పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బమ్మెర పోతన : పోతన గురించిన విశేషాలు

1. నేడు తెలంగాణలో జనగామ జిల్లాలో ఉండే రెండు ఊర్లకు- క్రీ. శ. 11, 12 శతాబ్దాలలో "గుముడూరు", "బొమ్మర" అని పేర్లు. ఆ రెండు ఊర్లూ పక్కపక్కనే ఉన్నాయి. ఆ గ్రామాల పేర్లకు తదనంతర కాలాన (నేడుకూడ) "గూడూరు", "బమ్మెర" అని వ్యవహారం.
పోతనగారు పుట్టి, పెరిగి, శ్రీకైవల్య పదం చేరేవరకు బమ్మెరలోఉన్నారు. బమ్మెరలో పోతన చేలు, పోతన సమాధి ఉంది.
2 . బమ్మెర పక్కన ఉండే "గూడూరులో" పోతనకంటె పూర్వం దాదాపు 300 ఏండ్లనాడే మల్లేశ్వరాలయం నిర్మింపబడింది. ఆ మల్లన్న స్వామి ఆప్రాంతంలో పేరుగల దైవం. ఆ దేవాలయ నిర్వహణను నాటి పాలకులు పోతనపూర్వికులకు అప్పగించి వారికి బమ్మెర గ్రామాన్నిదానంగా ఇచ్చారు. ఆమల్లయ్యస్వామి పేరును చాలామంది ఆ ప్రాంత ప్రజలు తమ సంతానానికి పెట్టుకుంటుంటారు. ఈ విషయం స్థానికులకు సువిదితం. పోతన పూర్వులలోకూడ "మల్లన" అనే వ్యక్తి ఉన్నాడు (చూడు-వీరభద్ర విజయం, అవతారిక, పోతన వంశవర్ణనం) పోతన కొడుకు పేరూ మల్లననే.
3. పోతనతల్లిగారి పేరు లక్కమ్మ ( లక్షమ్మ/లక్కసాని). గూడూరులో పోతన తల్లి పేరుతో "లక్కసముద్రం"అనేజలాశయం (చెఱువు) పూర్వులు తవ్వించారు.
4. గూడూరులోని మల్లేశ్వరాలయంలోని ఒక స్తంభంపై ఉండే శిలాశాసనం మూడువైపుల కన్నడంలోను, ఒక వైపు తెలుగులోను ఉంది. అంటే ఆ నాడు ఆ ప్రాంతాన కన్నడ ప్రభావం ఉందనేందుకు ఈ శాసనం కూడా ఒక ప్రామాణికమైన ఆధారం. తదనంతరం పోతనకాలం వరకూ కన్నడ ప్రభావం అక్కడ ఉంది అనడానికి ఆధారాలు ఉన్నాయి. పోతనగారు "కర్ణాటకిరాటకీచకులు" అన్నపదం ప్రయోగించడం ప్రస్తుతం స్మరణీయం.
5. పోతనకు వీరభద్రవిజయం రాయమని చెప్పిన మత గురువు సోమేశ్వరాధ్యులవారి నివాసగ్రామం "ఇవటూరు" బమ్మెర ప్రాంతంలో ఉంది.
6. భోగినీదండకం సింగభూపాల సంబంధి కావడం స్మరణీయం.
7. నారాయణశతకంలో చెప్పిన "ధర్మపురి" ఈ ప్రాంతం లోనే ఉంది.
8. పోతన గంగాస్నానం (గోదావరికి గంగ అని వ్యవ హారం}, విస్తర భీతిచే ఆ శ్లోకాలు ఇవ్వలేదు) ఆచరించాక కొన్నిరోజులకు ఓరుగల్లుకు వచ్చి బంధుజనాలను గురువులను దర్శించాడని, భాగవతావతారిక పోతననే చెప్పాడు.
9. ఓరుగల్లులో వేణుగోపాలస్వామి (ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది) వారి ఆలయంలో భాగవతరచన చేశాడని జనశ్రుతి.
10. భాగవత శిథిల భాగాలను పూరించిన పోతన శిష్యులుకూడ ఓరుగల్లు ప్రాంతంవాళ్లు కావడంకూడ ప్రస్తుతం స్మరణీయం.

ఇలాటి విశేషాలు చాలా ఉన్నవి, వీలునుబట్టి మరికొన్ని మార్లు ముచ్చటించుకుందాం
- వైద్యంవేంకటేశ్వరాచార్యులు