పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బమ్మెర పోతన : వాసుదేవ స్వామి పద్యాలు రెండు

ఓం శ్రీరామ
బమ్మెర పోతనామాత్యులు

శ్రీ వావిలికొలను సుబ్బారావు గారి విరచిత మందరం, శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం, బాలకాండ-1వ భాగంనుండి గ్రహించబడిన రెండు పద్యాలు.
సీ.
ఆంధ్రీకరణశక్తి నతకరించెను జాల; సర్వజ్ఞులనఁబడు సకల కవులఁ
బరమమధూక్తుల భవ్యకవితఁ గూర్చెఁ; గొద దీఱ నమృతంబుఁ గూరికూరి
భక్తిరసైక సంపద గర్భితముఁ జేసె; సకలరసావళీ శ్లాఘ్యరీతి
హరివర్ణనా సమయమునను స్వశరీర; విస్మృతి గనఁబడ వలసె నట్టి
తే.
పోతనామాత్యుఁ సత్కవి పూగజాత్యుఁ
దర్పితాదిత్యు రఘుపతి ధ్యాననిత్యు
సహజపాండిత్యుఁగృతకృత్యు శస్తసత్యు
ధీసురామాత్యుఁ గొలిచెద వాసిచెలఁగ.
కఠిన పదాల అర్థాలు:
ఆంధ్రీకరణ శక్తిన్ = సంస్కృత గ్రంథాన్ని తెలుగులో వ్రాయు సామర్థ్యమందు; సర్వజ్ఞు లనఁబడు సకల కవులన్ = సర్వజ్ఞులు అని పేరుపొందిన కవీశ్వరులు అందరిని; చాలన్ = మిక్కిలి; అతికరించెను = అతిశయించెను; పరమమధూక్తులన్ = మిక్కిలి తియ్యనైన మాటలచే; కొదదీఱన్ = కొరత లేకుండా; అమృతంబున్ = అమృతమును; కూరికూరి = బాగా దట్టించి; భవ్యకవితఁ = శుభమైన యోగ్యమైన కవిత్వమును; శ్లాఘ్యరీతి = పొగడ తగిన విధముగ; భక్తిరసైక సంపద గర్భితము = భక్తి రసమే ప్రధాన సంపదగా అంతర్గతంగా ఉండేలాగ (ఏ రసము వర్ణించినా దానిలో కూడ భక్తి రసం ఇమిడి ఉండేలా); చేసెన్ = రచించెను; హరి వర్ణనా సమయమునన్ = విష్ణుమూర్తిని స్తుతించేటప్పుడు; స్వశరీర విస్మృతి = భక్తి పారవశ్యంతో తన దేహాన్ని మరచుట; కనబడన్ = స్పురించే లాగ; వెలసెన్ = విలసిల్లెను; అట్టిపోతనామాత్యున్ = అటువంటి బమ్మెర పోతనని; సత్కవిపూగజాత్యున్ = మంచి కవుల సమూహంలో శ్రేష్ఠుడిని; తర్పితాదిత్యున్ = సంతోష పెట్టబడిన సూర్యుడు కల వానిని; రఘుపతి ధ్యాన నిత్యున్ = నిత్యం శ్రీరామ ధ్యానం చేసేవాడిని; సహజ పాండిత్యున్ = సహజసిద్ధంగా పుట్టుకతోనే పాండిత్యం అబ్బిన వానిని; కృతకృత్యున్ = జన్మ సార్థకము చేసుకొన్నవానిని; శస్తసత్యున్ = ప్రశస్తమైన సత్య గుణం కల వానిని; ధీసురామాత్యున్ = బుద్ధిమంతులలో ఉత్తముడిని; వాసి = మేలు; చెలగన్ = అతిశయించేలా; కొలిచెదన్ = సేవిస్తాను.
తాత్పర్యము:
సంస్కృత గ్రంథాన్ని తెలుగులోకి అనువదించడంలో, సర్వజ్ఞులు అని పేరుపొందిన కవులు అందరిని రస పోషణలో మించిన వాడిని. అమృతం బాగా దట్టించిన కవిత్వం చెప్పిన వాడిని, భగవంతునికి చెందిన విషయాలతో శుభకరమై, తియ్యనైన ఉండే కవిత్వం చెప్పిన వాడిని, ఏ రసం ప్రయోగించినా అంతర్గతంగా భక్తి తత్వం స్ఫురింపజేసిన వాడిని, భగవంతుణ్ణి వర్ణించేటప్పుడు భక్తి పారవశ్యంతో ఒళ్ళు మరిచే వాడిని, కవి శ్రేష్ఠుడిని, సూర్యుని ఉపాసకుడిని, సదా శ్రీరామ ధ్యానంలో ఉండే వాడిని, సహజ పండితుని, శ్రీమద్భాగవతమును ఆంధ్రీకరించి జన్మ సాఫల్యం చేసుకున్న వాడిని, సత్యవ్రతుడిని, బుద్ధి యందు బృహస్పతితో సమానమైన వాడిని ఆ బమ్మెర పోతనామాత్యుడు అను కవీంద్రుడిని కొలుస్తాను. - - - -
క.
తుచ్ఛుఁడు సరిగా దనినను
స్వచ్ఛపుఁ బోతన కవిత్వ సంపద చెడునే?
స్వేచ్ఛ జఱభి దూషించిన
నచ్చ పతివ్రతను బాప మంటుట గలదే?
ఈ పద్యము బమ్మెర పోతన విషయమే (= గురించే)
కఠిన పదాల అర్థాలు:
తుచ్ఛుడు = నీచుడు, అల్పబుద్ధి; చెడునే = చెడిపోదు కదా; జఱభి = రంకులాడి; స్వచ్ఛ = నిర్మలమైన; స్వేచ్ఛన్ = తన ఇష్టం వచ్చినట్లు; అచ్చ = నిర్మలమైన; కలదే = ఉండదు కదా.
తాత్పర్యము:
శీలం లేని ఆడది, నిర్మలమైన పతివ్రతను పట్టుకుని శీలం లేనిది అని ఎంత తిట్టినా, పతివ్రతకు ఆ పాపం అంటుకోదు కదా. అలాగే, అల్పబుద్ధి కోరి సలక్షణమైనది కాదు అని ఎంత గట్టిగా అన్నా, బమ్మెర పోతనామాత్యుల వారి కవిత్వపు గొప్పదనం, మాధుర్యం లేకుండా పోవు.