పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తుతులు స్తోత్రాలు : ముందుమాట

ముందు మాట

భాగవతము భగవల్లీలా ప్రథానమైనది. మూలంలో, విభిన్న సందర్భములలో విభిన్న వ్యక్తుల ద్వారా పరమ అద్భుతమైన స్తుతులు అనేకం ఆవిర్భవించాయి. ఆంధ్రీకరించిన జాతీయ మహాకవి సహజ కవి బమ్మెఱ పోతనామాత్యులవారు భక్తి ప్రపత్తులకు మారుపేరు. అపర వ్యాస అవతారుడు. తెలుగులోకి వారి ఘంటంలోనుంచి జాలువారిన ప్రతి స్తుతి అనర్ఘరత్నమే.

పరమ పవిత్ర భాగవత స్తుతులను భక్తులకు ఉపాసనాపరులకు ఉపకరించే రీతిలో 95 స్తుతులతో సంకలనం చేసిన భాగవత గణనాధ్యాయి, ఊలపల్లి సాంబశివ రావు, తెలుగు భాగవత సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, తెలుగు భాగవత ప్రచార సమితి ట్రస్టు వ్యవస్థాపక ట్రస్టీ. ఇకపోతే అభివృద్ధి పరచిన వీరి పుత్రుడు ఫణి కిరణు తెలుగు భాగవతం, భాగవత ఘట్టాలు చరణి గ్రంథాలు, ఐ భాగవత ఆణిముత్యాలు, త్రిభాషానిఘంటువు వంటి ఆండ్రాయిడు, ఐఫోను మొబైల్ ఆప్ లు అభివృద్ధి, ప్రచురణలు చేసారు. తెలుగు భాగవత ప్రచార సమితి ట్రస్టీ.

భారతీయ వాఞ్మయము తాత్విక, ధార్మిక సూత్రాలతో జనజీవనంలో పెనవేసుకున్న సమాజంలో వికసించినది. అట్టి భారతీయ వాఞ్మయమునందు అతృష్కృష్టమైనవి, మూల స్తంభముల వంటివి ఇతిహాస పురాణములు. పరమ ప్రమాణికమైన గ్రంథములుగా ఈనాటికిని చూడబడుతున్నవి. వీనిలో తాత్వికాంశంతోపాటుగా అంతర్లీనంగా భక్తి ప్రవహిస్తూ ఉంటుంది. అందులోనూ మహాభాగవత పురాణం భక్తి ప్రపత్తులకు పెద్దపీట వేసిన గ్రంథరాజము. బమ్మఱ పోతనామాత్యుని గంటం రాపిడికి భక్తి ప్రపత్తులు బాగా మఱుగు పెట్టబడి వజ్ర సదృశంగా భక్తుల మనసులను రంజింపజేస్తున్నాయి. భక్తి సాహిత్యంలో స్తుతులు, స్తోత్రాలు, మంత్రాలు ప్రథానమైనవి, మహిమాన్వితమైనవి. స్తోత్రాలు వాటి ఫలములు అనుభవజ్ఞులైన పెద్దలు చెప్పి అనుసంధానం చేయమని చెప్తారు. . అలా అనుసరించి పాడైనవారు లేరు అన్నది జగమెరిగిన సత్యం. స్తుతులు స్తోత్రాలు వివిధ ప్రక్రియలలో లభ్యమవుతున్నా, పద్యరూపంలో ఉన్నవి ముందునుంచీ బహుళ ప్రచారంలో ఉన్నాయి.

తెలుగు భాగవతము మంత్రపూరితమైది. గాయత్రిని అధికరించినది అని పౌరాణికుల ప్రమాణం. చతుర్విధ పురుషార్థ ఫలప్రదమైనది. భాగవతము మోక్షశాస్త్రంగా ధర్మశాస్త్రంగా కీర్తింపబడే మహా పురాణరాజము. పురాణానుండే ప్రాథమికంగా స్తోత్రాలు బహుళ ప్రాచుర్యం పొందాయి అంటారు. అట్టి భాగవత స్తుతులు కుంతి స్తుతి, భీష్మ స్తుతి, భ్రమర గీతలు, శ్రుతి గీతలు, గజేంద్రుని మొరలు ఇలా ఎన్నో దేని ప్రత్యేకత దానిది. ఇవి భక్తి ప్రపత్తులు పొంగి పొర్లేవీ, తాత్విక విషయభారమైనవి. కొన్ని బహు సరళమైనవి, కొన్ని చాలా ప్రౌఢంగా ఉండేవి. స్తుతి, స్తోత్రాలు ఎలాంటివైనా భగవంతునికి అత్యంత ప్రీతికరమైనవి, భక్తులకు బహుళ ప్రయోజనకర మైనవి. అట్టి అనంతమైన మన స్తోత్ర వాఞ్మయములో మణిపూసలుగా ఈ భాగవత స్తుతులు విరాజిల్లుతున్నాయి. వీటిని వివిధ అవసరాలకు అనుసంధానించడం అన్నది ఎప్పటినుంచో ఉన్నది. అయితే పోతన తెలుగు భాగవత పురణాంతర్గతంగా లభించే స్తుతులు అన్నీ ఒకచోట ఉంటే వాడుకరులకు మిక్కిలి అనుకూలంగా ఉంటుందని ఈ భాగవత స్తుతులు సంకలనం చేయడము అయినది. ఈ 95 స్తుతులు భాగవత స్కంధముల వరుసను అనుసరించి అందించబడ్డాయి. ఆయా స్తుతుల శీర్షిక తోపాటు వాటి పఠన ఫలితమును (పెద్దలు నిర్ణయించిన ప్రకారం) సూచించడమైనది.

ఈ భాగవత స్తుతులు గ్రంథము భక్తకోటికి ఉపకరిస్తుందని, అందరూ ఆ పరమాత్మ కృపకు పాత్రులు కాగలరని అశిస్తుద్దాము.

ఊలపల్లి సాంబశివ రావు

ఓం నమో భగవతే వాసుదేవాయః

సౌజన్యం: తెలుగుభాగవతం.ఆర్గ్ http://telugubhagavatam.org