స్తుతులు స్తోత్రాలు : వరుణుని కృష్ణ స్తుతి (శుభ కరం)
వరుణుని కృష్ణ స్తుతి (శుభ కరం)
వచ్చిన మాధవుఁ గనుఁగొని
చెచ్చెర వరుణుండు పూజ చేసి వినతుఁడై
యచ్చుగ నిట్లని పలికెను
"విచ్చేసితి దేవ! నా నివేశంబునకున్,
ఏ విభు పాదపద్మరతు లెన్నఁడు నెవ్వరుఁ బొందలేని పెం
ద్రోవఁ జరింతు రట్టి బుధతోషక! నీ వరుదెంచుటం బ్రమో
దావృత మయ్యెఁ జిత్తము కృతార్థత నొందె మనోరథంబు నీ
సేవఁ బవిత్రభావమునఁ జెందె శరీరము నేఁడు మాధవా!
ఏ పరమేశ్వరున్ జగములిన్నిటిఁ గప్పిన మాయ గప్పఁగా
నోపక పారతంత్ర్యమున నుండు మహాత్మక! యట్టి నీకు ను
ద్దీపిత భద్రమూర్తికి సుధీజన రక్షణవర్తికిం దనూ
తాపము వాయ మ్రొక్కెద నుదారత పోధన చక్రవర్తికిన్.
ఎఱుఁగఁడు వీఁడు నా భటుఁ డొకించుక యైన మనంబులోపలం
దెఱకువ లేక నీ జనకుఁదెచ్చె; దయం గొనిపొమ్ము ద్రోహమున్
మఱవుము నన్ను నీ భటుని మన్నన చేయుము నీదు సైరణన్
వఱలుదుఁ గాదె యో! జనకవత్సల! నిర్మల! భక్తవత్సలా! "
ఇది బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన శ్రీమత్తెలుగు భాగవతాంతర్గత దశమ - పూర్వ స్కంధములోని వరుణుని కృష్ణ స్తుతి అను స్తుతి