పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

వ్యాసములు : భ్రమర గీతాలు

భ్రమర గీతాలు
శ్రీకృష్ణుడు తన కోసం గోపికలు తపిస్తు, తాళలేక ఉన్నారు అని. ఉద్దవుడిని బృందావనానం వెళ్ళి గోపికలను ఓదార్చమని దూతగా పంపాడు. అలా వెళ్ళిన ఉద్దవునితో తుమ్మెదను నెపంగా పెట్టుకుని గోపికలు దెప్పుతున్న ధోరణిలో భ్రమరా, మధుపా. . . . అంటూ మన తెలుగుల పుణ్య పేటి పోతన్న గారు వాడిన అమృతగుళికలు పది పద్యాలు. ఇవి భావనాపరంగా, సాహిత్యపరంగా, కావ్యరసపరంగా, ఆధ్యాత్మికంగా చాలా ఉన్నత స్థాయికి ఉదాహరణలుగా చెప్పవచ్చు. ఇది కథాపరంగా ఇలా ఉండగా దీనికి విశిష్టార్థాలు పెద్దలు అనేకం చెప్తూ ఉంటారు.

ఉదాహరణకు – భగవంతునికి, పరబ్రహ్మకు నిర్వచనంలోని ఇంద్రియవిషయాతీత తత్వానికి చిహ్నంగా కృష్ణ నామం చెప్పబడుతుంది. గోపికలను బ్రహ్మజ్ఞాన పిపాసులైన ముముక్షువులకు ప్రతీకగా, భగవంతుడే పురుషుడుగా, జీవాత్మలు అంతా ఆ పురుషుని చేర వాంఛించే స్త్రీలుగా సంకేతిస్తూ గోపికలు అని చెప్పబడుతుంది. అలా బ్రహ్మజ్ఞానం పొందబోతున్న ఆ ముముక్షుల ఆతృత తెలుసుకున్న భగవంతుడు. ఉద్ధవుడుని, ఆ మెట్టు ఎక్కించి ఉద్ధరించే వాడిని, పంపాడట. అంతటి వాడు ఎక్కడ దొరుకుతాడు. పోనీ ఎలాగో వెతుక్కోవచ్చు అందామంటే సకల బంధాలు వ్యావృత్తులు విడిచిన గోపికలాయె. చెయ్యందించేవాడు లేకుండా అంత మెట్టు ఎక్కడం ఎంతో కష్టం. అవును ఆయన మరి ఆకర్షించేవాడు, అనాథ రక్షకుడు కదా. అందుకే ఆయనే పంపాల్సి వచ్చింది. విరహంతో వేగి వేసారిపోతున్న గోపికలు కావ్యనాయికలకు తక్కువేంకాదు కదా. అందుకే అన్యాపదేశంగా దూరుతున్నారు కడుపులో రతి ఎంత ఎక్కువగా ఉన్నప్పటికీ. దానిలో కూడా ఎన్నుకున్న నెపం భ్రమరం, మనసుకు సంకేతం.

ఈ నేపథ్యంలో మన బమ్మరె పోతనామాత్యుల వారు నాలుగు శార్దూలాలు, మూడు మత్తేభాలు, రెండు చంపకమాలలు, ఒక సీసం ప్రయోగించారు. శార్దూలం గాంభీర్యానికి ప్రతీక. విషయగాంభీర్య రీత్యా శార్దూలాలు ఎక్కువ పడి ఉంటాయి. మత్తగజగామినిలు పలుకుతున్నారు కనుక నిష్ఠూరాలు పలికేటప్పుడు పలుకులు బరువుగా ఉంటాయి కనుకను మత్తేభాలు పడ్డాయి. ఎంత దెప్పిపొడుస్తున్నా పతిభావంతో ఉన్నారు కనుక చంపకమాల పడి ఉంటుంది.

“కృష్ణ పాద చింతనమున చొక్కి, చేరువలో దైవవశంచేత: ఉజ్జ్వలత్ సునిశిత సద్వివేకము, ప్రసూన మరంద మదాతిరేకమున్, ఘనమృదునాద సంచలిత కాముక లోకము, చంచరీకమును కాంచెనట.” అవును మరి వారి మనసు మంచి చెడు చక్కగా గ్రహించగల వివేకం గలది. సుజ్ఞాన సువాసనలు వెదజల్లే సుమాలలోని మధువు గ్రోలేది. సాధనామార్గంలోని భ్రమరాది నాదాల నిలయమైనది.

చిన్న కొసరు భ్రమరంచేసేది కనుక తుమ్మెదను భ్రమరం అంటారు. మా గోపికల చిత్త భ్రమ కలిగిస్తోంది కనుక భ్రమర. ఎంత మధువులు కోరేదైనా, మరీ మా విరహాగ్నికి ఓ కారణం అయిన ఆ దుర్మార్గపు మధురనాగరికుల మరుగుతోంది కనుక దుర్జనమిత్ర.

"భ్రరా! దుర్జనమిత్ర! ముట్టకుము మా పాదాబ్జముల్ నాగర
ప్రదాళీకుచకుంకుమాంకిత లసత్ప్రాణేశదామప్రసూ
రందారుణితాననుండ వగుటన్ నాథుండు మన్నించుఁగా
మున్నేఁపుచుఁ బౌరకాంతల శుభాగారంబులన్ నిత్యమున్.

టీకా:

భ్రమరా = తుమ్మెదా {భ్రమరము - భ్రమించుచునుండునది, తుమ్మెద, భ్రమింప చేయునది}; దుర్జన = చెడ్డవారికి; మిత్ర = స్నేహితుడైనవాడ; ముట్టకుము = తాకవద్దు; మా = మా యొక్క; పాద = పాదములు అనెడి; అబ్జముల్ = పద్మములను; నాగర = పట్టణపు; ప్రమద = స్త్రీల {ప్రమద - మిక్కలి యౌవనమదము కలామె}; ఆళీ = సమూహముల యొక్క; కుచ = స్తనములందలి; కుంకుమ = కుంకుమ; అంకిత = అంటినట్టి; లసత్ = చక్కటి; ప్రాణేశు = మనోనాయకుని; దామ = పూలదండలోని; ప్రసూన = పువ్వుల యొక్క; మరంద = మకరందముచేత; అరుణిత = ఎర్రనైన; ఆననుండవు = మోము కలవాడవు; అగుటన్ = అగుటచేత; నాథుండు = ప్రభువు; మన్నించుగాక = ఆదరించవచ్చుగాక; మమ్మున్ = మమ్ములను; ఏపుచున్ = తపింపజేయుచు; పౌర = పురములోని; కాంతల = స్త్రీల; శుభ = మేలైన; ఆగారంబులన్ = ఇండ్ల యందు; నిత్యమున్ = ప్రతిదినము.

భావము:

ధూర్తుల మిత్రుడ వైన ఓ మధుపమా! మా పాదపద్మాలు తాకకు; మా ప్రాణవల్లభుని పూమాలల యందలి మకరందం గ్రోలి, అక్కడ అంటిన మథురానగరపు కాంతల స్తనకుంకుమలుతో ఎర్రబారిన నీ మోము (అందాన్ని) చూసి అతడు మన్నిస్తాడేమో గాని; మమ్మల్ని విరహాలతో వేపుకుతింటు, అక్కడ నగర కాంతల శోభనగృహాలలో కులుకుతుండే నిన్ను మేము మాత్రం మన్నించము.

ఉపమానానికి ఉపమేయానికి సారూప్యత చెప్తున్నారు
ఈ భ్రమరం ఇంద్రియ విషయాలమ్మట చరిస్తుంది కనుక దుర్జన మిత్రట. వచ్చిన ఉద్ధవుడు బతిమాలడానికి వచ్చాడని తెలిసింది అని సూచించడానికి పాదాలు ముట్టకు. బ్రహ్మజ్ఞాన సంస్కారులట మథుర మగువలు. వారి శుభగత్వం కుంకుమ. ఆ సుభగ సాంగత్యం వల్లనే పరమ పురుషుడు మన్నిస్తున్నాడట. ఇన్నాళ్ళు మాకందకుండా వేపుకు తిన్నావు అంటున్నారు. ఇక్కడ అభేదాన్నిచూపుతున్నారు. భక్తుడైన ఉద్దవునికి, భగవంతుడైన కృష్ణునికి.

పాదాబ్జముల్ – రూపకాలంకారం (ఉపమేయం నందు ఉపమాన ధర్మాన్ని ఆరోపించండం)
.. . . ప్రసూనమరందారుణితాననుండ- అతిశయోక్తి అలంకారం (చెప్పవలసినదాని కన్నా ఎక్కువ చేసి చెప్పడం సంబంధం, లేనిచోట్ల సంబంధం ఉన్నట్లు చెప్పడం)
పూలకంటిన కుంకుమ ఆ పూలలోని మకరందం త్రాగడానికి వచ్చిన తుమ్మెద ముఖానికి అంటుకోవడం వలన రంజిల్లి అందగించిందట అందుచేత కృష్ణుడికి ప్రీతిపాత్రం అయిందట.
స్వభావోక్తి (జాతి గుణ శ్రేయాదుల వలన దాని గుణం వర్ణించండం) - - తుమ్మెద పూలను చేరు ధర్మాన్ని చెప్పుట వలన . . .
తమ నాథుడి అన్యా సాంగత్య భావంతో కలతచెందిన గోపికలు దూతగా తుమ్మెదను ఎన్నుకోవడం భ్రమర శబ్దం ఎన్నుకోవడం ఎంతో రసరమ్యంగా ఉంది.


రోలంబేశ్వర! నీకు దౌత్యము మహారూఢంబు; నీ నేరుపుల్
చాలున్;మచ్చరణాబ్జముల్ విడువు మస్మన్నాథపుత్రాదులన్
లీలంబాసి పరంబు డించి తనకున్ లీనత్వముం బొందు మ
మ్మేలాపాసె విభుండు? ధార్మికులు మున్నీచందముల్ మెత్తురే.

టీకా:

రోలంబ = తుమ్మెదల{రోడ్బ అంటే ఉన్మాదం, అంబచ్ అంటే కలది కనుక మకరందాలు మిక్కిలిగా త్రాగి మదించేది తుమ్మెద రోలంబము.}; ఈశ్వర = రాజా; నీవు = నీ; కున్ = కు; దౌత్యము = రాయబారము చేయుట; మహా = మిక్కలి; రూఢంబు = అలవాటున్నది; నీ = నీ యొక్క; నేరుపుల్ = చమత్కారములు; చాలున్ = ఇక చాలు; మత్ = మా యొక్క; చరణ = పాదములనెడి; అబ్జముల్ = పద్మములను; విడువుము = వదులు; అస్మత్ = మా యొక్క; నాథ = పెనిమిటి; పుత్ర = కొడుకులు; ఆదులన్ = మున్నగువారిని; లీలన్ = అలక్ష్యముగా; పాసి = విడిచి; పరంబున్ = పరలోక సద్గతిని; డించి = వదలి; తన = అతని; కున్ = కి; లీనత్వమున్ = ఐక్యమును; పొందు = చెందెడి; మమ్మున్ = మమ్ములను; ఏలా = ఎందుకు; పాసెన్ = దూరమయ్యెను; విభుండు = ప్రభువు; ధార్మికులు = ధర్మమున నిష్ఠకలవారు; మున్ను = ఇంతకు పూర్వము; ఈ = ఈ; చందముల్ = విధములను; మెత్తురే = మెచ్చుదురా, మెచ్చరు.

భావము:

ఓ తుమ్మెదలరాయుడా! రాయబారం నడపటంలో నీవు చాల గడసరివేలే. నీ నేర్పులు ఇకచాలు. మా చరణపద్యాలను వదలిపెట్టు. మా భర్త, పుత్రాదులను చులకన తలచి పరిత్యజించి, సద్గతిమాట తలపెట్టక తనతో లీనమై ఉన్న మమ్మల్ని ప్రభువు ఎందుకు విడిచిపెట్టాడు? ఇలాంటి వర్తనలు ధర్మాత్ములు మెచ్చుకుంటారా?

రోలంబము – (ఆంధ్రశబ్దరత్నాకరము - - - లోడ్భ – ఉన్మాదే, లోడ + అంబచ్ –మత్తిల్లునది, తుమ్మెద) (మధువు గ్రోలి మత్తిలునది, తుమ్మెద) (ఇంతకీ మత్తిల్లినది మకరందారసాస్వాదనులా, భక్తిరసాస్వాదనులా?)

దౌత్యము పంపుడానికి నెపంగా ఎన్నుకున్న తుమ్మెదనే దౌత్యానికి వచ్చావని ఆరోపించడం లోని చమత్కృతి చక్కగా ఉంది
చరణాబ్జములు - రూపకాలంకారం (ఉపమేయం నందు ఉపమాన ధర్మాన్ని ఆరోపించండం)
లీనత్వముం బొందు మమ్మేలా పాసె విభుండు? ధార్మికులు మున్నీ చందముల్ మెత్తురే దృష్టాంతాలంకారం – (రెండు వాక్యాలు వేరవేరు ధర్మాలు బింబప్రతిబింబ భావంతో చెప్పడం)
అసమాలంకారం (అసమ రూపాల యెడ సంబంధం వర్ణింపబడుట)