స్తుతులు స్తోత్రాలు : సూత కృత స్తుతి (శ్రేయోదాయకం)
సూత కృత స్తుతి (శ్రేయోదాయకం)
సకలగుణాతీతు సర్వజ్ఞు సర్వేశు;
నఖిలలోకాధారు, నాదిదేవుఁ
బరమదయారసోద్భాసితుఁ ద్రిదశాభి;
వందిత పాదాబ్జు వనధిశయను
నాశ్రితమందారు నాద్యంతశూన్యుని;
వేదాంతవేద్యుని విశ్వమయునిఁ
గౌస్తుభ శ్రీవత్స కమనీయవక్షుని;
శంఖ చక్ర గదాసి శార్ఙ్గధరుని
శోభనాకారుఁ బీతాంబరాభిరాము
రత్నరాజితమకుటవిభ్రాజమానుఁ
బుండరీకాక్షు మహనీయ పుణ్యదేహుఁ
దలతు నుతియింతు దేవకీతనయు నెపుడు.
ఇది బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన శ్రీమత్తెలుగు భాగవతాంతర్గత ద్వాదశ స్కంధములోని సూత కృత స్తుతి అను స్తుతి