పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బమ్మెర పోతన : భాగవత ప్రశస్తి ప్రాభవం

  తెలుగునాడులో పోతన భాగవతానికి ఉన్నంత ప్రచారం మరే ఇతర గ్రంథానికీ లేదు. పోతన పద్యమాధుర్యము దానికి ప్రధానకారణం. భాగవతమంతా మందారమకరందమే. అర్థగాంభీర్యంతోపాటు శబ్దాలంకారాలు శ్రవణపేయంగా ఉండడం వలన కూడ భాగవతశైలి పాఠకులను ఎక్కువగా ఆకట్టుకుంటుంది. ఇదివరలో భీష్మస్తుతి, కుంతీస్తుతి మొదలయిన స్తోత్రాలు భక్తులు వేకువన పారాయణం చేసేవారు.

  ఇక పద్యాల విషయానికి వస్తే...
 చేతులారంగ శివుని పూజింపడేని – 1-14-తే.

 శ్రీకృష్ణా!యదుభూషణా! నరసఖా! – 1-201-శా.

 ఎవ్వనిచే జనించు - 8-73-ఉ.

 నీ పాదకమల సేవయు 10.1-991-క.

 నీ పద్యావళులాలకించు చెవులున్ 10.1-408-శా.

మొదలయిన పద్యాలు చదువుతూ గృహిణులు పిల్లలకు చెప్పి వల్లెవేయించేవారు. శత్రుపీడా నివారణంకోసం నారాయణకవచం పారాయణం చేస్తారు. ప్రహ్లాదచరిత్ర, గజేంద్రమోక్షణం, వామనచరిత్ర చాలా మందికి కంఠస్థాలు. పెళ్లికాని కన్యలకు శీఘ్రంగా వివాహంకావడానికి రుక్మిణీకల్యాణం చదివించేవారు. కృష్ణాష్టమినాడు, కృష్ణజననాన్నిపురాణంగా చెప్తారు. వినాయకచవితినాడు శ్యమంతకోపాఖ్యానం చదివేవారు / వినేవారు. క్షీరాబ్ది ద్వాదశినాడు అంబరీషోపాఖ్యానం పఠించడం పరిపాటి.

సమర్పణ
భాగవత శ్రీచరణ రేణువు
వైద్యం వేంకటేశ్వరాచార్యులు