పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవత పారాయణ - 3 : దశమ పూర్వ 653 - 759

గోపికలు విలపించుట

(653) "ఎదురువచ్చినఁ జాల నెదురుగాఁ జనుదెంతు¯ వెదురు వచ్చిన నే డదేల రావు? ¯ చూచినఁ గృపతోడఁ జూచు చుందువు నీవు¯ చూచినఁ గనువిచ్చి చూడ వేల? ¯ డాసిన నఱలేక డాయంగ వత్తువు¯ డాసిన నేటికి డాయ విచటఁ? ¯ జీరిన "నో!"యని చెలరేగి పలుకుదు¯ విది యేమి చీరిన నెఱుఁగకుంట? (653.1) తలఁపుఁ జేయునంతఁ దలపోయుచుందువు¯ తలఁపుఁ జేయ నేడు దలఁప వకట;"¯ యనుచు భక్తివివశు లాడెడి కైవడి ¯ వ్రేత లెల్ల నాడి వివశ లైరి. (654) ఆ సమయంబున నంద యశోదాదులు హరిం జూచి యధికం బైన శోకంబున నిట్లనిరి. (655) "విషకుచయుగ యగు రక్కసి¯ విషకుచదుగ్ధంబుఁ ద్రావి విషవిజయుఁడ వై¯ విషరుహలోచన! యద్భుత¯ విషయుండగు నీకు సర్పవిష మెక్కెఁ గదా! (656) కట్టా! క్రూర భుజంగము¯ గట్టలుకన్ నిన్నుఁ గఱవఁ గంపించితివో? ¯ తిట్టితివో పాపపు విధిఁ? ¯ బట్టీ! మముఁ దలఁచి కాఁక పలవించితివో? (657) పన్నగము మమ్ముఁ గఱవక¯ నిన్నేటికిఁ గఱచెఁ గుఱ్ఱ! నెమ్మి గలిగి నీ¯ వున్నను మము రక్షింతువు; ¯ ని న్నున్ రక్షింప నేము నేరము తండ్రీ! (658) చూడ వదేమి గౌరవపుఁజూపుల మమ్ము; సఖాలితోడ మా¯ టాడ వదేమి? మర్మముగ నందెలు పాదములందు మ్రోయ నే¯ డాడ వదేమి నర్తనము? లవ్వల మ్రోలను గోపికావళిం¯ గూడ వదేమి నవ్వులను? గోపకుమారవరేణ్య! చెప్పుమా; (659) శ్రవణరంధ్రంబులు సఫలతఁ బొందంగ¯ నెలమి భాషించు వా రెవ్వ రింకఁ? ¯ గరచరణాదుల కలిమి ధన్యత నొంద¯ నెగిరి పైఁ బ్రాఁకు వా రెవ్వ రింక? ¯ నయనయుగ్మంబు లున్నతిఁ గృతార్థములుగా¯ నవ్వులు చూపు వా రెవ్వ రింక? ¯ జిహ్వలు గౌరవశ్రీఁ జేరఁ బాటల¯ యెడఁ బలికించు వా రెవ్వ రింక (659.1) తండ్రి! నీవు సర్పదష్టుండవై యున్న¯ నిచట మాకుఁ బ్రభువు లెవ్వ రింక? ¯ మరిగి పాయ లేము; మాకు నీ తోడిద¯ లోక మీవు లేని లోక మేల?" (660) అని యొండొరులం బట్టుకొని విలపించుచుఁ “గృష్ణునితోడన మడుఁగుఁ జొత్తము చత్త” మనుచుఁ గృష్ణవిరహ వేదనానల భార తప్తులై మడుఁగు చొరఁబాఱుచున్న వారలం గనుంగొని భగవంతుండైన బలభధ్రుండు “మీరు మీఁ దెఱుఁగరు; ధైర్యంబు విడుచుట కార్యంబు గాదు సహించి చూడుం” డనుచు వారిని వారించె. (661) తనుఁ గూర్చి యివ్విధంబున¯ వనితలు బిడ్డలును దారు వాపోయెడి ఘో¯ షనివాసులఁ గని కృష్ణుఁడు¯ మనుజుని క్రియ నొక ముహూర్తమాత్రము జరపెన్.

కాళియ మర్ధనము

(662) అంతం గృష్ణుఁడు మేను పెంప భుజగుం డావృత్తులం బాసి తా¯ సంతప్తాయతభోగుఁ డై కఱచుటల్ చాలించి నిట్టూర్పుతో¯ శ్రాంతుండై తల లెత్తి దుర్విషము నాసావీథులం గ్రమ్మ దు¯ శ్చింతన్ దిక్కులు చూచుచుం దలఁగి నిల్చెన్ ధూమకాష్ఠాకృతిన్. (663) వెఱ మఱలేని మేటి బలువీరుఁడు కృష్ణకుమారుఁ డొక్క చేఁ¯ జఱచి ఖగేంద్రుచందమునఁ జక్కన దౌడలు పట్టి కన్నులం¯ జొఱజొఱ దుర్విషానలము జొబ్బిలు చుండఁగ నెత్తి లీలతో¯ జిఱజిఱఁ ద్రిప్పి వైచెఁ బరిశేషిత దర్పముఁ గ్రూరసర్పమున్. (664) ఇట్లు వేగంబుగ నాగంబు వీచివైచి జగజ్జెట్టియైన నందునిపట్టి రెట్టించిన సంభ్రమంబున. (665) ఘన యమునానదీ కల్లోల ఘోషంబు¯ సరసమృదంగ ఘోషంబు గాఁగ¯ సాధు బృందావనచర చంచరీక గా¯ నంబు గాయక సుగానంబు గాఁగఁ¯ గలహంస సారస కమనీయమంజు శ¯ బ్దంబులు దాళశబ్దములు గాఁగ¯ దివినుండి వీక్షించు దివిజ గంధర్వాది¯ జనులు సభాసీనజనులు గాఁగ (665.1) పద్మరాగాది రత్నప్రభాసమాన ¯ మహితకాళియ ఫణిఫణామండపమున¯ నళినలోచన విఖ్యాత నర్తకుండు¯ నిత్యనైపుణమునఁ బేర్చి నృత్య మాడె. (666) కుక్షిన్ లోకములున్న గౌరవముతో గోపాకృతి న్నున్న యా¯ రక్షోహంత వడిన్ మహాఫణిఫణారంగప్రదేశంబుపై¯ నక్షీణోద్ధత నాడుఁ; బాడుఁ; జెలఁగున్; హాసంబుతోడం బద¯ ప్రక్షేపంబులు జేయుఁ గేళిగతులం బ్రాణైకశేషంబుగన్. (667) ఘనతర సుషిరానంద¯ స్వనములతో సిద్ధ సాధ్య చారణ గంధ¯ ర్వ నిలింప మునిసతులు చ¯ య్యన గురిసిరి విరులవాన లాడెడు హరిపై. (668) ఇట్లు దుష్టజనదండధరావతారుండైన హరి వడి గలిగిన పడగల మీఁదఁ దాండవంబు సలుప, బెండుపడి యొండొండ ముఖంబుల రక్తమాంసంబు లుమియుచుఁ గన్నుల విషంబు గ్రక్కుచు నుక్కుచెడి చిక్కి దిక్కులుచూచుచుఁ గంఠగతప్రాణుండై ఫణీంద్రుండు తన మనంబున. (669) "వేలుపులైన లావుచెడి వేదనఁ బొందుచు నా విషానల¯ జ్వాలలు సోఁకినంతటన చత్తురు; నేడిది యేమి చోద్య? మా¯ భీలవిషాగ్ని హేతిచయపీడకు నోర్చియుఁ గ్రమ్మఱంగ నీ¯ బాలుఁడు మత్ఫణాశతము భగ్నముగా వెసఁ ద్రొక్కి యాడెడున్. (670) ఈతఁడు సర్వచరాచర¯ భూతేశుండైన పరమపురుషుఁడు సేవా¯ ప్రీతుఁడు శ్రీహరి యగు"నని¯ భీతిన్ శరణంబు నొందె బిట్టలసి నృపా! (671) ఇట్లు క్రూరంబులయిన హరిచరణ ప్రహరంబులం బడగ లెడసి నొచ్చి చచ్చినక్రియం బడియున్న పతిం జూచి నాగకాంతలు దురంతంబయిన చింతాభరంబున నివ్వటిల్లెడు నెవ్వగల నొల్లొంబోయి పల్లటిల్లిన యుల్లంబుల. (672) కచబంధంబులు వీడ భూషణము లాకంపింపఁ గౌఁదీవియల్ ¯ కుచయుగ్మంబుల వ్రేగునం గదలఁ బైకొంగుల్ వడిన్ జాఱఁగాఁ¯ బ్రచురభ్రాంతిఁ గలంగి ముందట రుదద్బాలావళిం గొంచు స్రు¯ క్కుచు, భక్తింజని కాంచి రా గుణమణిన్ గోపాలచూడామణిన్.

నాగకాంతలు స్తుతించుట

(673) కని దండప్రణామంబు లాచరించి నిటలతటఘటిత కరకమలలై యిట్లనిరి. (674) "క్రూరాత్ముల దండింపఁగ¯ ధారుణిపై నవతరించి తనరెడి నీ కీ¯ క్రూరాత్ముని దండించుట ¯ క్రూరత్వము గాదు సాధుగుణము గుణాఢ్యా! (675) పగవారి సుతుల యందును¯ బగ యించుక లేక సమతఁ బరగెడి నీకుం¯ బగగలదె? ఖలుల నడఁచుట¯ జగదవనముకొఱకుఁ గాక జగదాధారా! (676) నిగ్రహమె మము విషాస్యుల¯ నుగ్రుల శిక్షించు టెల్ల? నూహింప మహా¯ నుగ్రహము గాక మాకీ¯ నిగ్రహము విషాస్యభావనిర్గతిఁ జేసెన్. (677) ఎట్టి తపంబు జేసెనొకొ? యెట్టి సుకర్మము లాచరించెనో? ¯ యెట్టి నిజంబు బల్కెనొకొ? యీ ఫణి పూర్వభవంబు నందు ము¯ న్నెట్టి మహానుభావులకు నెన్నఁడుఁ జేరువగాని నీవు నేఁ¯ డిట్టి వినోదలీలఁ దల లెక్కి నటించెద వీ ఫణీంద్రుపై. (678) బహు కాలంబు తపంబు చేసి వ్రతముల్ బాటించి కామించి నీ¯ మహనీయోజ్వల పాదరేణుకణ సంస్పర్శాధికారంబు శ్రీ¯ మహిళారత్నము తొల్లి కాంచె నిదె నేమం బేమియున్ లేక నీ¯ యహి నీ పాదయుగాహతిం బడసె నే డత్యద్భుతం బీశ్వరా! (679) ఒల్లరు నిర్జరేంద్రపద మొల్లరు బ్రహ్మపదంబు నొందఁగా¯ నొల్లరు చక్రవర్తిపద మొల్లరు సర్వరసాధిపత్యము¯ న్నొల్లరు యోగసిద్ధి మఱియొండు భవంబుల నొందనీని నీ¯ సల్లలితాంఘ్రి రేణువుల సంగతి నొందిన ధన్యు లెప్పుడున్. (680) ఘన సంసారాహతులగు¯ జను లాకాంక్షింపఁ గడు నశక్యం బగు శో¯ భనము సమక్షంబున నహి¯ గనియెం దామసుఁడు రోషకలితుం డయ్యున్ (681) దేవా! సకల పురుషాంతర్యామి రూపత్వంబు వలనఁ బరమ బురుషుండ వయ్యు, నపరిచ్ఛిన్నత్వంబు వలన మహాత్ముండ వయ్యు, నాకాశాది భూతసమాశ్రయత్వంబు వలన భూతావాసుండ వయ్యును, భూతమయత్వంబు వలన భూతశబ్ద వాచ్యుండ వయ్యుఁ, గారణాతీతత్వంబు వలనఁ బరమాత్ముండ వయ్యును, జ్ఞాన విజ్ఞాన పరిపూర్ణత్వంబు గలిగి నిర్గుణత్వ నిర్వికారత్వంబు వలన బ్రహ్మంబ వయ్యుఁను, బ్రకృతి ప్రవర్తకత్వంబు వలన ననంతశక్తివై యప్రాకృతుండ వయ్యుఁ, గాలచక్రప్రవర్తకత్వంబు వలనఁ గాలుండ వయ్యుఁ, గాలశక్తి సమాశ్రయత్వంబు వలన గాలనాభుండ వయ్యు, సృష్టి జీవన సంహారాది దర్శిత్వంబు వలనం గాలావయవసాక్షి వయ్యు నొప్పు నీకు నమస్కరించెదము; మఱియును. (682) విశ్వంబు నీవయై విశ్వంబుఁ జూచుచు¯ విశ్వంబుఁ జేయుచు విశ్వమునకు¯ హేతువవై పంచభూతమాత్రేంద్రియ¯ ములకు మనః ప్రాణ బుద్ధి చిత్త¯ ముల కెల్ల నాత్మవై మొనసి గుణంబుల¯ నావృత మగుచు నిజాంశభూత¯ మగు నాత్మచయమున కనుభూతి చేయుచు¯ మూ డహంకృతులచే ముసుఁగుబడక (682.1) నెఱి ననంతుఁడవై దర్శనీయరుచివి¯ గాక సూక్ష్ముఁడవై నిర్వికారమహిమఁ¯ దనరి కూటస్థుఁడన సమస్తంబు నెఱుఁగు¯ నీకు మ్రొక్కెద మాలింపు నిర్మలాత్మ! (683) మఱియుఁ గలండు లేఁడు; సర్వంబు నెఱుంగు; నించుక నెఱుంగు బద్ధుండు; విముక్తుం డొకం; డనేకుఁడు నను నివి మొదలుగాఁ గల వాదంబులు మాయ వలన ననురోధింపుదురు గావున నానావాదానురోధకుండ వయ్యు, నభిధానాభిధేయ శక్తిభేదంబుల వలన బహుప్రభావప్రతీతుండ వయ్యుఁ, జక్షురాది రూపంబుల వలనఁ బ్రమాణ రూపకుండ వయ్యు, నిరపేక్షజ్ఞానంబు గలిమిం గవి వయ్యు, వేదమయనిశ్వాసత్వంబువలన శాస్త్రయోని వయ్యు, సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్నానిరుద్ధ రూపంబుల వలనఁ జతుర్మూర్తి వయ్యు, భక్తజనపాలకుండ వయ్యు, నంతఃకరణ ప్రకాశత్వంబు గలిగి సేవకజన ఫలప్రదానంబుకొఱకు గుణాచ్ఛాదకుండ వయ్యుఁ, జిత్తాదివర్తనంబులఁ గానందగిన గుణంబులకు సాక్షివై యొరుల కెఱుంగరామి నగోచరుండ వయ్యుఁ, దర్కింపరాని పెంపు వలన నవ్యాహతవిహారుండ వయ్యు, సకలకార్య హేతు వయ్యు, నంతఃకరణప్రవర్తకత్వంబు వలన హృషీకేశుండ వయ్యును, సాధనవశంబు గాని యాత్మారామత్వంబు వలన ముని వయ్యు, స్థూల సూక్ష్మగతుల నెఱుంగుచు నెందుం జెందక నీవు విశ్వంబుగాకయు విశ్వంబు నీ వయ్యును, విశ్వభావాభావ సందర్శనంబు చేయుచు విద్యావిద్యలకు హేతువైన నీకుం బ్రణామంబు లాచరించెదము; అవధరింపుము. (684) లోక జనిస్థితిలయములు¯ గైకొని చేయుదువు త్రిగుణకలితుఁడవై కా¯ లాకారమున నమోఘ¯ శ్రీకలితుఁడ వగుచు నిచ్చ జెందక యీశా! (685) ఈ శాంతులు గాని తనువు¯ లీశా! యీ మూఢజాతు లీ సజ్జాతుల్¯ యీశాంత తనువులందుఁ బ్ర¯ కాశింతువు ధర్మహితముగా సుజనులలోన్. (686) నేరము లెన్న నెక్కడివి? నేము దలంచు తలంపు లోపలన్ ¯ నేరుపు లున్నవే? సుతుల నేరమిఁ దండ్రులు ద్రోచిపుచ్చరే? ¯ నేరము చేయువారి ధరణీపతు లొక్కకమాటు గావరే? ¯ నేరము గల్గు మద్విభుని నే డిటఁ గావఁగదే కృపానిధీ! (687) బాలుం డీతఁడు మంచివాఁ డనుచుఁ జెప్పన్ రాము క్రూరుండు దు¯ శ్శీలుండౌ నవు నైన నేము సుభగశ్రీఁ బాసి వైధవ్య దు¯ ష్టాలంకారముఁ బొంద నోడెద మనాథాలాప మాలింపవే? ¯ చాలున్ నీ పద తాండవంబు; పతిభిక్షం బెట్టి రక్షింపవే? (688) ఆకుల మయ్యె భోగ మిదె యౌదల లన్నియు వ్రస్సెఁ బ్రాణముల్¯ రాకలఁ బోకలం బొలిసె రాయిడి పెట్టక మా నిజేశుపై¯ నీ కరుణాకటాక్షములు నిల్పఁగదే తగ నో! సమస్త లో¯ కైకశరణ్య! యో! యభయకారణ! యో! కమలామనోహరా! (689) మమ్ముఁబెండ్లి చేయు మా ప్రాణవల్లభు¯ ప్రాణమిచ్చి కావు భక్తవరద! ¯ నీవు చేయు పెండ్లి నిత్యంబు భద్రంబు¯ పిన్ననాటి పెండ్లి పెండ్లి కాదు. (690) నీయాన; యెవ్వారిని నిగ్రహింపం¯ డా యుగ్ర పాపాకృతి నంద డింకన్; ¯ నీ యాజ్ఞలో నుండెడు నేఁటఁగోలెన్ ¯ మా యీశు ప్రాణంబులు మాకు నీవే." (691) అని యిట్లు తమ పెనిమిటి బ్రతుకుఁ గోరెడి భుజగసతుల యందు శరణాగతవత్సలుండైన పుండరీకాక్షుండు కరుణించి, చరణ ఘట్టనంబు చాలించి, తలంగిన, నెట్టకేలకుఁ బ్రాణేంద్రియముల మరలం బడసి, చిదిసి నలఁగిన తలలు సవరించుకొని, వగర్చుచు భుజగపతి జలజనయనునికి నంజలిచేసి మెల్లన నిట్లనియె.

కాళిందుని విన్నపము

(692) "మలఁకలు మా ప్రచారములు మా ముఖముల్ విషవహ్ని ఘోరముల్; ¯ ఖలులము; రోషజాతులము; గర్వుల; మే మొక మంచివారమే? ¯ నళినదళాక్ష! ప్రాణులకు నైజగుణంబులు మాన నేర్చునే? ¯ వెలయవె? మా వికారములు వింతలె? మే లొనరించి తీశ్వరా! (693) వివిధ భావాకార వీర్యబీజాశయ¯ జవయోనియుతముగా జగము లెల్ల¯ నీవ చేసితి మున్న; నే మా జగంబులో¯ సహజకోపనులము సర్పములము; ¯ దుర్వారమైన నీ తోరంపు మాయ నే¯ మెఱిఁగి దాఁటెడు పని కెంతవార; ¯ మంతకుఁ గారణ మఖిలేశ్వరుండవు¯ సర్వజ్ఞుఁడవు నీవు జలజనయన! (693.1) మనిచె దేనిని మన్నించి మనుపు నన్ను¯ నిగ్రహించెద వేనిని నిగ్రహింపు; ¯ మింక సర్వేశ! మాయిమ్ము లెందుఁ గలవు¯ చిత్తమందున్న క్రమమునఁ జేయఁదగును. (694) నా పుణ్య మేమి చెప్పుదు? ¯ నీ పాదరజంబుఁ గంటి నే; సనకాదుల్¯ నీ పాదరజముఁ గోరుదు¯ రే పదమం దున్ననైన నిఁక మేలు హరీ!"

కాళిందుని శాసించుట

(695) అని విన్నవించిన కాళియు పలుకులు విన నవధరించి కారుణ్యమానసుం డైన సర్వేశ్వరుం డతని కిట్లనియె (696) “గోవర్గముతో మనుజులు ¯ ద్రావుదు రీ మడుఁగు నీరుఁ; దగ దిం దుండన్; ¯ నీవును నీ బాంధవులును¯ నీ వనితలు సుతులుఁ జనుఁడు నేఁ డంబుధికిన్. (697) నిను నే శాసించిన కథ¯ మనమునఁ జింతించి రేపుమాపును గీర్తిం¯ చిన మనుజులు నీ భయమును¯ విను మెన్నడు బొంద రెందు విషవిజయముతోన్. (698) ఇది మొద లెవ్వరైన నరు లీ యమునాతటినీ హ్రదంబులో¯ వదలక తోఁగి నన్ను నుపవాసముతోడఁ దలంచి కొల్చుచుం¯ గదలక దేవతాదులకుఁ గా జలతర్పణ మాచరించినన్¯ సదమలచిత్తులై దురితసంఘముఁ బాయుదు రా క్షణంబునన్. (699) గరుడభీతి రమణకద్వీప మొల్ల కీ¯ మడువుఁ జొచ్చి తీవు; మత్పదాబ్జ¯ లాంఛనములు నీ తలను నుంటఁజూచి యా ¯ పక్షిరాజు నిన్నుఁ బట్ట డింక." (700) అని యిట్లు విచిత్రవిహారుండైన గోపాలకృష్ణకుమారుం డానతిచ్చిన, నియ్యకొని, చయ్యన నయ్యహీంద్రుండు తొయ్యలులుం దానును నెయ్యంబున నయ్యీశ్వరునకు నవ్యదివ్యాంబరాభరణ రత్నమాలికానులేపనంబులు సమర్పించి, తేఁటితండంబులకు దండ యగు నీలోత్పలంబుల దండ యిచ్చి, పుత్ర మిత్ర కళత్ర సమేతుండై, బహువారంబులు కైవారంబుచేసి, వలగొని, మ్రొక్కి లేచి, వీడ్కొని రత్నాకరద్వీపంబునకుం జనియె; నిట్లు. (701) వారిజలోచనుఁ డెవ్వరు¯ వారింపఁగలేని ఫణినివాసత్వంబున్¯ వారించిన యమున సుధా¯ వారిం బొలుపారె నెల్లవారికిఁ బ్రియమై.”

కాళియుని పూర్వకథ

(702) అనిన విని “మునీంద్రా! యేమి కారణంబునఁ గాళియుండు భుజగనివాసం బైన రమణకద్వీపంబు విడిచె? నతం డొక్కరుండును గరుడున కేమి తప్పుఁ దలంచె?” నని నరవరుం డడిగిన మునివరుం డిట్లనియె. (703) "సర్పభీరువులైన జనులెల్ల నెలనెల¯ సరసభక్ష్యములు వృక్షముల మొదల¯ సర్పంబులకుఁ బెట్ట, సర్పంబులును మును¯ సర్పాంతకుఁడు దమ్ముఁ జంప కుండఁ ¯ బ్రతిమాసమును దమ భాగ భక్ష్యంబు లా¯ పక్షిరాజున కిచ్చి బ్రతుకు చుండ, ¯ విషవీర్యదుర్మదావిష్టుఁడై కాళియుఁ¯ డహికులాంతకుని పా లపహరించి (703.1) యీక తనపాలి బలి భాగ మెల్లఁ దినిన¯ విని ఖగేంద్రుఁడు కోపించి "వీని తలలు¯ చీఱి చెండాడి భోగంబు చించివైచి ¯ ప్రాణములఁ బాపి వచ్చెదఁ బట్టి"యనుచు. (704) అక్షీణ కనకసన్నిభ¯ పక్షయుగోద్భూత ఘోర పవమాన మహా¯ విక్షేప కంపితానే¯ కక్షోణిధరేంద్రుఁ డగుచు గరుడుఁడు వచ్చెన్. (705) వచ్చిన సర్పవైరిఁ గని వ్రాలక లేచి మహాఫణావళుల్¯ విచ్చి దృగంచలంబుల నవీనవిషాగ్నికణంబు లొల్కఁగా¯ నుచ్చలదుగ్రజిహ్వలు మహోద్ధతిఁ ద్రిప్పుచు నూర్పు లందుఁ గా¯ ర్చిచ్చెగయంగఁ బాఱి కఱచెన్ విహగేంద్రు నహీంద్రుఁ డుగ్రతన్. (706) కఱచిన భుజగము రదములు¯ విఱుగఁగ వదనముల విషము వెడలఁగ శిరముల్¯ పఱియలుగ నడిచె గరుడుఁడు¯ తఱిమి కనకరుచులు గలుగు తన డాఱెక్కన్. (707) ఇట్లహికులారాతి చేత వ్రేటుపడి వెఱచి పఱతెంచి కాళియుం డీ గభీరంబైన మడుఁగుఁ జొచ్చె; మఱియు నొక్కవిశేషంబు గలదు. (708) మున్ను సౌభరి యను ముని యీ హ్రదంబునఁ¯ దపము జేయుచు నుండ ధరణిలోన¯ నాఁకలిగొని పన్నగాంతకుఁ డొకనాడు¯ చనుదెంచి యందుల జలచరేంద్రు¯ నొడిసి భక్షించిన నున్న మీనము లెల్ల¯ ఖిన్నంబులై వగఁ గ్రిస్సి యున్నఁ¯ జూచి యా మునిరాజు శోకించి కోపించి¯ గరుడుఁడు నేడాది గాఁగ నిందుఁ (708.1) జొచ్చి మీనంబులను మ్రింగఁజూచెనేనిఁ¯ జచ్చుఁగావుత మని యుగ్రశాప మిచ్చెఁ¯ గాళియుం డొక్కఁడా శాపకథ నెఱుంగు¯ నితర భుజగంబు లెవ్వియు నెఱుఁగ వధిప! (709) అది కారణంబుగాఁ గాళియుం డా మడుఁగు జొచ్చియున్న, గో మనుజ రక్షణార్థంబు కృష్ణుం డతని వెడలించె; నిట్లు దివ్య గంధాంబర సువర్ణ మణిగణ మాలికాలంకృతుండయి, మడుఁగు వెడలివచ్చిన మాధవుం గని, ప్రాణలాభంబులం బొందిన యింద్రియంబులం బోలె, యశోదారోహిణీ సమేతలయిన గోపికలును, నంద సునందాదులయిన గోపకులును మూర్ఛలం బాసి, తేఱి తెప్పఱిలి, లేచి పరమానందంబులం బొందిరి; బలభద్రుండు తమ్ముని యాలింగనంబుఁ జేసె; నప్పుడు. (710) ఱంకెలు వైచె వృషభము ల¯ హంకారముతోడ; లేఁగ లట్టి ట్టుఱికెం; ¯ బొంకముల నొప్పె ధేనువు; ¯ లంకురితము లయ్యె దరువు లా హరిరాకన్. (711) "నీ సుతుఁడహిచే విడివడె¯ నీ సురుచిర భాగ్యమహిమ నిశ్చల"మనుచున్¯ భూసురులు సతులుఁ దారును¯ భాసురవచనముల నందుఁ బలికి రిలేశా! (712) "నిన్నా యుగ్ర భుజంగమంబు గఱవన్ నీ వాపదం బొందుచున్¯ న న్నేమంటి తనూజ! యోడవు గదా నా కూన! నా తండ్రి! రా¯ వన్నా"యంచు శిరంబు మూర్కొని నిజాంకాగ్రంబుపై నిల్పుచున్¯ గన్నీ రొల్కఁగఁ గౌగలించెఁ దనయున్ గారాముతోఁ దల్లి దాన్.

కార్చిచ్చు చుట్టుముట్టుట

(713) ఇట్లు పరమ సంతోషులై ఘోషజను లా రేయి కాళిందీతటంబున నాఁకలి నీరుపట్టుల డస్సి క్రుస్సి, గోవులుం దారు నుండ నగణ్యంబగు న య్యరణ్యంబున నొక్కదవానలంబు పుట్టి చుట్టుముట్టుకొని నడురేయి నిద్రితంబైన వ్రజంబుమీఁద గదిసిన నదిరిపడి లేచి, దందహ్యమానదేహులై సకల జనులును మాయా మనుజ బాలకుండైన హరికి శరణాగతులై యిట్లనిరి. (714) "అదె వచ్చెన్ దవవహ్ని ధూమకణ కీలాభీల దుర్వారమై¯ యిదె కప్పెన్ మము నెల్లవారి నిట మీఁ దేలాగు రక్షింపు; నీ¯ పదపద్మంబులకాని యొండెఱుఁగ; మో పద్మాక్ష! యో కృష్ణ! మ్రొ¯ క్కెద మో! రామ! మహాపరాక్రమ! దవాగ్నిన్ వేగ వారింపవే. (715) నీ పాదంబులు నమ్మిన¯ నాపద లెక్కడివి? జనుల కత్యుగ్ర మహా¯ దీపిత దావజ్వలనము¯ పైఁబడ కుండెడి విధంబు భావింపఁగదే." (716) అని ఘోషించు ఘోషజనులం గరుణించి జగదీశ్వరుండగు ననంతు డనంతశక్తియుక్తుం డై గహనంబు నిండిన దావదహనంబు పానంబు చేసిన, విజయగానంబు దశదిశల నిగిడె; నంత రామకృష్ణులు గోగణ జ్ఞాతి సహితులై మందయానంబున మందకుం జని; రిట్లు రామకేశవులు గోపాలబాల వేషంబులఁ గ్రీడించు సమయంబున.

గ్రీష్మఋతు వర్ణనము

(717) దినము లంతంతకు దీర్ఘంబులై యుండ¯ దిననాథుఁ డుత్తుర దిశఁ జరించె; ¯ నాఁటినాటికి నెండ నవ్యమై ఖర మయ్యె¯ వెచ్చని గాడ్పులు విసరఁ జొచ్చె; ¯ మేదినీరేణువుల్ మింట సంకుల మయ్యె¯ నేఱులుఁ గొలఁకులు నిగిరిపోయెఁ; ¯ బానీయ శాలలఁ బథిక సంఘము నిల్చెఁ¯ జప్పరంబుల భోగిచయము డాఁగెఁ; (717.1) దరులఁ గుసుమ చయము దళములతో వాడె; ¯ మిథునకోటికి రతి మెండు దోఁచె; ¯ నఖిలజంతుభీష్మమైన గ్రీష్మము రాకఁ¯ గీలి యడవులందుఁ గేలి సలిపె. (718) వాఁడిరుచులు గలుగువాని వేఁడిమి గ్రీష్మ¯ కాలమందు జగము గలయఁబడియె ¯ బ్రహ్మ జనులకొఱకు బ్రహ్మాండఘటమున¯ నుష్ణరసముఁ దెచ్చి యునిచె ననఁగ. (719) ఇట్లాభీలంబైన నిదాఘకాలంబు వర్తింప బృందావనంబు రామ గోవింద మందిరంబైన కతంబున నిదాఘకాల లక్షణంబులం బాసి, నిరంతర గిరినిపతిత నిర్ఝర శీకర పరంపరా భాసిత పల్లవిత కుసుమిత తరులతం బయ్యును, దరు లతా కుసుమ పరిమళ మిళిత మృదుల పవనం బయ్యును, బవనచలిత కమల కల్హార సరోవర మహాగభీర నదీహ్రదం బయ్యును, నదీహ్రద కల్లోల కంకణ ప్రభూత పంకం బయ్యును, బంక సంజనిత హరితాయమాన తృణనికుంజ బయ్యును, జనమనోరంజనంబయిన వసంతకాల లక్షణంబులు గలిగి లలితమృగపక్షి శోభింతంబై యొప్పుచుండె; మఱియు నందు. (720) పికముల కోలాహలమును, ¯ శుకసంఘము కలకలంబు, సుభగ మయూర¯ ప్రకరము కేకారవ, మళి¯ నికరము రొదయును జెలంగె నెఱి నయ్యడవిన్. (721) ఆతత యమునా సరసీ¯ జాత తరంగాభిషిక్త జలరుహ గంధో¯ పేతానిల మడఁచె నిదా¯ ఘాతత దావాగ్నిపీడ న వ్వనమందున్. (722) ఇట్లామని కందువ తెఱంగు గలిగి సుందరంబైన బృందావనంబునకు బలకృష్ణులు గోవుల రొప్పికొని చని, గోపకులుం దారును నొండొరులతో నగుచుఁ, దెగడుచుఁ, జెలంగుచుఁ, దలంగుచు. జిఱజిఱందిరుగుచుఁ, దరులసందుల కరుగుచు, దాఁగిలిమూత లాడుచు, గీతంబులు బాడుచు, వేణునాదంబులు ఘటియించుచు, నటియించుచు, గతులు దప్పినక్రియ నొఱఁగుచుఁ, గుప్పల కుఱుకుచుఁ జప్పటలుగొట్టుచుఁ, గందుకంబులఁ దట్టుచు నుప్పరం బెగసి దర్దురంబుల చందంబున దాఁటుచు, నామలకబిల్వాది ఫలంబుల మీఁటుచుఁ, గుటవిటపంబులుఁ గదల్చుచు, మృగంబుల నదల్చుచుఁ, బెరల రేఁపుచు, మధుమక్షికలఁ జోపుచుఁ, దేనియలు ద్రావుచు, సొమ్మసిలం బోవుచు, గురుశిష్య కల్పనంబులం బనులు చేయుచుఁ, గాకపక్షధరులై ముష్టియుద్ధంబుల డాయుచుఁ, బన్నిదంబులు చఱచుచుఁ, బులుగుల భంగి నఱచుచు, బహురూపంబులు పన్నుచు, నెగిరి తన్నుచు, సేవ్యసేవక మిత్రామిత్ర భావంబులు వహించుచు, నుత్సహించుచు మఱియు ననేకవిధంబులఁ గ్రీడించి; రందు. (723) "మా పాలికి బలకృష్ణులు¯ భూపాలకు"లంచు నెగిరి బొబ్బ లిడుచు నా¯ గోపాలురు మోతురు ప్రమ¯ దాపాదకు లగుచు వల్లికాందోళికలన్. (724) గోపకు లందఱు నాడుచు¯ దీపింపఁగ రామవాసుదేవుల వెనుకం¯ బై పడి పాఠక గాయక¯ రూపంబులఁ బొగడుదురు నిరూఢాత్మకులై. (725) ప్రీతిన్ గోపకు లందఱు¯ గీతంబులు పాడఁ దరుల క్రిందను నగుచుం¯ జేతులు ద్రిప్పుచు వెడవెడ¯ పాతర లాడును యశోదపాపం డడవిన్. (726) జలజాక్షుండును రాముఁడున్ నటనముల్సల్పంగ గోపాల మూ¯ ర్తులతో వారలఁ గొల్చు నిర్జరులు సంతోషించి, వేణుస్వనం¯ బులుగావించుచుఁ గొమ్ములూదుచు శిరంబుల్ద్రిప్పుచుం బాడుచున్¯ వలనొప్పన్ వినుతించి రప్పుడు నటుల్ వర్ణించు చందంబునన్.

ప్రలంబాసుర వధ

(727) ఇట్లు రామకృష్ణులు నద నదీ తీరంబులఁ, గొలంకుల సమీపంబుల, గిరులచఱుల సెలయేఱుల పొంతల మడుఁగులచెంతలఁ, బొదలక్రేవలఁ, బసిమి గల కసవుజొంపంబులఁ బసుల మేపుచుడం బ్రలంబుడను రక్కసుం డుక్కుమిగిలి గోపాలరూపంబున వచ్చి వారల హింసజేయ దలంచుచుండ న య్యఖిలదర్శనుం డగు సుదర్శనధరుం డెఱింగియు నెఱుంగని తెఱంగున. (728) ఆ రాముని సహజన్ముఁడు¯ రా రమ్మని వానిఁ జీరి రాకం బోకన్¯ గారాము చేసి మెల్లన¯ పోరామి యొనర్చెఁ బిదపఁ బొరిగొనుకొఱకున్. (729) ఇట్లు ప్రలంబునితోఁ జెలిమి చేయుచుఁ, గృష్ణుండు గోపాలకులకు, నిట్లనియె. (730) “మనకుఁ బ్రొద్దుపోదు మన మిందఱము రెండు¯ గములవార మగుచుఁ గందుకముల¯ శిలలు గుఱులు చేసి చేరి క్రీడింతము¯ రండు వలయు జయపరాజయములు. (731) అని యిట్లుపలికి, తానును బలభద్రుండును బెన్నుద్దులై యితర వల్లవు లెల్ల నుద్దించుకొని చిఱ్ఱుద్దు లై వచ్చిన సమయంబుగ విభజించికొని, రెండు గములవారై మార్గంబులందుఁ దృణ దారు శిలా కల్పితంబు లగు గుఱులొడ్డి, కందుక శిలాది ప్రక్షేపణంబుల లక్ష్యంబులఁ దాఁక వైచి, జయ పరాజయ నిర్ణయంబులు గైకొని వాహ్యవాహక లక్షణంబుల నిర్జితులు జేతల వహించి క్రీడించుచు, బలరామునికి వాని చందంబు రహస్యంబున నెఱింగించి; పసుల బిల్చుచు, భాండీరకం బను వటంబు జేరి రా సమయంబున; క్రీడయందుఁ శ్రీదామనామధేయండైన గోపకుండు శ్రీకృష్ణుని వహించె; భద్రసేనుండు వృషభు నెక్కించుకొనియె; బలభద్రుండు ప్రలంబు నారోహించె నప్పుడు. (732) వనజాక్షున్ బలిమిన్బలాఢ్యుఁడు తృణావర్తుండు మున్మింటికిం¯ గొనిపోఁ జాలక చిక్కినాఁ డతని నాకున్ మోవరా దంచు నా¯ దనుజారిన్ గొనిపోఁ దలంపక వడిన్ దైత్యేశుఁ డయ్యాటలోఁ¯ గొనిపోయెన్ గిరి దాఁటి రాము నఖిలక్రూరక్షయోద్దామునిన్. (733) ఇట్లు క్రీడాకల్పిత వాహనుం డయిన ప్రలంబుండు బలభద్రునిం గొనిపోవుచు. (734) గురుశైలేంద్ర సమాన భారుఁ డగు నా గోపాలకున్ మోవలే¯ క రయోద్రేకము మాని దైత్యుఁడు నరాకారంబు జాలించి భీ¯ కర దైత్యాకృతి నేగె హేమకటకాకల్పంబుతో రాముతో¯ మురు వొప్పంగఁ దటిల్లతేందుయుత జీమూతంబు చందంబునన్. (735) మోసము లేక వాని పెనుమూఁపుననుండుచు నా హలాయుధుం¯ డా సమయంబునం గనియె హాటక రత్న కిరీట కుండలో¯ ద్భాసిత మస్తకున్ భ్రుకుటి భాసుర దారుణ నేత్రునుగ్ర దం¯ ష్ట్రాసహితుం బ్రలంబు నురుశౌర్యవిలంబు మదావలంబునిన్. (736) కని నక్తంచరుం డని యించుక శంకించి, వెఱవక. (737) కడువడిఁ దను దివికిం గొని¯ వడిఁ జనియెడు దనుజు శిరము వ్రయ్య హలధరుం¯ డడరి పటుచటులతర మగు¯ పిడికిట వెస విసరి పొడిచె బిఱుసున నలుకన్. (738) హలధరు బలుపిడికిట హతిఁ¯ దల పగిలిన రుధిరజలము తనువివరములం¯ దొలఁక మొఱయిడుచు దనుజుఁడు¯ బలరిపుపవి నిహత నగము పగిదిం బడియెన్. (739) “మేలుమేలుగదయ్య! రాముఁడు మేటిరక్కసు నొక్కఁడున్¯ నేలఁ గూలిచె నొక్క పోటున నేడు విస్మయ” మంచు గో¯ పాలకుల్ గని చచ్చి వచ్చిన భ్రాతఁ గన్న విధంబునం¯ జాల దీవన లిచ్చి రాముని సత్కరించిరి వేడుకన్. (740) బలవంతుఁ డగు ప్రలంబుఁడు¯ బలుముష్టిన్ నిహతుఁడైన బ్రతికితి మనుచున్¯ బలసూదనాది దివిజులు¯ బలుపైఁ గుసుమముల వానఁ బరఁగించి రొగిన్.

దావాగ్ని తాగుట

(741) ఇట్లు గోపకులు క్రీడింప గోవు లంతంతం గాంతారంబున వింత కసవులు మెసవుచు, మేఁతపడి నొండడవికి దూరంబు చని యందు దవదహనపవన సంస్పర్శంబు సైరింపక కంపించి దప్పి నొప్పుజెడి ఘోషించిన. (742) ఆ గోపాలకు లందఱుం బసుల కుయ్యాలించి కౌమార కే¯ ళీ గాఢత్వము మాని గోఖురరదాళిచ్ఛిన్న ఘాసంబుతో¯ బాగై యున్న పథంబునం జని దవాపన్నంబు గాకుండ వే¯ వేగన్ గోగణమున్ మరల్చి రటవీవీధిన్ జవం బొప్పఁగన్. (743) జలధర గభీర రవమున¯ నళినదళాక్షుండు దమ్ము నామాంకములం¯ బిలిచిన విని ప్రతిఘోషణ¯ ములు జేయుచుఁ బసులు దిరిగె ముదమున నధిపా! (744) అంత న వ్వనంబున దైవయోగంబునం బుట్టిన కార్చిచ్చు బిట్టు విసరెడి కరువలి వలన మిన్నుముట్ట మిట్టిపడి, గట్టు చెట్టనక దరికొని, యట్టె క్రాలుచుఁ జుట్టుకొని, పఱవం గని పల్లటిల్లిన యుల్లంబులతో వల్లవు లెల్లఁ దల్లడిల్లి సబలుండైన హరికి మృత్యుభీతుల రీతిం జక్క మ్రొక్కి యిట్లనిరి. (745) “అభ్రంకష ధూమాయిత¯ విభ్రాంత మహాస్ఫులింగ విసరోగ్ర శిఖా¯ విభ్రష్ట దగ్ధలోకా¯ దభ్రంబై వచ్చెఁ జూడు దవశిఖి కృష్ణా! (746) నీ చుట్టాలకు నాపదల్ గలుగునే? నే మెల్ల నీ వార మ¯ న్యాచారంబు లెఱుంగ; మీశుడవు; మా కాభీలదావాగ్ని నే¯ డే చందంబున నింక దాఁటుదుము? మమ్మీక్షించి రక్షింప వ¯ న్నా! చంద్రాభ! విపన్నులన్ శిఖివితానచ్ఛన్నులన్ ఖిన్నులన్." (747) అని విన్నవించి రంత. (748) బంధుజనంబుచేత నిటు ప్రార్థితుఁడై హరి విశ్వరూపు “డో¯ బంధువులార! మీ నయనపంకజముల్ ముకుళింపుఁ డగ్నినీ¯ సంధి నడంతు నే” ననినఁ జక్కన వారలు నట్ల చేయుఁడున్, ¯ బంధురదావపావకముఁ బట్టి ముఖంబునఁ ద్రావె లీలతోన్. (749) ఇట్లు నిజయోగ వైభవంబున దావదహనంబుఁ బానంబుచేసి నిమిషమాత్రంబున గోపకుల నందఱ భాండీరక వటసమీపంబునకుం దెచ్చి విడిచిన వారు వికసిత నయన కమలు లయి కృష్ణుని యోగమాయాప్రభావంబున నెరగలి చిచ్చు మ్రగ్గె నని యగ్గించుచుఁ దమ మనంబులందు. (750) "కార్చి చ్చార్చు పటుత్వము¯ నేర్చునె నరుఁ డొకఁడు? శౌరి నేడిదె కార్చి¯ చ్చార్చి మనలఁ రక్షింపఁగ¯ నేర్చె; నితం డజుఁడొ హరియొ నిటలాక్షుండో!" (751) అని వితర్కించి; రంతఁ గృష్ణుండు సాయాహ్నసమయంబున రామసహితుండై వంశనాళంబు పూరించుచు గోపగణ జేగీయమానుండై గోష్ఠంబుఁ బ్రవేశించె; నప్పుడు. (752) కమలాక్షు నొద్ద నుండని¯ నిమిషము యుగశతముగాఁగ నెగడిన గోప¯ ప్రమదలు సంభ్రమమున నా¯ కమలాక్షునిఁ జూచి ముదముఁ గనిరి మహీశా! (753) ఆ సమయంబున గోపకు లిండ్లకడనున్న వృద్ధకాంతాజనంబులకు రామకృష్ణుల చిత్రచరిత్రంబులు చెప్పిన, విని వారు వారిని గార్యార్థులై వచ్చిన వియచ్చరవరు లని తలంచి; రంత.

వర్షర్తు వర్ణనము

(754) పూర్వవాయువులు ప్రభూతంబులై వీచెఁ¯ బడమట నింద్రచాపంబు దోఁచెఁ¯ బరివేషయుక్తమై భానుమండల మొప్పె¯ మెఱపు లుత్తరదిశ మెఱవఁ దొడగె¯ దక్షిణగాములై తనరె మేఘంబులు¯ జలచరానీకంబు సంతసించెఁ¯ జాతకంబుల పిపాసలు కడపలఁ జేరెఁ¯ గాంతారవహ్నుల గర్వ మడఁగె (754.1) నిజకరాళివలన నీరజబంధుండు¯ దొల్లి పుచ్చుకొనిన తోయ మెల్ల¯ మరల నిచ్చుచుండె మహిఁ గర్షకానంద¯ కందమైన వాన కందు వందు. (755) వర్షాకాలభుజంగుఁడు¯ హర్షముతో నిడిన నవ నఖాంకము లని యు¯ త్కర్షింప భూమిసతిపైఁ¯ కర్షక హలరేఖ లమరె గహనాంతములన్. (756) చెలువుఁడు ప్రావృట్కాలుఁడు¯ పొలసినఁ బులకించు భూమి పులకము లనఁగా¯ మొలచి తల లెత్తి నిక్కుచు¯ సలలితగతిఁ జాలువారె సస్యము లధిపా! (757) మఱియుఁ జటుల పవన చలితంబులై మిన్నుదన్ని, లెక్కకు మిక్కిలియై, ఱెక్కలు గల నీలగిరుల సిరుల మీఱి, కాఱుకొని తెఱపిపడక, నిబిడంబులై, శిశిరకిరణ తరణి మండలంబుల చొప్పుదప్పించి, విప్పు కలిగి, చదలు గప్పికొనిన లీలం గ్రాలు నీలమేఘంబులును, మేఘవిముక్తంబులై జలదసమయవిటుండు సరసగతి ధరణిసతి యురమ్మున దర్పించి, నేర్పున సమర్పించు కర్పూరఖండంబుల వడువునఁ బుడమిం బడు కరకలును, గరకానుగతంబులై యసిత భోగిభోగంబుల బాగున నీలమణిమాలికా విశేషంబుల విధంబున నెడపడక పడు సలిలధారలును, ధారాధర విగళిత విమల సలిలంబులం దోఁగుచు మదజలాభిషిక్త మత్త మాతంగంబుల సొబగున నుండు కొండలును, గొండల తుదలనుండి గండ శైలంబులపైఁ బడి వికీర్యమాణంబులగు గిరినిర్ఝరంబుల శీకరంబులును, శీకరపరంపరల చొదుకులు మదుగులుగొనినఁ బిద పిద నగుచుఁ జిదుకుచిదుకుమను రొంపులును, రొంపులుగ్రొచ్చి క్రచ్చర నుచ్చలితంబులై పఱచు వఱదలును, వఱదల వలన మెదలి కదలిపాఱెడి యేఱులును నేఱులవెంట గఱులు త్రిప్పుచు గములుగొని క్రొన్నీటి కెదురునడచు మీనంబులును, మీననయనల మేనుల మెఱుంగు సొంపు పెంపు సైరింపక కంపించి తిరిగి సురిఁగి చనియెడు కరణి మేఘ మధ్యంబులం బొలసి మలసి నిలువక మరలి చను క్రొమ్మెఱుంగులును, మెఱుంగుల తెఱంగునఁ దెఱవలు పురుషులం దగిలి నిలువరని జనుల కెఱుంగ నలువ మొఱయిడిన వడువున మొరయు నుఱుములును, నుఱుముల కులికిపడక కికురుపొడుచుచుఁ బింఛంబులు కొంచెంబులు జేయక విప్పి దెప్పరంబుగ ఱొప్పుచు నర్తనంబులు చేయు మయూరంబులును, మయూర ఘోషంబులు భీషణంబులై చెవులు సోఁక ననూనంబులైన మానంబుల నాసలు చెడి యొండొరులకుం గ్రిందుపడి క్రందుకొను విరహిజనులును, జనులకు రేపు మా పని రూపింప రాక మాలతీ కుసుమ విసర వికసన విదితావసానంబు లగు దుర్దినంబులును, దినావసాన సమయంబున మినుకుమినుకు మని మెఱయుచుం దిరుగు ఖద్యోతంబులును, ఖద్యోతసందర్శనంబు గోరుచు నుడుగక విడువక కురియు జడింబడి వలిగొని వడఁకుచు నశనయత్నంబులు వర్జించి ఖర్జూర జంబూఫల భక్షణంబుల దేహ సంరక్షణంబు లాచరించు వనచరులును, వనచరానందకారిణులై వారరమణులరుచి ననవరత భుజగ సమేతలగు కేతకులును, గేతకీ కదంబ యూధికా కుటజ కుసుమ పరిమళ మిళితంబు లగు విపిన మార్గంబులును మార్గనిరోధంబు లగుచుం బెరిగి రసికంబులై పసరు దొలంకుచు హరిన్మణికిరణ పుంజంబుల భంగి రంజిల్లి తొంగలించుచు జొంపంబులు గొనిన కసువులును, గసువులు మెసవి మిసమిసం దనువులు మెఱయ వలుఁద పొదుఁగుల బరువునం గదలక నిల్చి నెమ రమర నిడు ధేనువులును, గలిగి ధేనువ్రజంబుకైవడిఁ బయఃకణ మనోహరంబై, హరకరంబు భంగిఁ బరిపూర్ణ సారంగ భాసురంబై, సురగిరి చెలువున హరి శరాసన విభీషణంబై, విభీషణ హృదయంబు పోలికఁ బ్రకటిత హరిశబ్ద వైభవంబై, భవపూజనంబు చందంబున నింద్రగోపాది విభవ జనకం బయి, జనక యాగంబు భాతి సీతాప్రకరణాలంకృతం బయి, కృతయుగంబు సొంపున బహువర్షంబునై వర్షాగమంబు చెలువొందె నప్పుడు. (758) వాడక వ్రాలక తెవుళులఁ¯ గూడక తగ నల్ల గెఱలుగొని నవకములై¯ చూడఁగ భద్రము లగుచును¯ వీడెన్ సస్యంబు లిడుమ వీడెం బ్రజకున్. (759) జీవనము చాలఁ గలిగియుఁ¯ గావరమున మిట్టిపడని ఘనునిక్రియ నదీ¯ జీవనములు చొర జలనిధి ¯ ప్రావృట్కాలమున డిందుపడి యుండె నృపా!