పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బమ్మెర పోతన : పొడవు పొడవున కురుచై

"పొడవు పొడవున కురచై" వామన చరిత్ర లోని శుక్ర బలి సంవాదంలొని సంధర్భం లో బలి శుక్రునితో అన్నది. ఎలాంటి పొడవు కురచైనాడు,

“ఉడుగని క్రతువులఁ వ్రతములఁ బొడగనఁ జన నట్టి పొడవు”,
ఎడతెగని యఙ్ఞాలు, యాగాలు, వ్రతాలు చేసినా దర్శనం కలగనటువంటి పొడవు(గొప్పవాడు),

పొడవున కురచై, అంటే పొట్టి వాడైన వ్యక్తిగా, ఇంకా దానం అడుగుతూ ఔన్నత్యంలో తక్కువవాడిగా శ్లేషార్ధం ఉపయోగిస్తూ పోతనగారు చెప్పారు. పూర్తి పద్యం ఇదీ…

ఉడుగని క్రతువులఁ వ్రతములఁ
బొడగనఁ జన నట్టి పొడవు పొడవునఁ గుఱుచై
యడిగెడినఁట; ననుబోఁటికి
నిడరాదె మహానుభావ! యిష్టార్థంబుల్.

ఆ పొడుగు ఎంత గొప్పవాడొ తరువాత పద్యంలో చెప్తారు. ఆదిన్ శ్రీసతి కొప్పుపై అంటూ..

ఆదిన్ శ్రీసతి కొప్పుపైఁ, దనువుపై, నంసోత్తరీయంబుపై,
బాదాబ్జంబులపైఁ, గపోలతటిపైఁ, బాలిండ్లపై నూత్నమ
ర్యాదం జెందు కరంబు గ్రిం దగుట మీఁదై నా కరంబుంట మేల్
గాదే? రాజ్యము గీజ్యమున్ సతతమే? కాయంబు నాపాయమే?

ఈ వర్ణన గురించి చాలా మంది పరి పరి విధాలగా చెప్పారు. ఆ అంగాల వరుస ఎందుకు వస్తుందో కరుణశ్రీ తొ సహా చాల మంది చెప్పారు. ఇక్కడ నాకు కొంచం ఔచిత్యం లోపించినట్లు అనిపించింది. విష్ణువు ఎంతగొప్పవాడొ చెప్పడానికి లక్ష్మీదేవి అంగాలపై ఉన్న చేయి అని చెప్పక్కర్లేదు, తమ వంశస్తుడైన ప్రహ్లాదుడిని రక్షించడానికి వచ్చిన నరసింహుని చేయి అనిచెప్పవచ్చు, సుదర్శనం ప్రయోగించి గజేంద్రుని రక్షించిన చేయి అనిచెప్పవచ్చు. సర్వవ్యాపకుని, సర్వ సమర్ధుడిని, అవధువులులేని దయాళుని వర్ణించడాని వేరే ఉపమానాలే దొరకలేదా, పోతన ఇలా ఎందుకు రాస్తాడు.

వచ్చిన వాడు విష్ణువు అని బలికి తెలుసు, మన ఇంటికి దేవుడువస్తే ఏం చేస్తాం. పూజ. జాగ్రత్తగా గమనించండి. ఆదిన్ అంటే ఓం, శ్రీ అంటే శ్రీం, సతీ అంటే హ్రాం హ్రుదయాయనమః,కోప్పుపై అంటే హౄం శిఖాయైవషట్, తనువుపై హ్రైం కవచాయహుం అంటూ అంగన్యాస కరన్యాసాలతో బీజాక్షర సహితంగా ప్ర్రాణప్రతిష్టాపన గావించారు. నూత్న మరయాదలు అంటే షోడసోపచారములు గావించి, రాజ్యము గీజ్యము సతతమే అంటూ శుక్రుడు అతకు ముందు అన్న దానము గీనము వద్దు అన్న దానికి సరైన బదులిస్తూనే రాజ్యము, సతతము అంటూ రాజాదిరాజయ ప్రసంవ్యసాహినే.. అంటూ మంత్ర పుష్పముచెప్పి, కాయంబు నాపాయమే అంటూ సశరీరంగా ఆత్మ ప్రదక్షణ గావించి పూర్తి పూజగావించి అంతకుముందు చెప్పిన ఉడుగని క్రతువు అన్నదానిని సార్ధకం చేశాడు.మొత్తం పూజ ఇంత తక్కువలోనా అంటే పొడుగున కురచై ముందే చెప్పాడుకదా.

పోతన పద్యాలు మంత్రాక్షర నిబీడితాలై పూర్తిగా పూజలలో ఉపయోగించడానికి అనువైనవి. పోతన పద్యాలని పూర్తిగా అర్ధం చేసుకొవడానికి ఒక జన్మ చాలదు. పలికిన భవహరమగునట అని చెప్పిన పద్యాలు. కొన్ని పద్యాలు చడివినా మరొక జన్మ మరుండదు. స్వయంగా రామచంద్రమూర్తి చేయి పట్టుకొని రాయించిన పద్యాలు నిగమ సమములై భాసిల్లుతున్నాయి. పోతన తెలుగువాడవటం మనందరి అదృష్టం.

సౌజన్యము : కాకర్ల మురళి (వాట్సప్ నుండి)