పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవత పారాయణ - 3 : దశమ స్కంధము - పూర్వ భాగము 1 - 130

పోతన తెలుగు భాగవతం
దశమ స్కంధము పూర్వభాగము

ఉపోద్ఘాతము

(1) శ్రీకంఠచాప ఖండన! ¯ పాకారిప్రముఖ వినుత భండన! విలస¯ త్కాకుత్థ్సవంశమండన! ¯ రాకేందు యశోవిశాల! రామనృపాలా! (2) మహనీయ గుణగరిష్ఠులగు నమ్ముని శ్రేష్ఠులకు నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరీ సమేతుం డయిన సూతుం డిట్లనియె; నట్లు పరీక్షిన్నరేంద్రుండు శుకయోగీంద్రుం గనుంగొని.

పరీక్షిత్తు కృష్ణలీల లడుగుట

(3) "తెలిపితివి సోమసూర్యుల¯ కులవిస్తారంబు; వారి కులము ధరిత్రీ¯ శుల నడవళ్ళును వింటిమి; ¯ కలరూపము లెల్ల మాకుఁ గడు వెఱఁగులుగన్. (4) శీలముగల యదుకులమున¯ నేలా పుట్టెను మహాత్ముఁ డీశుఁడు విష్ణుం? ¯ డే లీల మెలఁగె? నెయ్యే¯ వేళల నే మేమి చేసె? వివరింపు తగన్. (5) భవములకు మందు; చిత్త¯ శ్రవణానందము; ముముక్షుజన పదము; హరి¯ స్తవము పశుఘ్నుఁడు దక్కను¯ జెవులకుఁ దని వయ్యె ననెడి చెనఁటియుఁ గలఁడే. (6) మా పెద్దలు మును వేల్పులు¯ నోపని భీష్మాది కురుకులోత్తమ సేనా¯ కూపారము నే కోలము ¯ ప్రాపున లంఘించి రొక్క బాలపదముగాన్. (7) మా యమ్మ కుక్షి గురుసుత¯ సాయక పీడితుఁడ నైన జడు నన్నుం గౌం¯ తేయ కురుకులము నిలుపఁగ¯ నా యుత్తముఁ డాత్త చక్రుఁడై రక్షించెన్. (8) కలసి పురుషమూర్తి కాలరూపములను¯ లోకజనుల వెలిని లోన నుండి¯ జన్మ మృత్యువులను సంసారముక్తుల¯ నిచ్చు నతని చరిత మెల్లఁ జెపుమ. (9) ఊహించి రాముఁడు రోహిణి కొడు కంచు¯ నప్పుడు యోగీంద్ర! చెప్పి తీవు¯ దేవకి కడుపున నే వెరవున నాతఁ¯ డుండెను దేహంబు నొండులేక? ¯ తన తండ్రి యిలువాసి వనజాక్షుఁ డేరీతి¯ మందకుఁ బోయె? నే మందిరమున¯ నుండి యెయ్యది చేయుచుండెను? దన మేన¯ మామ కంసుని నేల నామ మడఁచె? (9.1) నెన్ని యేండ్లు మనియె నిలమీఁద మనుజుఁడై? ¯ యెంద ఱైరి భార్య? లెట్లు మెలఁగె? ¯ మఱియు నేమి చేసె? మాధవు చారిత్ర¯ మెంత గలదు? నాకు నేర్పరింపు. " (10) అని మఱియు ని ట్లనియె. (11) "నీ ముఖాంబుజాత నిర్ముక్త హరికథా¯ మృతముఁ ద్రావఁ ద్రావ మేను వొదలె; ¯ వంత మానె; నీరుపట్టు నాఁకలియును¯ దూరమయ్యె; మనము తొంగలించె." (12) అని పలుకుచున్న రాజు మాటలు విని, వైయాసి యిట్లనియె. (13) "విష్ణు కథా రతుఁ డగు నరు¯ విష్ణుకథల్ చెప్పు నరుని వినుచుండు నరున్¯ విష్ణుకథా సంప్రశ్నము¯ విష్ణుపదీ జలము భంగి విమలులఁ జేయున్. (14) రాజేంద్ర! విను తొల్లి రాజలాంఛనముల¯ వేలసంఖ్యల దైత్యవిభులు దన్ను¯ నాక్రమించిన భార మాఁగఁజాలక భూమి¯ గోరూపయై బ్రహ్మఁ జేరఁ బోయి¯ కన్నీరు మున్నీరుగా రోదనము సేయఁ¯ గరుణతో భావించి కమలభవుఁడు¯ ధరణి నూఱడఁ బల్కి ధాత్రియు వేల్పులుఁ¯ గదలిరా విష్ణునిఁ గాన నేఁగి (14.1) పురుష సూక్తంబుఁ జదివి యద్భుత సమాధి¯ నుండి యొకమాట విని వారిజోద్భవుండు¯ వినుఁడు వేల్పులు ధరయు నే విన్నయట్టి¯ పలుకు వివరింతు" నని ప్రీతిఁ బలికెఁ దెలియ. (15) "యాదవకులమున నమరులు! ¯ మేదినిపైఁ బుట్టఁ జనుడు; మీ యంశములన్¯ శ్రీదయితుఁడు వసుదేవున¯ కాదరమునఁ బుట్టి భార మంతయుఁ బాపున్. (16) హరి పూజార్థము పుట్టుఁడు¯ సురకన్యలు! భూమియందు సుందరతనులై;¯ హరి కగ్రజుఁడై శేషుఁడు¯ హరికళతోఁ బుట్టుఁ, దత్ప్రియారంభుండై. (17) ఈ ప్రపంచ మెల్ల నే మాయచే మోహి¯ తాత్మ యగుచు నుండు; నట్టిమాయ¯ కమలనాభు నాజ్ఞఁ గార్యార్థమై, నిజాం¯ శంబు తోడఁ బుట్టు జగతి యందు." (18) అని యిట్లు వేల్పుల నియ్యకొలిపి, పుడమిముద్దియ నొడంబఱచి, తమ్మిచూలి దన మొదలి నెలవునకుం జనియె; నంత యదు విభుం డయిన శూరసేనుం డనువాఁడు మథురాపురంబు తనకు రాజధానిగా, మాథురంబులు శూరసేనంబు లనియెడు దేశంబు లేలెం; బూర్వకాలంబున. (19) ఏ మథుర యందుఁ నిత్యము ¯ శ్రీమన్నారాయణుండు చెలఁగుఁ బ్రియముమై, ¯ నా మథుర సకల యాదవ¯ భూమీశుల కెల్ల మొదలి పురి యయ్యె, నృపా!

వసుదేవ దేవకీల ప్రయాణం

(20) ఆ శూరసేనున కాత్మజుం డగు వసు¯ దేవుఁ డా పురి నొక్క దినమునందు¯ దేవకిఁ బెండ్లియై, దేవకియును దానుఁ¯ గడు వేడ్క రథమెక్కి కదలువేళ, ¯ నుగ్రసేనుని పుత్రుఁ డుల్లాసి, కంసుండు¯ చెల్లెలు మఱఁదియు నుల్లసిల్ల, ¯ హరుల పగ్గములఁ జేనంది, రొప్పఁ దొడంగె¯ ముందట భేరులు మురజములును (20.1) శంఖ పటహములును జడిగొని మ్రోయంగఁ¯ గూఁతుతోఁడి వేడ్క కొనలుసాఁగ, ¯ దేవకుండు సుతకు దేవకీదేవికి¯ నరణ మీఁ దలంచి, యాదరించి. (21) సార్థంబు లయిన రథంబుల వేయునెనమన్నూటిని, గనకదామ సముత్తుంగంబు లయిన మాతంగంబుల నన్నూటిని, బదివేల తురంగంబులను, విలాసవతు లయిన దాసీజనంబుల నిన్నూటి నిచ్చి, యనిచినం గదలి, వరవధూయుగళంబుఁ దెరువునం జను సమయంబున. (22) పగ్గములు వదలి వేగిర¯ మగ్గలముగ రథముఁ గడపు నా కంసుడు, లో¯ బెగ్గిలి, యెగ్గని తలఁపగ, ¯ దిగ్గన నశరీరవాణి దివి నిట్లనియెన్. (23) "తుష్ట యగు భగిని మెచ్చఁగ¯ నిష్టుఁడ వై రథము గడపె; దెఱుగవు మీఁదన్¯ శిష్ట యగు నీతలోదరి ¯ యష్టమగర్భంబు నిన్ను హరియించుఁ జుమీ!"

కంసుని అడ్డగించుట

(24) అని యిట్లాకాశవాణి పలికిన, నులికిపడి, భోజకుల పాంసనుండైన కంసుండు సంచలదంసుండై, యడిదంబు బెడిదంబుగాఁ బెఱికి, జళిపించి, దెప్పరంబుగ ననుజ కొప్పుఁ బట్టి, కప్పరపాటున నొప్పఱం దిగిచి యొడిసి పట్టి, తోఁబుట్టువని తలంపక, తెంపుఁ జేసి తెగవ్రేయ గమకించు సమయంబున వసుదేవుండు డగ్గఱి. (25) ఆ పాపచిత్తు, మత్తుం¯ గోపాగ్ని శిఖానువృత్తుఁ గొనకొని, తన స¯ ల్లాపామృతధారా వి¯ క్షేపణమునఁ గొంత శాంతుఁ జేయుచుఁ బలికెన్. (26) "అన్నవు నీవు చెల్లెలికి; నక్కట! మాడలు చీర లిచ్చుటో? ¯ మన్నన చేయుటో? మధుర మంజుల భాషల నాదరించుటో? ¯ "మిన్నుల మ్రోతలే నిజము, మే"లని చంపకు మన్న! మాని రా¯ వన్న! సహింపు మన్న! తగ దన్న! వధింపకు మన్న! వేడెదన్. (27) అదియునుం గాక.

వసుదేవుని ధర్మబోధ

(28) చెలియల్, కన్నియ, ముద్దరా, లబల, నీ సేమంబె చింతించు ని¯ ర్మల, దీనిన్ బయలాడుమాటలకు నై మర్యాదఁ బోఁదట్టి, స¯ త్కుల జాతుండవు, పుణ్యమూర్తి, వకటా! కోపంబు పాపంబు, నె¯ చ్చెలి నోహో! తెగవ్రేయఁ బాడి యగునే? చింతింపు భోజేశ్వరా! (29) మేనితోడన పుట్టు మృత్యువు జనులకు¯ నెల్లి నేఁడైన నూఱేండ్ల కైనఁ¯ దెల్లంబు మృత్యువు దేహంబు పంచత¯ నందఁ గర్మానుగుండై శరీరి ¯ మాఱుదేహముఁ నూఁది, మఱి తొంటి దేహంబుఁ¯ బాయును దన పూర్వ భాగమెత్తి ¯ వేఱొంటిపైఁ బెట్టి వెనుకభాగం బెత్తి¯ గమనించు తృణజలూకయును బోలె; (29.1) వెంటవచ్చు కర్మవిసరంబు; మును మేలు ¯ కన్నవేళ నరుడు గన్న విన్న ¯ తలఁపఁబడిన కార్యతంత్రంబు కలలోనఁ¯ బాడితోడఁ గానఁబడిన యట్లు. (30) తన తొంటి కర్మరాశికి¯ ననుచరమై బహువికారమై మనసు వడిం¯ జను; నింద్రియముల తెరువులఁ¯ దనువులు పెక్కైనఁ జెడవు తన కర్మంబుల్. (31) జలఘటాదులందుఁ జంద్రసూర్యాదులు¯ గానబడుచు గాలిఁ గదలు భంగి ¯ నాత్మకర్మ నిర్మితాంగంబులను బ్రాణి¯ గదలుచుండు రాగకలితుఁ డగుచు. (32) కర్మములు మేలు నిచ్చును; ¯ గర్మంబులు గీడు నిచ్చుఁ; గర్తలు దనకుం ¯ గర్మములు బ్రహ్మ కైనను; ¯ గర్మగుఁ డై పరులఁ దడవఁగా నేమిటికిన్? (33) కావునఁ బరులకు హింసలు¯ గావింపఁగ వలదు తనకుఁ గల్యాణముగా ¯ భావించి పరుల నొంచినఁ¯ బోవునె? తత్ఫలము పిదపఁ బొందక యున్నే? (34) వావిఁ జెల్లెలు గాని పుత్రికవంటి దుత్తమురాలు; సం¯ భావనీయచరిత్ర; భీరువు; బాల; నూత్నవివాహ సు¯ శ్రీవిలాసిని; దీన; కంపితచిత్త; నీ కిదె మ్రొక్కెదం; ¯ గావవే; కరుణామయాత్మక; కంస! మానవవల్లభా!" (35) అని మఱియు సామభేదంబులగు పలుకులు పలికిన వినియు వాఁడు వేఁడిచూపుల రాలు నిప్పులు గుప్పలుగొన ననుకంపలేక, తెంపుఁజేసి చంపకగంధిం జంపఁ జూచుట యెఱింగి మొఱంగెడి తెఱంగు విచారించి తనలో నిట్లనియె. (36) "ఎందును గాలము నిజ మని¯ పందతనంబునను బుద్ధిఁబాయక ఘనులై ¯ యెందాఁక బుద్ధి నెగడెడి¯ నందాఁకఁ జరింపవలయు నాత్మబలమునన్." (37) అని నిశ్చయించి. (38) "ఆపన్నురాలైన యంగన రక్షింప¯ సుతుల నిచ్చెద నంట శుభము నేడు; ¯ మీ దెవ్వ డెఱుగును? మెలఁత ప్రాణంబుతో¯ నిలిచిన మఱునాడు నేరరాదె? ¯ సుతులు పుట్టిర యేని సుతులకు మృత్యువు¯ వాలాయమై వెంట వచ్చెనేని ¯ బ్రహ్మచేతను వీఁడు పా టేమియును లేక¯ యుండునే? సదుపాయ మొకటి లేదె? (38.1) పొంత మ్రాఁకులఁ గాల్పక పోయి వహ్ని¯ యెగసి దవ్వులవాని దహించు భంగిఁ¯ గర్మవశమున భవమృతికారణంబు¯ దూరగతిఁ బొందు; నిఁక నేల తొట్రుపడఁగ? (39) కొడుకుల నిచ్చెద నని సతి¯ విడిపించుట నీతి; వీఁడు విడిచిన మీఁదం¯ గొడుకులు పుట్టినఁ గార్యము¯ తడఁబడదే? నాటి కొక్క దైవము లేదే? (40) ఎనిమిదవ చూలు వీనిం¯ దునుమాడెడి నంచు మింటఁ దోరపుఁబలుకుల్ ¯ వినఁబడియె; నేల తప్పును? ¯ వనితను విడిపించు టొప్పు వైళం బనుచున్," (41) తిన్నని పలుకులు పలుకుచుఁ ¯ గ్రన్నన తగఁ బూజ చేసి కంసు నృశంసున్¯ మన్నించి చిత్త మెరియఁ బ్ర¯ సన్నాననుఁ డగుచుఁ బలికె శౌరి నయమునన్. (42) "లలనకుఁ బుట్టిన కొమరుని¯ వలనం దెగె దనుచు గగనవాణి పలికె నం ¯ చలిగెద వేని మృగాక్షికిఁ¯ గల కొడుకులఁ జంప నిత్తుఁ గ్రమమున నీకున్." (43) అని యిట్లు పలికిన విని కంసుడు కంపితావతంసుండై సంతసించి గుణగ్రాహిత్వంబుఁ గైకొని కొందలమందు చెలియలి మందలవిడిచి చనియె; వసుదేవుండును బ్రదుకుమందలఁ గంటి ననుచు సుందరియుం దానును మందిరంబునకుం బోయి డెందంబున నానందంబు నొందియుండె; నంతఁ గొంత కాలంబు చనిన సమయంబున. (44) విడువక కంసుని యెగ్గులఁ¯ బడి దేవకి నిఖిలదేవభావము దన కే¯ ర్పడ నేఁట నొకని లెక్కను¯ గొడుకుల నెనమండ్ర నొక్క కూతుం గనియెన్. (45) అందు. (46) సుదతి మున్ను గన్న సుతుఁ గీర్తిమంతుని¯ పుట్టుఁ దడవు కంసభూవరునకుఁ¯ దెచ్చి యిచ్చెఁ జాల ధృతి గల్గి వసుదేవుఁ¯ డాశపడక సత్యమందు నిలిచి. (47) పలికిన పలుకులు దిరుగక¯ సొలయక వంచనము లేక సుతుల రిపునకున్¯ గలఁగక యిచ్చిన ధీరుం¯ డిల వసుదేవుండు దక్క నితరుఁడు కలడే? (48) మానవేంద్ర! సత్యమతికి దుష్కరమెయ్య? ¯ దెఱుఁక గలుగువాని కిష్ట మెయ్య? ¯ దీశభక్తి రతుని కీరాని దెయ్యది? ¯ యెఱుక లేనివాని కేది కీడు? (49) ఇట్లు సత్యంబు దప్పక కొడుకు నొప్పించిన వసుదేవుని పలుకునిలుకడకు మెచ్చి కంసుం డిట్లనియె. (50) కొడుకు నీవు మరలఁ గొనిపొమ్ము వసుదేవ! ¯ వెఱపు లేదు నాకు వీనివలన; ¯ నల్గ వీనికి; భవ దష్టమపుత్రుండు¯ మృత్యు వఁట; వధింతు మీఁద నతని. (51) అనిన నానకదుందుభి నందనుం గొని చనియు నానందంబు నొందక, దుష్టస్వభావుండగు బావపలుకులు వినియు నులుకుచుండె; నంత

మథురకు నారదుడు వచ్చుట

(52) ఒకనాఁడు నారదుం డొయ్యన కంసుని¯ యింటికిఁ జనుదెంచి యేకతమున¯ "మందలోపలనున్న నందాదులును, వారి¯ భార్యలుఁ బుత్రులు బాంధవులును¯ దేవకి మొదలగు తెఱవలు వసుదేవుఁ¯ డాదిగాఁగల సర్వ యాదవులును, ¯ సురలుగాని, నిజంబు నరులు గా రని చెప్పి¯ కంసుండ! నీవు రక్కసుడ వనియు (52.1) దేవమయుడు చక్రి దేవకీదేవికిఁ¯ బుత్రుఁడై జనించి భూతలంబు¯ చెఱుపఁ బుట్టినట్టి చెనఁటి దైత్యుల నెల్లఁ¯ జంపు"ననుచుఁ జెప్పి చనియె దివికి. (53) నారదు మాటలు విని పె¯ ల్లారాటముఁ బొంది యదువు లనిమిషు లనియున్¯ నారాయణకరఖడ్గవి¯ దారితుఁ డగు కాలనేమి దా ననియు మదిన్.

దేవకీ వసుదేవుల చెరసాల

(54) కలఁగంబాఱి మఱందిఁ జెల్లెలి నుదగ్రక్రోధుడై పట్టి బ¯ ద్ధులఁ గావించి హరిం దలంచి వెస తోడ్తో వారు గన్నట్టి పు¯ త్రులఁ జంపెన్; గురు నుగ్రసేను యదుఁ దద్భోజాంధకాధీశు ని¯ ర్మలు బట్టెం గడు వాలి యేలెఁ జలమారన్ శూరసేనంబులన్. (55) తల్లిఁ దండ్రి నైనఁ దమ్ము లనన్నల¯ సఖుల నైన బంధుజనుల నైన ¯ రాజ్యకాంక్షఁ జేసి రాజులు చంపుదు¯ రవనిఁ దఱచు జీవితార్థు లగుచు. (56) మఱియును బాణ భౌమ మాగధ మహాశన కేశి ధేనుక బక ప్రలంబ తృణావర్త చాణూర ముష్టి కారిష్ట ద్వివిధ పూతనాది సహాయ సమేతుండై కంసుండు కదనంబున మదంబు లడంచిన వదనంబులు వంచికొని, సదనంబులు విడిచి యదవలై, యదువులు, పదవులు వదలి నిషధ కురు కోసల విదేహ విదర్భ కేకయ పాంచాల సాల్వ దేశంబులుఁ జొచ్చిరి; మచ్చరంబులు విడిచి కొందరు కంసునిం గొలిచి నిలిచి; రంత. (57) తొడితొడిఁ గంసుడు దేవకి¯ కొడుకుల నార్వుర వధింప గురుశేషాఖ్యం¯ బొడవగు హరిరుచి యా సతి¯ కడుపున నేడవది యైన గర్భం బయ్యెన్.

యోగమాయ నాజ్ఞాపించుట

(58) అయ్యవసరంబున విశ్వరూపుం డగు హరి దన్ను నమ్మిన యదువులకుఁ గంసునివలన భయంబు గలుగు నని యెఱింగి యోగమాయాదేవి కిట్లనియె. (59) గోపికా జనములు గోపాలకులు నున్న¯ పసులమందకుఁ బొమ్ము భద్ర! నీవు¯ వసుదేవుభార్యలు వరుసఁ గంసుని చేత¯ నాఁకల బడియుండ నందుఁ జొరక¯ తలఁగి రోహిణి యను తరళాక్షి నంద గో¯ కుల మందు నున్నది గుణగణాఢ్య¯ దేవకికడుపున దీపించు శేషాఖ్య¯ మైన నా తేజ మీ వమరఁ బుచ్చి (59.1) నేర్పు మెఱసి రోహిణీదేవి కడుపునఁ¯ జొనుపు దేవకికిని సుతుఁడ నగుదు¯ నంశభాగయుతుఁడనై యశోదకు నందు¯ పొలఁతి కంత మీద బుట్టె దీవు. (60) నానావిధ సంపదలకుఁ¯ దానకమై సర్వకామదాయిని వగు నిన్¯ మానవులు భక్తిఁ గొలుతురు¯ కానికలును బలులు నిచ్చి కల్యాణమయీ! (61) మఱియు నిన్ను మానవులు దుర్గ భద్రకాళి విజయ వైష్ణవి కుముద చండిక కృష్ణ మాధవి కన్యక మాయ నారాయణి యీశాన శారద యంబిక యను పదునాలుగు నామంబులం గొనియాడుదు రయ్యై స్థానంబుల యం”దని యెఱింగించి సర్వేశ్వరుండగు హరి పొమ్మని యానతిచ్చిన మహాప్రసాదం బని యయ్యోగనిద్ర యియ్యకొని మ్రొక్కి చయ్యన ని య్యిల కయ్యెడ బాసి వచ్చి.

రోహిణి బలభద్రుని కనుట

(62) దేవకీదేవికడుపులోఁ దేజరిల్లు¯ దీప్త గర్భంబు మెల్లనఁ దిగిచి యోగ¯ నిద్ర రోహిణికడుపున నిలిపి చనియెఁ; ¯ గడుపు దిగె నంచుఁ బౌరులు గలగఁ బడగ. (63) అంత. (64) బలము మిగులఁ గలుగ "బలభద్రుఁ"డన లోక¯ రమణుఁ డగుటఁ జేసి "రాముఁ"డనగ¯ సతికిఁ బుట్టె గర్భసంకర్షణమున "సం¯ కర్షణుం"డనంగ ఘనుఁడు సుతుఁడు. (65) తదనంతరంబ. (66) ఆనకదుందుభి మనమున ¯ శ్రీనాథుం డంశభాగశిష్టతఁ జొరఁగన్¯ భానురుచి నతఁడు వెలిఁగెను¯ గానఁగఁ బట్టయ్యె భూతగణములకు నృపా! (67) ఆ వసుదేవుఁ డంతఁ దన యం దఖిలాత్మక మాత్మ భూతముం¯ బావనరేఖయున్ భువనభద్రమునై వెలుఁగొందుచున్న ల¯ క్ష్మీవిభు తేజ మచ్చుపడఁ జేర్చినఁ దాల్చి నవీనకాంతితో¯ దేవకి యొప్పెఁ బూర్వయగు దిక్సతి చంద్రునిఁ దాల్చు కైవడిన్." (68) అనిన విని తర్వాతి వృత్తాంతం బెట్లయ్యె నని రా జడిగిన శుకుం డిట్లనియె. (69) “గురుతరముగఁ దన కడుపునఁ¯ సరసిజగర్భాండభాండ చయములు గల యా¯ హరి దేవకి కడుపున భూ¯ భరణార్ధము వృద్ధిఁబొందె బాలార్కు క్రియన్. (70) అంత. (71) విమతులమోములు వెలవెలఁ బాఱంగ¯ విమలాస్యమోము వెల్వెలకఁ బాఱె; ¯ మలయు వైరులకీర్తి మాసి నల్లనగాఁగ¯ నాతిచూచుకములు నల్లనయ్యె; ¯ దుష్టాలయంబుల ధూమరేఖలు పుట్ట¯ లేమ యారున రోమలేఖ మెఱసె; ¯ నరి మానసముల కాహారవాంఛలు దప్ప¯ వనజాక్షి కాహారవాంఛ దప్పె; (71.1) శ్రమము సంధిల్లె రిపులకు శ్రమము గదుర¯ జడత వాటిల్లె శత్రులు జడను పడఁగ; ¯ మన్ను రుచియయ్యెఁ బగతురు మన్ను చొరఁగ; ¯ వెలఁది యుదరంబులో హరి వృద్ధిఁబొంద. (72) మఱియును. (73) సలిల మా యెలనాఁగ జఠరార్భకునిఁ గానఁ¯ జనిన కైవడి ఘర్మసలిల మొప్పె; ¯ నొగిఁ దేజ మా యింతి యుదరడింభకు గొల్వఁ¯ గదిసిన క్రియ దేహకాంతి మెఱసెఁ; ¯ బవనుఁ డా కొమ్మ గర్భస్థుని సేవింప¯ నొలసెనా మిక్కిలి యూర్పు లమరెఁ; ¯ గుంభిని యా లేమ కుక్షిగు నర్చింపఁ¯ జొచ్చుభంగిని మంటి చొరవ దనరె; (73.1) గగన మిందువదనకడుపులో బాలు సే¯ వలకు రూపు మెఱసి వచ్చినట్లు¯ బయలువంటి నడుము బహుళ మయ్యెను; బంచ¯ భూతమయుఁడు లోనఁ బొదల సతికి. (74) తదనంతరంబ. (75) అతివకాంచీగుణం బల్లన బిగియంగ¯ వైరివధూ గుణవ్రజము వదలె; ¯ మెల్లన తన్వంగి మెయిదీవ మెఱుఁగెక్క¯ దుష్టాంగనాతనుద్యుతు లడంగె; ¯ నాతి కల్లన భూషణములు పల్పలనగాఁ¯ బరసతీభూషణ పంక్తు లెడలె; ¯ గలకంఠి కొయ్యన గర్భంబు దొడ్డుగాఁ¯ బరిపంథిదారగర్భములు పగిలెఁ; (75.1) బొలఁతి కల్లన నీళ్ళాడు ప్రొద్దు లెదుగ¯ నహితవల్లభ లైదువలై తనర్చు ¯ ప్రొద్దు లన్నియుఁ గ్రమమున బోవఁ దొడగెఁ; ¯ నువిదకడుపున నసురారి యుంటఁజేసి. (76) ఇవ్విధంబున. (77) జ్ఞానఖలునిలోని శారదయును బోలె¯ ఘటములోని దీపకళిక బోలె ¯ భ్రాతయింట నాఁకఁ బడియుండె దేవకీ¯ కాంత విశ్వగర్భగర్భ యగుచు. (78) అంత న క్కాంతాతిలకంబు నెమ్మొగంబు తెలివియును, మేనిమెఱుంగును, మెలంగెడి సొబగునుం జూచి వెఱఁగుపడి తఱచు వెఱచుచుఁ గంసుండు తనలో నిట్లనియె. (79) "కన్నులకుఁ జూడ బరువై ¯ యున్నది యెలనాఁగగర్భ ముల్లము గలగన్¯ ము న్నెన్నఁడు నిట్లుండదు¯ వెన్నుఁడు చొరఁ బోలు గర్భవివరములోనన్. (80) ఏమి దలంచువాఁడ? నిఁక నెయ్యది కార్యము? నాఁడునాఁటికిం¯ గామిని చూలు పెంపెసఁగె; గర్భిణిఁ జెల్లెలి నాఁడు పేద నే¯ నేమని చంపువాడఁ? దగ వేలని చంపితినేని శ్రీయు ను¯ ద్దామయశంబు నాయువును ధర్మమునుం జెడిపోవ కుండునే? (81) వావి యెఱుంగని క్రూరుని¯ జీవన్మృతుఁ డనుచు నిందఁ జేయుదు; రతడుం¯ బోవును నరకమునకు; దు¯ ర్భావముతో బ్రదుకు టొక్క బ్రదుకే తలఁపన్?" (82) అని నిశ్చయించి క్రౌర్యంబు విడిచి, ధైర్యంబు నొంది, గాంభీర్యంబు వాటించి, శౌర్యంబు ప్రకటించుకొనుచు, దిగ్గనం జెలియలిం జంపు నగ్గలిక యెగ్గని యుగ్గడించి మాని, మౌనియుం బోలెనూర కుండియు. (83) పాపరాని దొడ్డ పగపుట్టె నిక నెట్టు¯ లిందుముఖికిఁ జక్రి యెపుడు పుట్టుఁ? ¯ బుట్టినపుడె పట్టి పురిటింటిలోఁ దెగఁ¯ జూతు ననుచు నెదురుచూచుచుండె. (84) మఱియు వైరానుబంధంబున నన్యానుసంధానంబు మఱచి యతండు. (85) తిరుగుచుఁ గుడుచుచుఁ ద్రావుచు¯ నరుగుచుఁ గూర్చుండి లేచు చనవరతంబున్¯ హరిఁ దలఁచితలఁచి జగ మా¯ హరిమయ మని చూచెఁ గంసుఁ డాఱని యలుకన్. (86) వెండియు. (87) శ్రవణరంధ్రముల నే శబ్దంబు వినఁబడు¯ నది హరిరవ మని యాలకించు; ¯ నక్షిమార్గమున నెయ్యది చూడఁబడు నది¯ హరిమూర్తి గానోపు నంచుఁ జూచుఁ; ¯ దిరుగుచో దేహంబు తృణమైన సోఁకిన¯ హరికరాఘాతమో యనుచుఁ నులుకు; ¯ గంధంబు లేమైన ఘ్రాణంబు సోఁకిన¯ హరిమాలికాగంధ మనుచు నదరుఁ; (87.1) బలుకు లెవ్వియైనఁ బలుకుచో హరిపేరు¯ పలుకఁబడియె ననుచు బ్రమసి పలుకుఁ; ¯ దలఁపు లెట్టివైనఁ దలఁచి యా తలఁపులు¯ హరితలంపు లనుచు నలుఁగఁ దలఁచు.

బ్రహ్మాదుల స్తుతి

(88) అ య్యవసరంబున ననుచరసమేతులైన దేవతలును, నారదాది మునులునుం గూడ నడువ నలువయును, ముక్కంటియు నక్కడకు వచ్చి దేవకీదేవి గర్భంబున నర్భకుండై యున్న పురుషోత్తము నిట్లని స్తుతియించిరి. (89) "సత్యవ్రతుని నిత్యసంప్రాప్త సాధనుఁ¯ గాలత్రయమునందు గలుగువాని¯ భూతంబు లైదును బుట్టుచోటగు వాని¯ నైదుభూతంబులం దమరువాని¯ నైదుభూతంబులు నడఁగిన పిమ్మట¯ బరఁగువానిని సత్యభాషణంబు¯ సమదర్శనంబును జరిపెడువానిని¯ ని న్నాశ్రయింతుము; నీ యధీన (89.1) మాయచేత నెఱుకమాలిన వారలు¯ పెక్కుగతుల నిన్నుఁ బేరుకొందు; ¯ రెఱుగనేర్చు విబుధు లేకచిత్తంబున¯ నిఖిలమూర్తు లెల్ల నీవ యండ్రు. (90) అదియునుం గాక. (91) ప్రకృతి యొక్కటి పాదు; ఫలములు సుఖదుఃఖ¯ ములు రెండు; గుణములు మూఁడు వేళ్ళు; ¯ తగు రసంబులు నాల్గు ధర్మార్థ ముఖరంబు¯ లెఱిగెడి విధములై దింద్రియంబు; ¯ లాఱు స్వభావంబు లా శోక మోహాదు¯ లూర్ములు; ధాతువులొక్క యేడు; ¯ పైపొరలెనిమిది ప్రంగలు; భూతంబు¯ లైదు బుద్ధియు మనోహంకృతులును; (91.1) రంధ్రములు తొమ్మిదియుఁ గోటరములు; ప్రాణ¯ పత్త్రదశకంబు; జీవేశ పక్షియుగముఁ¯ గలుగు సంసారవృక్షంబు గలుగఁ జేయఁ¯ గావ నడఁగింప రాజ వొక్కరుఁడ వీవ. (92) నీదెసఁ దమచిత్తము లిడి¯ యే దెసలకుఁ బోక గడతు రెఱుక గలుగువా; ¯ రా దూడయడుగు క్రియ నీ¯ పాదం బను నావకతన భవసాగరమున్. (93) మంచివారి కెల్ల మంగళ ప్రద లయ్యుఁ¯ గల్లరులకు మేలుగాని యట్టి¯ తనువు లెన్నియైనఁ దాల్చి లోకములకు¯ సేమ మెల్లప్రొద్దు జేయు దీవు. (94) ఎఱిఁగినవారల మనుచును¯ గొఱమాలిన యెఱుక లెఱిఁగి కొందఱు నీ పే¯ రెఱిగియు దలఁపగ నొల్లరు¯ పఱతు రధోగతుల జాడఁ బద్మదళాక్షా! (95) నీ వారై నీ దెసఁ దమ¯ భావంబులు నిలిపి ఘనులు భయవిరహితులై¯ యే విఘ్నంబులఁ జెందక¯ నీ వఱలెడి మేటిచోట నెగడుదు రీశా! (96) నిను నాలుగాశ్రమంబుల¯ జనములు సేవింప నఖిల జగముల సత్త్వం¯ బును శుద్ధంబును శ్రేయం¯ బును నగు గాత్రంబు నీవు పొందుదువు హరీ! (97) నలినాక్ష! సత్త్వగుణంబు నీ గాత్రంబు¯ గాదేని విజ్ఞానకలిత మగుచు¯ నజ్ఞానభేదకం బగు టెట్లు? గుణముల¯ యందును వెలుఁగ నీ వనుమతింపఁ¯ బడుదువు; సత్త్వరూపంబు సేవింపంగ¯ సాక్షాత్కరింతువు సాక్షి వగుచు¯ వాఙ్మనసముల కవ్వలిదైన మార్గంబు¯ గలుగు; నీ గుణజన్మకర్మరహిత (97.1) మైన రూపును బేరు నత్యనఘబుద్ధు¯ లెఱుగుదురు; నిన్నుఁ గొల్వ నూహించుకొనుచు¯ వినుచుఁ దలచుచుఁ బొగడుచు వెలయువాఁడు¯ భవము నొందఁడు నీ పాద భక్తుఁడగును. (98) ధరణీభారము వాసెను¯ బురుషోత్తమ! యీశ! నీదు పుట్టువున; భవ¯ చ్చరణాంబుజముల ప్రాపున¯ ధరణియు నాకసముఁ గాంచెదము నీ కరుణన్. (99) పుట్టువు లేని నీ కభవ! పుట్టుట క్రీడయె కాక పుట్టుటే? ¯ యెట్టనుడున్ భవాదిదశ లెల్లను జీవులయం దవిద్య దాఁ¯ బుట్టుచు నుండుఁ గాని నినుఁ బుట్టినదింబలెఁ బొంతనుండియుం ¯ జుట్టఁగ లేని తత్క్రియలఁ జొక్కని యెక్కటి వౌదు వీశ్వరా! (100) గురు పాఠీనమవై, జలగ్రహమవై, కోలంబవై, శ్రీనృకే¯ సరివై, భిక్షుఁడవై, హయాననుఁడవై, క్ష్మాదేవతాభర్తవై, ¯ ధరణీనాథుడవై, దయాగుణగణోదారుండవై, లోకముల్¯ పరిరక్షించిన నీకు మ్రొక్కెద; మిలాభారంబు వారింపవే. (101) ముచ్చిరి యున్నది లోకము¯ నిచ్చలుఁ గంసాదిఖలులు నిర్దయు లేఁపన్; ¯ మచ్చికఁ గావఁగ వలయును¯ విచ్చేయుము తల్లికడుపు వెడలి ముకుందా!” (102) అని మఱియు దేవకీదేవిం గనుంగొని యిట్లనిరి. (103) “తల్లి! నీ యుదరంబులోనఁ బ్రధానబూరుషుఁ డున్నవాఁ¯ డెల్లి పుట్టెడిఁ; గంసుచే భయ మింత లేదు; నిజంబు; మా¯ కెల్లవారికి భద్రమయ్యెడు; నింక నీ కడు పెప్పుడుం¯ జల్లగావలె యాదవావళి సంతసంబునఁ బొంగఁగన్. (104) అని యి వ్విధంబున హరిం బొగడి దేవకీదేవిని దీవించి దేవత లీశాన బ్రహ్మల మున్నిడుకొని చని; రంత .

దేవకి కృష్ణుని కనుట

(105) పంకజముఖి నీ ళ్ళాడఁను¯ సంకటపడ ఖలులమానసంబుల నెల్లన్¯ సంకటము దోఁచె; మెల్లన¯ సంకటములు లేమి తోఁచె సత్పురుషులకున్. (106) స్వచ్ఛంబులై పొంగె జలరాసు లేడును¯ గలఘోషణముల మేఘంబు లుఱిమె; ¯ గ్రహతారకలతోడ గగనంబు రాజిల్లె¯ దిక్కులు మిక్కిలి తెలివిఁ దాల్చెఁ; ¯ గమ్మని చల్లని గాలి మెల్లన వీఁచె¯ హోమానలంబు చెన్నొంది వెలిఁగెఁ; ¯ గొలఁకులు కమలాళికులములై సిరి నొప్పెఁ¯ బ్రవిమలతోయలై పాఱె నదులు; (106.1) వర పుర గ్రామ ఘోష యై వసుధ యొప్పె; ¯ విహగ రుత పుష్ప ఫలముల వెలసె వనము; ¯ లలరుసోనలు గురిసి ర య్యమరవరులు; ¯ దేవదేవుని దేవకీదేవి గనఁగ. (107) పాడిరి గంధర్వోత్తము; ¯ లాడిరి రంభాది కాంత; లానందమునన్¯ గూడిరి సిద్ధులు; భయముల¯ వీడిరి చారణులు; మొరసె వేల్పుల భేరుల్. (108) అ య్యవసరంబున. (109) సుతుఁ గనె దేవకి నడురే¯ యతి శుభగతిఁ దారలును గ్రహంబులు నుండన్¯ దితిసుతనిరాకరిష్ణున్¯ శ్రితవదనాలంకరిష్ణు జిష్ణున్ విష్ణున్. (110) వెన్నుని నతిప్రసన్నునిఁ ¯ గ్రన్నన గని మెఱుఁగుఁబోఁడి గడు నొప్పారెం¯ బున్నమనాఁడు కళానిధిఁ¯ గన్న మహేంద్రాశ చెలువు గలిగి నరేంద్రా! (111) అప్పుడు. (112) జలధరదేహు నాజానుచతుర్బాహు¯ సరసీరుహాక్షు విశాలవక్షుఁ¯ జారు గదా శంఖ చక్ర పద్మ విలాసుఁ¯ గంఠకౌస్తుభమణికాంతి భాసుఁ¯ గమనీయ కటిసూత్ర కంకణ కేయూరు¯ శ్రీవత్సలాంఛనాంచిత విహారు¯ నురుకుండలప్రభాయుత కుంతలలలాటు¯ వైడూర్యమణిగణ వరకిరీటు (112.1) బాలుఁ బూర్ణేందురుచిజాలు భక్తలోక¯ పాలు సుగుణాలవాలుఁ గృపావిశాలుఁ¯ జూచి తిలకించి పులకించి చోద్య మంది¯ యుబ్బి చెలరేఁగి వసుదేవుఁ డుత్సహించె. (113) స్నానముచేయఁగ రామిని¯ నానందరసాబ్ధిమగ్నుఁడై విప్రులకున్¯ ధేనువులం బదివేలను¯ మానసమున ధారవోసె మఱి యిచ్చుటకున్. (114) మఱియు వసుదేవుండు. (115) "ఈ పురిటియింటి కుద్య¯ ద్దీపంబును బోలి చాల దీపించె నిజం¯ బీ పాపఁడు నలు మొగముల¯ యా పాపని గనిన మేటి యగు"నని భక్తిన్.

వసుదేవుడు కృష్ణుని పొగడుట

(116) చాఁగి మ్రొక్కి లేచి సరగున నొసలిపైఁ¯ గేలుఁదమ్మిదోయిఁ గీలుకొలిపి¯ పాపఁ డనక వెఱక పాపని మొదలింటి¯ పోకలెల్లఁ దలఁచి పొగడఁ దొడఁగె. (117) "ఏ నిన్ను నఖిలదర్శను ¯ జ్ఞానానందస్వరూపు సంతతు నపరా¯ ధీనుని మాయాదూరుని¯ సూనునిఁగాఁ గంటి; నిట్టి చోద్యము గలదే? (118) అచ్చుగ నీ మాయను మును¯ జెచ్చెరఁ ద్రిగుణాత్మకముగఁ జేసిన జగముల్¯ జొచ్చిన క్రియఁ జొరకుందువు¯ చొచ్చుటయును లేదు; లేదు చొరకుండుటయున్. (119) అదియు నెట్లన మహదాదులఁ బోలెడి¯ దై వేఱువేఱయై యన్నివిధము¯ లగు సూక్ష్మభూతంబు లమర షోడశ వికా¯ రములతోఁ గూడి విరాట్టనంగఁ¯ బరమాత్మునకు నీకు బఱపైన మేను సం¯ పాదించి యందు లోఁబడియుఁ బడక¯ యుండు సృష్టికి మున్న యున్న కారణమున¯ వానికి లోనిభవంబు గలుగ; (119.1) దట్లు బుద్ధి నెఱుఁగ ననువైన లాగునఁ¯ గలుగు నింద్రియముల కడలనుండి¯ వాని పట్టులేక వరుస జగంబులఁ¯ గలసియుండి యైనఁ గలయ వెపుడు. (120) సర్వము నీలోనిదిగా¯ సర్వాత్ముఁడ; వాత్మవస్తు సంపన్నుఁడవై¯ సర్వమయుఁడ వగు నీకును¯ సర్వేశ్వర! లేవు లోను సందులు వెలియున్. (121) ఆత్మ వలనఁ గలిగి యమరు దేహాదుల¯ నాత్మకంటె వేఱు లవి యటంచు¯ దలఁచువాఁడు మూఢతముఁడు గావునఁ నీశ! ¯ విశ్వ మెల్ల నీవ వేఱు లేదు. (122) అదియునుం గాక. (123) గుణము వికారంబుఁ గోరికయును లేని¯ నీ వలన జగంబు నెఱి జనించుఁ; ¯ బ్రబ్బు; లేదగు; నంచుఁ బలుకుట తప్పుగా¯ దీశుండవై బ్రహ్మ మీవ యైన¯ నినుఁ గొల్చు గుణములు నీ యానతులు చేయ, ¯ భటులశౌర్యంబులు పతికి వచ్చు¯ పగిది నీ గుణముల బాగులు నీ వని¯ తోఁచును నీ మాయతోడఁ గూడి (123.1) నీవు రక్త ధవళ నీల వర్ణంబుల¯ జగము చేయఁ గావ సమయఁ జూడఁ¯ దనరు; దట్లు నేఁడు దైత్యుల దండింపఁ¯ బృథివి గావ నవతరించి తీశ! (124) మింటన్ మ్రోసిన మ్రోత తాలిమిని లోమేండ్రింప మున్ నీవు నా¯ యింటం బుట్టెద వంచుఁ గంసుడు దొడిన్ హింసించె నీ యన్నలం; ¯ గంటం గూరుకుఁ దేఁడు; నీ యుదయ మా కారాజనుల్ చెప్పగాఁ¯ బంటింపం; డెదురేఁగుదెంచు వడి నీపై నేఁడు సన్నద్ధుఁడై.” (125) అనుచుండ దేవకీదేవి మహాపురుషలక్షణుండును, విచక్షణుండును, సుకుమారుండును నైన కుమారునిం గని, కంసునివలని వెఱపున శుచిస్మితయై యిట్లనియె.

దేవకి చేసిన స్తుతి

(126) "అట్టిట్టి దనరానిదై మొదలై నిండు¯ కొన్నదై వెలుఁగుచు గుణములేని¯ దై యొక్క చందంబుదై కలదై నిర్వి¯ శేషమై క్రియలేక చెప్పరాని¯ దేరూపమని శ్రుతు లెప్పుడు నొడివెడి¯ యా రూప మగుచు నధ్యాత్మదీప¯ మై బ్రహ్మ రెండవ యర్థంబు తుది జగం¯ బులు నశింపఁగఁ బెద్దభూతగణము (126.1) సూక్ష్మభూతమందుఁ జొరగఁ నా భూతంబు ¯ ప్రకృతిలోనఁ జొరఁగఁ బ్రకృతి పోయి ¯ వ్యక్తమందుఁ జొరఁగ వ్యక్త మడంగను¯ శేషసంజ్ఞ నీవు చెలువ మగుదు. (127) విశ్వము లీల ద్రిప్పుచు నవిద్యకు జుట్టమ వైన నీకు దా¯ శాశ్వతమైన కాలమిది సర్వము వేడబమందు; రట్టి వి¯ శ్వేశ్వర! మేలుకుప్ప! నిను నెవ్వఁడుఁ గోరి భజించు వాడె పో¯ శాశ్వతలక్ష్మి మృత్యుజయ సౌఖ్యయుతుం డభయుండు మాధవా! (128) ఒంటి నిల్చి పురాణయోగులు యోగమార్గనిరూఢులై¯ "కంటి"మందురు గాని, నిక్కము గాన; రీ భవదాకృతిం¯ గంటి భద్రముఁ గంటి; మాంసపుఁ గన్నులం గనబోల; దీ¯ తొంటిరూపుఁ దొలంగఁబెట్టుము తోయజేక్షణ! మ్రొక్కెదన్. (129) విలయకాలమందు విశ్వంబు నీ పెద్ద¯ కడుపులోన దాఁచు కడిమి మేటి¯ నటుఁడ వీవు; నేఁడు నా గర్భజుఁడ వౌట¯ పరమపురుష! వేడబంబు గాదె? (130) నళినలోచన! నీవు నిక్కము నాకుఁ బుట్టెద వంచు నీ¯ ఖలుఁడు కంసుఁడు పెద్దకాలము కారయింట నడంచె; దు¯ ర్మలినచిత్తుని నాజ్ఞజేయుము; మమ్ముఁ గావుము భీతులన్; ¯ నులుసు లేక ఫలించె నోచిన నోము లెల్లను నీవయై.”