పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

వ్యాసములు : బ్రహ్మదేవుడు కూతు వెంటబడుట?

బ్రహ్మదేవుడు కూతు వెంటబడుట?

1-146-శా.
తన్నుం జంపెద నంచు వచ్చు విజయున్ దర్శించి తద్ద్రౌణి యా
పన్నుండై, శిశుహంత గావున, నిజ ప్రాణేచ్ఛఁ బాఱెన్ వడిన్;
మున్నా బ్రహ్మ మృగాకృతిం దనయకున్ మోహించి క్రీడింప నా
సన్నుండౌ హరుఁ జూచి పాఱు పగిదిన్ సర్వేంద్రియభ్రాంతితోన్.
ఈ పద్యం భయంతో అర్జునుడి నుండి పారిపోతున్న శిశు హంత అశ్వత్థామని వర్ణించే సందర్భంలోదే. బ్రహ్మ తన కూతురిని రమింప బోయి చేసిన తప్పుతోను, లజ్జతో పొందిన విభ్రాంతితోను పోతన గారు పోల్చారు. ఇది కథాపర అర్థం.
హరుడు చూడగా పారిపోయిన సందర్భం గురించి వ్యాస భాగవతంలోకి వెళ్తే, తృతీయ స్కంధే, సప్తమాధ్యాయే, అష్టాదశ శ్లోకః
తమాపతన్తం స విలక్ష్య దూరాత్కుమారహోద్విగ్నమనా రథేన
పరాద్రవత్ప్రాణపరీప్సురుర్వ్యాం యావద్గమం రుద్రభయాద్యథా కః

దీని గురించి http://vedabase.com/en/sb/1/7/18 వారు ఇలా వ్యాఖ్యానించారు. పారంపరగా వచ్చిన పాఠాంతరాలు రెండు ఉన్నాయి. శ్లోక అంత్యపదం కః / అక్రః. (రుద్రభయాద్యథా కః / రుద్రభయాద్య థాక్రః) (పోతన గారు బహుళవ్యాపకార్థమైన కః తీసుకొన్నారు). కః అంటే బ్రహ్మ దేవుడు, అక్రః అంటే సూర్యుడు. పురాణాలలో వీటి రెంటికి అన్వయించే వృత్తాంతాంలు రెండూ ఉన్నాయి. బ్రహ్మ మోహం చెంది కూతురు (నోటి నుండి పుట్టినామె వాణి లేడి రూపంలో ఉండగా తను కూడ లేడి రూపం ధరించి) వెంటబడినప్పుడు, శివుడు ఎదిరించగా మిక్కిలి భ్రాంతిచెంది పారిపోయాడు. అక్రః పరంగా వామనపురాణం ఇలా చెప్తోంది. విద్యున్మాలి అనే దైత్యుడు బంగారు రథంతో సూర్యుని వెనుక వచ్చేవాడు. ఆ రథ ప్రకాశం వలన రాత్రి అన్నది లేకుండా పోయింది. దానితో కోపం వచ్చిన సూర్యుడు తన తీక్ష్ణ కిరణాలతో దాడిచేసాడు. రథం కరిగిపోయింది. శివుడికి కోపం వచ్చి త్రిశూలంతో ఎదుర్కోగా మిక్కలి భ్రాంతి చెంది అక్రుడు పారిపోతూ కాశి (వారణాశి) వద్ద పడిపోయాడు. ఆ క్షేత్రం లోలార్క గా ప్రసిద్ధిచెందింది.
తృతీయ స్కంధంలోని సృష్టిభేదనంబు అను వృత్తాంతం ప్రకారం (3-377-సీ, అరవిందసంభవు . . . నుండి) బ్రహ్మ విభ్రాంతి చెందగా మరీచాది మహామునులు కఠినంగా మాట్లాడారు. బ్రహ్మ లజ్జతో విడిచిన దేహం దిక్కులు తీసుకొన్నాయి.

ఈ మరీచాదులు ఇక్కడ చెప్పిన బ్రహ్మ పుత్రులే కదా? మరి ఈ వృత్తాంతంలలో ఉన్నది కథా పరమైనదేనా? సాధారణంగా పురాణలలో ఉండేవన్నీ కథలే అయినా ఆధ్యాత్మిక విశేషార్థాలు ఉంటాయి. సుద్ధ శాస్త్రీయ / సిద్ధాంత విషయాలు చెప్పేవి కూడా ఉంటాయి.
సృష్టి భేదనంబు – బ్రహ్మ పుత్రదశక జననం – బ్రహ్మ కూతు రమింపబోవుట – వేదాదులు బ్రహ్మ చతుర్ముఖముల వెడలుట
3-376-తే.
వినుము భగవ ద్బలాన్విత వినుత గుణులు
భువన సంతాన హేతు విస్ఫురణ కరులు
పద్మసంభవతుల్య ప్రభావయుతులు
పదురు గొడుకులు పుట్టిరి భవ్యయశులు.
3-377-సీ.
అరవిందసంభవు నంగుష్టమున దక్షుఁ
డూరువు వలనను నారదుండు
నాభిఁ బులహుఁడు గర్ణములఁ బులస్త్యుండు
త్వక్కున భృగువు హస్తమునఁ గ్రతువు
నాస్యంబు వలన న య్యంగిరసుఁడు ప్రాణ
మున వసిష్టుఁడు మనమున మరీచి
గన్నుల నత్రియుఁ గాఁ బుత్రదశకంబు
గలిగిరి వెండియు నలినగర్భు
తే.
దక్షిణ స్తనము వలన ధర్మ మొదవె
వెన్ను వలన నుదయించె విశ్వభయద
మైన మృత్యు వధర్మంబు నంద కలిగె
నాత్మఁ గాముండు జననము నందె మఱియు.
3-378-సీ.
భ్రూయుగళంబునఁ గ్రోధంబు నధరంబు
నందు లోభంబు నాస్యమున వాణి
యును మేఢ్ర మందుఁ బయోధు లపానంబు
నందు నఘాశ్రయుఁడైన నిరృతి
లాలిత చ్ఛాయ వలన దేవహూతివి
భుండు గర్దముఁడును బుట్టి రంత
నబ్జజుఁ డాత్మ దేహమున జనించిన
భారతిఁ జూచి విభ్రాంతిఁ బొరసి
తే.
పంచశరబాణ నిర్భిన్న భావుఁ డగుచుఁ
గూఁతు రని పాపమునకు సంకోచపడక
కవయఁ గోరిన జనకునిఁ గని మరీచి
మొదలుగాఁ గల య మ్మునిముఖ్యు లెఱిఁగి.
3-379-వ.
ఇట్లనిరి.
3-380-ఉ.
చాలుఁ బురే సరోజభవ సత్పథవృత్తిఁ దొఱఁగి కూఁతు ని
ట్లాలరివై రమింప హృదయంబునఁ గోరుట ధర్మరీతియే
బేలరి వైతి నీ తగవుఁ బెద్దతనంబును నేలపాలు గా
శీలము వోవఁదట్టి యిటుసేసినవారలు మున్ను గల్గిరే.
3-381-ఉ.
నీవు మహానుభావుఁడ వనింద్యచరిత్రుఁడ విట్టిచోట రా
జీవభవుండు దా విధినిషేధము లాత్మ నెఱుంగఁ డయ్యె నీ
భావభవ ప్రసూనశర బాధితుఁడై తన కూఁతుఁ బొందెఁబో
వావి దలంపలే కనుచు వారక లోకులు ప్రువ్వఁ దిట్టరే.
3-382-క.
పాపము దలఁపక నిమిషము
లోపలఁ జెడు సౌఖ్యమునకు లోనైతివె యిం
తేపో ధారుణిఁ “గామా
న్ధోऽపి న పశ్యతి” యనంగఁ దొల్లియు వినమే.
3-383-మ.
అని యిబ్భంగి మునీంద్రు లాడిన కఠో రాలాపముల్ వీనుల
న్విని లజ్జావనతాననుం డగుచు నా నీరేజగర్భుండు స
య్యన దేహంబు విసర్జనీయముగఁజేయన్ దిక్కు లేతెంచి త
త్తనువుం గైకొనఁ బుట్టె దిక్కలిత మై తామిస్ర నీహారముల్.
3-384-వ.
అంత.
3-385-చ.
ఉడుగక పంకజాతభవుఁ డొండొక దేహముఁ దాల్చి ధైర్యమున్
విడువక సృష్టి పూర్వసమవేతముగన్ సృజియించు నేర్పు దాఁ
బొడమమి కాత్మలోనఁ దలపోయుచు నుండఁ జతుర్ముఖంబులన్
వెడలె ననూనరూపముల వేదము లంచిత ధర్మయుక్తితోన్.
3-386-తే.
మఱియు మఖములు మహిత కర్మములుఁ దంత్ర
ములును నడవళ్లు నాశ్రమములుఁ దదీయ
ముఖచతుష్కము నందున పొడమె” ననిన
విని మునీంద్రునిఁ జూచి య వ్విదురుఁ డనియె.