పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బమ్మెర పోతన : పోతన-భాస్కర-రామాయణం

పోతన తెలుగు భాగవతం.

ప్రాచీన కవుల పద్యాలతో సంవదించే పద్యాలు కొన్ని పోతన్న గారి తెలుగు భాగవతంలో అక్కడక్కడ గోచరిస్తాయని ఒక ఆక్షేపణ ఉంది. అది వాస్తవంగా అలోచిస్తే పోతనకు ఉత్కర్షే కాని అపకర్ష ఏ మాత్రం కాదు. అటువంటి విధంగా సంవదించే పద్యాలు పూర్వకవుల పద్యాలతో సరి సమానంగానూ, కొన్ని చోట్ల పూర్వకవి పద్యాలకు మెరుగులు దిద్దేవిగానూ ఉన్నాయి.
భాస్కర రామాయణం లోని పద్యాలకు సంవదించే పద్యాలు కూడా పోతన తెలుగు భాగవతంలో కనిపిస్తాయి. భాస్కరుడు చేసిన ఈ క్రింది దండకారణ్య వర్ణన చూడండి.

పుణ్యచరిత్రుఁ డత్రిముని పుంగవు వీడ్కొని రాముఁ డంచితా
ణ్యగుణాభిరాముఁ డుపకంఠమునం జని కాంచె దండకా
ణ్యము, సిద్ధసంయమి విరాజిత, చారు తపోనుజాత స
త్పుణ్యము, నిర్మలాంబువర పుష్కరపూర్ణసరోవరేణ్యమున్.

ఇదే సందర్భంలో పోతన దండకారణ్యాన్ని ఈ విధంగా వర్ణించాడు.

పుణ్యుడు రామచంద్రుఁడట వోయి మందంబునఁ గాంచె దండకా
ణ్యముఁ దాపసోత్తమ శణ్యము నుద్దత బర్హి బర్హ లా
ణ్యము గౌతమీ విమలవాఃకణ పర్యటనప్రభూత సా
ద్గుణ్యము నుల్లసత్తరు నికుంజవరేణ్యము నగ్రగణ్యమున్.

ఇరువురు మహాకవులూ ఒకే వృత్తం, ఒకే ప్రాస ఒకే అంత్యాను ప్రాస స్వీకరించారు. భాస్కరుడు దండకారణ్యానికి రెండు విశేషణాలు వేస్తే పోతన అయిదు విశేషణాలు వేసాడు. ఉద్దత బర్హి బర్హ లావణ్యము (మదించిన మయూరాల పింఛాలలోని నిగనిగలతో కూడినది) అన్న విశేషణమూ, ఉల్లసత్తరు నికుంజవరేణ్యము (చక్కగా వికసించిన చెట్లతో పొదరిండ్లతో నిండినది) అన్న విశేషణమూ అరణ్యశోభను మరింత వెల్లడిస్తున్నాయి. అంతే కాకుండా స్వచ్ఛమైన గోదావరీనది శీతలశీకరాలతో నిండి ఉన్నదనటం పొతన్నగారి ఆంధ్రాభిమానాన్ని అభివ్యక్తం చేస్తున్నది.
ఈ విధంగా పోతనగారి పద్యాలలో పూర్వకవుల పద్యాలతో సంవదించేవి ఉన్నప్పటికీ అవి సొంత విలువలు సంతరించుకొన్నవనీ, అది గ్రంథచౌర్యం కాదనీ, అందువల్ల పొతన్నగారి కవిత్వానికి ఎటువంటి లోటూ వాటిల్లదనీ మనకు అర్థమౌతుంది.

విశ్లేషణ. . .
కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి.