స్తుతులు స్తోత్రాలు : పృథు చక్రవర్తి చేసిన విష్ణు స్తుతి (సద్భక్తి ప్రదం)
పృథు చక్రవర్తి చేసిన విష్ణు స్తుతి (సద్భక్తి ప్రదం)
“వరదా! యీశ్వర! నిను స
త్పురుషుఁడు దేహాభిమాన భోగములకు నై
వరమెట్లు గోరు నిహసుఖ
వరములు నారకుల కైన వఱలవె చెపుమా.
ఘన మగు దేవ! యీ వరమె కాదు మహాత్మక వాగ్వినిర్గతం
బనఁదగు తావకీన చరణాంబుజ చారు మరందరూపమై
తనరిన కీర్తియున్ విని ముదంబును బొందఁగ లేని మోక్ష మై
నను మదిఁ గోర నొల్ల నఘనాశ! రమేశ! సరోజలోచనా!
అదిగాన పద్మలోచన!
సదమల భవదీయ ఘనయశము వినుటకునై
పదివేల చెవులు కృప ని
మ్మదియే నా యభిమతంబు నగును ముకుందా!
అనఘ! మహాత్మ వాగ్గళితమైన భవత్పద పంకజాత సం
జనిత సుధాకణానిలవశంబున విస్మృ తతత్త్వ మార్గవ
ర్తను లగు దుష్టయోగులకుఁ గ్రమ్మఱఁ దత్త్వముఁ జూపఁజాలు ని
ట్లొనరుట దక్క నన్య వర మొల్లఁ బయోరుహ పత్రలోచనా!
వినుత మంగళ యశోవిభవ! సర్వేశ్వర! ;
యిందిర గుణసంగ్రహేచ్ఛఁ జేసి
యే నీదు శివతరం బైన సత్కీర్తి ని;
నర్థిమై వరియించె నట్టి కీర్తి
కలిత సత్పురుష సంగమము గల్గుచు నుండ;
ధృతినెవ్వఁడేని యాదృచ్ఛికతను
జేసియునొకమాటు చెవులార విన్నవాఁ;
డనయంబును గుణజ్ఞుఁ డయ్యెనేని
విరతి నేరీతి బొందును ధరణిఁ బశువుఁ
దక్కఁ దక్కిన తజ్ఞుండు దనుజ భేది
గాన యుత్సుకమతి నైన యేను లక్ష్మి
కరణి నిన్ను భజింతు; నో! పరమపురుష!
ఇట్లు భవదీయ సేవాతత్పరులమైన యిందిరయు నేను నేక పదార్థాభిలాషం జేసి స్పర్ధమానుల మగుచున్న మా యిద్దఱకును బర్యాయసేవం జేసి కలహంబు లేకుండని;మ్మట్లు గాక భవదీయ చరణ సరోరుహ సేవాసక్త మనోవిస్తారుల మగుటం జేసి యేనయేన మున్ను భజియింతు నను తలంపులం గలహం బయిననుం గానిమ్ము దేవా;" యని వెండియు నిట్లనియె.
“జగదీశ! దేవ! యుష్మత్పద కైంకర్య;
పరతఁ దనర్చు సాగరతనూజ
కృత్యంబునందు నకిల్బిష బుద్ధి నేఁ;
బ్రీతిఁ గోరుట జగన్మాత యైన
యా రమాసతితోడి వైర మవశ్యంబుఁ;
గల్గు నైనను దయాకార! నీవు
దీనవత్సలుఁడవు గాన స్వల్పం బైన;
నధికంబు చేయుదు! వట్లుగాన
భవ్యచరిత! నిజస్వరూపంబునందు
నభిరతుఁడ వైన నీవు నన్నాదరించు
పగిది నిందిర నాదరింపవు మహాత్మ!
భక్తజనలోక మందార! భవవిదూర!
ఇట్లగుటం జేసి సత్పురుషు లైనవారలు నిరస్తమాయాగుణ సముదయంబు గల నిన్ను భజియింతురు; వారలు భవత్పాదానుస్మరణ రూపంబయిన ప్రయోజనంబు దక్క నితర ప్రయోజనంబుల నెఱుంగరు; దేవా! సేవక జనంబులను వరంబులు వేఁడు మని జగద్విమో హనంబు లైన వాక్యంబులు పలుకుదువు; యట్టి భవదీయ వాక్యతంత్రీనిబద్ధులు లోకులు గాకుండిరేని ఫలకాములై కర్మంబుల నెట్టు లాచరింతురు; యీశా! భవదీయ మాయావిమోహితులై జను లేమి కారణంబున నీకంటె నితరంబులఁ గోరుచుందు? రిట్లగుటం జేసి తండ్రి దనంతన బాలహితం బాచరించు నట్లు మాకు నీవ హితాచరణం బాచరింప నర్హుండ" వని పలికిన నాదిరాజర్షి యైన పృథుచక్రవర్తి యర్థవంతంబు లయిన వచనంబులు విని విశ్వద్రష్టయగు నారాయణుండు సంతుష్టాంతరంగుండై యిట్లనియె “మహారాజా! దైవప్రేరితుండవై నా యెడ నిట్టి బుద్ధి గలుగుటం జేసి యచలాచలం బగు భక్తి వొడము; దానిచే దుస్తరం బగు మదీయమాయం దరింతువు; నీవు నాచే నాదిష్టం బగు కృత్యం బప్రమత్తుండ వగుచు నాచరించిన సకల శుభంబులం బొందుదువు; మదీయ భక్తజనంబులు స్వర్గాపవర్గనరకంబులం దుల్యంబులుగా నవలోకింతురు; గావున నీ యధ్యవసాయంబు నట్టిదియ; మఱియు మదీ యాదేశంబున దుస్త్యజం బగు రోషంబును ద్యజించి నా యెడ భక్తి సలిపితివి గాన యదియె నాకుఁ బరమహర్షదం బగు" అని యభినందించి యనుగ్రహించి యతండు గావించు పూజలు గయికొని గమనోన్ముఖుం డయ్యె; అయ్యవసరంబున.
ఇది బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన శ్రీమత్తెలుగు భాగవతాంతర్గత చతుర్థ స్కంధములోని పృథు చక్రవర్తి చేసిన విష్ణు స్తుతి అను స్తుతి