స్తుతులు స్తోత్రాలు : గర్భస్థ జీవుని స్తుతి (యాతనా హరం)
గర్భస్థ జీవుని స్తుతి (యాతనా హరం)
అనయమును భువనరక్షణ
మునకై స్వేచ్ఛానురూపమునఁ బుట్టెడి వి
ష్ణుని భయవిరహిత మగు పద
వనజయుగం బర్థిఁ గొల్తు వారని భక్తిన్.
అదియునుం గాక; పంచభూత విరహితుఁ డయ్యుం బంచభూత విరచితం బైన శరీరంబు నందుఁ గప్పంబడి యింద్రియ గుణార్థ చిదాభాస జ్ఞానుం డైన నేను.
ఎవ్వఁడు నిఖిల భూతేంద్రియమయ మగు;
మాయావలంబున మహితకర్మ
బద్ధుఁడై వర్తించు పగిది దందహ్యమా;
నంబగు జీవ చిత్తంబు నందు
నవికారమై శుద్ధమై యఖండజ్ఞాన;
మున నుండు వానికి ముఖ్యచరితు
నకు నకుంఠితశౌర్యునకుఁ పరంజ్యోతికి;
సర్వజ్ఞునకుఁ గృపాశాంతమతికిఁ
గడఁగియుఁ బ్రకృతిపురుషుల కంటెఁ బరముఁ
డయిన వానికి మ్రొక్కెద నస్మదీయ
దుర్భరోదగ్ర భీకర గర్భనరక
వేదనలఁ జూచి శాంతిఁ గావించు కొఱకు."
ఇది బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన శ్రీమత్తెలుగు భాగవతాంతర్గత తృతీయ స్కంధములోని గర్భస్థ జీవుని స్తుతి అను స్తుతి