పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బమ్మెర పోతన : సాహితీ దీపిక - శృంగార భాగవతము

సాహిత్య దీపిక - శృంగార భాగవతం

సౌజన్యము.:-
-వైద్యంవేంకటేశ్వరాచార్యులు (వీరి వ్యాసాన్ని కొద్దిగా మార్చుకొనుట జరిగినది)

"లలితస్కంధము కృష్ణమూలము" అనే భాగవత పద్యాన్ని పోతనగారు శ్లేషలో రచించారు. ఆ పద్యం పరిశీలింతం-

లితస్కంధము, కృష్ణమూలము, శుకాలాపాభిరామంబు, మం
జుతాశోభితమున్, సువర్ణసుమనస్సుజ్ఞేయమున్, సుందరో
జ్జ్వవృత్తంబు, మహాఫలంబు, విమలవ్యాసాలవాలంబునై
వెయున్ భాగవతాఖ్యకల్పతరు వుర్విన్సద్ద్విజశ్రేయమై.
- - తెలుగు భాగవతం 1-22-మ.

బమ్మెరవారు భాగవతాన్నిపరిచయం చేసిన పద్యంలోనే హృద్యంగా మార్మికంగా శృంగార రసాన్ని సూచించారు. పై పద్యానికి పూర్వవ్యాఖ్యాతలు శ్లేషార్థాలు చెప్పారు. కల్పవృక్షాన్ని భాగవతంతో పోల్చి చెప్పిన పద్యం ఇది. దీనికి లలితాత్రిపురసుందరీ పరంగాకూడా అర్థం ఉందని విన్నాను. ఈ పద్యానికి శృంగారపరమైన అర్థం చెప్పినవారూ ఉన్నారు. కల్పవృక్షం కామితఫలాన్నిస్తుంది. భాగవతకల్ప వృక్షం కోరిన ఫలరసాలను అందిస్తుంది. భావుకుడు శృంగారరస ఫలాన్ని భావిస్తే దాన్నే ప్రసాదిస్తుంది బమ్మెరవారి భాగవతాఖ్యకల్పతరువు.

శృంగారపరంగా పై పద్యాన్ని ఇలా సమన్వ యించవచ్చు.(ఈ సమన్వయానికి ఆధారం డా.యం.భానుప్రకాశ రావుగారి సిద్ధాంతగ్రంథం)-

 • భాగవతాఖ్య కల్పతరువు-భాగవతమనే కల్పవృక్షం,
 • లలితస్కంధము-కామోత్కంఠమైన గోపికాది స్త్రీజన కళాస్థానాలుగ పరిగణించబడే అంస భాగాలుకలదీ,
 • కృష్ణమూలము-ఆ గోపీకలకుశ్రీకృష్ణుడు ఆలంబనంగాకలదీ,
 • శుకాలాపాభిరామంబు- ఉద్దీపనవిభావాలయిన శుకపికాల కలస్వనాలతో అందగించినదీ,
 • మంజులతా శోభితమున్-నాయికా సదృశమైన పూలతీవలతో సుమనోజ్ఞంగా విరాజిల్లుతున్నదీ,
 • సువర్ణ సుమనః-మంచి రంగు కలిగినవీ, మన్మథబాణాల వంటివీ అయిన పూలు కలిగినదీ,
 • సుజ్ఞేయమున్-పైఆలంబనఉద్దీపనాలతోఆస్వాదించతగినదీ,
 • సుందరోజ్జ్వలవృత్తంబు-ఆదరణీయమైన,శృంగార రస నిర్భరమైన కథ కలిగినదీ,
 • మహిఫలంబు-అఖండ రసానందమే ఫలముగా కలిగినదీ,
 • విమలవ్యాసాలవాలంబునై-స్వచ్ఛమైన శృంగార రస భేదాలకు నిలయమైనదై,
 • సద్ద్విజశ్రేయమై-సహృదయులకు మేలు కలిగించేదిగా,
 • ఉర్విన్- జగత్తులో/భూమ్మీద,
 • వెలయున్-విరాజిల్లుతుంది.

ఈ పద్యంలాంటి పూర్వరచనలను కొన్నిటిని పరిశీ లింతం -

శ్లో.
ధృతి ప్రవాళః,ప్రసహాగ్ర్య పుష్ప,
స్తపోబల,శ్శౌర్య నిబద్ధమూలః,
రణేమహాన్ రాక్షసరాజ వృక్ష,
స్సమ్మర్థితో రాఘవమారుతేన
-వాల్మీకి రామాయణం.

ఇది యుద్ధకాండలో రావణుడనే రాక్షసవృక్షాన్ని రాఘవుడనే మారుతం సమ్మర్దించడం గురించి చెప్పబడిన శ్లోకం. ఈ సందర్భాన హుళక్కిభాస్కరకవి ఇలా చెప్పాడు-

శా.
సారాస్కంధము, శౌర్యమూలము, విరాద్బాహుశాఖంబు, దు
ర్వారోదార ధృతిప్రవాళ, మతిదీవ్యత్కోప పుష్పంబు, బా
పారంభైక ఫలంబునై పరగు దైత్యాధీశ వృక్షంబు, దా
నీ రూపంబున రామహస్తి విఱిచెన్ హేలాసముల్లాసియై.
-భాస్కర రామాయణము.

వీటి సంగతి అలా స్మరణలోఉంచుకుందాం. నన్నయ భట్టు భారతాన్ని. పారిజాత తరువుతో పోలుస్తూ ఇలా చెప్పాడు-

మ.
మితాఖ్యానక శాఖలం బొలిచి వేదార్థామలచ్ఛాయ మై
సుహావర్గచతుష్కపుష్పవితతిన్ శోభిల్లి కృష్ణార్జునో
త్త నానాగుణకీర్తనార్థ ఫలమై ద్వైపాయనోద్యాన జా
హాభారత పారిజాత మమరున్ ధాత్రీసురప్రార్థ్యమై.
-భారత,ఆదిపర్వ,౧.౬౬

పైన చెప్పినవి వృక్షాలతో పోల్చి చెప్పిన వర్ణనలే. బమ్మెరవారుకూడా భాగవతాన్ని కల్పవృక్షంతో పోలుస్తూ పైపద్యం చెప్పారు –

--బమ్మెరపోతనవారికి వందన మందారాలు