పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బమ్మెర పోతన : ఉటంకింపులు - పుష్పాంజలి

ఉటంకింపులు - పుష్పాంజలి

సౌజన్యము:- భాగవత జయంతిక - ఆర్కైవ్.ఆర్గ్ (archive.com)

1) ఈ మహాకవీశ్వరుని కవిత్వ మతిసుకుమార సరసవచన రచనా ధౌరేయమై నాతి కఠినమై శబ్దాలంకార శోభితమై కోవిద పామరజన హృదయంగమై వీనులవిందై చదువువారి కమందానందము కలిగించును. ఈయన పదము లతికోమలములు. అలంకారములు మనోజ్ఞములు. రచనలు సరసములు. పాకము మధురము. హరిభక్తి యగ్గలము. పాండిత్యము మిక్కుటము. లోకానుభవం బహీనము. వేదాంతార్థ చింతనము మెండు. పురాణ రత్నంబగు నిమ్మహా భాగవతము నాంధ్రీకరించి యీయన సాపాయంబగు కాయంబు దొరంగియు జీవించియే యున్నవాడు.

-శ్రీ నాగపూడి కుప్పుస్వామయ్య.

2) శ్రీ రామానుగ్రహ సమాసాదిత సరస కవితాసామ్రాజ్య ధురంధరుండగు బమ్మెర పోతనామాత్యుడు మృదుమధురాతిసుందర పద సందర్భ సౌభాగ్యంబు దీపింప నవరసభావ బంధురంబుగా నిమ్మహా గ్రంథంబు నాంధ్రీకరించె. పదలాలిత్యమును, ప్రసాద వైభవమును, సులలిత సరళధారయు పోతన కవితా కమనీయతకు ముఖ్య హేతువులు. ఈయన కవిత్వ ధార యన్నిట నతిశయించినది. అది యెందును గుంటులేక కటుపదంబుల గడుసుగాక యతి ప్రాసములందు మెలిగొనక యొక మహానదీ నిర్మల ప్రవాహము వలె నిగనిగలాడుచు నిరర్గళముగా ప్రవహించుచుండును. తిక్కన కర్థ సారస్యమునందు కన్ను. పోతనకు రససౌభాగ్యమునందు దృష్టి.

- శ్రీ తంజనగరం తేవప్పెరుమాళ్ళయ్య

3) పొతన పాండిత్య విశేషంబులు పూర్వపు కవులవానితో సమానముగను, కొంచె మధికముగను నుండును. గాని న్యూనంబుగ నెన్నండు నుండవు. తిక్కన సంగ్రహశయ్యకును, పోతన యమక కవనంబునకును ప్రసిద్ధులు. తిక్కన రౌద్ర బీభత్స రస ప్రధానంబులగు నారభటీ వృత్తులును వీర భయానక రస ప్రధానములగు సాత్వతీ వృత్తులును జెప్పెడి స్వభావము కలవాడు. పోతన శృంగార కరుణా రసంబులచే నొప్పు కౌశికీ వృత్తులును, హాస్య శాంతాద్భుతరస ప్రధాన భారతీవృత్తులును జెప్పెడి స్వభావము కలవాడు. సోమయాజి తెలుగు పదంబులు ప్రయోగించుట యందు విశేషాసక్తి కలవాడు. పోతన సంస్కృత పదప్రయోగ పటిష్ఠుడు. శృంగార వర్ణనల దొంటి పురాణ కవులలో పోతన కవనమే మిగుల శ్లాఘనీయము.

- శ్రీ గురజాడ శ్రీరామమూర్తి.

{గమనిక: - వృత్తులు నాలుగు విధములు - 1. కైశికి, 2, ఆరభటి, 3. భారతి, 4. సాత్వతి. 1) కైశికి - శృంగార కరుణ రసములు మిక్కిలి సున్నితమగు రీతిని వర్ణించినది; 2) ఆరభటి - రౌద్ర భీభత్సములు పరుషవర్ణములతో పెళుసుగ వర్ణింపబడినది; 3) భారతి - హాస్య శాంతాద్భుత రసములు సరళాక్షరములతో మృదువుగాఁ జెప్పబడినది; 4) సాత్వత - అతి పరుషములుగాని వర్ణములుగల పదజాలముతో వీరభయానక రసముల నభివర్ణించినది. (అతి సుకుమారములగు శృంగార కరుణ రసములకు మిక్కిలి ప్రౌఢరతన కూడదు. అట్లే అతి ప్రౌఢములగు రౌద్ర భీభత్సములకు మిక్కిలి కోమలవర్ణములుగల రచనయు పనికిరాదు. అనఁగా వర్ణనము రసానుకూలముగా నుండలెననుట.)

విద్యార్థి కల్పతరువు - కావ్య ప్రకరణము.

అత్యర్థ సుకుమా రార్ధ సందర్భాకైతికీ వతా
అత్యుద్ధతార్థ సందర్భా వృత్తి రారభటీ స్మృతా
ఈషద్మృదు అర్థ సందర్భా భారతీ వృత్తి రిష్యతే
ఈషత్ ప్రౌడార్థ సందర్భా సాత్వతీ వృత్తి రిష్యతే||

- విద్యానాథ విరచిత ప్రతాపరుద్రీయం (అలంకార శాస్త్రం)}

4) భక్తిరసపారావారమున నోలలాడు నట్లాంధ్రభాగవత ప్రబంధమును రచించి యాంధ్రలోకము ననుగ్రహించిన పూతచరిత్రుడు బమ్మెర పోతరాజు సుకవి. v- శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి

5) పోతనపేరు తలచడమే తడవుగా ఆంధ్రుల హృదయం పులకరిస్తుంది. పండితులు, కవితాపిపాసువులు మాత్రమే గాక మధ్య తరగతి కుటుంబాల్లో విద్యావతులుకాని స్త్రీలకు కూడ గజేంద్రమోక్షం, ప్రహ్లాదచరితం, భ్రమరగీతలు మొదలగు కొన్ని ఘట్టాలైనా తప్పక కంఠస్ఠమై యుండడం గమనించదగింది. ఈ నాటి మాట చెప్పలేను కాని మొన్న మొన్నటి వరకు తెలంగాణం లో అక్షరాభ్యాసంతోపాటు “తల్లీ! నిన్ను దలంచి పుస్తకము చేతం బూనితిన్” అనే పద్యం నేర్పేవారు. పండిత పామరులకు ఉభయులకూ అభిమానకవి ఎవ్వరని ప్రశ్నిస్తే ఏ దృష్టితో చూచినా “పోతన” అనే చెప్పవలసి వస్తుంది.

- శ్రీ పి.వి.నరసిమహారావు.

6) పోతన మహాకవి తన యపార రామభక్తిచే తాను తరించుటే కాక అష్టాదశ పురాణములం దుత్త మోత్తమమై, విష్ణుభక్తి ప్రబోధకమై, సులభ మోక్షప్రదమై, వ్యాసప్రోక్తమైన శ్రీ మద్భాగవత పురాణమును భక్తి రసఘుటికగా భవ్యసాహితీ రీతిని మధురాతిమధురఫణితి నాంధ్రీకరించి ముముక్షులోకమునకు మోక్షభిక్షను ప్రసాదించినాడు. పోతన భాగవతము వలె తెలుగుదేశము నందలి ఆబాలగోపాలమునకు నత్యంతాదర పాత్రమైన యుద్గ్రంథము మఱి లేదు.

­- డాక్టర్ పల్లా దుర్గయ్య

7) మహాకవి పోతన కలవడిన భక్తిసాత(హి)త్య మితరాంధ్ర కవులందు విరళము. శ్రీ కృష్ణపరమాత్ముడు భక్తసులభుడగు శృంగారమూర్తి. జానపదుల పామర హృదయములం దాతని పాదపంకజము లతిసాంద్రముగా ముద్రితములు. వేదాంతవేత్తయగు పోతనను భక్తి విషయమున జానపదు లందుకొనగలిగిరి. శృంగారమున వారిదే ముందడుగు. భక్తి యాత్మగా, శృంగారము శరీరముగా జన్మించిన జానపదులు (గోపస్త్రీలు) తాము కృష్ణతత్వ మనుభవించి త్రేన్చినప్పటి పరిమళమే శిష్టుల కాస్వాదయోగ్యమైనది.

- ఆచార్య బి. రామరాజు.

8) పోతన శబ్దార్థముల రెండింటికి సమాన గౌరవమునిచ్చి సామర్థ్యాతిశయముతో శబ్దార్థాలంకారముల నుపయోగించెను. ఆత్మగౌరవము గల కవిసత్తముడు పోతన.

- శ్రీ ఆండ్ర శేషగిరిరావు

9) పరమభాగవతోత్తముడగు బమ్మెర పోతనామాత్యుడు భాగవతమును తెనుగున రచించి తెనుగులోకమున కంతకును భుక్తిముక్తులను సమకూర్చెను. ఆ మహానుభావుని వదనారవిందము నుండి వెల్వడిన కవిత మరందధార. దాని బిందువులు పద్దెములు. అవి మధుర భక్తిని, మధురసభుక్తిని కలిగించుట తెలుగులోకమున కంతకును అనుభవపునరుక్తమే. భక్తిరసప్రవాహ మా మహానీయుని కవితాధారగా స్రవంతిగా ప్రవహించినది.

- శ్రీ వేదాల తిరువేంగళాచార్యులు.

10) పోతన భాగవతమున వ్రాసినంత శృంగారరసము నెవ్వరును రచియింపలేదు. కాని యావద్గ్రంథమును పఠించిన తరువాత పర్యవశించునది భక్తిరసము. శృంగారము అంగరసము. భక్తి అంగిరసము. దీనిని మధురభక్తి యందురు.

- శ్రీ కురుగంటి సీతారామయ్య

11) పోతనామాత్యుని కవిత్వము అతిమృదుమధురపద సంఘటితమై శబ్దార్థాలంకార పరిశోభితమై వీనులకు విందొనర్చుచు అమందానందము కలిగించుచుండును. తెలుగుదేశములో ఆంధ్ర భారతమును జదువనివా రుండిన నుండవచ్చును. కాని ఆంధ్ర మహాభాగవతమును జదువనివారు చదువనేర్చినవారిలో అరుదు.

- శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మ

12) అమితరసాధారణ మృదుమధుర చిత్రనిసర్గ నిరర్గళధారాధోరణి భాసురుడు పోతన. ఆయన కవితాధార ధారాశుద్ధమై సౌకుమార్య భూయిష్ఠమై యుండును. ఆయన కవితావిషయమున తాను చేసిన ప్రతిజ్ఞ శ్లాఘనీయముగ నిర్వహించి అజరామరకీర్తి గడించెను.

- శ్రీ శేషాద్రి రమణ కవులు

13) స్వామి దేవకి కన్నవాడు. యశోద పెంచినవాడు. భాగవతాన్ని వ్యాసర్షి కన్నవాడు. పోతన (వ్యాసుణ్ణి మరపించేట్టు) అనువదించి పెంచి పెద్దచేసినవాడు. ఈ సారస్యం గ్రహించదగ్గది.

- శ్రీ బెల్లంకొండ చంద్రమౌళి శాస్త్రి

14) భాగవతము నందలి పద్యమొక్కటి యైనను కంఠస్థముగ రాని తెలుగువా డుండడు. అందుకు పోతనార్యుని కమ్మని కవితా శైలి, భాగవత గ్రంథప్రాశస్త్యము కారణములు.

- శ్రీ డి. నాగసిద్ధారెడ్డి

15) భక్తిరసప్రధానమైన భాగవతము పండితపామర సాధారణముగా తెలుగు నాట ప్రతియింటను వెలయుచు నెల్లవారిచే సంభావింపబడుచున్నది. పోతన భాగవత మాంధ్రులకు పరమ ప్రియమైన గ్రంథము. అందును అష్టమస్కంధములోని, గజేంద్రమోక్షము, దశమస్కంధములోని రుక్మిణీకల్యాణమును ప్రత్యేకముగా నాంధ్రులకు ప్రాణతుల్యములైనవి.

- శ్రీ అనుముల సుబ్రహ్మణ్య శాస్త్రి

16) భాగవతం భావగతం అయినా కాకపోయినా భావగతం చేసుకున్న సహజపండితులైన పోతన్న పొదిగిన పదాల శబ్దమాధుర్యానికి మనం పరవశం కాక తప్పదు. ఆ మాధుర్యం ప్రతి పద్యంలోనూ, ప్రతి పదంలోనూ, ప్రతి అక్షరంలోనూ అనుభూతమవుతుంది. అర్థం తెలియకపోయినా సామాన్యజనానీకం కూడా ఆ మరంద మాధురీ మార్థవాలకు దాసోహం అంటుంది. అందుకే “ముద్దులు గార భాగవతమున్ రచియింపుచు పంచదారతో నద్దితివేమో గంట” మని శ్రీ జంధ్యాలవారు పోతన శబ్దమధురిమకు ఒక కారణం అభ్యూహించారు.

- శ్రీ గుమ్మా శంకరరావు.

17) పోతనామాత్యుడు ఒక కవితా నిర్మాణదక్షుడు. అతడు నిరాడంబరమైన కర్షక కవి. ఒకచేత కలము ఒకచేత హలము పట్టి “మందార మకరంద మాధుర్య” జ్ఞానరాశులను, ధాన్యరాసులను పండించిన సవ్యసాచి.

- డాక్టర్ నేతి అనంత రామశాస్త్రి

18) పోతన కవిత్వమందలి యాధిక్యమును వర్ణించి చెప్పలేను. ఏ కవిత యందును గానని మాధుర్య మీతని కవిత యందు పొంగి పొరలుచుండును. భాగవతము నందు భక్తిని, వేదాంతమును ప్రబోధించు కథలు విశేషముగా గలవు. ఈ రెండును పాఠకుని హృదయమున దృఢముగ నాటుకొనునట్లు చేయుటలో నీ మహాకవి కడునేర్పరి. అందులకు కావలసిన పదజాల మీతని కవిత యందు సహజముగా వచ్చిపడినది.

- శ్రీ చాగంటి శేషయ్య

19) పోతన మహాకవి రచనలో అటు శిల్ప వైదుష్యమును, ఇటు కళాకౌశలమును ఉభయ తన్మయ పరిపాకము నందినవి. ఆయన శీలాది గుణగరిష్ఠతచేత నిర్మలుడు. సహజ పాండిత్యముచే సాంగసంపన్నుడు. భాగవత వ్రతసిద్ధిచే జీవన్ముక్తుడు. శ్రీరామప్రసాద కవితా ప్రభావముచే మహాకవీశ్వరుడు. తన్మయుడై భాగవతమును తెనిగించి చిన్మయమైన ఆనందమును పొంది పంచిపెట్టిన పుణ్యరచయిత. ఆయన రచనలో దోషాలు వెదకి దోషులమైనాము. ఆరాధనకు మారుగా అపరాధము జరిగినది. ఆయన వాక్కును ఆర్షప్రయోగముగా పరిగ్రహించి పరమ ప్రమాణముగా శిరసావహింప వలసినది.

- సంపాదకులు
అకాడమీ మహాభాగవత పీఠిక