

(760) ఆ వర్షాగమమందు గోవుల నరణ్యాంతంబులన్ మేపుచున్¯ గోవిందుండు ప్రలంబవైరియుతుఁడై గోపాలవర్గంబుతోఁ¯ బ్రావీణ్యంబునఁ గందమూలఫలముల్ భక్షించుచున్ మంజుల¯ గ్రావాగ్రంబులఁ బ్రీతిఁ జల్దిగుడిచెం గాసారతీరంబులన్. (761) ఆ సమయంబున. (762) విశ్వమోహనమైన వేణు నినాదంబు¯ సరసగంభీర గర్జనముగాఁగ¯ మహనీయ నిర్మల మందహాసద్యుతి¯ లలిత సౌదామనీ లతిక గాఁగఁ¯ దలచుట్టు బాగుగఁ దనరు పింఛపుదండ¯ శైలభేదను శరాసనము గాఁగఁ¯ గరుణా కటాక్షవీక్షణ సుధావర్షంబు¯ సలిలధారా ప్రవర్షంబు గాఁగఁ (762.1) జాడ నేతెంచు గోపాలజన మునీంద్ర¯ చాతకంబుల దురవస్థఁ జక్కఁ జేసి¯ కృష్ణమేఘంబు బహుతరకీర్తి నొప్పె¯ విమల బృందావనాకాశవీధి యందు. (763) గోవుల వృషవత్సంబుల¯ వావిరిఁ బూజించి పిదప వర్షాకాల¯ శ్రీవనితనుఁ బూజించెను ¯ శ్రీవల్లభుఁ డయ్యు గోపశేఖరుఁ డధిపా!

శరదృతువర్ణనము

(764) ఇట్లు కృష్ణుండు విహితవిహారంబుల వర్షాకాలంబుఁ బుచ్చె; నంత. (765) జొంపములు గొనియె వనములు; ¯ రొంపు లిగిరె; నెమలిగముల రొద లుడిగె; నదుల్¯ పెంపులకుఁ బాసె; నుఱుముల¯ శంపల సంపదలు మానె శారదవేళన్. (766) మఱియు జీవనంబులు విడిచి, విమలజ్ఞానవశంబున ముక్తులగు పురుషరత్నంబులచెన్నునఁ జెన్ను వదలి, మిన్ను విడిచి, వాయువశంబులై, వెల్లివిరిసి చను మేఘంబులును, మేఘపటల రహితంబును, గలశభవముని సహితంబునునయి, విజ్ఞానదీప విలసితం బగు యోగిహృదయంబు చందంబున శుభం బైన నభంబును, నభంబున నీలదుకూల వితాన సంయుక్త ముక్తాఫలంబుల వడువున నెగడు నుడుగణంబులును, నుడుగణ మయూఖంబు క్రొవ్వు లువ్వెత్తుగఁ గొని నివ్వటిల్లుచు బ్రహ్మాండ కరండ కర్పూర ఖండాయమానంబు లగు చంద్రకిరణంబులును, జంద్రకిరణ సమ్మర్శనంబున సగర్భంబులై భూమికి దుర్భరంబు లగుచు నిండి పండి హాలిక కర నిశిత లవిత్ర ధారా సంరంభంబుఁ దలంచి తల్లడిల్లి వెలవెలకంబాఱుచుఁ దల్లియగు విశ్వంభరకు మునుకొని ప్రణతంబులై వడంకుచు నెఱుంగ మొఱయిడుచున్న పెంపున సంపన్నంబులైన యెన్నులవ్రేగున వ్రాలి గాలిం దూలుచు మర్మర ధ్వనుల సారస్యంబు లగు కలమాది సస్యంబులును సస్య మంజరీ పుంజంబులం గొంచక చంచువులఁ ద్రుంచి కబళించి పిల్లపెంటి తండంబులం గూడి కడుపులు నిండ మెక్కి విక్కవిరిసి చొక్కుచుఁ ద్రిక్కలుగొని మహోత్తుంగ సమంచిత మంచప్రదేశంబు లెక్కి సంచరించుచు వెన్నుల కావలియున్న యన్నుల కెమ్మోవులు బింబఫలంబు లని కఱచి తత్కరాస్ఫాలనంబుల నులికి పడి యెగసి చను శుకనికరంబుల కలకలంబులును, గలహంస కోక సారస కోలాహల మండితంబులై నిండిన నిర్మల జలంబులు గల జలాశయంబులును, జలాశయముల జలము లనుదినము నిగుర గృహములఁ బ్రతుకు దినములు చనుట యెఱుంగని మనుజుల గమనికం దిరుగు జలచరంబులును, జలచర హృదయముల బెగడుగదుర డొంకి యింకిన నదులును, నదులందుఁ గర్పూర మండపంబుల తెఱంగున, మణికుట్టిమంబుల మాడ్కిని సౌధసోపానమార్గంబుల జాడను, విలోకితంబులగు నూతన సైకతంబులును సైకత ప్రదేశంబుల నుదయ వేళల నిత్యకర్మానుష్ఠాన నిరతులగు మునులును, మునికన్యకాకర కలశ సలిలాభిషిక్తమూలంబులగు తపోవన బాలరసాల సాలంబులును, సాలవిటపి వాసంతికా కుంజపుంజంబుల తఱచున నిముడుకొని దినకర కిరణములకుం గరువలికిం జొర వెరవుపడని వనమ్ములును, వనమ్ములం దరులకొమ్మల నాకలమ్ములు నేకలమ్ములై మెసంగి మసరుకవిసి క్రొవ్వి కొమ్ముకొనల సూటి యేటిదరులు త్రవ్వి చిమ్మి కుమ్మి కోరాడెడు వనగజంబులును, గజకుంభ కనకకుంభ రుచిర కుచభార భీరుమధ్య సమంచిత లగు చెంచితలును, జెంచితల క్రూరమ్ము లగు వాలమ్ముల సారములుచెడి బెడిదంబుగఁ బాదంబులు దొట్రుపడఁ బెనుగాతమ్ములం బడు వరాహ పుండరీకంబులును, బుండరీక కుంద కుముద కురంటకాది కుసుమ మకరందంబులు గ్రోలి తేలి సోలి వాలి మహాహంకృతుల ఝంకృతులు జేయు తేఁటికదుపులును, గదుపులం గలయక యెదగలిగి మదమున నదనుపద నెఱింగి మదనమార్గణ ప్రేరితంబులై పెంటితుటుముల వెంటం జని యొండొంటి గెంటించుచుఁ దగుల నెక్కి గర్భంబులు నెక్కొలుపు మృగవృషభ రాజంబులును గలిగి రాజరాజ గృహంబు పగిది విలసిత కుంద పద్మ సౌభాగ్యం బై, భాగ్యహీను కర్మంబు రేఖ నశ్రుత నీలకంఠ శబ్దంబై, శబ్దశాస్త్రవేది హృదయంబు బాగున విశదప్రకాశాభిరామంబై, రామసంగ్రామంబు కైవడి బాణాసనాలంకృతంబై, కృతాంత హృదయంబు కరణి నపంకంబై, పంకజాసను గేహంబు సొంపున రాజహంస విరాజమానంబై, మానధనుని చరిత్రంబు సొబగున నకల్మషజీవనంబై, వననిధి పొలుపున సమ్మిళిత భూభృద్వాహినీ సంకులంబై, కులవధూరత్నంబు చెలువున నదృష్ట పయోధరంబై ధరణికిం దొడ వగుచు శరత్కాలంబు వచ్చె; నందు. (767) వాజుల నీరాజనములు¯ రాజుల జయగమనములును రాజిత లక్ష్మీ¯ పూజలు దేవోత్సవములు¯ రాజిల్లెను జగతి యందు రాజకులేంద్రా! (768) చేగ గల చెఱకువింటను¯ బాగుగ నీలోత్పలంబు బాణంబుగ సం¯ యోగంబు చేసి మదనుఁడు¯ వేగంబున విరహిజనుల వేటాడె నొగిన్. (769) ఇట్లు భాసురంబైన శరద్వాసరంబుల గోవిందుండు గోబృంద సమేతుండై బృందావనంబునం బసులఁ బొసంగ మేపుచు.

వేణు విలాసంబు

(770) కర్ణావతంసిత కర్ణికారప్రభ¯ గండభాగద్యుతిఁ గడలుకొలుప¯ భువనమోహనమైన భ్రూవిలాసంబుతో¯ వామభాగానతవదన మొప్ప¯ నపసవ్యకర మృదులాంగుళీ చాతురి¯ షడ్జధ్వనికి మర్మసరణిఁ జూప¯ డాకాలిమీఁద నడ్డము చాఁచి నిల్పిన¯ పదనఖద్యుతి భూమిఁ బ్రబ్బికొనఁగ (770.1) మౌళిపింఛముఁ గంఠదామమును మెఱయ¯ విలసితగ్రామముగ నొక్క వేణువందు ¯ బ్రహ్మగాంధర్వగీతంబు పరఁగఁ జేసెఁ¯ జతురనటమూర్తి గోపాలచక్రవర్తి. (771) ఇట్లు హరి వేణునాదంబు పూరింపఁగ మారవికారహేతు వగు తద్గీతం బాలించి సిగ్గులు చాలించి మక్కువలు చెక్కులొత్త గోపిక లోపికలు లేక తమతమ పొత్తుకత్తెలుం దారును దత్తఱంబునం బదుగురు నేగురుం దుటుములు గట్టి జిలిబిలి ముచ్చటలకుం జొచ్చి తమలోన.

గోపికల వేణునాథుని వర్ణన

(772) "శ్రవణోదంచితకర్ణికారమునతో స్వర్ణాభ చేలంబుతో¯ నవతంసాయిత కేకిపింఛమునతో నంభోజ దామంబుతో¯ స్వవశుండై మధురాధరామృతముచే వంశంబుఁ బూరించుచు¯ న్నువిదా! మాధవుఁ డాలవెంట వనమం దొప్పారెడిం జూచితే? (773) రావే సుందరి! యేమె బోటి! వినవే; రాజీవనేత్రుండు బృం¯ దావీధిం దగ వేణు వూఁదుచు లసత్సవ్యానతాస్యంబుతో¯ భ్రూవిన్యాసము లంగుళీ క్రమములుంబొల్పార షడ్జంబుగాఁ¯ గావించెన్ నటుభంగి బ్రహ్మమగు దద్గాంధర్వ సంగీతమున్. (774) తలఁకెను గొబ్బునఁ జిత్తము¯ నళినాక్షుని మధుర వేణునాదము నా వీ¯ నులు సోఁకినంత మాత్రన¯ చెలియా! యిఁక నేటివెఱపు చింతింపఁ గదే. (775) నాతోడ వెఱవ వలదే? ¯ నాతోడనె గొనుచుఁ బోయి నళినదళాక్షున్¯ నీతోడుతఁ బలికించెద¯ నీతోడి జనంబు మెచ్చ నీతోడు సుమీ." (776) అని పెక్కు భంగుల నోర్తోర్తు నుద్దేశించి పలుకుచు గోపసుందరులు బృందావనంబునకు గోవిందుని కెదురు చని పరమానందంబున నతనిం దమ మనంబులఁ బ్రతిపదంబును నాలింగనంబు చేసిన వార లగుచు, రామకృష్ణుల నుద్దేశించి. (777) "నవగోస్థానక రంగమందుఁ బరమానందంబుతోఁ జూత ప¯ ల్లవ నీలోత్పల పింఛ పద్మదళ మాలా వస్త్ర సంపన్నులై¯ కవయై వేణువు లూఁదుచున్ బహునటాకారంబులం గేళితాం¯ డవముల్ జేసెద రీ కుమారకులు; వేడ్కం గామినుల్ గంటిరే. (778) ఓ చెలువలార! వినుఁడీ¯ వాచా శతకంబులేల? వర్ణింపంగా¯ లోచనముల కలిమికి ఫల¯ మీ చెలువురఁ జూడఁగలుగు టింతియ సుండీ. " (779) అని పలికి; రందుఁ గొందఱు గోవిందు నుద్దేశించి. (780) "ఒనరన్ వ్రేతల కించుకేనియును లేకుండంగ గోపాలకృ¯ ష్ణుని కెమ్మోవి సుధారసంబు గొనుచుం జోద్యంబుగా మ్రోఁయుచుం¯ దన పర్వంబులు నేత్రపర్వములుగా దర్పించెఁ, బూర్వంబునన్¯ వనితా! యెట్టి తపంబు జేసెనొకొ యీ వంశంబు వంశంబులోన్. (781) ముదితా! యే తటినీ పయఃకణములన్ మున్ వేణు వింతయ్యె నా¯ నది సత్పుత్రునిఁ గన్నతల్లి పగిదిన్ నందంబుతో నేడు స¯ మ్మద హంసధ్వని పాటగా వికచపద్మశ్రేణి రోమాంచమై¯ యొదవం దుంగతరంగ హస్తనటనోద్యోగంబు గావింపదే! (782) నళినోదరుభక్తునిఁ గని¯ కులజులు ప్రమదాశ్రుజలము గురియు తెఱఁగు మ్రాఁ¯ కులు పూదేనియ లొలికెడు¯ నలినాక్షుని చేతి వంశనాళము మ్రోతన్. (783) నా మోసంబున కెద్ది మేర? విను నే నా పూర్వజన్మంబులన్¯ లేమా! నోములు నోఁచుచో నకట! కాళిందీతటిన్ వేణువై¯ భూమిం బుట్టెద నంచుఁ గోరఁ దగదే? బోధిల్లి యెట్లైన నీ¯ బామం దిప్పుడు మాధవాధరసుధాపానంబు గల్గుంగదే? (784) కాళిందీ కూలంబున¯ నాళీ! యీ నందతనయు నధరామృతముం¯ గ్రోలెడి వేణువు నగు నో¯ మేలాగున నోమవచ్చు నెఱిఁగింపఁగదే? (785) వనితా! కృష్ణుఁడు నల్లని¯ ఘన మనియున్ వేణురవము గర్జన మనియున్¯ మనమునఁ దలంచి రొప్పుచు¯ ననవరతము నెమలితుటుము లాడెడిఁ గంటే? (786) గిరిచరమిథునము లోలిం¯ బరికింపఁగఁ గృష్ణపాదపద్మాంకితమై¯ సురరాజు నగరికంటెనుఁ¯ దరుణీ! బృందావనంబు తద్దయునొప్పెన్. (787) అమరేంద్రాంగన లాకసంబున విమానారూఢులై పోవుచుం¯ గమలాక్షున్ శుభమూర్తిఁ గాంచి మురళీగానంబు లందందఁ గ¯ ర్ణములన్ నిల్పుచు మేఖలల్ వదలఁగా నాథాంకమధ్యంబులం¯ బ్రమదా! వ్రాలిరి చూచితే వివశలై పంచాశుగభ్రాంతలై? (788) కానల నుండుచున్ సరసగాన వివేకవిహీనజాతలై¯ వీనుల నేఁడు కృష్ణముఖ వేణురవామృతధార సోఁకినన్¯ మేనులు మేఁతలున్ మఱచి మెత్తని చూడ్కి మృగీమృగావళుల్¯ మానిని! చూడవమ్మ; బహుమానము చేసెఁ గృతార్థచిత్తలై. (789) తల్లుల చన్నుఁబాలు మును ద్రావు తఱిం దమకర్ణవీధులన్¯ వల్లభమైన మాధవుని వంశరవామృతధార చొచ్చినం ¯ ద్రుళ్ళక పాలురాఁ దివక దూఁటక మానక కృష్ణుమీఁద దృ¯ గ్వల్లులు చేర్చి నిల్చె నదె; వత్సము లంగనలార! కంటిరే? (790) మమతన్ మోములు మీఁది కెత్తుకొని రోమంథంబు చాలించి హృ¯ త్కమలాగ్రంబులఁ గృష్ణు నిల్పి మురళీగానామృతశ్రేణి క¯ ర్ణములం గ్రోలుచు మేఁతమాని గళితానందాశ్రులై చిత్రితో¯ పమలై గోవులు చూచుచున్న వవిగో పద్మాక్షి! వీక్షించితే? (791) జగతీజంబులశాఖ లెక్కి మురళీశబ్దామృతస్యందమున్¯ మిగులన్ వీనులఁ ద్రావి వ్రేఁగుపడి నెమ్మిం గృష్ణు రూపంబు చి¯ త్తగమై యుండఁగ నడ్డపెట్టు క్రియ నేత్రంబుల్ దగన్ మూసి యీ¯ ఖగముల్ చొక్కెడిఁ జూచితే? మునిజనాకారంబులం గామినీ! (792) క్రమమొప్పన్ నదులెల్ల వంశరవ మాకర్ణించి సంజాత మో¯ హములన్ మన్మథసాయక క్షత విశాలావర్తలై హంస వా¯ క్యములం జీరి తరంగహస్తముల నాకర్షించి పద్మోప హా¯ రములం గృష్ణపదార్చనంబు సలిపెన్ రామా! విలోకించితే? (793) వనిత! నేడు కృష్ణు వంశనినాదంబు¯ విని పయోధరంబు విరులు గురిసి¯ తన శరీర మెల్ల ధవళాతపత్రంబుఁ¯ జేసి మింట నీడఁ జేసెఁ గంటె? (794) మంచి ఫలంబులు హరిచే¯ నించి కరాలంబనముల నెగడుచు నిదె క్రీ¯ డించెద, రంగన! చూడుము¯ చెంచెతలం బింఛ పత్ర చేలాంచితలన్. (795) ఉల్లసిత కుచభరంబున¯ నల్లాడెడి నడుముతోడ నలరుల దండన్¯ భిల్లి యొకతె హరి కిచ్చెను¯ హల్లోహలకలిత యగుచు నంగన! కంటే? (796) గిరు లెల్ల జలము లయ్యెం¯ దరు లెల్లనుఁ బల్లవించె ధరణి గగన భూ¯ చరు లెల్లనుఁ జొక్కిరి హరి¯ మురళిరవామృతము సోఁక ముద్దియ! కంటే? (797) బలకృష్ణాంఘ్రిసరోజ సంగమముచే భాసిల్లుచున్ ధన్యమై¯ ఫలపుష్పంబులఁ గానికల్ గురిసి సంభావించి మిన్నందుచున్¯ జలఘాసంబుల గోవులం దనిపి చంచద్భూజరోమాంచమై¯ వెలసెం జూడఁ గదమ్మ! యీ గిరిపురోవీధిన్ సరోజాననా!" (798) అని యిట్లు బృందావన విహారియైన గోవిందుని సందర్శించి పంచబాణభల్ల భగ్నహృదయ లయి వల్లవకాంత లేకాంతంబులఁ జింతించుచుఁ దత్పరతంత్రలై యుండి; రంత.

హేమంతఋతు వర్ణనము

(799) శామంతికా స్రగంచిత¯ సీమంతవతీ కుచోష్ణజితశీతభయ¯ శ్రీమంతంబై గొబ్బున¯ హేమంతము దోఁచె; మదనుఁ డేఁచె విరహులన్. (800) ఉత్తరపుగాలి విసరె వి¯ యత్తలమునఁ దుహినకిరణుఁ డహితుం డయ్యెం¯ బొత్తు జరిగె మిథునములకు¯ నెత్తమ్ములు దఱిగె హిమము నెలకొనియె నృపా! (801) అహములు సన్నము లయ్యెను¯ దహనము హితమయ్యె దీర్ఘదశ లయ్యె నిశల్; ¯ బహు శీతోపేతంబై¯ యుహుహూ యని వడఁకె లోక ముర్వీనాథా! (802) అన్నుల చన్నుల దండ వి¯ పన్నులు గా కెల్లవారు బ్రతికిరిగా కీ¯ చన్నుల మీఱిన వలి నా¯ పన్నులు గా కుండఁ దరమె బ్రహ్మాదులకున్. (803) పొడుపుఁగొండమీఁద పొడిచిన మొదలుగాఁ¯ బరువుపెట్టి యినుఁడు పశ్చిమాద్రి¯ మఱుఁగుఁ జొచ్చెఁ గాక మసలినఁ జలిచేతఁ¯ జిక్కెఁజిక్కె ననఁగఁ జిక్కకున్నె. (804) చెంగల్వ విరుల గంధము¯ మంగళముగఁ గ్రోలుచున్న మధుపము లొప్పె¯ న్నంగజ వహ్నులపై ను¯ ప్పొంగి విజృంభించు పొగల పోలిక నధిపా! (805) శంభుకంట నొకటి జలరాశి నొక్కటి¯ మఱియు నొకటి మనుజ మందిరముల¯ నొదిగెఁగాక మెఱసియున్న మూడగ్నులు¯ చలికి నులికి భక్తి సలుపకున్నె? (806) ఈ హేమంతము రాకఁ జూచి రమణీహేలాపరీరంభ స¯ త్సాహాయ్యంబునఁగాని దీని గెలువన్ శక్యంబుగా దంచుఁ దా¯ రూహాపోహవిధిం ద్రిమూర్తులు సతీయుక్తాంగు లైనారు గా¯ కోహో! వారలదేమి సంతత వధూయోగంబు రాఁ గందురే? (807) ఈ హేమంతము రాకకు ¯ శ్రీహరి యొక్కింత వడఁకి చింతింపంగా¯ నోహో! వెఱవకు మని తా¯ మా హరికిని శ్రీకుచంబు లభయం బిచ్చెన్.

గోపికల కాత్యాయని సేవనంబు

(808) ఇట్టి నితాంతంబగు హేమంతంబున మొదలినెల తొలిదినంబు నందు నందుని మందంగల గోపకుమారికలు రేపకడ లేచి చని కాళిందీజలంబులం దోగి; జలతీరంబున నిసుమునం గాత్యాయనీరూపంబుఁ జేసి, సురభి కుసుమ గంధంబు లిడి, ధూపదీపంబు లిచ్చి, బహువిధోపచారంబులు సమర్పించి. (809) "ఓ! కాత్యాయని! భగవతి! ¯ నీకున్ మ్రొక్కెదము మేము నే డనుకంపన్¯ మా కిందఱకును వైళమ ¯ శ్రీకృష్ణుఁడు మగఁడు గాఁగఁ జేయుము తల్లీ! (810) ఓ తల్లి! మాకుఁ గృష్ణుఁడు¯ చేతోవిభుఁ డైననాడు చెలువల మెల్లన్¯ నేతివసంతము లాడుచు¯ జాతర జేసెదము భక్తి చాతురితోడన్." (811) అని నమస్కరించి హవిష్యంబులు గుడుచుచు ని వ్విధంబున మాసవ్రతంబు సలిపి; రందొక్కనాడు. (812) రమణుల్ ప్రొద్దుల మేలుకాంచి సఖులన్ రం డంచు నాత్మీయ నా¯ మములం జీరి, కుచద్వయీ భరములన్ మధ్యంబు లల్లాడఁగాఁ¯ బ్రమదోద్దామ గజేంద్రయాన లగుచుం బద్మాక్షునిం బాడుచున్¯ యమునాతీరముఁ జేరఁబోయిరి గృహీతాన్యోన్య హస్తాబ్జలై.

గోపికా వస్త్రాపహరణము

(813) అట్లా నదీతీరంబు చేరం జని గజగమనలు విజనప్రదేశంబున వలువలు విడిచి యిడి మది శంకలేక యకలంకలై గ్రుంకులిడఁ జలంబున జలంబు జొచ్చి. (814) వారిజలోచనుఁ బాడుచు¯ వారిజలోచనలు వారివారికి వేడ్కన్¯ వారివిహారము సలిపిరి¯ వారి విహారములు జగతివారికిఁ గలవే? (815) ఆ సమయంబున. (816) తోయజనయనలు యమునా¯ తోయములం దుండు టెఱిఁగి దూరగుఁ డయ్యున్¯ తోయజనయనుఁడు హరి తన¯ తోయము వారలును దానుఁ దోతెంచె నృపా! (817) "కదలకుం"డని తోడివారలఁ గన్నుసన్నల నిల్పుచుం¯ బదము లొయ్యన నేలఁ బెట్టుచుఁ బద్మనేత్రుఁడు మౌనియై¯ పొదల మాటున నల్లనల్లనఁ బొంచి పొంచి నతాంగుఁడై¯ యదను గోరుచు డాసి వ్రేతల యంబరంబులు దొంగిలెన్. (818) ఇట్లు దొంగిలి. (819) ఉద్యద్గంధగజేంద్ర గౌరవముతో యోషాంబరంబుల్ విభుం¯ డాద్యుం డర్భకు భంగి నర్భకులతో హాసార్థియై కొంచు ద¯ న్నద్యంభఃకణ శీతవాత జనితానందంబుతో నెక్కెఁ దా¯ సద్యోముక్త దురంతపాదప జనుస్సంతాపమున్ నీపమున్. (820) అప్పు డయ్యింతు లిట్లనిరి. (821) "మామా వలువలు ముట్టకు¯ మామా! కొనిపోకుపోకు మన్నింపు తగన్¯ మా మాన మేల కొనియెదు? ¯ మా మానసహరణ మేల? మానుము కృష్ణా! (822) బహుజీవనముతోడ భాసిల్లి యుండుటో?¯ గోత్రంబు నిలుపుటో కూర్మితోడ? ¯ మహి నుద్ధరించుటో? మనుజసింహంబవై¯ ప్రజలఁ గాచుటొ? కాక బలిఁ దెరల్చి¯ పిన్నవై యుండియుఁ బెంపు వహించుటో?¯ రాజుల గెలుచుటో రణములోన? ¯ గురునాజ్ఞ జేయుటో? గుణనిధి వై బల¯ ప్రఖ్యాతిఁ జూపుటో భద్రలీల? (822.1) బుధులు మెచ్చ భువిఁ బ్రబుద్ధత మెఱయుటో? ¯ కలికితనము చేయ ఘనత గలదె? ¯ వావి లేదు వారి వారు నా వారని¯ యెఱుఁగ వలదె? వలువ లిమ్ము కృష్ణ! (823) కొంటివి మా హృదయంబులు; ¯ గొంటివి మా మనము; లజ్జఁ గొంటివి; వలువల్¯ గొంటి; విఁక నెట్లు చేసెదొ; ¯ కొంటెవు గద; నిన్ను నెఱిఁగికొంటిమి కృష్ణా! (824) రాజసంబున నీవు రంజిల్లు టెఱుఁగమే¯ చెలరేఁగి వింతలు చేయుచుండ? ¯ సత్త్వసంపద గల్గి జరుగుటఁ దలపమే¯ సిరి గల్గి యన్యులఁ జెనకుచుండ? ¯ గురుతర శక్తియుక్తుఁడ వౌట యెఱుఁగమే¯ తామసంబున నెగ్గు దలఁచుచుండ? ¯ నొకభంగితో నుండకుంట జింతింపమే¯ మాయావియై మాఱుమలయుచుండ? (824.1) నేమి జాడవాఁడ? వేపాటి గలవాఁడ? ¯ వే గుణంబు నెఱుఁగ? వెల్ల యెడల¯ నొదిగి యుండ నేర వోరంత ప్రొద్దును? ¯ బటము లీఁగదయ్య! పద్మనయన! (825) రాజుల నెఱుఁగవు బలిమిని¯ రాజిల్లెదు చీర లీవు రమణుల మింకన్¯ రాజున కెఱిఁగించెద; మో¯ రాజీవదళాక్ష! నీవు రాజవె ధరకున్? " (826) అని పలికిన కన్నియల పలుకు లాలించి మందహాస సుందర వదనారవిందుండై గోపాలబాలకులకరంబులం గరంబులు వ్రేసి య మ్ముద్దియల నుద్దేశించి నెఱవాది చతురుం డిట్లనియె. (827) "రామల్ రామలతోడి నీ పనికిగా రాగింతురే మీ క్రియన్¯ మోమోటేమియు లేక దూఱెదరు మీ మోసంబు చింతింప రం¯ భో మధ్యంబున నుండి వెల్వడి వెసం బూర్ణేందుబింబాననల్¯ మీమీ చీరలు వచ్చి పుచ్చుకొనుఁడా; మీకిచ్చెదం జెచ్చెరన్. " (828) అనిన న మ్మానవతు లొండండురుల మొగంబులుచూచి నగుచు, మర్మంబులు నాటిన మాటలకు మగుడం బలుక సిగ్గుపడచు, నగ్గలం బైన చలిని వలిగొని కంఠప్రమాణజలంబులం దుండి డోలాయమాన మానస లై యిట్లనిరి. (829) "మా వలువ లాగడంబున¯ నీ వేటికిఁ బుచ్చుకొంటి? నీ వల్పుఁడవే? ¯ నీ వెఱుఁగని దేమున్నది? ¯ నీ వందఱిలోన ధర్మనిరతుఁడవు గదే? (830) ఇంతుల్ తోయము లాడుచుండ మగవా రేతెంతురే? వచ్చిరా¯ యింతల్ చేయుదురే? కృపారహితులై యేలోకమందైన నీ¯ వింతల్ నీ తలఁబుట్టెఁ గాక; మఱి యేవీ కృష్ణ! యో చెల్ల! నీ¯ చెంతన్ దాసులమై చరించెదము మా చేలంబు లిప్పింపవే. (831) వచ్చెదము నీవు పిలిచిన; ¯ నిచ్చెద మేమైనఁగాని; నెట జొరు మనినం¯ జొచ్చెదము; నేఁడు వస్త్రము¯ లిచ్చి మముం గరుణతోడ నేలుము కృష్ణా! " (832) అనిన దరహసితవదనుండై హరి యిట్లనియె. (833) "ఏ తరుణుఁడు మగఁ డౌటకు¯ మీ తపములు చెప్పుఁ డింక మీ యానలు సుం¯ డీ తప్పిన నీ కూరిమి¯ మీ తలలనె పుట్టెనోటు మేదిని లేదే? (834) ఎవ్వనిఁ గని మోహించితి? ¯ రెవ్వఁడు మీ మానధనములెల్ల హరించెన్? ¯ నివ్వటిలె మీకుఁ గూరిమి¯ యెవ్వనిపైఁ? బలుకరాదె? యే నన్యుఁడనే?" (835) అనిన విని సుందరు లన్యోన్య సందర్శనంబులు చేయుచు, హృదయారవిందంబులఁ గందర్పుండు సందడింప నగుచు నిరుత్తరలయి యున్న లోకోత్తరుం డిట్లనియె. (836) "నా యింటికి దాసులరై¯ నా యాజ్ఞ వహించి మీరు నడచెదరేనిన్¯ మీ యంబరంబు లిచ్చెదఁ¯ దోయంబులు వెడలి రండు తొయ్యలులారా! " (837) అనిన విని హరిమధ్యలు చలికి వెఱచి సలిలమధ్యంబున నిలువనోపక. (838) కొందఱు వెడలుద మందురు; ¯ కొందఱు వెడలుటయు సిగ్గుఁగొను గోవిందుం¯ డందురు; కొందఱు దమలోఁ¯ గొందల మందుదురు వడఁకుఁగొని మనుజేంద్రా! (839) మఱియు నెట్టకేలకుఁ జిత్తంబులు గట్టిపఱచుకొని తనుమధ్యలు తోయ మధ్యంబు వెలువడి. (840) చంచత్పల్లవ కోమల¯ కాంచన నవరత్నఘటిత కంకణరుచిరో¯ దంచిత కరసంఛాదిత¯ పంచాయుధగేహ లగుచుఁ బడతులు వరుసన్. (841) చని ప్రౌఢలైన సుందరుల ముందట నిడుకొని మందగమనలు మందహాసంబుతోడ నెదుర నిలిచిన నరవిందనయనుం డిట్లనియె. (842) "శృంగారవతులార! సిగ్గేల? మిముఁ గూడి¯ పిన్ననాటను గోలెఁ బెరిగినాఁడ; ¯ నెఱుఁగనే మీలోన నెప్పుడు నున్నాఁడ¯ నేను జూడని మర్మ మెద్ది గలదు? ¯ వ్రతనిష్ఠలై యుండి వలువలు గట్టక¯ నీరు జొత్తురె మీరు నియతిఁ దప్పి? ¯ కాత్యాయనీదేవిఁ గల్ల చేయుట గాక¯ నీ రీతి నోమువా రెందుఁ గలరు? (842.1) వ్రతము ఫలము మీకు వలసినఁ జక్కఁగ¯ నింతు లెల్లఁ జేతు లెత్తి మ్రొక్కి¯ చేరి పుచ్చుకొనుఁడు చీరలు; సిగ్గు పో¯ నాడనేల? యెగ్గు లాడనేల?" (843) అనిన విని మానవతులు తమలోన. (844) వ్రతముల్ జేయుచు నొక్క మాటయిన నెవ్వానిన్ విచారించినన్¯ వ్రతభంగంబులు మానునట్టి వరదున్ వామాక్షు లీక్షించియున్¯ గతచేలాప్లవనంబు నేడు వ్రతభంగం బంచు శంకించి ఫా¯ లతట న్యస్త కరాబ్జలై సరసలీలన్ మ్రొక్కి రట్లందఱున్.

గోపికల యెడ ప్రసన్ను డగుట

(845) బాలలకు హస్తకీలిత¯ ఫాలలకు నితాంతశీత పవనాగమ నా¯ లోలలకు నంబరములు కృ¯ పాలుఁడు హరి యిచ్చె భక్తపాలకు డగుటన్. (846) చీర లపహరించి సిగ్గులు విడిపించి¯ పరిహసించి యైనఁ బరఁగ మనకు¯ ఘనుఁడు నోము కొఱఁతగాకుండ మ్రొక్కించె¯ ననుచు హరి నుతించి రబలలెల్ల (847) ఉల్లములు నొవ్వ నాడిఁనఁ¯ గల్లలు చేసినను నగినఁ గలఁచిన నైనన్¯ వల్లభులు చేయు కృత్యము¯ వల్లభలకు నెగ్గుగాదు; వల్లభ మధిపా! (848) ఇట్లు హరి వలువ లిచ్చినం గట్టుకొని సతు లతని యందు బద్ధానురాగులై యుచ్చరింపక ఱెప్పలిడక తప్పక చూడ నా ప్రోడ యెఱింగి చేరి వారి కిట్లనియె. (849) “లక్షణవతులార! లజ్జించి చెప్పరు¯ గాని మీ మర్మముల్ గానఁబడియె; ¯ ననుఁ గొల్వఁ జింతించినారు నాచేతను¯ సత్యంబు మీ నోము సఫల మగును; ¯ గామితార్థంబులు కలిమిఁ జెప్పఁగ నేల?¯ ననుఁ గొల్వ ముక్తికి నడవవచ్చుఁ; ¯ గడమ కూడఁగ నంబికాదేవి నోమంగ¯ నటమీఁద రాత్రుల యందు మీకు (849.1) నన్నుఁ బొందఁ గల్గు నమ్మి పొం"డని హరి¯ పల్క నింతు లెల్ల భ్రాంతిఁ జనిరి¯ తపము పండె ననుచుఁ దత్పదాంభోజముల్¯ మానసించికొనుచు మందకడకు. (850) ఇట్లు గోపకన్యక లందుఁ బ్రసన్నుండయి గోవిందుండు బృందావనంబు దాఁటి దూరంబున ధేనువుల మేపుచుండఁ; జండకిరణుని యెండంబడి దండిచెడి తరుల దండ నండగొనుచు నాతపత్రాకారంబులయి నీడలు చేయుచున్న వృక్షంబుల నీక్షించి కృష్ణ బలరామ శ్రీదామ దేవప్రస్థ విశాలార్జున ప్రముఖులకుం దక్కిన గోపకు లిట్లనిరి. (851) "అపకారంబులు చేయ వెవ్వరికి నేకాంతంబు లం దుండు నా¯ తప శీతానిల వర్ష వారకములై త్వగ్గంధ నిర్యాస భ¯ స్మ పలాశాగ్ర మరంద మూల కుసుమచ్ఛాయా ఫలశ్రేణిచే¯ నుపకారంబులు చేయు నర్థులకు నీ యుర్వీజముల్ గంటిరే. " (852) అని చిగురాకు పువ్వు కాయ పండు తండంబుల వ్రేఁగున వీఁగిన తరువుల నడిమి తెరువునం బసుల దాఁటుల దాఁటించి, యమునకుం జని, వెడఁదమడుఁగుల మెల్లనఁ జల్లని నీరుఁ ద్రావించి, తత్సమీపంబున మేపుచు, వల్లవు లెల్ల మూఁకలుగొని, యాఁకలి గొంటిమని విన్నవించినఁ దనకు భక్తురాండ్రగు విప్రభార్యలవలనం బ్రసన్నుం డయి వారలం జూచి రామసహితుం డయిన హరి యిట్లనియె. (853) "వల్లవులార! యీ వనమున విప్రులు¯ బ్రహ్మవాదులు దేవభవనమునకు¯ నరుగుట కాంగిరసాహ్వయ సత్రంబు¯ సలుపుచునున్నారు చనుఁడు మీరు¯ మా నామములు చెప్పి మైత్రితో నడిగిన¯ నన్నంబుఁ బెట్టెద"రనుచుఁ బలుక¯ వారలు చని విప్రవరుల కెల్లను మ్రొక్కి¯ "పసుల మేపుచు బలభద్ర కృష్ణు (853.1) లలసి పుత్తెంచి రిట మమ్ము నన్న మడుగ¯ ధర్మవిదులార! యర్థిప్రదాతలార! ¯ పెట్టు డన్నంబు; శ్రాంతులఁ బిలిచి తెచ్చి¯ పెట్టుదురు గాదె మిముబోఁటి పెద్ద లెల్ల. (854) ఘన దీక్షితునకు నైనం¯ జనుఁ గుడువఁగఁ; బశువధంబు సౌత్రామణియుం¯ జనిన వెనుక దోషము లే¯ దనఘాత్మకులార! పెట్టు డన్నము మాకున్. " (855) అని గోపకులు పలికిన. (856) క్రతువున్ మంత్రముఁ దంత్రమున్ ధనములుం గాలంబు దేశంబు దే¯ వతయున్ ధర్మము నన్యముల్ దలఁప నెవ్వాఁ డట్టి సర్వేశ్వరున్¯ మతి నూహింపక గోపబాలుఁ డనుచున్ మందస్థితిం జూచి దు¯ ర్మతులై యన్నము లేదు లే దనిరి సన్మాన్యక్రియాశూన్యులై. (857) అంత గోపకులు నిరాశులై వచ్చి యెఱింగించిన హరి లౌకికానుసారి యగుచు “మీ ర య్యార్యుల నడుగక, వారి భార్యలకు మారాకఁ జెప్పుఁ; డన్నంబు పెట్టుదు” రని పంచిన వారు చని బ్రాహ్మణసతుల దర్శించి నమస్కరించి సంపూజితులై యిట్లనిరి. (858) "గోవుల మేపుచు నాఁకొని¯ గోవిందుం డన్న మడిగికొని రండని మ¯ మ్మీవేళనుఁ బుత్తెంచెను¯ ధీవిలసితలార! రండు తెం డన్నంబుల్. "

విప్రవనితా దత్తాన్న భోజనంబు

(859) అనిన విని గోవింద సందర్శన కుతూహలలై ధరణీసుర సుందరులు సంభ్రమానందంబులు డెందంబుల సందడింప, భక్ష్య భోజ్య లేహ్య చోష్య పానీయ భేదంబులుం గలిగి, సంస్కార సంపన్నంబులైన యన్నంబులు కుంభంబుల నిడికొని సంరంభంబున సముద్రంబునకు నడచు నదుల తెఱంగున. (860) బిడ్డలు మగలును భ్రాతలు¯ నడ్డము చని వల దనంగ నటు తలఁడని మా¯ ఱొడ్డుచు జగదీశ్వరునకు¯ జడ్డన నన్నంబు గొనుచుఁ జని రా సుదతుల్. (861) చని యమునాసమీపంబున నవపల్లవాతిరేకంబును విగత వనచర శోకంబును నైన యశోకంబుక్రింద నిర్మలస్థలంబున. (862) ఒక చెలికానిపై నొక చేయి చాఁచి వే¯ ఱొక చేత లీలాబ్జ మూఁచువానిఁ¯ గొప్పున కందని కొన్ని కుంతలములు¯ చెక్కుల నృత్యంబు చేయువానిఁ¯ గుఱుచ చుంగులు పుచ్చి కొమరారఁ గట్టిన¯ పసిఁడి వన్నియ గల పటమువానిఁ¯ నౌదలఁ దిరిగిరా నలవడఁ జుట్టిన¯ దట్టంపు పింఛపు దండవాని (862.1) రాజితోత్పల కర్ణపూరములవాని¯ మహిత పల్లవ పుష్ప దామములవాని¯ భువన మోహన నటవేష భూతివానిఁ¯ గనిరి కాంతలు కన్నుల కఱవు దీఱ. (863) కని లోచనరంధ్రంబుల¯ మునుమిడి హరి లలితరూపమును లోఁగొని నె¯ మ్మనములఁ బరిరంభించిరి¯ తనుమధ్యలు హృదయ జనిత తాపమువాయన్. (864) ఇ వ్విధంబున. (865) వారిత సర్వస్పృహలై¯ వా రందఱుఁ దన్నుఁ జూడ వచ్చుట మదిలో¯ వారిజనయనుఁడు పొడగని¯ వారికి నిట్లనియె నగి యవారితదృష్టిన్. (866) "కాంతారత్నములార! మీ గృహములం గళ్యాణమే? యేమి గా¯ వింతున్ మీ? కిటు రండు; మమ్ము నిచటన్ వీక్షింప నేతెంచినా¯ రెంతో వేడుకతో; నెఱుంగుదుము; నిర్హేతుస్థితిన్ నన్ను ధీ¯ మంతుల్ మీ క్రియఁ జేరి కందురుగదా మత్సేవలన్ సర్వమున్. (867) కావున గృహస్థు లయిన మీ పతులు మిమ్ముం గూడి క్రతువు నిర్విఘ్నంబుగా సమాప్తిం జేసెదరు; మీరు యాగవాటంబునకుం జనుఁ” డనిన విప్రభార్య లిట్లనిరి. (868) "తగునే మాధవ! యిట్టి వాఁడిపలుకుల్ ధర్మంబులే మా యెడన్? ¯ మగలుం బిడ్డలు సోదరుల్ జనకులున్ మమ్మున్ నివారింప మ¯ చ్చిగ నీ యంఘ్రులు చేరినార; మటఁబోఁ జేకొందురే వార లా¯ పగి దే మొల్లము; కింకరీజనులఁగా భావించి రక్షింపవే. " (869) అనిన జగదీశ్వరుండు. (870) "నా సమీపమున నున్నా రంచు నలుగరు;¯ బంధులు భ్రాతలు పతులు సుతులు¯ మిమ్ము దేవతలైన మెత్తు రంగనలార!¯ నా దేహసంగంబు నరుల కెల్ల¯ సౌఖ్యానురాగ సంజనకంబు గాదు; ము¯ క్తిప్రదాయకము; నా కీర్తనమున¯ దర్శనాకర్ణన ధ్యానంబులను గర్మ¯ బంధ దేహంబులఁ బాసి మీరు (870.1) మానసంబులు నా యందు మరుగఁజేసి¯ నన్నుఁ జేరెద రటమీఁద నమ్ము"డనుచుఁ¯ బలికి వారలు దెచ్చిన భక్షణాదు¯ లాప్తవర్గంబుతో హరి యారగించె. (871) పరమేశ్వరార్పణంబుగఁ¯ బరజనులకు భిక్ష యిడినఁ బరమపదమునం¯ బరఁగెద రఁట; తుది సాక్షా¯ త్పరమేశుఁడు భిక్ష గొన్న ఫలమెట్టిదియో?

విప్రుల విచారంబు

(872) ఇట్లు సర్వేశ్వరుండైన హరికి భిక్ష యిడి తమ భార్య లతని వలనం గృతార్థు లగుట యెఱింగి భూసురులు తమలో నిట్లనిరి. (873) "కటకట! మోసపోయితిమి; కాంతల పాటియు బుద్ధి లేదు; నే¯ డిట హరిఁ గానఁబో నెఱుఁగ; మేము దురాత్ముల; మేము గల్మషో¯ ద్భటులము; విష్ణుదూరగుల ప్రాజ్ఞత లేల? తపంబు లేల? ప¯ ర్యటనము లేల? శీలములు యాగములున్ మఱి యేల కాల్పనే? (874) జపహోమాధ్యయనంబులు¯ తపములు వ్రతములును లేని తరుణులు హరి స¯ త్కృపఁ బడసి రన్ని గలిగియుఁ¯ జపలతఁ బొందితిమి భక్తి సలుపమి నకటా! (875) సుర గురులగు యోగీంద్రుల¯ నరుదుగ మోహితులఁ జేయు హరిమాయ మమున్¯ నరగురుల మూఢవిప్రుల¯ నురవడి మోహితులఁ జేయ నోపక యున్నే? (876) క్రతువుల్ ధర్మము మంత్ర తంత్ర ధనముల్ కాలంబు దేశంబు దే¯ వతయున్ వహ్నులు మేదినీసురులు నెవ్వా డిట్టి సర్వేశుఁ డీ¯ క్షితి రక్షింప జనించినాఁ; డెఱుగ; మా శ్రీభర్తకుం గర్తకుం¯ గుతలోద్ధర్తకు మేము మ్రొక్కెదము రక్షోనాథ సంహర్తకున్. "

యాగము చేయ యోచించుట

(877) అని మఱియు ననేకవిధంబులఁ బశ్చాత్తాపంబులం బొంది హరిం దలంచి శమింపుమని మ్రొక్కి బ్రాహ్మణులు కంసభీతులై బల కృష్ణ సందర్శనంబు జేయం జనరై; రంత నక్కడ నఖిలదర్శనుం డైన హరి యింద్రయాగంబు జేయం దలంచి తనకడకు వచ్చిన నందాది గోపవృద్ధులం గని నమస్కరించి, నందున కిట్లనియె. (878) "యాగంబు సేయంగ నర్థించి వచ్చితి¯ రీ యాగమున ఫల మేమి గలుగు? ¯ నెవ్వాఁడు దీనికి నీశ్వరుం? డధికారి¯ యెవ్వఁడు? సాధన మెంత వలయు? ¯ శాస్త్రీయమో, జనాచారమో కార్యంబు?¯ వైరుల కెఱిఁగింప వలదు గాని¯ యెఱిఁగెడి మిత్రుల కెఱిఁగింపఁ దగుఁ జేరి¯ యెఱిఁగి చేసినఁ గోర్కు లెల్లఁ గలుగుఁ (878.1) బగయుఁ జెలిమి లేక పరఁగిన మిముబోఁటి¯ మంచివారి కేల మంతనంబు? ¯ తలఁపు లెల్ల మాకుఁ దగ నెఱిఁగింపవే¯ తాత! వాక్సుధాప్రదాత వగుచు. " (879) అనినఁ బ్రౌఢకుమారునికిఁ దండ్రి యిట్లనియె. (880) "పర్జన్యుఁ డధికుండు భగవంతుఁ డమరేంద్రుఁ¯ డతనికిఁ బ్రియమూర్తు లగుచు నున్న¯ మేఘ బృందంబులు మేదినీ తలముపై¯ నతని పంపున భూతహర్షణముగ¯ జలములు గురియుఁ, దజ్జలపూరములఁ దోఁగి¯ పండు సస్యంబు లా పంట దమకు¯ ధర్మార్థకామ ప్రదాయకంబుగ లోకు¯ లెల్లను బ్రతుకుదు; రింత యెఱిఁగి (880.1) మేఘవిభుఁడైన యింద్రుఁడు మెచ్చుకొఱకు¯ నింద్రమఖములు జేయుదు రెల్ల నృపులుఁ¯ గామ లోభ భయ ద్వేష కలితు లగుచుఁ¯ జేయ కుండిన నశుభంబు చెందుఁ బుత్ర! (881) అదియునుం గాక. (882) మఖము సేయ వజ్రి మది సంతసించును¯ వజ్రి సంతసింప వాన గురియు¯ వాన గురియఁ గసవు వసుమతిఁ బెరుగును¯ గసవు మేసి ధేనుగణము బ్రతుకు. (883) ధేనువులు బ్రతికెనేనియు¯ మానక ఘనమైన పాఁడి మందలఁ గలుగున్; ¯ నూనముగ బాఁడి గలిగిన¯ మానవులును సురలుఁ దనిసి మనుదురు పుత్రా! "