పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

వ్యాసములు : శ్రీమానినీచిత్తచోర దండకం

10.1-1236-దం.

    శ్రీమానినీమానచోరా! శుభాకార! వీరా! జగద్ధేతుహేతుప్రకారా! సమస్తంబు నస్తంగతంబై మహాలోలకల్లోల మాలాకులాభీల పాథోనిధిం గూలఁగా బాలకేళీగతిం దేలి నారాయణాఖ్యం బటుఖ్యాతిఁ శోభిల్లు నీ నాభికంజంబులో లోకపుంజంబులం బన్ను విన్నాణి యై మన్న యా బమ్మ యుత్పన్నుఁ డయ్యెం గదా పావ కాకాశ వాతావనీ వార్యహంకార మాయామహామానసాదుల్ హృషీకాదులున్ లోకముల్ లోకబీజంబులున్ నిత్యసందోహమై నీ మహాదేహమం దుల్లసించున్; వసించున్; నశించున్; జడత్వంబు లేకాత్మ యై యొప్పు నీ యొప్పిదం బెల్ల నోచెల్ల; చెల్లన్ విచారింపఁ దారెంత; వారెంత వారైన మాయాదులా మాయతోఁ గూడి క్రీడించు లోకానుసంధాత యౌ ధాత నిర్ణేతయే? నీ కళారాశికిం గొంద ఱంభోజగర్భాదు లధ్యాత్మ లందున్న శేషాధిభూతంబు లందు న్ననేకాధిదైవంబు లందున్ సదా సాక్షివై యుందువంచుం దదంతర్గతజ్యోతి వీశుండ వంచుం ద్రయీపద్ధతిం గొంద ఱింద్రాదిదేవాభిదానంబులన్, నిక్క మొక్కండ వంచున్ మఱిం గొంద ఱారూఢకర్మంబులం ద్రెంచి సంసారముం ద్రుంచి సన్యస్తులై మించి విజ్ఞానచక్షుండ వంచున్, మఱిం బాంచరాత్రానుసారంబునం దన్మయత్వంబుతోఁ గొందఱీ వాత్మ వంచున్, మఱిం గొంద ఱా వాసుదేవాది భేదంబులన్ నల్వురై చెల్వుబాటింతు వంచున్; మఱిన్ నీవు నారాయణాఖ్యుండ వంచున్; శివాఖ్యుండ వంచున్; మఱిం బెక్కుమార్గంబులన్ నిన్ను నగ్గింతు; రెగ్గేమి? యేఱుల్ పయోరాశినే రాసులై కూడు క్రీడన్ విశేషంబు లెల్లన్ విశేషంబులై డింది నీ యం దనూనంబు లీనంబులౌ; నేక రాకేందుబింబంబు కుంభాంతరంభంబులం బింబితంబైన వేఱున్నదే? యెన్ననేలా ఘటాంతర్గతాకాశముల్ దద్ఘటాంతంబులం దేకమౌ రేఖ లోకావధిన్ వీక నే పోకలం బోక; యేకాకివై యుండు; దీశా! కృశానుండు నెమ్మోము, సోముండు భానుండు కన్నుల్ దిశల్ కర్ణముల్ భూమి పాదంబు లంభోనిధుల్ గుక్షి, శల్యంబు లద్రుల్, లతాసాలముల్ రోమముల్, గాలి ప్రాణంబు, బాహుల్ సురేంద్రుల్, ఘనంబుల్ కచంబుల్, నభోవీధి నాభిప్రదేశంబు, రేలుంబగళ్ళున్ నిమేషంబు, లంభోజగర్భుండు గుహ్యంబు, వర్షంబు వీర్యంబు, నాకంబు మూర్ధంబుగా నేకమై యున్న నీమేని దండం బయోజాత గర్భాండముల్ మండితోదుంబరానోకహానేక శాఖా ఫలాపూరి తానంత జంతు ప్రకాండంబు లీలం బ్రసిద్ధోదరాశిస్థ జంతుప్రకారంబుగా నిండి యుండున్; మహారూప! నీ రూపముల్ వెగ్గలం బుగ్గడింపన్; లయాంభోధిలో మీనుమేనన్ విరోధిన్ నిరోధించి సాధించి మున్ వేధకున్ వేదరాశిం బ్రసాదింపవే; ద్రుంపవే కైటభశ్రీమధుం జక్రివై మొత్తవే; యెత్తవే మందరాగంబు రాగంబుతోఁ గూర్మలీలా పరిష్పందివై పందివై మేదినిన్ మీదికిం ద్రోచి దోషాచరుం గొమ్ములన్ నిమ్ములం జిమ్ముచుం గ్రువ్వవే త్రెవ్వవే ఘోరవైరిన్ నృసింహుండవై దండివై, దండి వైరోచనిం జూచి యాచింపవే, పెంపవే మేను బ్రహ్మాండము న్నిండఁ, బాఱుండవై రాజకోటిన్ విపాటింపవే, రాజవై రాజబింబాస్యకై దుర్మదారిన్ విదారింపవే నొంపవే క్రూరులన్ వాసుదేవాది రూపంబులన్, శుద్ధ బుద్ధుండవై వైరిదా రాంతరంగంబుల న్నంతరంగంబులుంగాఁ గరంగింపవే పెంపు దీపింపవే కల్కిమూర్తిం బ్రవర్తించు నిన్నెన్న నేనెవ్వఁడన్ నన్ను మాయావిపన్నున్ విషణ్ణుం బ్రపన్నుం బ్రసన్నుండవై ఖిన్నతం బాపి మన్నింపవే పన్నగాధీశతల్పా! కృపాకల్ప! వందారుకల్పా! నమస్తే నమస్తే నమస్తే నమః.