పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

వ్యాసములు : పురంజనుని కథ

పురంజనుని కథ

కథలో సంఖ్యలు ఉన్న పదాలకు కింద గమనింపులలో అదే సంఖ్యలతో వాటి సంకేతాలు ఉన్నాయి.

(Story of Puranjana from Bhagavatam, is well aplicpble even for today. Hindu scriptures in general, bhagavata narations in particular were written in very fine verses of highest linguistic beauty and complexity both in form and message. Lots of symbolic representations are generally used duly echoing multiple targets. But this is the only one, where in such symbolics are explained there itself directly. That is the specialty of this story)

చాలా కాలం క్రితపు రాజు[1] పురంజనుడు అని ఒకడు ఉన్నాడు. అతడికి అవిఙ్ఞాతుడు[2] అని ఓ ప్రాణ మిత్రుడున్నాడు. ఏం చేస్తాడో తెలియదు కాని, ఈ స్నేహితుడికి అతని గురించి బాగా తెలుసు. అతడు కోరికలు తీర్చుకోడానికి వీలైన పురం[3] కావాలని వెతుక్కుంటూ, భూమండలం అంతా తిరిగేడు. ఎన్నిటినో చూసాడు. ఆఖరికి హిమలయాలకి దక్షిణం వైపున ఒకటి కనిపించింది. ఎంత చక్కగా ఉందో. చక్కగా ఐదు ఆరామాలు[4] ఉన్నాయి. కావలసినవి లోపలికి తెచ్చుకోడానికి, అక్కరలేనివి బయటకు పంపేయడానికి తొమ్మిది ద్వారాలు[5] ఉన్నాయి. అది ఏకపాలక[6], త్రికోష్ట[7], షట్కుల[8] సహితం. అన్ని హంగులు ఉన్నాయి. చాలా బాగుంది కద అనుకున్నాడు.

అదిగో ప్రమదోత్తమ[9] అనే కామిని. భర్త కావాలని వెతుక్కుంటు అటే వస్తోంది. ఆమె కామరూపిణి, నవ యౌవనవతి. ఆమె పదిమంది అనుచరులు[10] వస్తున్నారు. అయిదు తలల సర్పం[11] ఒకటి కాపలా కాస్తోంది. వెంటనే అతనికి ప్రేమ పుట్టేసింది. ఆమెని ఇంతదానివి అంతదానివి అని పొగిడేసేడు, ‘ఓ సుందరి! ఎవరు నువ్వు ఎంతో అందంగా ఉన్నావు. ఈ పురంలో మనిద్దరం కలిసుండి సుఖిద్దాం. రా!’ అని పిలిచాడు. ఆ వీరమోహిని[12] సంతోషించేసింది. అతని మీద ఆమెకి ప్రేమ పుట్టేసింది. ఆమె “మన కులాలు ఏమిటో? గోత్రాలు ఏమిటో? గురువుల పేర్లు ఏమిటో? నీకు తెలియదు, నాకు తెలియదు. ఈ పురం ఎవరు కట్టారో తెలియదు. ఐతేనేంలే, మనిద్దరం ఇక్కడే కలిసుందాం. వీళ్ళంతా నా సఖులు, ఈ ముసలి పాము నే నిద్ర పోతుంటే మెలకువగా ఉండి కాపాలా కాస్తుంది. నా వాళ్ళంతా నాతోనే ఉంటారు సుమా. నీ కంటే ఇష్టమైన వాళ్ళు నాకు ఎవ్వరున్నారు చెప్పు. మరి రావయ్యా! రా! ఇక్కడ గొప్ప గొప్ప విషయ సౌఖ్యాలు, సకల కామ భోగాలు అనుభవించు.” అంది. అలా శతవత్సరకాలం పాటు సమస్త భోగాలు అనుభవిస్తూ ఆ పురంలో కాపురం ఉన్నాడు.

ఆ పురం ఎంతో అద్భుతమైంది. దాని వైభోగమే వైభోగం. దానికి ఉన్న తొమ్మిది ద్వారాలలో తూర్పుకి ఐదు, ఉత్తరదక్షిణాలకి రెండు, పడమరకి రెండు ఉన్నాయి. ఇందులో ఏడు పైన ఉంటే రెండు కింద ఉన్నాయి. వాటిలో విషయాలు అన్ని తెలుసుకొనే అధికారి ఒకడున్నాడు. పురంజనుడు వాటిలో తూర్పుకి ఉన్న ఖద్యోత, హవిర్ముఖి[13] అనే రెండు ద్వారాలు నుంచి విభ్రాజితాలు[14] అనే ఊళ్ళని ద్యుమంతుడు అనే సఖుడితో ఏలుతాడు; నళిని, నాళిని[15] అనే వాటి రెంటి నుంచి నవధూత అనే సఖుడితో సౌరభరూపాలను ఏలతాడు; ముఖద్వారం[16] నుంచి రసఙ్ఞ[17] అనే సఖుడితో ఆపణ బహూదనాలను[18] పొందుతాడు; పితృహూ[19] అనే దక్షిణ ద్వారం లోంచి దక్షిణ రాజ్యాలు, దేవహూ అనే ఉత్తర ద్వారం లోంచి ఉత్తర రాజ్యాలు ఏలుతుంటాడు; ఆసురీ[20] అనే పడమటి ద్వారం లోంచి దుర్మదునితో గ్రామక రాజ్యాలు[21] ఏలతాడు; నిరృతి[22] అనే పడమటి ద్వారంలో లుబ్దకునితో వైశసం[23]ని పొందుతాడు; ఇంకా నిర్వాక్కు, పేశస్కరులు[24] అనే ఇద్దరు గుడ్డివాళ్ళతో గమనం, కరణం అనే పనులు చేస్తాడు. అతను క్షణం కూడా ఎడబాటు లేకుండా భార్యతో కూడి ఉండి ఆ పురంలో జీవిస్తున్నాడు.

ఒకసారి భార్యకి చెప్పకుండా అతడు ఆర్భాటంగా పంచప్రస్థం అనే అడవికి వేటకి వెళ్ళేడు. ఐదు గుర్రాలు[25], ఐదు బంధనాలు[26], రెండు చక్రాలు[27], రెండు యుగాలు[28], మూడు జండాలు[29], ఒక పగ్గం[30], ఒక సారథి[31], ఏడు పైకప్పులు, ఐదు గతిప్రకారాలు. ఒక గూడు, అయిదు ఆయుధాలు, అతి వేగం గల రథం[32] ఎక్కి; బంగారు కవచం[33] ధరించి; అక్షయతూణీరాలు[34] విల్లు ధరించి; పదకొండు మంది సేనాధిపతులతో కూడి బయలు దేరేడు. వేటాడి వేటాడి అలిసిపోయి వచ్చే సరికి భార్య అలకపాన్పు ఎక్కేసింది. ఏం చేస్తాడు పాపం మానవుడు? కాళ్ళు చేతులు పట్టుకు బతిమాలాడు. అంతే ఇద్దరు ఒకటై పోయారు. అలా అలా పిల్లపాపలతో సంసారం పెరిగి పోయింది కాని పాపం తనివి తీరలేదు.

ఈ విధంగా పురంజనుడు దారా పుత్ర పౌత్రాదులతో ఎడతెగని గాఢానురక్తితో కాలం గడుపుతున్నాడు. ఇంతలో చండవేగుడు[35] అనే గంధర్వుడు సిత అసిత[36]లనే మూడొందల అరవైమంది గంధర్వ మిథునాలతో[37] దాడి చేసాడు. పురంజంనుడు చింతాక్రాంతుడు కాసాగాడు. ప్రజ్వారుడు[38] పురాన్ని కాల్చి భయుడనే తన అన్నగారికి ప్రీతి కలిగించాడు. దుర్భగ[39] అనే కాలపుత్రిక, ఏ పురుషుడు వరించని ఆమె, వచ్చి బలవంతంగా ఆక్రమించింది. పురంజనుడు బయటకు గెంటేయబడ్డాడు[40].

ఇది ఎవరి కధ? మనిషి కథ కదా.


- ఊలపల్లి సాంబశివ రావు

గమనింపులు

[1] చాలాకాలం క్రితపు రాజు అంటే జీవాత్మ (internal self - atma) – ఆత్మ శాశ్వతుడు, స్వతంత్రుడు (atma is permanent & independent - king of all days), జన్మని బట్టి పురుషుడు లేదా స్త్రీ కావచ్చు. (but by birth he may be man or woman)

[2] అవిఙ్ఞాతుడు (unperceivable) అంటే భగవంతుడు – (universal atma)

[3] పురం అంటే దేహం – జంతు పక్షి మానవ ఏ జీవిదైనా దేహమే. (Live physical body say human, animal etc.)

[4] పంచారామాలు (five gardens) – పంచేంద్రియార్థా లైన శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధాలు. (sound, touch, shape, taste, smell)

[5] నవద్వారాలు అంటే ముక్కు మున్నగు శరీర రంద్రాలు తొమ్మిది. (the nine openings of body)

[6] ఏకపాలకం – ప్రాణం. (life force – prana)

[7] త్రికోష్టాలు – భూమి, జలం, అగ్ని అనే మూడు. (earth, water and fire)

[8] షట్కులములు – ముక్కు, నాలుక, కన్ను, చెవి, చర్మం, మనస్సు. (6 villages are nose, tongue, eye, ear, skin & mind)

[9] ప్రమదోత్తమ (భార్య / భర్త) అంటే బుద్ధి. (good woman – high lust & arrogant the great – spouse / mind)

[10] పదిమంది అనుచరులు – దశేంద్రియాల వ్యాపారాలు. (the activities of the 10 sensory organs)

[11] ఐదు తలల సర్పం – ఐదు వృత్తులు కల ప్రాణం. (five hooded serpent – 5 greaths udana etc)

[12] వీరమోహిని – అధికమైన మోహానికి స్థానం / వీరత్వాన్ని మోహించు స్త్రీ. (seat of high tempting / fan of bravery)

[13] ఖద్యోత, హవిర్ముఖి – కుడి ఎడమ కన్నులు. (right & left eyes)

[14] విభ్రాజితాలు – ప్రకాశించేవి. (which makes glow)

[15] నళిని, నాళిని – కుడి ఎడమ ముక్కులు. (right & left nostrils)

[16] ముఖద్వారం – నోరు. (mouth)

[17] రసఙ్ఞ – నాలుక. (tongue)

[18] ఆపణ బహూదనాలు – సంభాషణ, పలురకాలైన ఆహారాలు. (the talking & many variety of food)

[19] పితృహూ, దేవహూ – కుడి ఎడమ చెవులు. (right & left ears)

[20] ఆసురీ – శిశ్నం. – (genital)

[21] గ్రామక రాజ్యాలు – కామ భోగాలు. (sensual enjoyments)

[22] నిరృతి – గుదం. (anus)

[23] వైశసం – నరకం. (hell)

[24] నిర్వాక్కు, పేశస్కరులు – కాళ్ళు, చేతులు. (which cannot see & talk – legs & hands)

[25] 5 గుర్రాలు – పంచేంద్రియాలు. (5 horses – 5 sensory organs)

[26] ఐదు బంధనాలు – పంచ ప్రాణాలు. (5 bondages – 5 life airs udana etc)

[27] రెండు చక్రాలు – పాపపుణ్య లు. (virtue & sin)

[28] రెండు యుగాలు – సంవత్సరం / వయస్సు. (year representing age)

[29] మూడు జండాలు – త్రిగుణాలు. (3 flags – 3 traits, satvaguna etc)

[30] పగ్గం – మనస్సు . (rein - conscience)

[31] సారథి – బుద్ధి. (driver - mind)

[32] రథం – దేహం. (chariot - body)

[33] బంగారు కవచం – రజోగుణం. (golden armor – rajo guna)

[34] అక్షయతూణీరాలు – అనంతవాసనాహంకార ఉపాధి.(unlimited vasanas & consequent proudness)

[35] చండవేగుడు – కాలం. (one with dangerous speed – time)

[36] సిత అసిత – పగళ్ళు, రాత్రుళ్ళు (white & black - day & night – treated as couples)

[37] మూడొందల అరవై మంది గంధర్వ మిథునాలు – 360 రోజులు సంవత్సరం (360 gandharva couples – 360 days of year)

[38] ప్రజ్వారుడు – వేగంగా చావును కలిగించే జ్వరం. (high fever – the fever leading to death)

[39] దుర్భగ – మృత్యు దేవత. (Unbearable – godess death)

[40] బయటకు గెంటబడుట – జీవాత్మ దేహాన్ని వదలటం, మరణం (kicked out – jeevatma leaving body; dead)