పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బమ్మెర పోతన : ప్రౌఢకవి మల్లన్న


మల్లన పోతనామాత్యుని కుమారుడు.శ్రీనాథునకు మేనల్లుడు. "రుక్మా౦గద చరిత్ర"యీతని రచన. మల్లన చిన్ననాటి కథ యొకటి ప్రచారములో నున్నది.

శ్రీనాథుడు తాను తెనిగించిన నైషధమును పోతనకు వినిపించి యాతని మెప్పు పొందవలెననన్న తలంపుతో ఒకనాడు పోతన యింటికి వచ్చెను. ఆ సమయమున పోతన ఇంటివద్ద లేడు. మల్లన యున్నాడు. కుశలప్రశ్నల అనంతరము, శ్రీనాథుడు పంచటరుగు పై కూర్చుండి, తన గ్రంథమును విప్పి పారజూచుకొను చుండెను. అప్పుడు మల్లన్నకు, శ్రీనాథునికీ జరిగిన సంభాషణ యిటుల సాగెను.

మల్లన:-అది యేమి గ్రంథము మామా?
శ్రీనాథుడు:- (నిర్లక్ష్యముగా) నైషధములే

మల్లన్నకా ప్రత్యుత్తరము కొంత బాధ కలిగించినది, మామ తనను ఆపండితుడిగా భావించినట్లు తోచినది. శ్రీనాథుడికి తాను పోతనకంటే యెక్కువ పాండిత్యము గలవాడి నను భావముండెను. ఈ విషయము మల్లనయు నెరుంగును. అందువల్ల మామగారిని ఆటపట్టించవలయునని

మల్లన్న:- ఏమి మామా! నైషధ మిప్పుడు చదువుకొను చున్నావా?
శ్రీనాథుడు:-లేదురా యిది, శ్రీహర్షుని నైషధమునకు నా తెనిగింపు. దీని పేరు "శృంగారనైషధము"
మల్లన:- ఓహో! నీవునూ తెనిగించితివా?
శ్రీనాథుడు:- (ఆశ్చర్యముతో) నేనుగాక మఱి ఎవరు తెనిగించిరి?
మల్లన:-- మా నాయనగారు చాలా కాలము క్రిందటే తెనిగించి యున్నారు
.శ్రీనాథుడు:- తత్తరపాటుతో ఏమీ! మీ నాయన తెనిగించినాడా? ఏదీ ఆ గ్రంథము?
మల్లన:-- గ్రంథ మెక్కడున్నదో తెలియదు గానీ అందులోని కొన్ని పద్యములు మాత్రము నాకు వచ్చును.
శ్రీనాథుడు:--వచ్చునా? ఏదీ దమయంతి విరహ గ్లాని వర్ణన ఘట్టము లోని పద్యమొకటి వచ్చిన వినిపించు.

అనగానే మల్లన, అప్పటికప్పుడు పద్యమును కూర్చుకొని యిట్లు చదివెను.

గీ:-
కాంత కలదిన చందాన ర్దమంబు
గ్ర విరహాగ్నిదుకదుక నుడికి చెదరి
చెంత నున్నట్టి దమయంతి చెలిమి కత్తె
మెఱుగు పాలిండ్లపై బడి మిట్టి పడియె

శ్రీనాథుడీ పద్యమును విని, పోతన నైషధమును తెనిగించిన మాట నిజమే ననుకొని ఏమియు దోచక యూరకుండెను. ఇంతలో పోతరాజింటికి వచ్చెను. బావమరిదిని క్షేమ సమాచారములడిగెను.కానీ శ్రీనాథుడు ముభావంగా చెప్పీ చెప్పనటుల చెప్పెను. శ్రీనాథుడెప్పుడూ పోతరాజు నెగతాళి చేయుచుండెడివాడు.నాడట్టి ప్రసంగమేమియు చేయలేదు. నిష్కళంక హృదయుడగు పోతనామాత్యుడుశ్రీనాథుని చేతిలోనున్న గ్రంథమును జూచి " బావా! నదియేమి గ్రంథ"మని యడిగెను.దానికి శ్రీనాథుడు "బావా! నీవు తెనిగించితివనే సంగతి తెలియక నేనునూ నైషధమును తెనిగించితిని.ఈ గ్రంథ మదియే." ననెను.

పోతన:-" బావగారూ! తమరు నైషధమును తెనిగించుట నీరీతి వెల్లడించు చున్నారా?లేక నన్ను పరిహాసము జేయుచున్నారా?"
శ్రీనాథుడు :-- సరేలే యింకెన్నినాళ్ళు దాచెదవు? నీవబద్ధ మాడవనుకుంటిని. నే డంతయు అబద్ధమని తెలిసినది.

పోతన రిచ్ఛవడి ఏమిది? నేను నిశ్చయముగా ఆగ్రంథమును తెనిగించియు తనకు చెప్పక దాచిపెట్టితినని నొక్కి పలుకు చున్నాడు. నిక్కమెఱుంగ వలయునని "శ్రీనాథకవీ! ఈ సంగతి నీకెవరైనా చెప్పిరా? లేక నీవే కలగంటివా?" యనెను.తనకీ సంగతి మల్లన చెప్పెననియు, అందులోని పద్యమును కూడా వినిపించెనని చెప్పి పై పద్యమును వినిపించెను.

మల్లన నవ్వుకొనుచూ నచటినుండి వెడలిపోయెను. పరమ భాగవతోత్తముడగు పోతన నిజము గుర్తెరిగి చిరునవ్వు నవ్వి "'కవిసార్వభౌమా! ఈ పద్యము నేను వ్రాసితినని నీ అల్లుడు చెప్పుటయందు కంటే నీవు నమ్ముటయందు మిగుల స్వారస్యము కలదు.ఇట్టి స్వభావ విరుద్ధమైన రచనను నా కెందుకంటగట్టెదవు ? అది మీ మామాయళ్ళు౦ డ్లకే తగును..మామవని నీ అల్లుడు మేలమాడినట్లున్నాడు బావా కోపం తెచ్చుకోకు". యనెను. శ్రీనాథుడు తన తెలివితక్కువతనము బయటపడినందుకు విచారపడి, యల్లుడు చేసిన మోసము నెఱుగజాలక పోతినేనని సిగ్గుపడి అవమానముచే మ్రగ్గెను. అప్పుడే యింటికి వెళ్లిపోవలయునని యనుకొనియు, నట్లు వెళ్లిపోవుట సముచితము కాదని తలచి, యాపూట నిలిచి సాయంత్రము వెళ్లిపోయెను.

(దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము"నుండి)

సౌజన్యము:- శ్కీమతి రూపన్గుడు సుగుణ