పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఉల్లేఖనాలు : గజేంద్ర మోక్షణ రహస్యార్థము - ముందు పుటలు.




పోతన తెలుగు భాగవతం గ్రంథంలో గజేంద్ర మోక్షణ వృత్తాంతంలో కథాబలం ఎఁత గట్టిగా ఉంటుందో, సాహితీ విలువల ఔన్నత్యం ఎంత ఉదాత్తంగా ఉంటాయో, అంత స్థాయిలోనూ ఆధ్యాత్మిక సంకేతాలతో అంతర్వాహినిలా తత్వం నడుస్తూ ఉంటుంది. ఈ విషయంలోగ్రంథస్తమైన సమాచారం దొరకడం కష్టం. అదృష్టవశాత్తు ప్రసిద్ధ ప్రవచనకర్త చదువుల వీర్రాజు శర్మ గారి గజేంద్ర మోక్షణ రహస్యార్థము అనే అరుదైన గ్రంథం అందుబాటులో ఉంది. దాని నుండి కొన్ని రహస్యాల వాసనను గ్రహించి నాకు చేతనైనట్లు ఉపయోగించాను.అట్టి సద్గ్రంథమునకు వ్రాయబడిన ముందుమాట మున్నగువాటిని యథాతధంగా లిప్యంతీకరణ చేసి ఇక్కడ ఉల్లేఖిస్తున్నాను. రసజ్ఞులు ఆస్వాదించగలరు. ఇది విజ్ఞులకు మరింత చేరువగా అందించాలనే తపన తప్పించి వారి మేథేహక్కులు భక్షించడం ఉద్దేశం కాదు. ఈ గ్రంథం 1954 లో ప్రచురింపబడింది కనుక మేథోహక్కుల కాలం కూడా గడిచినట్లే అనుకుంటున్నాను.


ఓం
గజేంద్ర మోక్షణ రహస్యార్థము

*

గ్రంథకర్త,
అనుభవ వేదాంత ప్రదర్శక,చదువుల వీర్రాజు శర్మ,
శృంగవరపుకోట.

శ్రీ కృష్ణా ప్రింటింగ్ ప్రెస్.
పాలకొల్లు

1000 కాపీలు
వెల 1 రూపాయి - 8 అణాల - 0 కాణీలు.


(రచయిత ఛాయా చిత్రం)
చ॥
చదువుల వంశవర్దనుఁడ క్ష్మాసురఁడన్ రఘురామచంద్రునిం
పొదవఁగఁ గొల్చు భక్తుఁడ, సముజ్వలతత్వ విశేష ధర్మముల్
సదయులహాయనంగఁ దగు సత్సభలందు నుపన్యసింతు నె
న్బది వడి నీ చరిత్రమిటు వ్రాసితినామము వీర రాజిలన్.



విజ్ఞప్తి

వైరాగ్య పుష్పగుచ్ఛము - భగవద్గీతా దండకము - గీతా ప్రశ్నోత్తరములు -రామగీతార్థము - భూమిపైగల వేదాంతాది గ్రంథములు - రచియించుటకు ముందుగ నేనీ గజేంద్ర మోక్షణమను చరిత్రమునకు, బాహ్య - రహస్య లేక, నధ్యాత్మిక తాత్పర్యములు విశేషముగా వ్రాయుటలో శ్రుతి స్మృతులు సందర్భానుసార ముపయోగించి సృష్టిక్రమముఁ - గాముకుని లక్షణములుఁ - దత్కామజనిత కష్టములు - వాటి నివారణోపయములు - మున్నగునవి యెల్లరకు బోధపడునటులు, పూర్వపక్ష సిద్ధాంతములతో సమకూర్చడమైనది. పాల యందు వెన్నగలదనియు నయ్యది నేయిగా మారగలదనియు నందఱకుఁ దెలిసిన విషయమే, కాని. సక్రమముగాఁ దీసినచే యది వచ్చును గాని లేనినాడది చెడిపోవునటులనే, యీ గ్రంథముఁ జక్కగాఁ చదివినవారికే బోధపడగలదని వేఱే చెప్పనక్కరలేదు. అదిగాకఁ జందోవ్యాకరణాదు లంతగాఁ దెలిసినవాఁడను గాను, గాన నిందేవైనఁ బొరపాటు లగుపడిన, నవి నాకుఁ దెలియపర్చినచో సవరించుకొందును. అంతియే గాక నచ్చటచ్చట నద్వైతమును గూర్చి నే నుపన్యాసము లిచ్చుచుండుటలోఁ బూళ్ళ గ్రామమువా రీ పుస్తక మచ్చు గూర్పింపఁ బ్రోత్సహించి కొంతధన సహాయ మొనర్చి రా తదుపరిఁ బాలకొల్లు రామలింగేశ్వర స్వామి వారి యాలయములో గీతోపన్యాసము లొసంగుచుఁ బ్రస్తావనలోఁ బై గ్రంథమునుగూర్చి ముచ్చటింపఁ తెనాలి తాలూకా వరహాపురం అగ్రహారం వాస్తవ్యులును - ప్రస్తుతము నర్సాపురం తాలూకా దిగమఱ్ఱు గ్రామములోఁ గాపురముండి. పాలకొల్లు రంగమన్నారు పేటలోఁ బా(ఫా)ర్మసీ నేర్పాటుజేసి, తెలుగు వైద్యము నింగ్లీషు వైద్యము నతి నిపుణతతో నొనర్చువారును - శ్రీ వంకమామిడి సాంబయ్యగారి కుమారులు నగు శ్రీ కృష్ణమూర్తి డాక్టరుగారు, మీ పుస్తక మీ పాలకొల్లు గ్రామములోనే యచ్చుపడగల దని హెచ్చరించి రంత, వారి వా క్కమోఘమై యీ గ్రామమునఁ గల మహాభక్తుల సహాయముచేతను శ్రీ కృష్ణమూర్తిగారి మిత్రబృంద సహాయము చేతను శ్రీ పూళ్ళగ్రామీయుల సహాయముచేతను గృష్ణాప్రెస్ వారిచే ముద్రణ పూర్తియైనది గాన శ్రీకృష్ణమూర్తి డాక్టరుగారినిఁ దదితర మహాభక్తు లనేక విధముల నభినందించుచు నన్నీ గ్రామము రప్పించి నటు లొనర్చిన వెలివెల దేవల పంతులుగారికి నీ గ్రంథ విషయములో నాకు సర్వవిధములఁ జేతోడుగా నుండి సంస్కరించిన - ఆయుర్వేద భిషక్ - మహాకవి - కవిసింహ - నల్లా చినకోటయ్య గారికి, బహు దొందఱగా నచ్చుపనిఁ బూర్తిగావించి యొసంగిన తత్కృష్ణా ప్రెస్ మేనేజరు శ్రీ కాకుల వేంకటస్వామి గారికిని, మహాపవిత్రమైన నీ గ్రంధమును భక్తి శ్రద్ధలతోఁ జదివినవారికిని, విన్నవారికిని నఘటనా ఘటన సమర్ధుండగు శ్రీరామచంద్రమూర్తి యష్టైశ్వర్యంబులం జేకూర్చి రక్షించుచుండునుగాక.

శృంగవరపుకోట
3-5-1954
ఇట్లు,
అనుభవ వేదాంత ప్రదర్శక,
చదువుల వీర్రాజుశర్మ