పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

వార్తా ఉల్లేఖనాలు : 2018-09-05 ఆంధ్రజ్యోతిలో జయంత్యుత్సవాలు



ఆంధ్రజ్యోతి
ప్రవాస2018-09-05

సింగపూర్‌లో ఘనంగా ‘భాగవత జయంత్యుత్సవం


ఆంధ్రజ్యోతిలో పడిన ఛాయాచిత్రం

సింగపూర్ సిటీ: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ‘‘తెలుగు భాగవత ప్రచార సమితి’’, ‘‘గణనాలయము’’ సంస్థల ఆధ్వర్యంలో సింగపూర్‌లో ‘భాగవత జయంత్యుత్సవం’ ఘనంగా జరిగింది. సెప్టెంబర్ 2న ‘భాగవత జయంత్యుత్సవం 2018’ అత్యంత ఆకర్షణీయంగా జరిగింది. సనాతన హిందూ ధర్మానికి తలమానికమైన ‘శ్రీమద్భాగవత’ గ్రంధంలోని భక్తితత్వం ప్రతిఒక్కరికి అన్నికాలాలలోనూ ఆదర్శప్రాయము కావాలనే సంకల్పంతో, పోతన తెలుగు భాగవతం మరింత ప్రాచుర్యంలోనికి తెచ్చే దిశగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం విశేషం. పిల్లలలో కూడా భాగవత తత్వం పట్ల ఆసక్తి పెంచేవిధంగా వారికి భాగవత ఇతివృత్తానికి సంబంధించిన చిత్రలేఖనము, కథల పోటీలను నిర్వహించారు.

మరిన్ని ఫొటోల కోసం క్లిక్ చేయండి

శ్రీశ్రీశ్రీ అమృతానంద సరస్వతీ సంయమీంద్ర మహాస్వాములవారు విజేతలకు ధృవపత్రాలను అందజేసి ఆశీర్వదించారు. పిల్లలకు పెద్దలకు కూడా అనువైన విధంగా కార్యక్రమం రూపొందడంతో సింగపూర్‌లోని తెలుగు వారందరూ అధిక సంఖ్యలో సకుటుంబంగా ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం పాల్గొన్న భక్తులందరికీ అన్నప్రసాద వితరణ గావించారు. భాగవత పారాయణము, భక్తి పాటలు, పిల్లల పాటలు, ఆసక్తికరమైన సాంస్కృతిక కార్యక్రమాలతో కృష్ణాష్టమిని సింగపూర్ వాసులు అందరూ కలిసి వైభవోపేతంగా జరుపుకోవడం ఆనందదాయకంగా ఉందని నిర్వాహకులు తెలియజేశారు. భాగవతంలోని వివిధ పాత్రల వేషధారణలతో చిన్నారులు ప్రత్యేకంగా ఆహూతులను అలరించారు. ఈ కార్యక్రమ ముఖ్యఅతిథిగా ప్రముఖ వక్త, ఉపనిషత్తులలో పట్టభద్రుడు, తెలుగు ఉమ్మడి రాష్ట్రాలకు మాజీ డీజీపీ, డా. కరణం అరవిందరావు విచ్చేసి తమ అమూల్యమైన ఆధ్యాత్మిక సందేశాన్ని అందించారు. భాగవత ప్రచార సమితి ఆధ్వర్యంలో సంస్థ యొక్క 5వ వార్షికోత్సవాన్ని కూడా పురస్కరించుకుని ఈ ఏడాది హైదరాబాద్, సింగపూర్‌లో ఒకేరోజున భాగవత జయంతి వేడుకలు నిర్వహించడం విశేషం. అన్ని కార్యక్రమాలను ఆన్‌లైన్‌, యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం కూడా చేయడంవల్ల ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో కార్యక్రమాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో భాస్కర్, విద్యాధరి, రవితేజ, రాధిక, లావణ్య, మమత, నమ్రత, భరద్వాజ్, శ్రీధర్, శ్రీవిద్య తదితరులు పాల్గొన్నారు.

సింగపూర్‌లో ఘనంగా ‘భాగవత జయంత్యుత్సవం’ ఛాయాచిత్రమాల