పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బమ్మెర పోతన : పోతన - సంగీతము

బమ్మెరపోతనార్యుడు సంగీతవిద్వాంసుడు

బమ్మెరపోతన భక్తితత్త్వ విశ్లేషణం సామాన్యాంశం:

పోతననుగురించి పరిశోధనలు చేసిన కొందరు సంగీతజ్ఞులయిన పరిశోధక పండితులు పోతనామాత్యుని సంగీతమర్మజ్ఞునిగాకూడా పేర్కొన్నారు.ఈ విషయం వినూత్నాంశమే. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఆచార్య టి.సుశీలగారి పర్యవేక్షణలో ఎన్ (ప్రభల) జానకిగారు "భక్తిపథంలో ప్రస్థాన త్రయం" అనే అంశం గురించి పరిశోధనలుచేసి సిద్ధాంత గ్రంథాన్ని రచించినారు 2002.ఈ గ్రంథం ముద్రితం. ఈ గ్రంథంలోని అంశాలు కొన్ని ప్రస్తుతం ప్రస్తావించుకుందా౦.ఈ కోణంతో కూడా భాగవతాన్ని అధ్యయనం చేయవలసి ఉంది.

సీ.
సాంద్ర శరశ్చంద్ర - చంద్రికా ధవళిత,
  విమలబృందావన- వీధియందు
రాసకేళీ మహో-ల్లాసుడై యుత్ఫుల్ల
  జలజాక్షుడొక నిశా-సమయమునను
దనరారు మంద్రమ-ధ్యమతారములనింపు
  దళుకొత్త రాగభే-దముల దనరి
దైవత ఋషభ గాం-ధార నిషాద పం
  చమ షడ్జమధ్యమ-స్వరములోని
తే.
గళలు జాతులు మూర్ఛనల్ గలుగు వేణు
నాళ విమాంగుళిన్యాస-లాలనమున
మహిత గతి బాడె నవ్యక్త-మధురముగను
బంకజేక్షుండ దారువు-లంకురింప.
- భాగవతం, ద్వితీయస్కం.

పై పద్యంలో సంగీతశాస్త్ర సాంకేతిక పదాలు అనేకం ప్రయుక్తాలు.పద్యారంభంలోనే చంద్రిక రాగం సూచితం. " ద,రి,గ,ని,ప,స,మ " అనడంలో సప్తస్వరాలు, మంద్ర, మధ్యమ, తారలు అనే త్రిస్థాయిలు, కళలు, జాతులు, మూర్ఛ నలు - ఇవన్నీ సంగీతశాస్త్ర సాంకేతిక పదాలు.ఇవన్నీ సంగీతశాస్త్రనిష్ణాతులకు మాత్రమే అర్థమవుతాయి."సరిగమపదని" అనికాకుండ "ద,రి,గ,ని,ప,స,మ " అనే వరుస నిర్దేశించడం చేత చంద్రికారాగ ఆరోహణావరోహణాలు కూడా సూచించినట్లయినది. కళలు అంటే సంగీతంలో "సంగతులు". అయితే, ఇది తాళ దశప్రాణాలలోఒక తాళాంగంగా కూడా సంగీతజ్ఞులు సంభావిస్తారు. ఈ కళలు మళ్లీ ఏక, ద్వి, చతుష్క భేదంతో జాతు లైదని సంగీత సంప్రదాయం. ద్వావింశతి శ్రుతులు అనేవి సంగీతాభిమానులకు పరిచితమైనవే.ఇంతటి గంభీరార్థాన్ని పోతనగారు ఈ సీసపద్యంలో నీక్షేపించినారూ. ఇది ఆ మహానుభావుని సంగీతజ్ఞానానికి నిదర్శనం.

పద్యభావం:-
అది ఒక శరత్కాపు రాత్రి.పండు వెన్నెలలో బృందావన వీథులన్నీ తెల్లగా కనిపిస్తున్నాయి. విరబూసిన తామరలవంటి నేత్రాలుగల కృష్ణుడు ఆ వనంలో రాసకేళికి ఉపక్రమించినాడు. ఆ క్రీడోల్లాసంతో పిల్లనగ్రోవి చేతపట్టాడు. దాని రంధ్రాలపై వేళ్లూని వివిధరాగాలను ఆలపించినాడు. వాటిలో మంద్ర, మధ్యమ, తార స్థాయిలను వినిపించినాడు. దైవతం, ఋషభం, గాంధారం, నిషాదం, పంచమం, షడ్జమం, మధ్యమం అనే ఏడు స్వరాలూ, కళలూ, జాతులూ, ఆరోహణావరోహణ క్రమమూ తేటపడే విధంగా అవ్యక్తమధురంగా గానం చేసినాడు.ఆ గానానికి మోడులు చిగురించాయి.

సంగీతశాస్త్రానికి సంబంధించిన పారిభాషిక పదాలను పోతనామాత్యులవారు సమన్వయాత్మకంగా చెప్పినాడు. భగవంతుడు రసస్వరూపుడు, కనుక ఈ సమన్వయం సముచితం. భక్తి శృంగార రసాలకు సంబంధించిన క్రీడను రాసక్రీడ అంటారు. అవ్యక్త మధురం - పక్షుల, జంతువుల నాదాలలో అక్షరాల స్వరూపం అవ్యక్తంగా ఉంటుంది. నాదం మధురంగా ఉంటుంది.

ఇలా భాగవతంలో సంగీత విశేషాలతోకూడిన పద్యాలను పోతనామాత్యులవారు అక్కడక్కడ రచించినారు.అందుకే కాబోలు త్యాగరాజుగారు పోతరాజుగారి భాగవతాన్ని విశేషంగా అభిమానించినారు.

మరికొన్ని విశేషాలు వీలునుబట్టి మరొకసారి.

సమర్పణ
శ్రీభాగవత శ్రీచరణ రేణువు
వైద్యం వేంకటేశ్వరాచార్యులు