పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బమ్మెర పోతన : తొలి తెలుగు కామబాణ దండకము

మున్నుడి:- బమ్మెర పోతనామాత్యుల వారు యౌవనారంభ వయసులో భోగినీ దండకము చేసి ఉంటారని అంటారు. అది నిజమే కావచ్చును. కానీ అప్పటికే వారు భాష, సాహిత్యం, ఛందస్సు, వ్యాకరణం మున్నగునవే కాకుండా సకల శాస్త్రాలు, చతుషష్ఠి కళలలోనూ మంచి ప్రవేశం పొందినవారు అయి ఉంటారన్నది సత్యం. లేకపోతే, ఆ కాలంలో దండకం ఎత్తుకోవడమే కాదు కామబాణదండకం అనే నవ్యప్రక్రియ చేపట్టి ఉండేవారు కాదు. ఇంత చక్కగా నిర్వహించగలిగేవారు కాదు. తెలుగుబాగవతంలో మరొకచోట. తెలుగులో అందుబాటులో ఉన్న దండకాలలో భోగినీ దండకమే మొదటిది అని వ్రాసాను. అది తప్పుకావచ్చుకానీ, ఈ దండకం తొలి ప్రయోక్త కామబాణదండకమే అన్నది, శ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యులు, ప్రసిద్ధ విశ్రాంత తితిదే పండితులు వారి వ్యాసం ద్వారా నిర్ధారణ అయింది. ఆ వ్యాసం వారి సౌజన్యంతో ఇక్కడ ఉటంకిస్తున్నాను.
- భాగవత గణనాధ్యాయి

తొలితెలుగు కామబాణం భోగినీ దండకము:- ఉక్త, అత్యుక్త, మధ్య, ప్రతిష్ఠ, సుప్రతిష్ఠ, గాయత్రీ, ఉష్ణిక్కు, అనుష్టుప్పు - మొదలయిన పేర్లతో 26 ఛందస్సులున్నాయి. ఒక్కొక్క ఛందస్సులో ఎన్నో వృత్తాలున్నాయి. ఒక వృత్తం ఎన్నవ ఛందస్సుకు సంబంధించిందో ఆ వృత్తపాదం అన్ని ఆక్షరాలు కలిగి ఉంటుంది. పాదానికి 26 అక్షరాలకన్నా ఎక్కువ అక్షరాలు కలిగి ఉంటే, అలాంటివాటిని ఉద్ధురమాలా వృత్తాలు / ఉపరి వృత్తాలు అంటారు. వీటిలో లయగ్రాహి, లయవిభాతి, త్రిభంగి, దరము, లలితము, ఘననినదము, దండకము మొదలయిన వృత్తాలకు ప్రయోగాలు కన్పిస్తాయి.

దండకం వృత్తం కాబట్టి నాలుగుపాదాలు ఉండాలి. అయితే తెలుగులో ఒకపాదం, రెండుపాదాలు ఉండే దండకాలు కూడా ప్రయోగించబడ్డాయి. నన్నయ భారతంలోని దండకం ఏకపాది, కాగా - ముక్కుతిమ్మనగారి పారిజాతాపహరణం లోనిది ద్విపాద దండకం. శ్రీనాథుని శృంగారనైషధంలోని సరస్వతీదండకం నాలుగుపాదాలు కలిగి ఉంది. గణ ప్రయోగ భేదాలనుబట్టి దండకాలలో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో కామబాణం అనే దండకభేదం ఒకటి. “తా” “గౌ” కామబాణః అని హేమచంద్రాచార్యులవారు తన ఛందోనుశాసనం (3-399 )వృత్తిలో - "యత్ర యధేష్ట త గణా అంతే గురుద్వయం చ ప్రయుజ్యతే స కామబాణః” అని చెప్పారు. త్రివిక్రమసూరిగారు వృత్తరత్నాకర టీకలో - “పాదే సమస్తై స్తకారైఃకృతః కామబాణాభిధానో భవేద్దండకో౭న్తే గ యుగ్మం యదిస్యాత్” (3.205) అని చెప్పారు. ఇది కామబాణదండక లక్షణం, లక్ష్యం కూడా. కామబాణదండకంలో (అనియత) ఇష్టంవచ్చినన్ని (అవసరమైనన్ని) తగణాల తర్వాత చివరన రెండు గురువులు ఉంటాయి.

 భోగినీదండకం “శ్రీమన్మహామంగళాకారు… ” అని ప్రారంభించబడి, దండకమంతా తగణాలతోనే నడచి “… ఆచంద్ర తారార్క మైయొప్పు చుండున్.” అని రెండు గంరువులు (‘చుం’ – ‘డున్’)తో ముగించబడింది. భోగినీదండకంలో ”కాక లోలంబులై మోహజాలంబులై కామబాణంబులై యప్రమాణంబులై మీనశోభంబు.. “ అని దండకంపేరు కూడా ముద్రాలంకారంగా చెప్పబడింది.

 శృంగారానికి మౌలిక ప్రేరకం కామబాణాలే. కనుక పోతనామాత్యులవారు శృంగార రసాత్మకమైన భోగినీదండకాన్ని కామబాణదండకభేదంగా రచించారు. భోగిని కందర్పబాణాహతిం జెంది లోగుంది సింగభూపాలుని ప్రేమించి చివరకు ప్రేమను సాఫల్యం చేసుకుంది. ఛందఃప్రయోగ ఔచిత్య మర్మాన్ని ఎరిగిన బమ్మెరపోతన తొలితెలుగు కామబాణ ప్రయోక్త. ఇతః పూర్వ పరిశోధకులు “భోగినీదండకం కామబాణ దండకభేదమనీ, పోతనార్యుడు తొలి తెలుగు కామబాణ ప్రయోక్త అనీ” స్పృశించకపోవడం మత్ పురాకృత శుభాధిక్యం.

 ఇది, ఇదివరలో రాజమండ్రినుంచి వెలువడిన ‘సమాలోచన’ అనే పత్రికలో తొలి తెలుగు కామబాణ ప్రయోక్త -బమ్మెర పోతన అని నేను రచించిన వ్యాసంలో కొంతభాగం

  - వైద్యం వేంకటేశ్వరాచార్యులు