పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బమ్మెర పోతన : పోతన - TSN మూర్తి గారు


బమ్మెర పోతనామాత్యుడు
- తల్లాప్రగడ సత్యన్నారాయణ మూర్తి.

2016-11-1.

  తెలుగువారికి అత్యంత ఆదరణీయమైన భాగవత పురాణాన్ని రచించిన బమ్మెర పోతనామాత్యుడు జీవించిన సంవత్సరాలు గురించి చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయా లున్నాయి. కొంతమంది చరిత్రకారులు ఆయన సుమారు కీ.శ. 1400 నుండి 1478 వరకు జీవించా డని అభిప్రాయపడుతున్నారు. ఆయన పనిచేసిన ప్రభువు రెండవ సర్వజ్ఞ సింగ భూపాలుడు కీ. శ. 1425 లేదా 1430 నుండి 1485 వరకు పాలకునిగా జీవించా డని తెలుస్తోంది. కాబట్టి, ఆయన అధికారంలోకి వచ్చిన కీ.శ. 1430 ప్రాంతానికి పోతనకు దాదాపు కనీసం 30 సంవత్సరాల వయస్సు వచ్చి ఉండవచ్చు నని భావించి నట్లయితే, ఆయన 1400 ప్రాంతాలోనే జన్మించా డని భావించడం సమంజసం. అయితే, ఆయన ఎప్పుడు స్వర్గస్తు డైనదీ నిర్థారణగా చెప్పడానికి ఆధారాలు లేవు. మొదటి వర్గం చరిత్రకారులు భావించినట్లు 1475 ప్రాంతంలోనే గతించి ఉండవచ్చు.

2.up-arrow   ఆయన స్వగ్రామం వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం లోని బమ్మెర. ఆ గ్రామనామమే ఆయన ఇంటిపే రైనది. అంతేకాక, ఆయనకు దీక్ష నిచ్చిన ఇవటూరి సోమనాథుడు, ఆయన విడిచిన లేదా శిథిల మైన భాగవత నాలుగు స్కంధాలను పూరించిన ఆయన శిష్యులు వెలిగొండ నారయ, ఏల్చూరి సింగన, బొప్పరాజు గంగన తెలంగాణా వాసులు; ఆయనను ఆదరించి ఆమాత్యునిగా నియమించిన రావు సర్వజ్ఞ సింగ భూపాలుడు తెలంగాణా ప్రభువు. ఆయన రాజధాని నేటి హైదరాబాద్ మహానగర సమీపంలో కల రాచకొండ. ఈ అంశాలను పరిగణన లోకి తీసుకున్నట్లయితే పోతన తొలిదశలో తెలంగాణాలోనే నివశించా డని తెలియగలదు.

3.up-arrow   పోతన తండ్రి కేతనామాత్యుడు; తల్లి లక్కమాంబ; అన్న తిప్పన; భార్య నరసమాంబ; కుమార్తె లక్ష్మి. ఆయన ఆరాధ్య బ్రాహ్మణ శాఖకు చెందిన ఆరువేల నియోగి; కౌండిన్యస గోత్రీకుడు; తండ్రి పేరులో ‘ఆమాత్య’ అని ఉంది కాబట్టి, ఆయన కూడా బహుశః రాచకొండ వెలమ ప్రభువుల వద్ధ మంత్రిగా పని చేసి ఉంటాడు. ఆయన "శైవ శాస్త్ర మతాల లోతులను చూసినవాడు"; తల్లి "సదాశివ పాద యుగార్చ నానుకంపనయ వాగ్భవాని"; అన్న తిప్పయ "ఈశ్వర సేవా కాముడు". వీనిని బట్టి వారు ఆరాధ్య బ్రహ్మణ శివారాధుకు లని, వారి దీక్షా గురువు ఇవటూరి సోమనాథు డని తెలియగలదు. అయితే పోతన ఏ పరిస్థితులలో రామభక్తు డయా డనే అంశం పై నిర్దుష్ట మైన సమాచారం లేదు. జనశృతిని బట్టి, ఆయన గోదావరి తీరంలో నున్న పాల్కుర్కి సోమనాథుని సమాధిని దర్శించడానికి వెళుతుండగా "చిదానందు" డనే యోగి తారసపడి ఆయనకు తారకమంత్రం ఉపదేశించగా, ఆ నాటి నుండి పోతన రామభక్తు డయాడు. అంతకు ముందే ఆయన సోమనాథుని ప్రోద్భలంతో "వీరభద్ర విజయం" అనే కావ్యం రచించాడు. సింగ భూపాలుని అభ్యర్థనపై ఆస్థాన నర్తకి పై "భోగినీ దండకం" రచించాడు. ఈ రచనలు పూర్తిచేసిన తర్వాతే ఆయన రామభక్తు డైనట్లు భావించవచ్చు. అందుచేతనే "పలికెడిది భాగవత మట; పలికించు విభుడు రామభద్రుం డట" అని వ్యక్తం చేశాడు. కానీ ఆయన వైష్ణవ మతం స్వీకరించా డనడానికి ఆధారాలు లేవు. ఆయన "స్మార్త" పదాన్నే స్వీకరించాడు. కనుకనే విష్ణుమూర్తి "ఎందెందు వెదెకిన అందందే కల" డనే అధ్వైత భావాన్ని, "చేతులారంగ శివుని పూజించ డేని" వంటి శివారాధనా తత్వాన్ని వ్యక్తం చేశాడు. జనశృతిని బట్టి రాచకొండలోని శారదాదేవి విగ్రహం, రామపట్టాభిషేక విగ్రహాలు కల ఒక గుహలో కూర్చొని, ఆయన భాగవత రచన ప్రారంభించాడు. ఆ గుహలో ఈనాటికీ రామపట్టాభిషేక ఉత్సవాలు జరుగుతాయి. ఆయన తన భాగవత ఆశ్వాశాంత గద్యలలో "పోతనామాత్య ప్రణీతం బైన" అని వ్రాసుకొనడం బట్టి ఆయన సింగ భూపాలుని ఆస్థాన కవియే కాక ఆమాత్యుడు కూడా అని విశదమవుతుంది.

4. up-arrow   తెలంగాణా పై బహమనీ సుల్తానుల దాడి ప్రారంభ మైన నాటి నుండి, సింగ భూపాలునికి, పోతనకు కష్టకాలం ప్రారంభమైంది. 15వ శతాబ్ది తొలి దశలోనే ఈ దాడులు ప్రారంభమయాయి. సింగ భూపాలుని తండ్రి అనపోతా నాయుడు, రెండవ సింగ భూపాలుడు, ఆయన సన్నిహిత బంధువు దేవరకొండ పాలకుడు అయిన లింగమనీడు హంపి విజయనగర చక్రవర్తుల సహాయంతో బహమనీ దాడులను చాలా కాలం విజయవంతంగా ఎదుర్కొనగలిగాడు. బహమనీ సుల్తాన్ ఫిరోజుషా మద్ధతు సంపాదించిన కొండవీడు ప్రభువు పెద కోమటి వేమారెడ్డిని అంతమొందించి, ఆయన రాజ్యం విజయనగరం వారి అధ్వర్యంలోకి తరలిపోడానికి దోహదం చేశాడు. అయితే, ప్రౌఢదేవరాయలనే బిరుదు కల రెండవ దేవరాయలు (1422 – 1446) మరణానంతరం హంపి విజయనగర సింహాసన మధిష్టించిన పాలకులు కడు అసమర్థులు. ప్రజాపీడకులు. వీరిలో కొంతమంది పితృ హంతకు లైతే, మరికొంత మంది భాతృహంతకులు; వ్యసనపరులు. వీరు బహమనీ సుల్తానుల తెలంగాణా పై దండయాత్రల గురించి పట్టించుకొన లేదు; రాచకొండ, దేవరకొండ ప్రభువుల కండగా నిలువ లేదు. అందుచే ఆ ప్రభువులు కళింగ గజపతుల సహాయం అర్థించవలసి వచ్చింది. వారి సహచరులుగా 1448లో రాజమహేంద్రవర రెడ్డి రాజ్యాన్ని అంతం చేశారు. వారి అండదండలతో 1450 ప్రాంతం వరకు తన అధికారాన్ని నిలబెట్టుకున్న రెండవ సర్వజ్ఞ సింగ భూపాలుడు, ఆ తర్వాత దానిని కోల్పోయి, తొలుత కర్నూలు జిల్లాలోని వెలుగోడుకు, అచట నుండి బెల్లంకొండకు తరలిపోయి కొంతకాలం గజపతుల సామంతుడుగా అక్కడ నివశిస్తూ వారి సహాయంతో తిరిగి తన రాజ్యాన్ని సంపాదించడానికి 1461, 1463 సంవత్సరాలలో గట్టి ప్రయత్నం చేశాడు. కానీ ఫలితం దక్కలేదు. చివరకు బెల్లంకొండ ప్రాంతం సాళువ నరసింహ రాయలు స్వాధీన మైన తర్వాత ఆయనకి అనుచరునిగా హంపి విజయనగరానికి తరలి పోయి అచ్చోటనే మరణించాడు.

5.up-arrow   రామభక్తిని అలవరచుకొని, భాగవత రచనకు పూనుకొనిన తర్వాత పోతనకు లౌకిక విషయాల యందు ఆసక్తి తగ్గింది. మంత్రి బాధ్యతలను కూడ ఆయన కడు శ్రద్ధగా నిర్వర్తించినట్లు లేదు. అందుచేతనే సర్వజ్ఞ సింగ భూపాలుడు తన బంధు మిత్ర సైన్య సమేతంగా రాచకొండనుండి తరలి నపుడు, పోతన ఆయనను అనుసరించినట్లు లేదు. ఆయన రాచకొండలో కల రామ పట్టాభిషేక విగ్రహాలను తీసుకొని దక్షిణ దిశగా తరలిపోయాడు. షంషాబాద్ విమానాశ్రయం సమీపంలో కల ఒక గ్రామంలో పురాతన రామాలయం ఉంది. దీనికి సంబంధించిన అర్చకులు, స్థానికులు భక్తపోతన రామపట్టాభిషేక విగ్రహాలతో వచ్చి అక్కడ కొద్ది కాలం నివశించాడని చెబుతారు. వారి కథనం పోతన వలసను సమర్థింస్తుంది. తెలంగాణాపై మహమ్మదీయ దండయాత్రలు ప్రారంభ మైన దశలోనే ఆ ప్రాంతానికి చెందిన ప్రజలు అనేక మంది రాయలసీమ ప్రాంతాలకు; కోస్తా ఆంధ్ర ప్రాంతాలకు తరలిపోయారు. బహమనీల కాలంలో ఈ వలసలు మరింత ఉధృత మయాయి. అందుకనే కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో తెలంగాణాకు కల గ్రామల పేర్లు మీదుగా నూతన గ్రామాలు ఆవిర్భవించడం చూస్తాం. వలసదారులు తమ స్వస్థలం పేరునే తాము స్థిరపడిన స్థలానికి కూడా పెట్టుకొనడం ఆచారం. అదే విధంగా తెలంగాణాలోని గ్రామాల పేర్లనే ఇంటిపేర్లుగా కల వేలాది కుటుంబాలు ఆంధ్ర ప్రాంతంలో చూడగలుగుతాం. కనుక, పోతన రాయలసీమ ప్రాంతానికి వలసపోయాడంటే, అది కాలానుగుణ్యంగానే జరిగిందని భావించాలి.

6.up-arrow   ఒంటిమిట్టలో నేడు కోదండరామస్వామి ఆలయం అని పిలువబడే ఆలయాన్ని కీ. శ. 7 లేదా 8వ శతాబ్దాలలో తెలుగు చోళులు నిర్మించారు. తొలుత ఇది రఘునాథస్వామి ఆలయంగా పిలువబడిం దని ఇచ్చటి శాసనాధారాలు తెలుపుతున్నాయి. ప్రస్తుత కాలంలో ఒకే రాతి పలకపై చెక్కిన సీతారామలక్ష్మణ విగ్రహా లున్నాయి. పూర్వం ఈ రాతి పలక సమీపంలోని ఒక గుహలో లభించిన వని స్థానికులు చెపుతారు. బహుశః బమ్మెర పోతన వీనిని రాచకొండ నుండి అనేక ప్రయాసల కోర్చి తెచ్చి, తొలుత ఒక గుహలో ఉంచి, ఆ తర్వాత ఆలయంలో ప్రతిష్టింపజేసి ఉంటాడు. ఆలయ సమీపంలో కల ఒక చిన్న గుట్టపై పోతన విగ్రహం ఉంది. ఆలయంలో స్వామివారికి పోతన పేర తాంబూలం సమర్పించే ఆచారం ఉంది. ఆలయానికి 1-1/2 కి.మీ. ల దూరంలో "బమ్మెర గడ్డ" అనే చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో కల చెరువు క్రింద "పోతన మడి" ఉంది. ఇవన్నీ పోతన ఇచ్చట స్థిరపడ్డాడు అనడానికి తిరుగులేని సాక్ష్యాధారాలు. పోతన, ఆయన శిష్యగణం, అనుచరులు నివశించిన కుగ్రామమే "బమ్మెర గడ్డ". ఆయన అక్కడ స్థిరపడిన తరువాత "మడి" దున్నుకు జీవించాడని తెలియగలదు. ఒకప్పుడు అమాత్యుడుగా సుఖజీవితం గడపిన ఈ మహాకవి ఎవరి వద్ద నుండి దానాలు స్వీకరించకుండా "కూళలకు" తన కావ్యాన్ని అంకితమిచ్చి ధన మాశించకుండా ఆకలితో అలమటించకపోయినా "మడి" దున్నుకు మాత్రం బ్రతికిన నిరాడంబర నిజాయితీ కల భక్తుడు, విరాగి. బహుశః పోతన ఔన్నత్యాన్ని గురించిన తుళువ వంశానికి చెందిన విజయనగర చక్రవర్తులు, వారి సామంతులైన మట్ల వంశస్థులు ఒంటిమిట్ట ఆలయాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేశారు.

7.up-arrow   అభినవ పోతన బిరుదాంకితులు వానమామలై వరదాచార్యులు "పోతన జన్మస్థలం బమ్మెర అయినప్పటికీ ఒంటిమిట్టలోనే తన భాగవతాన్ని రచించా" డని అభిప్రాయపడ్డారు. కాని, ఆయన భాగవత రచనను రాచకొండలోనే ప్రారంభించి ఒంటిమిట్టలో పూర్తి చేశా డని తలంచడమే సమంజసం. తాను వదలిపెట్టిన నాలుగు స్కంధాలను తన శిష్యులచేత ఒంటిమిట్టలోనే రచింపజేశాడు. భాగవతాన్ని తన కంకితమివ్వ మని సర్వజ్ఞ భూపాలుడు అభ్యర్థించగా, పోతన దానిని తిరస్కరించా డనే కథనం ఉంది. కాని ఇందులో వాస్తవం లేదు. భాగవత రచన పూర్తి అయ్యే నాటికి సింగ భూపాలునికి పోతనకు మధ్య సన్నిహిత సంబంధాలు లేవు. సింగ భూపాలుడు వెలుగోడుకు, బెల్లంకొండకు తరలిపోగా, పోతన ఒంటిమిట్టకు తరలిపోయాడు. ఆ దశలో ఒంటిమిట్ట ప్రాంత పరిపాలకుడు సింగ భూపాలుడు కాడు, అది హంపీ విజయనగర చక్రవర్తుల పాలనలో ఉంది. ఆ దినాలలో వారిలో ఎక్కువ కాలం పరిపాలించిన వారు వీరు: విరూపాక్ష రాయలు, మల్లిఖార్జున రాయలు (1447-1465), రెండవ విరూపాక్ష రాయలు (1465 – 1485) పోతనకు సమకాలీనులు. వారిలో విరూపాక్ష రాయలు బహు దుర్మార్గుడు, హంతకుడు, వ్యసనపరుడు. బహుశః అతడికి తన కావ్యాన్ని అంకిత మర్పించ మని పోతనకు రాయల శ్రేయోభిలాషి ఎవరో సలహా ఇచ్చారు. (ఆ సలహా ఇచ్చినది శ్రీనాథుడు మాత్రం కాదు; ఆయన 1450 ప్రాంతంలో బొట్టుపల్లిలో మరణించాడు.) దీనికి పోతన అంగీకరించ లేదు. ఈ సందర్భంలో తనకు ప్రత్యక్షమైన శారదాదేవి నుద్దేశించి "నిన్నాకటికై కొనిపోయి యల్ల కర్ణాట కిరాత కీచకుల కమ్మ త్రిశుద్ధిగ నమ్ము భారతీ!" అని ఆమెకు హామీ ఇచ్చాడు. ఇందు "కర్ణాట కిరాత కీచకు" లని స్పష్టంగా చెప్పాడు. ఈ కర్ణాట కిరాత కీచకులు హంపీ విజయనగ రాధీశులే కాని రాచకొండ ప్రభువులు కాదు. పోతనకు ఇంచుమించు సమకాలీను డైన అన్నమాచార్య కూడా ఆ నాటి హంపీ విజయనగర చక్రవర్తులను పరోక్షంగా ఉద్దేశించి "దేహ మిచ్చిన వాని తివిరి చంపెడి వాడు"; "తోడబుట్టిన వాని దొడరి జంపిన వాడు" అంటాడు. (అన్నమయ్య కడపజిల్లా తాళ్ళపాకకు చెందిన వాడు. ఆయనకు ఒంటిమిట్టతో సంబంధం ఉంది. ఆయనపై పోతన ప్రభావం ఏమైనా ఉందేమో పరిశీలించవలసి ఉంది.)

8.up-arrow   పోతన శ్రీనాథుని బావగా రనే అంశం జనశ్రుతిలో ఉంది. కాని ఇది వాస్తవం కాదు. క్రీ.శ. 1448 ప్రాంతంలో రాజమహేంద్రవరం రెడ్డిరాజ్యం కళింగ గజపతుల చేతిలోకి తరలిపోయిన తర్వాత, ఆయన గత్యంతరం లేక రాచకొండ దర్శించాడు. ఆయనకు సింగ భూపాలుని దర్శనం లభించడం దుస్తరం. ఆయనను ఆదరించిన కొండవీటి పెద కోమటి వేమారెడ్డిని, రాజమహేంద్రవరం వీరభద్రారెడ్డిని అంతం చేయడంలో సింగ భూపాలుని సన్నిహిత బంధు వైన దేవరకొండ ప్రభువు లింగమనీడు పాత్ర ఉంది. అందుకే పోతన భాగవత రచనకు ఆశీనుడయ్యే గుహల నున్న శారదా దేవిని "సరస సద్గుణ నికురంబ శారదాంబ! రావు సింగ భూపాలు ధీ విశాలు నిండు కొలువున నెలకొని యుండి, నీవు నన్ను ఇంక మీద ఎటుల మెప్పించెదో!" అని ప్రార్థించాడు. బహుశః పోతన అభ్యర్థన పైననే సింగ భూపాలుడు శ్రీనాథునికి దర్శన మిచ్చా డేమో? అంతకు మించి పోతనకు శ్రీనాథుడికి ఎటువంటి సంబంధ బాంధవ్యాలూ లేవు. "శివ పురాణ" కర్త శ్రీ గడియారం వేంకట శాస్త్రిగారు "శ్రీనాథునకు పోతనకు మధ్య గల సంబంధ బాంధవ్యాలపై జనశృతిలో కొన్ని గాథలు కలవు. కాని, వాటి కెటువంటి చారిత్రక, ప్రబంధ పూర్వక ఆధారాలు లేవు." అని స్పష్టం చేశారు. "ధన్వంతరి వాణి" అనే పత్రిక (2011 మే నెల సంచిక) లో "విశాలాంధ్ర కవులు" అనే శీర్షికను ఆచార్య ఎస్. వి. రామారావు గారు ఒక వ్యాసం వ్రాస్తూ "బమ్మెర పోతనకు శ్రీనాథునికి ఎటువంటి బంధుత్వం లేదు. శ్రీనాథుని బావమరిది దగ్గుబిల్లి దుగ్గన తమ్ముని పేరు పోతన. ఇతడు బమ్మెర పోతన కాదు." అని వివరించారు. ఈ దగ్గుబిల్లి పోతన శ్రీనాథునికి బావమరిది వరస అవుతాడు. ఈ పోతననే బమ్మెర పోతనగా భావించి జనశృతిలో అనేక గాధలు ప్రచారంలోకి వచ్చా యని దీనిని బట్టి తెలుస్తోంది.ఆచార్య తల్లాప్రగడ సత్యన్నారాయణ మూర్తిగారు, ఎమ్ఎ(చరిత్ర)

up-arrow సత్యన్నారాయణ మూర్తి గారు
: ఆచార్యుల వారు ప్రముఖ రచయిత, విద్యావేత్త, తెలుగు భాష, చరిత్రల పై విశిష్ఠతర కృషి చేసి, అనేక గ్రంథాలు ప్రచురించారు. వీరు గంగరాజు మణికర్ణికగారూ, వెంకట భవానీ శంకర శ్రీరామ మూర్తి దంపతులకు తే. 1927- మే, 27న ఉంగటూరులో జన్మించి, తల్లాప్రగడవారింట పెంపకం వెళ్ళారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చరిత్రలో ఎమ్ఎ చేసి, అనకాపల్లి కళాశాలలో ఆచార్యులుగా పనిచేశారు. ఉపాధ్యాయవృత్తిలో చక్కటి విజయాలు సాధించడమే కాదు. పదవీ విరమణ అనంతరం కూడా గత 3 దశాబ్దాలలో నిరంతరకృషి చేస్తూ అనేక పుస్తకాలు వ్రాసారు. ప్రచురించారు. వీరు పోతన మీద, భాషాసంస్కృతుల మీద, సాహిత్యంపైన వారికి గల అవిశ్రాంత అభిమానంతోటి మన తెలుగుభాగవతం.ఆర్గ్ కోసం అని 89 ఏళ్ళ వయసులో కూడా శ్రమించి ఇచ్చిన అముద్రిత వ్యాసం ఇది. వారికి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం, త్రికరణశుద్ధిగా ప్రణామ సహస్రాలు చెప్పుకోడం తప్పించి. వారికి ఆయురారోగ్యాలు, సుఖమయ నిండు నూరేళ్ళ జీవితాన్ని మా నల్లనయ్య అనుగ్రహించు గాక. వీరి అల్లుడు శ్రీ ధన్యంరాజు శేషాచలపతి రావు, మా మేనబావ ఎంతో ఆదరంగా వారి స్వీయ దస్తూరితో ఉన్న ఈ అముద్రిత ప్రతిని 2016,నవంబరు – 09న అందించారు.