పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బమ్మెర పోతన : పోతన లో తాను

సౌజన్యము: "గబ్బిట దుర్గా ప్రసాద్"

సాహితీ బంధువులకు - శుభా కాంక్షలు - సహజ కవి పోతనామాత్యుడు తనను తాను ఆవిష్కరించుకుంటున్నట్లుగా ఈ రచన సాగుతుంది. అందుకే "పోతన - తనలో తాను" అన్న దాన్ని సరదాగా "పోతన లో తాను" అని కలిపి శీర్షిక పెట్టాను. ఇందులో "నేను" అని అంటే పోతన గారే అని తెలుసుకోవాలి. మూడు భాగాలుగా దీనిని అందిస్తున్నాను.. పోతన భాగవతంలోని, ముఖ్యంగా దశమ స్కంధం లోని విశేషాలు ఇందులో వుంటాయి. ఆయన లోని కవిత్వ సంపద, వినయం, భగవద్భక్తీ, అలంకార వైభవం అన్నీ ఆయన మాటలతో వింటున్నట్లు వుంటుంది. సమాదరిస్తారని ఆశిస్తున్నాను. — మీ దుర్గా ప్రసాద్.

పోతన లో తాను —1

SitraRamulu
శ్రీకైవల్య పదంబుఁ జేరుటకునై చింతించెదన్ లోక ర
క్షైకారంభకు, భక్త పాలన కళా సంరంభకున్, దానవో
ద్రేస్తంభకుఁ, గేళి లోల విలసద్దృగ్జాల సంభూత నా
నాకంజాత భవాండ కుంభకు, మహానందాంగనాడింభకున్.

మహా భాగవత కథానాయకుడు యదువంశ విభుడు; నందనందనుడు; అవతారపురుషుడు; లోకరక్షణ గావించిన కర్తవ్యపరాయణుడు; గజెంద్రాది భక్తులను పాలించి, ఆదుకొన్న ఆదిదేవుడు; హిరణ్యకశిపుడు మొదలైన దానవులను సంహారం చేసి, లోకరక్షణ చేసి, ఉద్రేకస్తంభన చేసిన పరబ్రహ్మము; శిష్టరక్షణ, దుష్టశిక్షణ, అవతార పరమావధి; నంద డింభకుడు; స్థితికారకుడే కాదు, సృష్టికారుడు కూడా; ఇది "కేళిలోలవిలసదృగ్జాల, సంభూత, నానా కంజాత, భవాండ కుంభకుడు" లో ధ్వనించింది; "దానవోద్రేక స్తంభకు" అనే పదం అతని లయకారత్వానికి స్ఫురణ; అంటే - సృష్టి, స్థితి, లయ కారకుడైన పరమాత్మనే ఈ పద్యంలో స్మరించాను; "ఆశీర్నమస్క్రియాల"తో బాటు, వస్తు నిర్దేశామూ జరిగింది ఈ పద్యంలో. నా రచనా లక్ష్యం "శ్రీ కైవల్యపదమే"; భవబంధరాహిత్యమే; జన్మసాఫల్యం, కైవల్యం వల్లనే కదా సాధ్యం? అదే నేను కోరుకొన్న పరమపదం. పుర్వజన్మ తపః ఫలం. ఈ కైవల్య కాంక్ష, ప్రవృత్తి లాగా భాసించే నివృత్తి. భాగవతంలోని ప్రధాన రసమైన భక్తికి ఆదిలోనే ఎత్తిన వైజయింతిక. అలాగే దశమ స్కంధంలో చిట్టచివర, శుకయోగి చేసిన "ఫలశృతి"లో కూడా, శ్రీ కృష్ణకథా సుథారసము గ్రోలిన వారు "కాంతు రత్యున్నత పదంబైనట్టి కైవల్యమున్" అని వుంది. . నా ఆకాంక్ష, మొదటినుంచీ, చివరిదాకా, "కైవల్యమే" ఈ భాగవతజన్మ వల్ల నాకు పునర్జన్మ లేదు అని భావించి, శ్రీహరిని సంభావించాను. "తెలుగు సాహిత్యం ఉన్నంత కాలము, పోతన గారు బ్రతికే వుంటారు, ఆయన మరణించరు కనుక. పోతరాజు గారికి పునర్జన్మ లేదు" అన్నారొక మహానుభావుడు. ఇది నాపై వారికి గల అపూర్వ అనురాగానికి మచ్చు తునక.

అవును - ఇదంతా నేను వ్రాశానా? నా చేత, ఆ పరమాత్మ పలికించిన పలుకులివి. అవి నావి కావు. ఆయనవే. మీ పొగడ్తల పొగడపూల దండలన్నీ, ఆ చిన్ని నాయనకే.


లికెడిది భాగవత మఁట,
లికించెడివాడు రామద్రుం డఁట, నేఁ
లికిన భవహర మగునఁట,
లికెద, వేఱొండు గాథ లుకఁగ నేలా?

అన్న గారు తిక్క యజ్వ గారికి "హరిహరనాథులు" కలలో కన్పించి, "భారత రచనా ప్రయత్నం భవ్య పురుషార్ధ, తరు పక్వఫలమని, దానిని తనకు కృతి ఇమ్మనీ" సెలవిచ్చారు. సోమయాజి గారి మనః ప్రవృత్తి అప్పటికే "ఎల్లలు లేని భక్తి సరిత్తు". భారత రచనా విధానం వారి దృష్టిలో ఆరాధనా భావం. మరి నా అదృష్టమేమో?


రన్ నన్నయ తిక్కనాది కవు లీ యుర్విం బురాణావళుల్
తెనుఁగుం జేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు దా నెట్టిదో
తెనుఁగుం జేయరు మున్ను భాగవతమున్ దీనిం దెనింగించి నా
నంబున్ సఫలంబుఁ జేసెదఁ బునర్జన్మంబు లేకుండఁగన్.

నా ముందు తరం కవీశ్వరుల దృష్టిలో కాని, నా సమకాలీన కవిపుంగవుల కంట గాని భాగవత మహాగ్రంథం పడకుండటం, నా అదృష్టమే కదా! అందుచేతనే "శ్రీ మన్నారాయణ కథా ప్రపంచ విరచనా కుతూహలం" కనబరచాను.

గంగాతీరంలో మహేశ్వర ధ్యానం చేస్తూ, కన్నులు అరమూసుకొని వుండగా


మెఱుఁగు చెంగటనున్న మేఘంబు కైవడి;
నువిద చెంగట నుండ నొప్పువాఁడు
చంద్రమండల సుధాసారంబు పోలిక;
ముఖమునఁ జిఱునవ్వు మొలచువాఁడు
ల్లీయుత తమాల సుమతీజము భంగిఁ;
లువిల్లు మూఁపునఁరఁగువాఁడు
నీలనగాగ్ర సన్నిహిత భానుని భంగి;
న కిరీటము దలఁ లుగువాఁడు


పుండరీకయుగముఁ బోలు కన్నుల వాఁడు
వెడఁద యురమువాఁడు విపులభద్ర
మూర్తివాఁడు రాజముఖ్యుఁ డొక్కరుఁడు నా
న్నుఁగవకు నెదురఁ గానఁబడియె.

చూశాను. వారు భాగవతం తెనిగించమని ఆనతిచ్చారు. తమకు అంకితమివ్వ మనీ కోరారు. నా అదృష్టం పండింది. భవబంధ విమోచానానికి తగిన ప్రాతిపదిక లభించింది.

భాగవతం స్థూల దృష్టికి శ్రీకృష్ణ లీలాపేటిక. విష్ణుభక్తుల కథా వాటిక. మధ్య మధ్య ఎన్నో విప్పలేని వేదాంత గ్రంథులు వున్న మహా గ్రంథం. అందుకే నాకు అప్పుడు అనిపించింది. -


భాగవతము దెలిసి లుకుట చిత్రంబు,
శూలికైనఁ దమ్మిచూలికైన,
విబుధజనుల వలన విన్నంత కన్నంత
దెలియ వచ్చినంత దేటపఱతు.

అయితే ఇక్కడ ఒక చిక్కు వచ్చి పడింది. “తేట తెల్లంగా వ్రాయాలి అంటే" ఆది కవి నన్నయార్యుని తత్సమపద బహుళ మైన తెలుగులోనా? పాల్కురికి సోమనాథ మహాకవి గారి జానుతెలుగులోనా? లేక కవిబ్రహ్మ తిక్కన సోమయాజి గారి పధ్ధతిలోనా? భాగవత మహాగ్రంథం అందరి నోళ్ళ లోను నానాలంటే, సందర్భాన్ని బట్టి అందర్నీ మెప్పించాలంటే —


కొంఱకుఁ దెనుఁగు గుణమగుఁ
గొంఱకును సంస్కృతంబు గుణమగు రెండుం
గొంఱికి గుణములగు నే
నంఱ మెప్పింతుఁ గృతుల య్యై యెడలన్.

అని అత్యంత వినయంతో విన్నవించుకొన్నాను. ఇందులో "నా ఆత్మవిశ్వాసం కూడా ఉందనీ", విబుధులు అంటే వారి సంస్కారానికి నా నమస్కార పురస్కారం. "వేయి నిగమాలు చదివినా, సుగమం కాని ముక్తి, భాగవత నిగమం - పఠిస్తే అత్యంత సుగమం" అని నా విశ్వాసం.

ఇక్కడ నా కుటుంబ నేపథ్యాన్ని గురించి విన్నవిన్నవించుకొంటాను. "నేను పరమేశ్వర కరుణా కలిత కవితా విచిత్రుడిని"

మా తాత పాదులు, పితృ పాదులు అందరు "శ్రీ ఉమామహేశ్వర పాదారవింద మత్త చిత్తులే. మా వంశమే మహేశ్వర ధ్యానమందిరం. శైవమతావలంబానే మా ధ్యేయం. అయితే", అప్పటికే ఆ మతం కొంత పెడదారి పట్టింది అనిపించింది. "వీరభద్ర పళ్ళెం"లతో, "హరో హర" అని వీరంగాలతో ఊరేగే మతోద్వేగానికి ఓపలేకపోయి, చిత్తం శివుని మీద నుంచి వైష్ణవం మీదకు మరలింది పోతనకు". . అని నా గురించి కొందరు అన్నారు. బుధజనులారా! నేను చెప్పే నిజం విని మీరే నిర్ణయానికి రండి.

"మహేశ్వర ధ్యాన తత్పరుడనైన" నాకు శ్రీ రామచంద్రప్రభు దర్శనం అయింది. తనకు భాగవతాన్ని అంకిత మివ్వమని ఆయన ఆన. "హారికి, నంద గోకుల విహారికి, గోప నితంబినీ మనో హారికి" అని షష్టి అంత్యాలు రాసి శ్రీ కృష్ణునికి అంకితం ఇచ్చాను. . శివునికీ, శ్రీరామునికీ, శ్రీరామునికీ, శ్రీకృష్ణ పరమాత్మకు భేదం లేదని కదా నేను అలా చేసింది? అంతే కాదు -


చేతులారంగ శివునిఁ బూజింపఁడేని,
నోరు నొవ్వంగ హరికీర్తి నుడువఁడేని,
యయు సత్యంబు లోనుగాఁ లఁపఁడేనిఁ,
లుగ నేటికిఁ దల్లుల డుపుఁ జేటు.

అనటంలో పరమాత్మను మనం చూడటం లోనే భేదం వుంది కాని, ఆయన ఎప్పుడూ ఒక్కడే అన్నది సత్యం కాదా? కనుక నాకు శివ, కేశవ భేదం లేదు. ఆ ఇద్దరు అభిన్నులే అని నా ధృఢ విశ్వాసం.

మీ గబ్బిట దుర్గా ప్రసాద్ - 04 - 01 - 12.

సౌజన్యం: గబ్బిట దుర్గా ప్రసాదు - సరస భారతి వుయ్యూరు
పోతన లో తాను —1


పోతన లో తాను - 2
జనవరి 4, 2012 ప్రచురణ

నా, హరి, హర అభేద భావాన్ని ఇప్పటి దాకా మీకు తెలియ జేశాను. నాది సహజ పాండిత్యం అని విన్నవించుకొంటున్నాను. "అనగా, చదువు, సాధనా లేక గాలి మూటగట్టిన, శ్రుత వాచాటనము" అని కొందరు భావించారు. కర్ణునికి కవచకుండలాలు, కుశ లవులకు, జృంభకాస్త్రాదులు, జన్మతో, సంసిద్ధ మైనవి కావా? అట్లనే నాకు కూడా నా పురాకృత సుకృతం వల్ల సిద్ధించింది ఈ పాండిత్యం. పూర్వ జన్మ సువాసన, జన్మాంతర బహుళ అధ్యయనం వల్ల లభించిన ఫలితం ఇది. పుట్టుకతో నా పుణ్యం వల్ల లభించిన పాండిత్యం, తపస్సాధనతో సాధించిన కవితా కౌశలం, కలిసి, ఆత్మ మంత్రపుష్ప సమర్పణ చేశాను. పరమేశ్వర ప్రీతితో, ప్రేరణతో, పరమేశ్వరాంకితంగా చేసిన పని ఇది. ఈ విషయంలో ఇంత కంటే ఎక్కువ చెప్పలేను.

ఇక అనువాద విషయంలో నేను చెప్పేదేమీ లేదు. భగవానుడైన వ్యాస మహర్షి వ్రాసిన సంస్కృత మహా భాగవతాన్ని అనువదించటం కొండను నెత్తి కెత్తుకోవటమే. భగవానుడు "రాముడు" ఈ అనువాదాన్ని చేయించాడు. ఆ పలుకుల పులకలన్నీ ఆ భగవానుడివే . నేను నిమిత్తమాత్రుణ్ణి. గంటం నాది – కదలిక "వారిది". తులనాత్మకంగా సంస్కృత, తెలుగు, భాగవతాలను పరిశీలించిన మహాత్ములు కొందరు నా అనువాదం "హృదయాను వాదం" అన్నారు. "అంతర్లీన పారవశ్యమే ధ్యేయం"గా, పాండిత్యం కంటే పరమార్థానికి, మూర్తి సందర్శనం కంటే, స్ఫూర్తి సందర్శనానికి, మేధా విలసనం కంటే, హృదయ వికాసానికి, ఆశ్చర్యకర మైన ప్రజ్ఞాప్రకటన కంటే, పారవశ్యంతో కూడిన రసోదయానికి ప్రాధాన్యం ఇచ్చానని, రస నిష్యంద మాన మైన ఆనంద బ్రహ్మ స్వరూప సాక్షాత్కారానికే ప్రాముఖ్యం ఇచ్చానని, నా అనువాద వైఖరి "హృదయాను వాద వైఖరి" అని తమ సహృదయాన్ని ప్రకటించారు. నా అనువాద పధ్ధతి లోని విశేషాలన్నీ మీకు తెలిసినవే. అవి శ్రీహరికి అర్పిత నైవేద్యములే. సహృదైక వేద్యాలే.

"రసో వై సహా" అని వేదం అంది. రస స్వరూపుడగు భగవంతుని దివ్య మంగళవిగ్రహం, ఎప్పుడూ, మన మనసులో ఉండేటట్లు మాత్రం చేయగలిగానని ఆనందంగా వుంది. నా బాలకృష్ణుణ్ణి చూసి వెండి గడ్డం వెలిగిస్తున్న ముఖవర్చస్సు తో వ్యాస భగవానులు వెన్నెల బావుల్లాంటి కన్నులతో నవ్వుతు "నా బాలకృష్ణా! నువ్వు అచ్చం తెలుగు పిల్లాడివి అయిపోయావురా" అని అన్నారని విని, నా మనసు ఆనంద పులకిత మైంది. నా కళ్ళు సంతత బాష్పధారా పరివృత మైనాయి. నేను ధన్యుణ్ణి అయ్యా ననిపించింది. ఆంధ్రభాగవత పద్యాలు, ఆంధ్రుల నోట అలవోకగా పలుకుతున్నాయి అట. . ఎంతటి అదృష్టవంతుణ్ణి నేను? ఇది నా పూర్వజన్మ ఫలం. నా మాధవుని దయావీక్షణ కటాక్షం.

తిక్క యజ్వను సూర్యునిగా, నన్ను చంద్రునిగా కొందరు పోల్చారు. మేమిరువురము ఆంధ్ర లోకానికి రెండు వెలుగులం అట. సోమయాజి పక్కన నాకు పీట వేసి అందలం ఎక్కించారు. తెలుగు జాతికి, తెలుగు వేదాలు అనదగిన, మహా గ్రంథాలను రచించిన ఋషి పుంగవులం అట. ఆహా ఏమి నా భాగ్యం? అంతర్ దృష్టి తో మహా భారత తంత్రాన్ని, మంత్రాన్ని, యంత్రాన్ని తన మనస్సులో నిల్పి, ఆయా పాత్రలను నాటకోచితంగా తీర్చిదిద్ది, ఎవరూ తన దారికి వచ్చే సాహసం చేయకుండా చేసిన తిక్కన కవీశ్వరు లెక్కడ? నేనెక్కడ? "ఛందో బంధమగు శబ్దం, కళాధర్మాలైన శ్రుతి లయలను నేను, సాధించానని" కొందరి భావన. "తగిన చోట్ల యమ, ప్రాస అలంకారాలను భాగవత కవితా గానానికి మృదంగ వ్యాపారం నిర్వహించానట". నాదము బ్రహ్మము; శబ్దమూ బ్రహ్మమే. నాద, శబ్ద బ్రాహ్మల అను సందానమే నేను చేసిన పని. ధన్యోశ్మి.

ఆంధ్రభాగవత ప్రశస్తి మన తెలుగు దేశాన్నిదాటి మహారాష్ట్రదేశం లోను మన్నన పొందింది. హిందూ ధర్మరక్షకులు, హిందూ సామ్రాజ్య స్థాపకులు అయిన శ్రీ శివాజీ మహారాజ్ కు గురు ప్రభులైన శ్రీ శ్రీ సమర్ధ రామదాస సద్గురువులు తమ "దాస బోధ" గ్రంథంలో నా భాగవత భక్తిని, ప్రపత్తిని ప్రశంసించారట. ఆహా! ఏమి నా అదృష్టం? ఒక జాతికి కీర్తిని, స్పూర్తిని కలిగించిన "రామదాసు"వరేణ్యుల మనస్సెంత సువిశాలం? ఎల్లలు లేని వారి భక్తికి, వారికి నాపై వున్న వాత్సల్యానికి నేను ఎంతో కృతజ్ఞుడిని.

నాదబ్రహ్మ యై, నారదుని అపర అవతార మైన త్యాగరాజు మహానుభావులు ఆంధ్ర మహాభాగవతాన్ని, అనునిత్యం పారాయణ చేసేవారట. తిరువయ్యారులో త్యాగరాజస్వామి గృహంలో తెలుగు భాగవత ప్రతి ఇప్పటికీ చెక్కు చెదర కుండా భద్రపరిచారట. ఇది తెలుగు భాగవత దివ్యత్వ తేజఃపుంజం. దీని కాంతి దశదిశలా వ్యాపించింది.

తమిళ దేశ నవయుగ ప్రవక్త శ్రీ సుబ్రహ్మణ్య భారతి "సిలకవి యరశాల్" (కొందరు కవి రాజులు ) అనే వ్యాసం లో నన్ను ప్రస్తుతించారట. హరికథా పితామహులు శ్రీ మదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారికి వారి అయిదవ ఏటనే "తెలుగు భాగవతం" తోనే అక్షరాభ్యాసం అయిందట. భాగవత భక్తి చేతనే ఆయన రచనలు హరికథారూపంలో ఆంద్ర సాహిత్యాన్ని రంజింప జేసింది. అమ్మా వాణీ! ఇది నీవు ఇచ్చిన అక్షరాభ్యాసమే. నా కైమోడ్పు నీకే కదా! నేను ఎప్పుడూ నిమిత్త మాత్రుడినే.


క్షోణితలంబునన్ నుదురు సోఁకఁగ మ్రొక్కి నుతింతు సైకత
శ్రోణికిఁ, జంచరీక చయ సుందరవేణికి, రక్షితామర
శ్రేణికిఁ, దోయజాతభవ చిత్త వశీకరణైక వాణికిన్,
వాణికి. నక్షదామ శుక వారిజ పుస్తక రమ్య పాణికిన్.

- మీ - గబ్బిట దుర్గా ప్రసాద్ - 04 - 01 - 12.

సౌజన్యం: గబ్బిట దుర్గా ప్రసాదు - సరస భారతి వుయ్యూరు
పోతన లో తాను —2


పోతన లో తాను - 3 భాగవత భక్తీ
జనవరి 5, 2012 ప్రచురణ

భాగవత భక్తి — "ఆంద్ర వాగ్మయ ప్రపంచం"లో విష్ణు భక్తి మార్గాన్ని మొట్ట మొదట భాగవతం మూలంగా "ఈ పోత రాజు" సుప్రతిష్ఠం చేశాడు" అని అన్నారు. అది లోకోత్తర కృషి అన్నారు. వంగ దేశంలో ఆంద్రమహాభాగవతం తరువాతే శ్రీకృష్ణభక్తి ప్రారంభము అయినదట. శ్రీచైతన్య ప్రభువుల "రాధా వల్లభ మతం", శ్రీ వల్లభాచార్యుల వారి "శుద్దాద్వైతం లేక పుష్టి మార్గం"లకు మన తెలుగుభాగవతంలోని దశమ స్కంధమే ప్రామాణికం అట. శ్రీచైతన్యులు ఆంద్ర దేశమున పర్యటించి, మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించినారట. అక్కడ ఇప్పటికీ శ్రీవారి పాదపద్మాలు వున్నాయట. అసలు శ్రీ వల్లభాచార్యులు తెలుగు వారేనట. వీరు గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలలో, పుష్టి మార్గాన్ని ప్రవర్తింప జేశారట. అక్కడ ఇప్పటికీ తెలుగు వారు "తలాంగులు" అనే పేర ఉన్నారట. వారందరూ మన ఆంధ్రమహాభాగవతాన్ని నేటికీ భక్తీ పఠనం చేస్తున్నారట. కనుక శ్రీకృష్ణభక్తినీ, మధుర భక్తినీ సాహిత్యం లో అందించిన ఘనత ఈ దాసాను దాసుడు పోతనదే అని చెబుతుంటే విని నా మనసు పులకరిస్తోంది. బహుశా, ఆయా భాషలలోని భాగవతానువాదానికి తగిన మహాకవులు జన్మించ లేదేమో? ఆ మహా పుణ్యం నాకు దక్కింది. కాదు కాదు, కలిగించారు నాకు - నాకు ముందున్న కవి శ్రేష్ఠులు. ఈ ఉత్క్రుష్ఠత నాకు కాదు, నా భాగవతానికే దక్కుతుంది. "నానా రాసాభ్యుదయోల్లాసి యైన భారతము కన్నా, రాసోల్లసితమగు రామాయణము కన్నా, భక్తి రసం భాగవతంలో ప్రధానంగా ప్రపంచితమైంది" అన్నారు.


లితస్కంధము, కృష్ణమూలము, శుకాలాపాభిరామంబు, మం
జుతాశోభితమున్, సువర్ణసుమనస్సుజ్ఞేయమున్, సుందరో
జ్జ్వవృత్తంబు, మహాఫలంబు, విమలవ్యాసాలవాలంబునై
వెయున్ భాగవతాఖ్యకల్పతరు వుర్విన్సద్ద్విజశ్రేయమై.

ఇలాంటి దివ్య భక్తి ప్రతిపాదక మైన భాగవతాన్ని, తెలుగు చేసినందుకు నాకు జన్మరాహిత్యము కలిగింది. "ఈ జన్మరాహిత్యం, సర్వాంధ్రజనానికీ కలిగింది" అని ఒక మహాశయుడు సెలవిచ్చారు. అంటే నా పూర్వజన్మానికీ, నేను రచించిన భాగవతఆంధ్రీకరణానికీ నట" అంటే ఏకవీ ఇంత రసవత్తరంగా నేటి వరకు భాగవతాన్ని తెనిగించ లేదట. దీని లోతులతో సరితూగే రచన "న భూతో న భవిష్యతి" అట. "జయంతి తే సుకృతినో రస సిద్ధః కవీశ్వరాః". ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ఇదంతా ఆ అమృతభాండాన్ని సంస్కృతంలో నిక్షిప్తం చేసి, మనకు అందించిన ఆ వ్యాసభగవానునికే చెందుతుంది. తపోధన్యాత్ముడైన ఆ మహర్షికి నా నమోవాకాలు.


వేదకల్పవృక్షవిగళితమై శుక
ముఖసుధాద్రవమున మొనసి యున్న
భాగవతపురాణలరసాస్వాదన
దవిఁ గనుఁడు రసికభావవిదులు.

“అ, ఉ, అం అనే మూడు మాత్రలతో ఆవిర్భావించిందే ఓంకార ప్రణవమంత్రము." అలాగే రామాయణ భారత, భాగవతములు మూడు, ఆంధ్రవాగ్మయానికి మూలస్తంభాలు" అని కొనియాడిన సహృదయులకు నా కృతజ్ఞాతాంజలులు తెలియజేయటం కంటే నేనేమి చేయగలను?

మా బావ గారు శ్రీనాథ కవిసార్వభౌములు

ఇదంతా విని మా బావ శ్రీనాథ కవిసార్వభౌములు చిరునవ్వు నవ్వుతున్నారు. వారి కవిత్వంలో ప్రౌఢిమ, గాంభీర్యం, శృంగారం త్రివేణీ సంగమంలా పవిత్రత సంపాదించుకొన్నాయి. వారి కవితా వేశము, సీసపద్య నిర్వహణ ఎవరికి అబ్బుతాయి? "సరస్వతీ వర ప్రసాదలబ్దులు" మా బావగారు; కారణజన్ములు. కనకాభిషేకం జరిపించుకొన్న కవిరాజులు. ఆ నాటి కవులందరినీ, తన పాండిత్యప్రకర్ష చేత ఓడించి, కంచుఢక్కను పగులగొట్టిన ఉద్దండ కవిసార్వభౌములు; పరమేశ్వర వరప్రసాదలబ్దులు వారు. పురాణాలను అనువదించి, శ్రీహర్షనైషధాన్ని ఆంద్ర సరస్వతికి "కంఠాభరణం"గా సమర్పించిన పుంభావ సరస్వతులు. ప్రజల భాషలో కూడా కవిత్వం చెప్పి, ప్రజా కవిగా గుర్తింపు పొందారు. తెలుగు సాహిత్యంలో ఒక కొత్త మార్గాన్ని, ప్రపంచానికి చూపిన మార్గదర్శి. నాకు గురుతుల్యులు. మిత్రులు, సహచరులు కూడా. "శ్రీనాథయుగ" కర్తలనిపించుకొన్న మహాకవి. వారి ప్రజ్ఞా, పాటవాలు వారికే సరి, వారొక కవితా కేసరి. ఆంద్ర సాహిత్యంలో విశృంఖల వీర విహారం చేసిన విశిష్ట కవిశ్రేష్ఠులు. "పండితాఖండలులు" అని పండితప్రపంచంలో వన్నెకెక్కిన వారు. అద్వితీయ శృంగారకవిచక్రవర్తి. వారి అశేష పాండితీ వైభవానికి సదా నమస్కరిస్తాను.

మా బావగారి మార్గాన్ని, నా మార్గాని బేరీజు వేశారు కొందరు విశ్లేషకులు. మా బావగారిలో "ఆడంబరం, అహంభావం, వున్నాయని, నేను ఆత్మాభిమాని నని, నిరాడంబరుడిని" అన్నారు. బావగారు పండితులై, కవియై, సుఖదుఖాల ద్వంద్వం లో చిక్కుకొన్నారట. నేను ద్వంద్వాతీతంగా ప్రవర్తిస్తూ, జనన, మరణ రహితమైన కైవల్యం పొందినానాట. శ్రీనాధ బావ గారు శృంగారిగా ఎంత పేరు తెచ్చుకొన్నా, "ఈశ్వరార్చన కళాశీలుండ" అని తానే చెప్పుకొన్నారు. మరి, నేను భోగినీదండకం వంటి, పరమ శృంగార కృతి రచించినా, "భక్తుని" గానే చలామణీ పొందాను. కాశీ ఖండ, భీమ ఖండ, హర విలాస, శివ రాత్రి మాహాత్మ్యం లలో భక్తీభావాన్ని రంగరించి, కుమ్మరించి పోసినా, శృంగార నైషధంలో రక్తినీ, చాటువులలోని, శృంగార ప్రసక్తి వల్ల, "శృంగార శ్రీనాథుడు" గానే ముద్రపడ్డారు. రుక్మిణీకల్యాణం, రాసక్రీడలలో శృంగారం కొంత మోతాదు మించినా, నన్ను "తెలుగుల పుణ్య పేటిక" అనే అన్నారు. కారణం ఒకటే అనుకొంటున్నాను. బావ గారి కృతులన్నీ నరాంకితాలు. వారి ఉజ్వల ఘట్టాలన్నీ రాచకొలువుకే సమర్పితాలు. పట్టెడు వారి మెతుకులు, గుక్కెడు మంచినీళ్ళు, పుట్టని దుర్దశలో కూడా, ఆ రాజసమూర్తి, కృష్ణుడినో, శివుడినో, దుయ్యబట్టారు. "మత్యహంకృతి" వారిది అన్నారు. అయినా

అవసానదశలో “దివిజకవివరుల గుండియల్ డిగ్గురనగ, అరుగుచున్నాడు శ్రీనాథు డమరపురికి" అని తొడగొట్టిన ధీరకవి. వారిది ప్రౌఢ వ్యక్తిత్వం.

నన్ను అంచనా వేస్తూ "నరాధిపుల కొలువు చేయలేదని, సిరులకోసం వెంపర్లాడ లేదని, అధికారానికి ఆశించలేదని, అహంకారాన్ని ప్రకటించ లేదని, అంటూ; పూర్వకవులను, భావికవులను కొనియాడాను అని అన్నారు. నిజమేనని నేను అనవలసి వస్తోంది. సమకాలీనులు ఎవరు మెచ్చారు? మరి నా అంతరంగంలో అందరు "విష్ణు చిత్తులే". పుట్టనికవులకు జేకోట్టటం నేను అలవరచుకొన్న సహనశీలం, అలవడిన సంస్కారం. హాలికుడనై కవితాకేదారాన్ని పండించటానికి కృషి చేశాను.


మ్మనుజేశ్వరాధముల కిచ్చి, పురంబులు వాహనంబులున్
సొమ్ములుఁ గొన్ని పుచ్చుకొని, చొక్కి, శరీరము వాసి కాలుచే
మ్మెట వ్రేటులం బడక మ్మతితో హరి కిచ్చి చెప్పె నీ
మ్మెర పోతరాజొకఁడు భాగవతంబు జగద్ధితంబుగన్.

బావ గారికీ నాకు తెచ్చిన పోలిక చరిత్రకే పరిమిత మైతే చాలు. వారి అంతస్తుతో నన్ను చేర్చవద్దు. నేను భాగవత పద సేవా తత్పరుడను - అంతే.

- మీ - గబ్బిట దుర్గా ప్రసాద్ — 05-01-12.

సౌజన్యం: గబ్బిట దుర్గా ప్రసాదు - సరస భారతి వుయ్యూరు
పోతన లో తాను —3



రచయిత పరిచయం:
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati. wordpress. com
http://suvarchalaanjaneyaswami. wordpress. com
విశ్రాంత ప్రథానేపాధ్యాయులు,
2 - 405 శివాలయము వీధి, వుయ్యూరు, కృష్ణా జిల్లా, ఆంద్ర ప్రదేశ్ 521165