పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవత పారాయణ - 3 : దశమ పూర్వ 263 - 402

తృణావర్తుడు కొనిపోవుట

(263) అప్పుడు. (264) ఖరుఁ డగు కంసుని పంపున¯ నరిగి తృణావర్తుఁ డవని కవచాటముగాఁ¯ సురకరువలి యై బిసబిస¯ నరు దరు దన ముసరి విసరి హరిఁ గొనిపోయెన్. (265) సుడి యెఱుఁగని హరి సుడివడ¯ సుడిగాలి తెఱంగు రక్కసుఁడు విసరెడి యా¯ సుడిగాలి ధూళి గన్నుల¯ సుడిసిన గోపకులు బెగడి సుడివడి రధిపా! (266) మఱియు న వ్వలయపవన దనుజుండు విలయపవనుని తెఱంగునం గసిమసంగి ముసరి మసరుకవిసి విసిరెడి సురకరువలిం బొడమిన పుడమిరజంబు వడి నెగసి గగనమున మెఱసి తరణి కిరణములకు మఱుఁగుపడిన నిబిడ మగు బెడిదంపు తిమిరమున దశదిశ లెఱుంగఁబడక గోకులం బాకులంబు నొంద నొండొరుల నెఱుంగక బెండుపడుచున్న జనంబుల మనంబుల ఘనంబగు భయంబు రయంబునం జెంద నదభ్రపరిభ్రమణ శబ్దంబున దిగంతంబులు చెవుడుపడి పరిభ్రాంతంబులుగ నొక్క ముహూర్తమాత్రంబున భువన భయంకరత్వంబు దోఁచె; నా సమయంబున. (267) పాపనిఁ జూడఁ గానక విపద్దశ నొంది కలంగి తల్లి "యో¯ పాపఁడ! బాలసూర్యనిభ! బాలశిరోమణి! నేడు గాలికిం¯ జేపడిపోయితే"యనుచుఁ జీరుచు దైవముఁ జాల దూఱుచుం¯ దాపము నొంది నెవ్వగల డయ్యుచుఁ గుందుచు బిట్టు గూయుచున్ (268) "సుడిగాలి వచ్చి నిన్నున్¯ సుడిగొని కొనిపోవ మింట సుడిసుడి గొనుచున్¯ బెడఁ గడరెడు నా ముద్దుల¯ కొడుకా! యే మంటి"వనుచు “ఘోరం” బనుచున్ (269) "ఇక్కడఁ బెట్టితిం దనయుఁ డిక్కడ నాడుచు నుండె గాలి దా¯ నెక్కడ నుండి వచ్చె శిశు వెక్కడి మార్గము పట్టిపోయె నే¯ నెక్కడఁ జొత్తు"నంచుఁ గమలేక్షణ గ్రేపుఁ దొఱంగి ఖిన్నయై¯ పొక్కుచు వ్రాలు గోవు క్రియ భూస్థలి వ్రాలె దురంత చింతయై (270) పాపనికై యిటు పొగిలెడి¯ యా పాపని తల్లిఁ జూచి యారటపడుచున్¯ గోపాలసతులు బాష్పజ¯ లాపూరిత నయన లైరి యార్తిం బడుచున్ (271) ఆలోఁ జక్రసమీరదైత్యుఁడు మహాహంకారుఁడై మింటికిన్¯ బాలుం దోకొనిపోయి పోయి తుదిఁ దద్భారంబు మోవన్ బల¯ శ్రీ లేమిం బరిశాంత వేగుఁ డగుచుం జేష్టింపఁగా లేక ము¯ న్నీలా గర్భకుఁ జూడ నంచు నిటమీఁ దెట్లంచుఁ జింతించుచున్. (272) అట్లు దనుజుండు చింతించుచున్న సమయంబున. (273) బాలద్విరద కరంబులఁ¯ బోలెడి కరములను దనుజు బొండుగు బిగియం¯ గీలించి వ్రేలఁ బడియెను¯ బాలకుఁ డొక కొండభంగి బరు వై యధిపా! (274) మెడ బిగియఁ బట్టుకొని డిగఁ¯ బడియెడి బాలకునిచేతఁ బర్వతనిభుచే¯ విడివడఁజాలక వాఁ డురిఁ¯ బడి బెగడెడు ఖగము భంగి భయముం బొందెన్. (275) హరి కరతల పీడనమునఁ¯ బరవశుఁడై ఱాలమీఁద భగ్నాంగకుఁ డై¯ సురవైరిభటుఁడు గూలెను¯ బురభంజను కోలఁ గూలు పురముం బోలెన్. (276) అంత గోపకాంత లంతయుం గని రోదనంబులు మాని సమ్మోదంబున విక్కవిరిసి రక్కసుని యురంబున మురువు గలిగి బరువులేక వ్రేలు బాలునిం గొనివచ్చి ముచ్చిరుచున్న తల్లి కిచ్చి రప్పుడు గోపగోపికాజనంబు లందఱు దమలో నిట్లనిరి. (277) "రక్షణము లేక సాధుఁడు¯ రక్షితుఁ డగు సమతఁ జేసి రాయిడు లందున్¯ రక్షణములు వెయి గలిగిన¯ శిక్షితుఁ డగు ఖలుఁడు పాపచిత్తుం డగుటన్. (278) గత జన్మంబుల నేమి నోఁచితిమొ? యాగశ్రేణు లేమేమి జే¯ సితిమో? యెవ్వరి కేమి పెట్టితిమొ? యే చింతారతిం బ్రొద్దు పు¯ చ్చితిమో? సత్యము లేమి పల్కితిమొ? యే సిద్ధప్రదేశంబుఁ ద్రొ¯ క్కితిమో? యిప్పుడు జూడఁగంటి మిచటం గృష్ణార్భకు న్నిర్భయున్."

పాలుతాగి విశ్వరూప ప్రదర్శన

(279) అని పలికి రంత నందుండు మున్ను దనకు వసుదేవుండు జెప్పిన మాటలకు వెఱఁగుపడుచుండె మఱియును. (280) జననాథ! యొకనాడు చన్ను చేఁపినఁ దల్లి¯ చిన్ని ముద్దుల కృష్ణుఁ జేరఁ దిగిచి¯ యెత్తి పెందొడలపై నిడికొని ముద్దాడి¯ చన్నిచ్చి నెమ్మోము చక్క నివిరి¯ యల్లని నగవుతో నావులించిన బాలు¯ వదన గహ్వరమున వారినిధులు¯ దిశలు భూమియు వనద్వీపశైలంబులు¯ నేఱులు గాలియు నినుడు శశియు (280.1) దహనుఁ డాకసంబు దారలు గ్రహములు¯ నఖిలలోకములు జరాచరంబు¯ లైన భూతగణము లన్నియు నుండుటఁ¯ జూచి కన్నుమోడ్చి చోద్యపడియె. (281) అంత నొక్కనాడు వసుదేవు పంపున యాదవ పురోహితుం డైన గర్గుండు మందకుం జనుదెంచిన నందుం డతనిఁ గనుంగొని లేచి నిలిచి కృతాంజలి యై. (282) కోరి భజించెను నందుఁడు¯ సారగుణాచారమార్గు సత్సంసర్గు¯ న్నారాధితభర్గున్ మతి¯ దూరితషడ్వర్గుఁ గుజనదుర్గున్ గర్గున్. (283) మఱియుఁ దగిన సత్కారంబులు జేసి ఇట్లనియె. (284) "ఊరక రారు మహాత్ములు¯ వా రధముల యిండ్లకడకు వచ్చుట లెల్లం¯ గారణము మంగళములకు¯ నీ రాక శుభంబు మాకు నిజము మహాత్మా! (285) జ్యోతిశ్శాస్త్రుల కెల్ల మేటరివి తేజోమూర్తి వాశాంత వి¯ ఖ్యాత స్ఫూర్తివి బ్రహ్మబోధనుఁడ వాకర్ణింపు నా పల్కు ని¯ ర్ణీతుండైన గురుండు మానవులకున్ విప్రోత్తముం డండ్రు నీ¯ చాతుర్యంబున నీ కుమారులకు సంస్కారంబుఁ గావింపవే."

బలరామ కృష్ణుల నామకరణం

(286) అని రామకృష్ణులం జూపిన గర్గుండు మున్ను కంసునిచేత వ్రేటుపడి దివికెగసిపోయిన తెఱవ చెప్పిన తెఱంగు తేటపఱచి దేవకీదేవి కొడుకని కృష్ణుని గంసుండు దలంచుఁ గావున రహస్యంబున సంస్కారంబు జేయుట కార్యం బని నందానుమతంబున రోహిణీకుమారు నుద్దేశించి. (287) “జనులు రమియింపఁ దిరిగెడి¯ యనువు కలిమి రాముఁ డనియు యదు సంకర్షం¯ బున సంకర్షణుఁ డనియును¯ ఘన బలమున బలుడు ననియు గణుతించె నృపా!” (288) మఱియుం గృష్ణు నుద్దేశించి తొల్లి “యీ శిశువు ధవళారుణపీత వర్ణుండై యిప్పుడు నల్లనైన కతంబునఁ గృష్ణుం డయ్యె; వసుదేవునకు నొక్కెడ జన్మించిన కారణంబున వాసుదేవుండయ్యె; నీ పాపనికి గుణరూపకర్మంబు లనేకంబులు గలుగుటం జేసి నామంబు లనేకంబులు గల; వీ శాబకునివలన మీరు దుఃఖంబులఁ దరియింతు; రీ యర్భకునిచేత దుర్జనశిక్షణంబు సజ్జనరక్షణంబు నగు నీ కుమారుండు నారాయణ సమానుం” డని చెప్పి; తన గృహంబునకు నమ్మునీశ్వరుండు జనియె; నందుండును బరమానందంబున నుండె; నంత.

బలరామ కృష్ణుల క్రీడాభివర్ణన

(289) జానుభాగముల హస్తములు వీడ్వడఁ జేసి¯ నిగుడు చల్లనఁ బోదు రింత నంత¯ నవ్వల పయ్యెద లంది జవ్వాడుదు¯ రాల క్రేపుల తోఁక లలమి పట్టి¯ విడువ నేరక వాని వెనువెంట జరుగుదు¯ రప్పంకముల దుడు కడర జొత్తు¯ రెత్తి చన్నిచ్చుచో నిరుదెసఁ బాలిండ్లు¯ చేతులఁ బుడుకుచుఁ జేఁపు గలుగ (289.1) దూటుదురు గ్రుక్క గ్రుక్కకు దోర మగుచు¯ నాడుదురు ముద్దుపలుకు లవ్యక్తములుగఁ¯ గరము లంఘ్రులు నల్లార్చి కదలుపుదురు¯ రామకృష్ణులు శైశవరతులఁ దగిలి. (290) తడ వాడిరి బలకృష్ణులు¯ దడ వాడిరి వారిఁ జూచి తగ రంభాదుల్¯ దడవాడి రరులు భయమునఁ¯ దడ వాడిరి మంతనములఁ దపసులు వేడ్కన్. (291) తల లెత్తి మెల్లనఁ దడవి యాడెడు వేళ¯ పన్నగాధీశులపగిదిఁ దాల్తు; ¯ రంగసమ్మృష్ట పంకాంగరాగంబుల¯ నేనుగుగున్నల నెత్తువత్తు; ¯ రసమంబులైన జవాతిరేకమ్ముల¯ సింగంపుఁగొదమల సిరి వహింతు; ¯ రాననంబుల కాంతు లంతకంతకు నెక్కు¯ బాలార్క చంద్రుల పగిదిఁ దోతు; (291.1) రెలమిఁ దల్లుల చన్నుఁబా లెల్లఁ ద్రావి¯ పరమయోగోద్భవామృత పానలీల¯ సోలి యెఱుగని యోగుల సొంపు గందు¯ రా కుమారులు జనమనోహారు లగుచు. (292) చూడని వారల నెప్పుడుఁ¯ జూడక లోకములు మూఁడు చూపులఁ దిరుగం¯ జూడఁగ నేర్చిన బాలక¯ చూడామణి జనుల నెఱిఁగి చూడఁగ నేర్చెన్. (293) నగవుల నవిద్య పోఁడిమి¯ నగుబాటుగఁ జేయనేర్చు నగవరి యంతన్¯ నగుమొగముతోడ మెల్లన¯ నగుమొగముల సతులఁ జూచి నగనేర్చె నృపా! (294) అవ్వల నెఱుఁగక మువ్వురి¯ కవ్వల వెలుఁగొందు పరముఁ డర్భకుఁడై యా¯ యవ్వలకు సంతసంబుగ¯ నవ్వా! యవ్వా! యనంగ నల్లన నేర్చెన్. (295) అడుగులు వే గలిగియు రెం¯ డడుగులనే మన్నుమిన్ను నలమిన బాలుం¯ డడుగిడఁ దొడఁగెను శాత్రవు¯ లడుగులు సడుగులును వదలి యడు గవనిఁబడన్.

హరిహరా భేదము చూపుట

(296) మఱియును. (297) తనువున నంటిన ధరణీపరాగంబు¯ పూసిన నెఱిభూతి పూఁత గాఁగ; ¯ ముందల వెలుగొందు ముక్తాలలామంబు¯ తొగలసంగడికాని తునుక గాఁగ; ¯ ఫాలభాగంబుపైఁ బరగు కావిరిబొట్టు¯ కాముని గెల్చిన కన్ను గాఁగఁ; ¯ గంఠమాలికలోని ఘననీల రత్నంబు¯ కమనీయ మగు మెడకప్పు గాఁగ; (297.1) హారవల్లు లురగహారవల్లులు గాఁగ; ¯ బాలలీలఁ బ్రౌఢబాలకుండు¯ శివుని పగిది నొప్పె శివునికిఁ దనకును¯ వేఱులేమిఁ దెల్ప వెలయునట్లు. (298) ఆ పాపల విహరణములు¯ తీపులు పుట్టింప మరగి తేఁకువ లే కా¯ గోపాలసతులు మక్కువ¯ నే పనులును మఱచి యుండి రీక్షణపరలై. (299) ఆ సమయంబున బాలకుల తల్లులు గోఱ గోరు కొమ్ములు గల జంతువులవలన నేమఱక, జలదహనకంటకాదుల యెడ మోసపోక, బాలసంరక్షణంబు జేయుచు నుల్లంబుల మొల్లంబు లైన ప్రేమంబు లభిరామంబులు గా విహరించుచుండి రంత. (300) తన యీడు గోపబాలురు¯ తనుఁ గొలువఁగ రాముఁ గూడి తనువు గలుగుచుం¯ దను గమనంబులఁ గృష్ణుఁడు¯ తనుమధ్యలు మెచ్చ నీల తనురుచి మెఱసెన్. (301) మఱియు నా కుమారుండు దినదినంబునకు సంచార సంభాషణ దక్షుండై. (302) చప్పుడు చేయకుండు మని జంకె యొనర్చిన నల్గిపోవఁగా¯ నప్పుడు బార చాఁచి తన యర్మిలి విందులు వచ్చి రంచు న¯ వ్వొప్పఁగఁ జీరు తల్లి దెస కొత్తిలి కృష్ణుఁడు రంతు జేయుచు¯ న్నెప్పటియట్ల చన్గుడుచు నింపొలయన్ మొలగంట మ్రోయఁగన్. (303) వల్లవగృహ నవనీతము¯ లెల్లను భక్షించి వచ్చి, యెఱుఁగని భంగిం¯ దల్లిఁ గదిసి చిట్టాడుచు, ¯ నల్లనఁ జను "బువ్వఁ బెట్టు మవ్వా!"యనుచున్. (304) మఱియు గోపకుమారులం గూడికొని కృష్ణుండు. (305) "గోవల్లభుఁడ నేను; గోవులు మీ"రని¯ వడి ఱంకె వైచుచు వంగి యాడు; ¯ "రాజు నే; భటులు మీరలు రండురం"డని¯ ప్రాభవంబునఁ బెక్కు పనులుపనుచు; ¯ "నేఁదస్కరుండ; మీరింటివా"రని నిద్ర¯ పుచ్చి సొమ్ములు గొనిపోయి డాఁగు; ¯ "నే సూత్రధారి; మీ రిందఱు బహురూపు"¯ లని చెలంగుచు నాటలాడఁ బెట్టు; (305.1) మూల లుఱుకును; డాఁగిలిమూఁత లాడు; ¯ నుయ్యలల నూఁగుఁ జేబంతు లొనరవైచు; ¯ జార చోరుల జాడలఁ జాల నిగుడు; ¯ శౌరి బాలురతో నాడు సమయమందు.

గోపికలు కృష్ణుని యల్లరి చెప్పుట

(306) మఱియు నా కుమారశేఖరుండు కపట శైశవంబున దొంగజాడలం గ్రీడింప గోపిక లోపికలు లేక యశోదకడకు వచ్చి యిట్లనిరి. (307) “బాలురకుఁ బాలు లే వని¯ బాలింతలు మొఱలుపెట్టఁ బకపక నగి యీ¯ బాలుం డాలము చేయుచు¯ నాలకుఁ గ్రేపులను విడిచె నంభోజాక్షీ! (308) పడఁతీ! నీ బిడ్డడు మా¯ కడవలలో నున్న మంచి కాఁగిన పా లా¯ పడుచులకుఁ బోసి చిక్కిన¯ కడవలఁ బో నడిచె నాజ్ఞ కలదో లేదో? (309) మీ పాపఁడు మా గృహముల¯ నా పోవఁగఁ బాలు ద్రావ నగపడ కున్నన్¯ గోపింపఁ బిన్నపడుచుల¯ వాపోవఁగఁ జిమ్ముకొనుచు వచ్చెం దల్లీ! (310) పుట్టి పుట్టఁడు నేడు దొంగిలఁ బోయి మా యిలు జొచ్చి తా¯ నుట్టి యందక ఱోలు పీఁటలు నొక్క ప్రోవిడి యెక్కి చై¯ పెట్టఁ జాలక కుండ క్రిం దొక పెద్ద తూఁ టొనరించి మీ¯ పట్టి మీఁగడపాలు చేరలఁ బట్టి త్రావెఁ దలోదరీ! (311) ఆడం జని వీరల పెరు¯ గోడక నీ సుతుఁడు ద్రావి యొక యించుక తాఁ¯ గోడలి మూఁతిం జరిమినఁ¯ గోడలు మ్రుచ్చనుచు నత్త గొట్టె లతాంగీ! (312) వా రిల్లు చొచ్చి కడవలఁ¯ దోరంబగు నెయ్యిఁ ద్రావి తుది నా కడవల్¯ వీరింట నీ సుతుం డిడ¯ వారికి వీరికిని దొడ్డ వా దయ్యె సతీ! (313) "వేలుపులఁటె; నా కంటెను¯ వేలుపు మఱి యెవ్వ"రనుచు వికవిక నగి మా¯ వేలుపుల గోడపై నో¯ హేలావతి! నీ తనూజుఁ డెంగిలిఁ జేసెన్. (314) వెన్నఁ దినఁగఁ బొడగని మా¯ పిన్నది యడ్డంబు వచ్చి పిఱిఁదికిఁ దివియన్¯ జన్నొడిసి పట్టి చీఱెనుఁ¯ జిన్ని కుమారుండె యితఁడు? శీతాంశుముఖీ! (315) ఇమ్మగువ దన్ను వాకిటఁ ¯ గ్రుమ్మరుచోఁ జీరి నిలిపికొని పే రడుగం¯ గెమ్మోవిఁ గఱచి వడిఁ జనె¯ నమ్మా! యీ ముద్దుగుఱ్ఱఁ డల్పుఁడె? చెపుమా. (316) చేబంతి దప్పి పడెనని ¯ ప్రాబల్యముతోడ వచ్చి భవనము వెనుకన్¯ మా బిడ్డ జలక మాడఁగ¯ నీ బిడ్డఁడు వలువఁ దెచ్చె నెలఁతుక! తగునే? (317) ఇచ్చెలువఁ జూచి "మ్రుచ్చిలి¯ యచ్చుగ నుఱికించుకొనుచు నరిగెద; నాతో¯ వచ్చెదవా?"యని యనినాఁ¯ డిచ్చిఱుతఁడు; సుదతి! చిత్ర మిట్టిది గలదే? (318) కొడుకులు లేరని యొక సతి¯ కడు వగవఁగఁ దన్ను మగనిఁగాఁ గైకొనినం¯ గొడుకులు గలిగెద రని పైఁ¯ బడినాఁ డిది వినుము శిశువు పనులే? తల్లీ! (319) "తలఁగినదానం దల"మనఁ¯ దలఁగక యా చెలికి నాన తలయెత్తఁగ "నీ¯ తలఁగిన చోటెయ్యది"యని¯ తల యూఁచెన్ నీ సుతుండు తగవె? మృగాక్షీ! (320) వ్రాలఁగ వచ్చిన నీ సతి¯ "చూలాలం దలఁగు"మనుడు "జూ లగుటకు నే¯ మూలంబు జెప్పు"మనె నీ ¯ బాలుఁడు; జెప్పుదురె సతులు? పర్వేందుముఖీ! (321) మగువా! నీ కొమరుఁడు మా¯ మగవా రటు పోవఁ జూచి మంతనమునకుం¯ దగఁ జీరి పొందు నడిగెను¯ జగముల మున్నిట్టి శిశువు చదువంబడెనే? (322) నమ్మి నిదురబోవ నా పట్టిచుంచు మా¯ లేఁగతోఁకతోడ లీలఁ గట్టి¯ వీథులందుఁ దోలె వెలది! నీ కొమరుండు; ¯ రాచబిడ్డఁ డైన ఱవ్వ మేలె? (323) నా పట్టి పొట్ట నిండఁగఁ¯ బై పడి నీ పట్టి వెన్న బానెం డిడినాఁ; ¯ డూపిరి వెడలదు; వానిం¯ జూపెద నేమైన నీవ సుమ్ము లతాంగీ! (324) తెఱవ యొకతె నిద్రింపఁగ¯ నెఱిఁ గట్టిన వలువ వీడ్చి నే టగు తేలుం¯ గఱపించి నీ కుమారుఁడు¯ వెఱచుచు నది పఱవ నగియె విహితమె? సాధ్వీ! (325) నా కొడుకును నా కోడలు¯ నేకతమునఁ బెనఁగ బాము నీతఁడు వైవం¯ గోక లెఱుంగక పాఱినఁ¯ గూఁక లిడెన్ నీ సుతుండు గుణమె? గుణాఢ్యా! (326) తరుణి యొకతె పెరుగుఁ ద్రచ్చుచోఁ దుది వంగి¯ వెన్నదీయ నొదిఁగి వెనుకఁ గదిసి¯ మగువ! నీ సుతుండు మగపోఁడుములు చేయ¯ సాఁగినాఁడు తగదె? జక్కఁజేయ. (327) కలకంఠి! మా వాడ గరితల మెల్ల నీ¯ పట్టి రాఁగల డని పాలు పెరుగు¯ లిండ్లలోపల నిడి యే మెల్లఁ దన త్రోవఁ¯ జూచుచో నెప్పుడు చొచ్చినాఁడొ? ¯ తలుపుల ముద్రల తాళంబులును బెట్టి¯ యున్న చందంబున నున్న వరయ; ¯ నొక యింటిలోఁ బాడు నొక యింటిలో నాడు¯ నొక యింటిలో నవ్వు నొకటఁ దిట్టు; (327.1) నొకట వెక్కిరించు నొక్కొకచో మృగ¯ పక్షి ఘోషణములు పరఁగఁ జేయు¯ నిట్లు చేసి వెనుక నెక్కడఁ బోవునో¯ కాన రాఁడు రిత్త కడవ లుండు. (328) కడు లచ్చి గలిగె నేనిం¯ గుడుతురు గట్టుదురు గాక కొడుకుల నగుచున్¯ బడుగుల వాడలపైఁ బడ¯ విడుతురె రాకాంత లెందు? విమలేందుముఖీ! (329) ఓ యమ్మ! నీ కుమారుఁడు¯ మా యిండ్లను బాలు పెరుగు మననీ డమ్మా! ¯ పోయెద మెక్కడి కైనను¯ మా యన్నల సురభులాన మంజులవాణీ!”

యశోద గోపికల నొడంబరచుట

(330) అని మఱియు ననేకవిధంబుల బాలకృష్ణుండు చేయు వినోదంబులు దమ యందుఁ జేయు మహాప్రసాదంబు లని యెఱుంగక దూఱుచున్నయట్టి గోపికలకు యశోద యిట్లనియె. (331) "చన్ను విడిచి చనఁ డిట్టటు¯ నెన్నఁడుఁ బొరుగిండ్ల త్రోవ లెఱుఁగఁడు నేడుం¯ గన్నులు దెఱవని మా యీ¯ చిన్ని కుమారకుని ఱవ్వ చేయం దగునే? (332) అన్య మెఱుఁగఁడు; తన యంత నాడుచుండు; ¯ మంచివాఁ డీత; డెగ్గులు మానరమ్మ! ¯ రామలార! త్రిలోకాభిరామలార! ¯ తల్లులార! గుణవతీమతల్లులార!" (333) అని యశోద వారల నొడంబఱచి పంపి గొడుకుం గోపింపఁజాలక యుండె; నిట్లు. (334) కాంతలు దల్లితోఁ దన వికారము లెల్ల గణింప భీతుఁ డై¯ శాంతుని సొంపునం బరమ సాధుని పెంపున గోలమాడ్కి వి¯ భ్రాంతుని కైవడిన్ జడుని భంగిఁ గుమారకుఁ డూరకుండె నే¯ వింతయు లేక దల్లి కుచవేదికపైఁ దల మోపి యాడుచున్.

కృష్ణుడు మన్ను దినె ననుట

(335) అంత నొక్కనాడు బలభద్రప్రముఖులైన గోపకుమారులు వెన్నుండు మన్ను దినె నని చెప్పిన యశోద బాలుని కేలు పట్టుకొని యిట్లనియె. (336) "మన్నేటికి భక్షించెదు? ¯ మన్నియమము లేల నీవు మన్నింపవు? మీ¯ యన్నయు సఖులును జెప్పెద¯ రన్నా! మ న్నేల మఱి పదార్థము లేదే? " (337) అని పలికిన ముగుదతల్లికి నెఱదంట యైన కొడు కిట్లనియె. (338) "అమ్మా! మన్నుదినంగ నే శిశువునో? యాఁకొంటినో? వెఱ్ఱినో? ¯ నమ్మం జూడకు వీరి మాటలు మదిన్; న న్నీవు గొట్టంగ వీ¯ రి మ్మార్గంబు ఘటించి చెప్పెదరు; కాదేనిన్ మదీయాస్య గం¯ ధ మ్మాఘ్రాణము జేసి నా వచనముల్ దప్పైన దండింపవే."

నోటిలో విశ్వరూప ప్రదర్శన

(339) అని పలికి నెయ్యంబున నయ్యవ్వ నియ్యకొలిపి క్రీడామనుజ బాలకుం డైన యీశ్వరుండు తన నోరు దెఱచి ముఖంబుఁ జూపిన (340) ఆ లలితాంగి కనుంగొనె¯ బాలుని ముఖమందు జలధి పర్వత వన భూ¯ గోళ శిఖి తరణి శశి ది¯ క్పాలాది కరండమైన బ్రహ్మాండంబున్. (341) కనుంగొని. (342) “కలయో! వైష్ణవ మాయయో! యితర సంకల్పార్థమో! సత్యమో! ¯ తలఁపన్ నేరక యున్నదాననొ! యశోదాదేవిఁ గానో! పర¯ స్థలమో! బాలకుఁడెంత? యీతని ముఖస్థంబై యజాండంబు ప్ర¯ జ్వలమై యుండుట కేమి హేతువొ! మహాశ్చర్యంబు చింతింపఁగన్ (343) బాలమాతృఁడగు సలీలుని ముఖమందు¯ విశ్వ మెల్ల నెట్లు వెలసి యుండు¯ బాలు భంగి నితఁడు భాసిల్లుఁ గాని స¯ ర్వాత్ముఁ డాది విష్ణుఁ డగుట నిజము.” (344) అని నిశ్చయించి. (345) “ఏ మహాత్మువలన నీ విశ్వరూపంబు¯ గానఁబడిన బుద్ధి కంప మయ్యె¯ నా మహాత్ము విష్ణు నఖిలలోకాధారు¯ నార్తులెల్లఁ బాయ నాశ్రయింతు. (346) నా మగడు నేను గోవులు¯ నీ మందయు గోపజనులు ని బ్బాలుని నె¯ మ్మోమున నున్న విధముఁ గని¯ యేమఱితిమి గాక యీశుఁ డీతఁడు మాకున్". (347) అని తన్ను పరమేశ్వరుండని తలంచుచున్న యశోద యందు నా కృష్ణుండు వైష్ణవమాయం బొందించిన. (348) జడనుపడి యెఱుక చెడి యా¯ పడతుక సర్వాత్ముఁ డనుచుఁ బలుకక యతనిం¯ గొడుకని తొడపై నిడుకొని ¯ కడు వేడుకతోడ మమతఁ గావించె నృపా!”

నంద యశోదల పూర్వజన్మ

(349) అనిన విని రా జిట్లనియె. (350) "జగదధీశ్వరునకుఁ జ న్నిచ్చు తల్లి గా¯ నేమి నోము నోఁచె నీ యశోద? ¯ పుత్రుఁ డనుచు నతనిఁ బోషించు తండ్రి గా¯ నందుఁ డేమి జేసె? నందితాత్మ! (351) ప్రబ్బిన భక్తిని హరిపైఁ¯ గబ్బంబులు చెప్పి కవులు కైవల్యశ్రీ¯ కబ్బుదు రట! హరిపోషణ¯ మబ్బిన తలిదండ్రు లెచటి కబ్బుదురొ? తుదిన్." (352) అనిన విని రాజయోగికి శుకయోగి యిట్లనియె. (353) "అవనీశ! విను ద్రోణుఁ డనువాఁడు వసువుల¯ యందు ముఖ్యుఁడు; ధర యతని భార్య; ¯ వారి నిద్దఱ బ్రహ్మ వసుధపై జన్మించు¯ డంచుఁ బంపిన వార లతనిఁ జూచి¯ "విశ్వేశ్వరుండైన విష్ణుసేవారతి¯ మా కిచ్చితేనిని మహి జనింతు"¯ మనవుడు "నట్ల కా"కనియె వేల్పులపెద్ద¯ యా ద్రోణుఁ డీ నందుఁడై జనించె (353.1) ధర యశోద యయ్యె; దనుజేంద్రవైరియుఁ¯ గమలగర్భుమాట గారవించి¯ తల్లిదండ్రు లనుచుఁ దగ వారి మన్నించె; ¯ నధిక భక్తితోడ నలరి రిట్లు.

చిలుకుతున్న కవ్వం పట్టుట

(354) అంత నొక్కనాఁడు తన యింటికడ పాప లందఱు నయ్యై పనులందుఁ బంపుపడిపోయిన నందసుందరి సంరంభంబునం దరికంబంబు కడఁ గుదురున నొక్క దధికుంభంబు పెట్టి మిసిమిగల మీఁగడపెరుగు గూడంబోసి వీఁక నాఁక త్రాడు కవ్వంబున నలంవరించి. (355) కరకమలారుణ కాంతిఁ గవ్వుపు ద్రాడు¯ పవడంపు నునుఁదీఁవ పగిది మెఱయఁ; ¯ గ్రమముతో రజ్జు వాకర్షింపఁ బాలిండ్లు¯ వీడ్వడి యొండొంటి వీఁక నొత్తఁ; ¯ గుచకుంభములమీఁది కొంగు జాఱఁగ జిక్కు¯ పడుచు హారావళుల్ బయలుపడగఁ; ¯ బొడమిన చెమటతోఁ బొల్పారు నెమ్మోము¯ మంచు పైఁబడిన పద్మంబుఁ దెగడఁ; (355.1) గౌను నులియంగఁ; గంకణక్వణన మెసఁగఁ; ¯ దుఱుము బిగివీడఁ; గర్ణికాద్యుతులు మెఱయ; ¯ బాలు నంకించి పాడెడి పాట వలనఁ¯ దరువు లిగురొత్త బెరు గింతి దరువఁ జొచ్చె. (356) ఆ సమయంబున. (357) సుడియుచు వ్రాలుచుఁ గిదుకుచు¯ సడి గొట్టుచు "నమ్మ! రమ్ము; చన్ని"మ్మనుచున్¯ వెడవెడ గంతులు వైచుచుఁ¯ గడవఁ గదిసి బాలకుండు గవ్వముఁ బట్టెన్. (358) కవ్వముఁ బట్టిన ప్రియసుతు¯ న వ్వనరుహనేత్ర దిగిచి యంకతలమునన్¯ నవ్వుచు నిడుకొని కూఁకటి¯ దువ్వుచుఁ జన్నిచ్చె; నతఁడు దూఁటుఁచుఁ గుడిచెన్. (359) కడుపారం జనుబాలు ద్రావని సుతుం గంజాక్షి పీఠంబుపై¯ నిడి పొంగారెడు పాలు డించుటకుఁనై యేగంగఁ దద్బాలుఁ డె¯ క్కుడు కోపంబున వాఁడిఱాత దధిమత్కుంభంబుఁ బోఁగొట్టి తెం¯ పడరం గుంభములోని వెన్నఁ దినె మిథ్యా సంకులద్భాష్పుఁడై. (360) అంత నా లోలలోచన పాలు డించి వచ్చి వికలంబు లయిన దధికుంభ శకలంబులఁ బొడఁగని తుంటకొడుకు వెన్నదింట యెఱింగి నగుచు నా కలభగామిని యతనిం గానక చని చని. (361) వికచకమలనయన వే ఱొక యింటిలో¯ వెలయ ఱోలు దిరుగవేసి యెక్కి¯ యుట్టిమీఁది వెన్న నులుకుచు నొక కోఁతి¯ పాలు జేయుచున్న బాలుఁ గనియె.

యశోద కృష్ణుని అదిలించుట

(362) కని చేతన్ సెలగోలఁ బట్టికొనుచుం "గానిమ్ము గానిమ్ము రా¯ తనయా! యెవ్వరి యందుఁ జిక్కుపడ నేదండంబునుం గాన నే¯ వినివారంబును బొంద నే వెఱపు నే విభ్రాంతియుం జెంద ము¯ న్ననియో నీవిటు నన్నుఁ గైకొనమి నేఁడారీతి సిద్ధించునే." (363) అని యదలించుచు కొడుకు నడవడిం దలంచి తనుమధ్య దన మనంబున. (364) "బాలుఁ డీతండని భావింతు నందునా¯ యే పెద్దలును నేర రీక్రమంబు¯ వెఱ పెఱుంగుటకు నై వెఱపింతు నందునా¯ కలిగి లే కొక్కఁడు గాని లేఁడు¯ వెఱపుతో నా బుద్ధి వినిపింతు నందునా¯ తనుఁ దాన యై బుద్ధిఁ దప్పకుండు¯ నొం డెఱుంగక యింట నుండెడి నందునా¯ చొచ్చి చూడని దొకచోటు లేదు (364.1) తన్ను నెవ్వరైనఁ దలపోయఁ బాఱెడి¯ యోజ లేదు భీతి యొక టెఱుంగఁ¯ డెలమి నూరకుండఁ డెక్కసక్కెము లాడుఁ¯ బట్టి శాస్తిజేయు భంగి యెట్లు?" (365) అని వితర్కించి. (366) లాలనమున బహుదోషము¯ లోలిం బ్రాపించుఁ దాడనోపాయములన్¯ జాల గుణంబులు గలుగును¯ బాలురకును దాడనంబ పథ్యం బరయన్. (367) అని నిశ్చయించి కేలనున్న కోల జళిపించి “బాలా! నిలునిలు” మని బగ్గుబగ్గున నదల్చుచు దల్లి డగ్గఱిన బెగ్గడిలిన చందంబున నగ్గలికచెడి ఱోలు డిగ్గ నుఱికి. (368) గజ్జలు గల్లని మ్రోయఁగ¯ నజ్జలు ద్రొక్కుటలు మాని యతిజవమున యో¯ షిజ్జనములు నగఁ దల్లియుఁ¯ బజ్జం జనుదేర నతఁడు పరువిడె నధిపా! (369) అప్పుడు. (370) స్తనభారంబున డస్సి క్రుస్సి యసదై జవ్వాడు మధ్యంబుతో¯ జనిత స్వేదముతోఁ జలత్కబరితో స్రస్తోత్తరీయంబుతో¯ వనజాతేక్షణ గూడ బాఱి తిరిగెన్ వారించుచున్ వాకిటన్¯ ఘనయోగీంద్ర మనంబులున్ వెనుకొనంగా లేని లీలారతున్.

కృష్ణుని ఱోలుకి కట్టుట

(371) ఇట్లు గూడం జని. (372) స్తంభాదికంబులు దనకు నడ్డం బైన¯ నిట్టట్టు చని పట్టనీనివాని¯ నీ తప్పు సైరింపు మింక దొంగిలఁ బోవ¯ నే నని మునుముట్ట నేడ్చువాని¯ గాటుక నెఱయంగఁ గన్నులు నులుముచు¯ వెడలు కన్నీటితో వెగచువాని¯ నే దెస వచ్చునో యిది యని పలుమాఱు¯ సురుగుచుఁ గ్రేగంటఁ జూచువానిఁ (372.1) గూడఁ బాఱి పట్టుకొని వెఱపించుచుఁ¯ జిన్న వెన్నదొంగ చిక్కె ననుచు¯ నలిగి కొట్టఁ జేతు లాడక పూఁబోఁడి¯ కరుణతోడ బాలుఁ గట్టఁ దలఁచి. (373) ఇ ట్లనియె. (374) “వీరెవ్వరు? శ్రీకృష్ణులు¯ గారా? యెన్నడును వెన్నఁ గానరఁట కదా! ¯ చోరత్వం బించుకయును¯ నేర రఁట! ధరిత్రి నిట్టి నియతులు గలరే? (375) పట్టినఁ బట్టుపడని నినుఁ¯ బట్టెద నని చలముఁగొనినఁ బట్టుట బెట్టే? ¯ పట్టువడ వండ్రు పట్టీ¯ పట్టుకొనన్ నాఁకుఁగాక పరులకు వశమే? (376) ఎక్కడనైనను దిరిగెద; ¯ వొక్క యెడన్ గుణము గలిగి యుండవు; నియమం¯ బెక్కడిది నీకు? మఱచినఁ¯ జక్కగఁ బోయెదవు పెక్కు జాడలఁ బుత్రా! (377) తోయంబు లివి యని తొలగక చొచ్చెదు¯ తలఁచెదు గట్టైనఁ దరల నెత్త; ¯ మంటితో నాటలు మానవు; కోరాడె¯ దున్నత స్తంభంబు లూఁపఁ బోయె; ¯ దన్యుల నల్పంబు లడుగంగఁ బాఱెదు¯ రాచవేఁటలఁ జాల ఱవ్వఁదెచ్చె; ¯ దలయవు నీళ్ళకు నడ్డంబు గట్టెదు¯ ముసలివై హలివృత్తి మొనయఁ; జూచె (377.1) దంబరంబు మొలకు నడుగవు తిరిగెద¯ వింకఁ గల్కిచేఁత లేల పుత్ర! ¯ నిన్ను వంప వ్రాల్ప నే నేర ననియొ నీ¯ విట్టు క్రిందు మీఁదు నెఱుఁగ కునికి.” (378) అని మర్మంబు లెత్తి పలికి. (379) ఆ లలన గట్టె ఱోలన్¯ లీలన్ నవనీతచౌర్యలీలుం బ్రియ వా¯ గ్జాలుం బరివిస్మిత గో¯ పాలున్ ముక్తాలలామ ఫాలున్ బాలున్. (380) ఱోలను గట్టుబడియు న¯ బ్బాలుఁడు విలసిల్లె భక్త పరతంత్రుండై¯ యాలాన సన్నిబద్ధ వి¯ శాల మదేభేంద్రకలభ సమరుచి నధిపా! (381) వెలి లోను మొదలు దుది నడు¯ ములు లేక జగంబు తుదియు మొదలున్ నడుమున్¯ వెలియున్ లో నగు నీశ్వరు¯ నలవడునే కట్టఁ బ్రణతురాల్ గా కున్నన్? (382) పట్టి యెల్లబోఁటి పట్టి యీతం డని¯ గట్టితలఁపుతోడఁ గట్టెఁ గాక¯ పట్టికడుపు పెక్కు బ్రహ్మాండములు పట్టు¯ టెఱిఁగి నేనిఁ దల్లి యేల కట్టు? (383) చిక్కఁడు సిరికౌగిటిలోఁ¯ జిక్కఁడు సనకాది యోగిచిత్తాబ్జములం¯ జిక్కఁడు శ్రుతిలతికావళిఁ¯ జిక్కె నతఁడు లీలఁ దల్లి చేతన్ ఱోలన్ (384) ఇట్లు గ్రద్దన నా ముద్దియ ముద్దులపట్టి యుదరంబు గట్ట నడరుచుఁ జతురంబుగఁ జక్క నొక్కత్రాడు చుట్టిన నది రెండంగుళంబులు కడమపడియె; మఱియు నొక్క బంధనంబు సంధించి వలగొనిన నంతియ కొఱంత యయ్యె; వెండియు నొక్కపాశంబు గూర్చి పరివేష్టించిన వెల్తిఁ జూపె; నిట్లు. (385) తజ్జనని లోఁగిటం గల¯ రజ్జుపరంపరలఁ గ్రమ్మఱన్ సుతుఁ గట్టన్¯ బొజ్జ దిరిగి రా దయ్యె జ¯ గజ్జాలము లున్న బొజ్జఁ గట్టన్ వశమే? (386) అప్పు డా యవ్వయు గోపికలును వెఱంగుపడిరి; తదనంతరంబ (387) ఒడలఁ జెమట లెగయ నుత్తరీయము జాఱ¯ వీడి యున్న తుఱుము విరులు రాలఁ¯ గట్టరాని తన్నుఁ గట్టెద నని చింతఁ¯ గట్టుకొనిన తల్లిఁ గరుణఁ జూచి. (388) బంధవిమోచనుఁ డీశుఁడు¯ బంధింపఁ బెనంగు జనని పాటోర్చి సుహృ¯ ద్బంధుఁడు గావున జననీ¯ బంధంబునఁ గట్టుబడియెఁ బాటించి నృపా! (389) సంగడిఁ దిరిగెడు శంభుఁడు¯ నంగాశ్రయ యైన సిరియు నాత్మజుఁడై యు¯ ప్పొంగెడు పద్మజుఁడును గో¯ పాంగన క్రియఁ గరుణ పడయ రఖిలేశ్వరుచేన్. (390) జ్ఞానులచే మౌనులచే¯ దానులచే యోగ సంవిధానులచేతం¯ బూని నిబద్దుం డగునే¯ శ్రీనాథుఁడు భక్తియుతులచేతం బోలెన్? (391) అంత నయ్యశోద యింటికడఁ బనులవెంటందిరుగఁ గృష్ణుఁడు తొల్లి నారదు శాపంబున నిరుమద్దులై యున్న నలకూబర మణిగ్రీవు లను గుహ్యకుల నిద్దఱం గని ఱో లీడ్చుకొని చనియె"నని చెప్పిన శుకయోగివరునకు భూవరుం డిట్లనియె.

గుహ్యకుల నారదశాపం

(392) "నారదుఁ డేల శపించెను? ¯ వా రా వృక్షత్వమునకు వచ్చిన పనికిం¯ గారణ మెయ్యది? యోగికు¯ లారాధ్య! యెఱుంగఁ జెప్పు మయ్య! వినియెదన్." (393) అనిన శుకుండిట్లనియె “మున్ను కుబేరుని కొడుకు లిరువురు శంకరకింకరులై యహంకరించి వెండికొండమీఁద విరుల తోఁటలం బాడెడి చేడియలం గూడికొని కరేణు సంగతంబు లైన యేనుంగుల భంగి సురంగంబు లైన మందాకినీతరంగంబులం గ్రీడింప నారదుండు వచ్చిన న చ్చెలువలు చెచ్చెర వలువలు ధరియించిరి; మదిరాపాన పరవశులు గావున వార లిరువురు వివస్త్రులై మెలంగుచున్న నా మునీశ్వరుండు చూచి శపియించు వాఁడై ప్రతీతంబగు గీతంబు వాడె; వినుము. (394) "సంపన్నుం డొరుఁ గాన లేఁడు తనువున్ సంసారమున్ నమ్మి హిం¯ సింపం జూచు దరిద్రుఁ డెత్తుబడి శుష్కీభూతుఁడై చిక్కి హిం¯ సింపం డన్యుల నాత్మకున్ సముల కాఁ జింతించు నట్లౌటఁ ద¯ త్సంపన్నాంధున కంజనంబు వినుమీ దారిద్ర్య మూహింపఁగన్." (395) అని గీతంబు వాడి తన మనంబున. (396) "కలవాని సుతుల మనుచును¯ గలకంఠులతోడఁ గూడి కానరు పరులం¯ గలలో నైనను; వీరికిఁ¯ గల క్రొవ్వడఁగించి బుధులఁ గలపుట యొప్పున్." (397) అని చింతించి విజ్ఞాన విశారదుండగు నారదుండు నలకూబర మణిగ్రీవులఁ జూచి "మీరలు స్త్రీమదాంధులరు గావున భూలోకంబున నర్జున తరువులై నూఱు దివ్యవర్షంబు లుండుం డటమీఁద గోవిందచరణారవింద పరిస్పందంబున (398) ముక్తులరై నారాయణ¯ భక్తులరై పరమసాధుభావ శ్రీ సం¯ సక్తులరై సురలోక¯ వ్యక్తుల రయ్యెదరు నాదువాక్యము కతనన్."

కృష్ణుడు మద్దిగవను గూల్చుట

(399) అని యిట్లు పలికి నారదుండు నారాయణాశ్రమంబునకుం జనియె వారిరువురు సంగడిమద్దు లైరి, పరమభాగవతుండైన నారదు మాటలు వీటింబుచ్చక పాటించి. (400) ముద్దుల తక్కరిబిడ్డఁడు¯ మద్దులఁ గూల్పంగ దలఁచి మసలక తా నా¯ మద్దికవ యున్న చోటికిఁ ¯ గ్రద్దన ఱో లీడ్చుకొనుచుఁ గడకం జనియెన్. (401) చని యా యూర్జిత మహాబలుండు నిజోదరదామ సమాకృష్యమాణ తిర్యగ్భవదులూఖలుండై యా రెండు మ్రాకుల నడుమం జొచ్చి ముందటికి నిగుడుచు. (402) బాలుఁడు ఱో లడ్డము దివ¯ మూలంబులు పెకలి విటపములు విఱిగి మహా¯ భీలధ్వనిఁ గూలెను శా¯ పాలస్యవివర్జనములు యమళార్జునముల్