స్తుతులు స్తోత్రాలు : గర్భస్థ కృష్ణ స్తుతి (భవభయ హరం)
గర్భస్థ కృష్ణ స్తుతి (భవభయ హరం)
సత్యవ్రతుని నిత్యసంప్రాప్త సాధనుఁ;
గాలత్రయమునందు గలుగువాని
భూతంబు లైదును బుట్టుచోటగు వాని;
నైదుభూతంబులం దమరువాని
నైదుభూతంబులు నడఁగిన పిమ్మట;
బరఁగువానిని సత్యభాషణంబు
సమదర్శనంబును జరిపెడువానిని;
ని న్నాశ్రయింతుము; నీయధీన
మాయచేత నెఱుకమాలిన వారలు
పెక్కుగతుల నిన్నుఁ బేరుకొందు;
రెఱుగనేర్చు విబుధు లేకచిత్తంబున
నిఖిలమూర్తు లెల్ల నీవ యండ్రు.
అదియునుం గాక.
ప్రకృతి యొక్కటి పాదు; ఫలములు సుఖదుఃఖ;
ములు రెండు; గుణములు మూఁడు వేళ్ళు;
తగు రసంబులు నాల్గు ధర్మార్థ ముఖరంబు;
లెఱిగెడి విధములై దింద్రియంబు;
లాఱు స్వభావంబు లాశోక మోహాదు;
లూర్ములు; ధాతువులొక్క యేడు;
పైపొరలెనిమిది ప్రంగలు; భూతంబు;
లైదు బుద్ధియు మనోహంకృతులును;
రంధ్రములు తొమ్మిదియుఁ గోటరములు; ప్రాణ
పత్త్రదశకంబు; జీవేశ పక్షియుగముఁ
గలుగు సంసారవృక్షంబు గలుగఁ జేయఁ
గావ నడఁగింప రాజ వొక్కరుఁడ వీవ.
నీదెసఁ దమచిత్తము లిడి
యేదెసలకుఁ బోక గడతు రెఱుక గలుగువా;
రా దూడయడుగు క్రియ నీ
పాదంబను నావకతన భవసాగరమున్.
మంచివారి కెల్ల మంగళ ప్రద లయ్యుఁ
గల్లరులకు మేలుగాని యట్టి
తనువు లెన్నియైనఁ దాల్చి లోకములకు
సేమ మెల్లప్రొద్దు జేయు దీవు.
ఎఱిఁగినవారల మనుచును
గొఱమాలిన యెఱుక లెఱిఁగి కొందఱు నీ పే
రెఱిగియు దలఁపగ నొల్లరు
పఱతు రధోగతుల జాడఁ బద్మదళాక్షా!
నీ వారై నీ దెసఁ దమ
భావంబులు నిలిపి ఘనులు భయవిరహితులై
యే విఘ్నంబులఁ జెందక
నీవఱలెడి మేటిచోట నెగడుదు రీశా!
నినునాలుగాశ్రమంబుల
జనములు సేవింప నఖిల జగముల సత్త్వం
బునుశుద్ధంబును శ్రేయం
బునునగు గాత్రంబు నీవు పొందుదువు హరీ!
నలినాక్ష! సత్త్వగుణంబు నీ గాత్రంబు;
గాదేని విజ్ఞానకలిత మగుచు
నజ్ఞానభేదకం బగు టెట్లు? గుణముల;
యందును వెలుఁగ నీ వనుమతింపఁ
బడుదువు; సత్త్వరూపంబు సేవింపంగ;
సాక్షాత్కరింతువు సాక్షి వగుచు
వాఙ్మనసముల కవ్వలిదైన మార్గంబు;
గలుగు; నీ గుణజన్మకర్మరహిత
మైన రూపును బేరు నత్యనఘబుద్ధు
లెఱుగుదురు; నిన్నుఁ గొల్వ నూహించుకొనుచు
వినుచుఁ దలచుచుఁ బొగడుచు వెలయువాఁడు
భవము నొందఁడు నీ పాద భక్తుఁడగును.
ధరణీభారము వాసెను
బురుషోత్తమ! యీశ! నీదు పుట్టువున; భవ
చ్చరణాంబుజముల ప్రాపున
ధరణియు నాకసముఁ గాంచెదము నీ కరుణన్.
పుట్టువు లేని నీ కభవ! పుట్టుట క్రీడయె కాక పుట్టుటే?
యెట్టనుడున్ భవాదిదశ లెల్లను జీవులయం దవిద్య దాఁ
బుట్టుచు నుండుఁ గాని నినుఁ బుట్టినదింబలెఁ బొంతనుండియుం
జుట్టఁగ లేని తత్క్రియలఁ జొక్కని యెక్కటి వౌదు వీశ్వరా!
గురుపాఠీనమవై, జలగ్రహమవై, కోలంబవై, శ్రీనృకే
సరివై, భిక్షుఁడవై, హయాననుఁడవై, క్ష్మాదేవతాభర్తవై,
ధరణీనాథుడవై, దయాగుణగణోదారుండవై, లోకముల్
పరిరక్షించిన నీకు మ్రొక్కెద; మిలాభారంబు వారింపవే.
ముచ్చిరి యున్నది లోకము
నిచ్చలుఁ గంసాదిఖలులు నిర్దయు లేఁపన్;
మచ్చికఁ గావఁగ వలయును
విచ్చేయుము తల్లికడుపు వెడలి ముకుందా!"
ఇది బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన శ్రీమత్తెలుగు భాగవతాంతర్గత దశమ - పూర్వ స్కంధములోని గర్భస్థ కృష్ణ స్తుతి అను స్తుతి