పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బమ్మెర పోతన : శ్రీనాథుడు - పోతన

వెనుకటి పుట ||ఓం శ్రీరామ|| తరువాత పుట

శ్రీనాథుడు – పోతన

శ్రీమద్భాగవత పురాణాన్ని ఆంధ్రీకరించిన సహజ కవీ, ప్రజా కవీ బమ్మర పోతనా, కాశీఖండం రచించిన శ్రీనాధ మహాకవీ, వయోభేదం ఉంటే ఉండవచ్చు కానీ, బావా బావమరదులు అని అంటారు. శ్రీనాథ సార్వభౌముని పుత్రికను, కవికులోత్తముడు బమ్మెర పోతన కుమారుడు “మల్లయ”కు ఇచ్చారని అంటారు.

పోతనామాత్యుడు పొలం దున్నుకుంటూ వచ్చిన దానితో నిరాడంబరముగా బ్రతుకుతుండే వాడు. “భాగవత పురాణాన్ని శ్రీరాముని ఆజ్ఞ ప్రకారం తెలుగీకరించాను అని శ్రీ రామచండ్రుడికి తప్ప ఇతరులకు అంకిత మివ్వను” అని అనే వాడు. వీరభద్రవిజయం యివటూరి సోమనాథుని తమ గురువుగా చెప్పుకుని వ్రాసాడు.. శ్రీనాథుడు తను వ్రాసిన గ్రంథాలను రెడ్డి రాజులకు అంకిత మిచ్చి వారిచ్చిన ధనం తో దర్జాగా బ్రతికే వాడు. ఆయన పోతన గారికి యిలా సలహా యిస్తున్నాడు.

తెలుగీకరించిన కమ్మని గ్రంథం బొక్కటి
యిమ్ముగ నే నృపతి కైన అంకితమిచ్చిన
కొమ్మని యీయరె యర్థం
బిమ్మహి దున్నంగ నేల యిట్టి మహాత్ముల్.
అర్థము:--నీవు వ్రాసిన గ్రంథము భాగవతాన్ని ఏ రాజుకైనా అంకిత మిచ్చినా వాళ్ళు ఎంతో ధనం యిస్తారు కదా! హాయిగా జీవనం గడపవచ్చు. ఈ భూమిని దున్నుకుని బ్రతకడమెందుకు? అంటే అందుకు పోతనగారిచ్చిన సమాధానం.

బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్
గూళలకిచ్చి యప్పడుపుఁగూడు భుజించుటకంటె సత్కవుల్
హాలికులైన నేమి? గహనాంతర సీమలఁ గందమూల కౌ
ద్దాలికులైన నేమి నిజదారసుతోదరపోషణార్ధమై.
అర్థము:--లేత మామిడి చిగురు లాగా కోమలమైన కావ్య మనే కన్యను దుర్మార్గులైన రాజులకు అంకిత మిచ్చి ఆ పడుపు కూడు (వేశ్యా వృత్తిని పడుపు వృత్తి అంటారు) తినే దానికంటే సత్కవులు భార్యా బిడ్డలను పోషించుటకు భూమి దున్ని బ్రతికినా, అడవిలోని కందమూలాలు తిని బ్రతికినా తప్పులేదు సుమా.

ఇది ప్రజల నాలుకలపై కలకాలంగా నానుతున్న కథ. ఇంకొక గాథ కూడా ఇలాగే ప్రజలలో ప్రచారంలో ఉంది.