పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బమ్మెర పోతన : ప్రాచీన గ్రంథాల పలుకుల వాడుక

సౌజన్యం - శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు గారు
వేటూరి ప్రభాకర శాస్త్రి గారి తెలుగు మెఱుఁగులు పుల్తకం నుండి ఉల్లేఖనములు


 వేటూరి ప్రభాకర శాస్త్రి గారు 1888 వరకు జీవించిన మహా రచయిత. వారి అనేక రచనలలో తెలుఁగు మెఱుఁగులు (వ్యాస సంపుటి) బహుసరసమైనది అపూర్వమైనది. తితిదేవారి పుణ్యమాని ఇది ఇప్పటికి మనకు అందుబాటులో ఉంది. ఈ విషయం సూచించిన సజ్జనులు శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు గారు.

ఉల్లేఖనం - 1
తెలుగు మెఱుఁగులు - ప్రాచీన గ్రంథములు మన చెల్లుబడి - పుట 20

 సామెతలు గ్రంథములలోని కెక్కినట్లు గ్రంథములలోని పద్యములుకూడ లోకవ్యవహారములోని కెక్కినవు. అసలు, ఆంధ్రప్రజల నిత్యవ్యవహారములలోనే కవిత్వగానములు కలగలుపై యున్నవి. ఆంధ్రభాష పుట్టుకయే కవితాగానాత్మకము. వినాయకచతుర్థి, నవరాత్రులు అను పండుగలలో బాలకులచే పద్యములు పాడించుట, ప్రబంధములు చేతఁబట్టించుట నే నెఱుఁగుదును.

 "ధర సింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్ భృత్యులై
 పరమామ్నాయము లెల్ల వందిగణమై బ్రహ్మాండ మాగారమై
 సిరి భార్యామణియై విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రియై
 వరుసన్ నీఘనరాజసంబు నిజమై వర్ధిల్లు నారాయణా!"
     [పోతన నారాయణ శతకము 1-10-మ.]
 ఇత్యాది పద్యములు నేను చాల పసిప్రాయమున నేర్చుకున్నవి. వివాహములలో రుక్మణీకల్యాణపద్యములను ముత్తయిదువలు ఆనందభైరవిలో ఆలపించుచుండుట అనేకు లెఱుఁగుదురు. బడిపిల్లలు నాటపద్యాలు, ఆటవిడుపు పద్యాలు అనుపేర ప్రబంధ పద్యములు వల్లించుట పల్లెటూళ్ళలో పరిపాటి. పెళ్ళిళ్లలో వరునిచేత తాటాకులమీఁద, ఇటీవల కాగితాలమీఁద “శ్రీయును, కులమును, రూపము ప్రాయము శుభలక్షణంబు” ఇత్యాదిపద్యములను వ్రాయించుట ఆచారము...

ఉల్లేఖనం - 2
తెలుగు మెఱుఁగులు - ప్రాచీన గ్రంథములు మన చెల్లుబడి - పుటలు 27-28
<
 ... ఒక పూరి ఇల్లు.చిన్నది, తలుపు ఓరవాకిలిగా వేసి ఉన్నది. లోపల ముసలమ్మ వడ్లు దంచుచున్నది. రోకటిపోటుతో పాటు.

 ''ఓ రామ ఓ రామ ఒయ్యారి రామ!
 ఓ రామ! ఓ రామ!
 ఓ రామ! ఓ రామ!''

అనుచు ఉచ్ఛ్వాస నిశ్వాసములతో రామనామస్మరణ జోడించు చున్నది- మధ్యాహ్నము ఒంటిగంటవేళ. ఇంటనామె ఒక్కర్తయే. తాటాకు పుస్తకాలేవో ఉన్నవనగా చూడవెళ్ళినాను. ఇంటిలోనికి అడుగు సాగక వాకిటనే ఉన్నాను. కొంతసేపటికి దంపుడు ముగియగా చేటలో దంచిన బియ్యము చేర్చుకొని చెరుగబోవుచు, ఈ కింది పద్యము చదివినది.

 ''కలడందురు దీనుల యెడ
 గలడందురు పరమయోగి గణముల పాలన్
 కలడందురన్ని దెసలను
 కలడు కలండనెడి వాడు కలడో లేడో! ''

నాలుగవ చరణము గద్దించుచు మరి ముమ్మారు చదివినది. ఇదే సందర్భమురా అనుకొని 'ఉన్నాడమ్మా' అనుచు నేను లోపలకి వెళ్ళినాను... ఇట్లనుకున్నాను. ఆహో ! పోతరాజుగారెంత పుణ్యాత్ములు, భాగవతమెందరినో పవిత్రాత్ములను చేయుచున్నదిగదా!
 బ్రౌనుదొరగారికెవరో దీనుడు ఈ కింది పద్యమును అర్జీగా రాసి పంపుకొన్నాడట.

''లావొక్కింతయు లేదు, ధైర్యము విలోలంబయ్యె, బ్రాణంబులున్
ఠావుల్ దప్పెను, మూర్ఛవచ్చె, దనువున్ డస్సెన్, శ్రమంబయ్యెడిన్
వే తప్ప నితః పరంబెరుగ మన్నింపందగున్ దీనునిన్
రావే యీశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!''


 బ్రౌను దొరగారా దీనుని కేదో కొంత సొమ్ముతో పాటు, ఆ అర్జీ మీదనే ఎండార్స్మెంటుగా ఈ కిందిపద్యమును వ్రాసి పంపినారట!
''ఏను మృతుండనౌదునని యింత భయంబు మనంబులోపలన్
మానుము సంభవంబు గల మానవ కోట్లకు చావునిక్కమౌ
గాన హరిందలంపుమిక గల్గదు జన్మము నీకు ధాత్రిపై
మానవనాథ! చెందెదవు మాధవలోక నివాస సౌఖ్యముల్!'
'

 బ్రౌను దొరగారికి కూడ భాగవతమింత పరిచితమయినది!

ఉల్లేఖనం - 3
తెలుగు మెఱుఁగులు - పుట 39
 నన్నయశయ్య వంటి పురాణశయ్యకావ్యగౌరవము కలది భాగవతకర్త కొక్కనికే తక్క మఱి యితర పురాణయుగాంధ్రకవుల కెవ్వరికి దక్కలేదు.


.