స్తుతులు స్తోత్రాలు : గోపికల తాదాత్మ్యత (మధురభక్తి ప్రదం)
గోపికల తాదాత్మ్యత (మధురభక్తి ప్రదం)
అనుచు మదనోన్మాదచిత్తలై తదాత్మకత్వకంబునఁ గృష్ణు లీలల ననుకరించుచు.
పూతన యై యొక్క పొలఁతి చరింపంగ;
శౌరి యై యొక కాంత చన్నుగుడుచు;
బాలుఁడై యొక భామ పాలకు నేడ్చుచో;
బండి నే నను లేమఁ బాఱఁదన్ను;
సుడిగాలి నని యొక్క సుందరి గొనిపోవ;
హరి నని వర్తించు నబ్జముఖియు;
బకుఁడ నే నని యొక్క పడఁతి సంరంభింపఁ;
బద్మాక్షుఁడను కొమ్మ పరిభవించు;
నెలమి రామకృష్ణు లింతు లిద్దఱు గాఁగ
గోపవత్సగణము కొంద ఱగుదు
రసురవైరి ననుచు నబల యొక్కతె చీరుఁ
బసుల మనెడి సతుల భరతముఖ్య!
"లోకమెల్లఁ గుక్షిలోపల నున్నది
మాధవుండ నేను మాత వీవు
చూడు" మనుచు నొక్క సుందరి యొకతెకు
ముఖము దెఱచి చూపు ముఖ్యచరిత!
"వెన్నలు దొంగిలి తినియెడి
వెన్నుఁడ" నని యొకతె నుడువ వేఱొక్కతె చే
సన్నల యశోద నంచునుఁ
గ్రన్ననఁ గుసుమముల దండఁ గట్టు నిలేశా!
"కాళియఫణి యిది వీరలు
కాళియఫణి సతులు మ్రొక్కఁ గడఁగిరి నే గో
పాలకుమారుఁడ" ననుచును
లీలాగతి నాడు నొక్క లేమ నరేంద్రా!
"తరుణులు గోపకు లందఱు
హరిహయుఁ డిదె వాన గురిసె హరి నే" నని భా
సుర చేలాంచల మొక్కతె
గిరి నెత్తెద ననుచు నెత్తుఁ గెంగేల నృపా!
"మీరలు గోపకు లే నసు
రారిని దావాగ్ని వచ్చె నటు చూడకుఁడీ
వారించెద" నని యొక్కతె
చేరి బయల్ కబళనంబు చేయు నరేంద్రా!
ఇట్లు తన్మయత్వంబున గోపసుందరులు బృందావనంబునం గల తరులతాదుల హరి నడుగుచు, దుర్గమం లయిన విపినమార్గంబుల సరోజాత కేతన హల కులిశ కలశాంకుశాది లక్షణలక్షితంబులై మనోహరంబు లయిన హరిచరణంబుల చొప్పుఁగని తప్పక చెప్పి కొనుచుఁ దమలో నిట్లనిరి.
కొమ్మకుఁ బువ్వులు కోసినాఁ డిక్కడ;
మొనసి పాదాగ్రంబు మోపినాఁడు
సతి నెత్తుకొని వేడ్క జరిగినాఁ డిక్కడఁ;
దృణములోఁ దోపఁదు తెఱవ జాడ
ప్రియకు ధమ్మిల్లంబు పెట్టినాఁ డిక్కడఁ;
గూర్చున్న చొప్పిదె కొమరు మిగులు
నింతికిఁ గెమ్మోవి యిచ్చినాఁ డిక్కడ;
వెలఁది నిక్కిన గతి విశదమయ్యె
సుదతితోడ నీరు చొచ్చినాఁ డిక్కడఁ
జొచ్చి తా వెడలిన చోటు లమరెఁ
దరుణిఁ గాముకేళిఁ దనిపినాఁ డిక్కడఁ
ననఁగి పెనఁగియున్న యంద మొప్పె.
మఱియును.
ఒక యెలనాగ చెయ్యూఁదినాఁ డిక్కడ;
సరస నున్నవి నాల్గు చరణములును
నొక నీలవేణితో నొదిఁగినాఁ డిక్కడ;
మగ జాడలో నిదె మగువ జాడ
యొక లేమ మ్రొక్కిన నురివినాఁ డిక్కడ;
రమణి మ్రొక్కిన చొప్పు రమ్యమయ్యె
నొక యింతి కెదురుగా నొలసినాఁ డిక్కడ;
నన్యోన్యముఖములై యంఘ్రు లొప్పె
నొకతె వెంటఁ దగుల నుండక యేగినాఁ
డడుగుమీఁదఁ దరుణి యడుగు లమరె
నబల లిరుగెలంకులందు రాఁ దిరిగినాఁ
డాఱు పదము లున్నవమ్మ! యిచట.
ఈ చరణంబులే యిందునిభానన! ;
సనకాది ముని యోగ సరణి నొప్పు;
నీ పాదతలములే యెలనాగ! శ్రుతివధూ;
సీమంతవీధులఁ జెన్నుమిగులు;
నీ పదాబ్జంబులే యిభకులోత్తమయాన! ;
పాలేటిరాచూలి పట్టుకొమ్మ;
లీ సుందరాంఘ్రులే యిందీవరేక్షణ! ;
ముక్తికాంతా మనోమోహనంబు;
లీ యడుగల రజమె యింతి! బ్రహ్మేశాది
దివిజవరులు మౌళిదిశలఁ దాల్తు
రనుచుఁ గొంద ఱబల లబ్జాక్షుఁ డేగిన
క్రమముఁ గనియు నతనిఁ గానరైరి.
అప్పుడు.
పతుల దైన్యంబును భామల క్రౌర్యంబుఁ;
జూపుచు విభుఁ డొక్క సుదతితోడ
విహరింప నది యెల్ల వెలఁదుల వర్జించి;
"నా యొద్దనున్నాఁడు నాథుఁ" డనుచు
గర్వించి రాఁ జాలఁ "గమలాక్ష! మూఁపున;
నిడుకొను" మనుఁడు న య్యీశ్వరుండు
మొఱఁగి పోయినఁ దాపమును బొంది "యో! కృష్ణ! ;
యెక్కడఁ జనితి ప్రాణేశ! రమణ!
నీకు వరవుడ నయ్యెద నిలువు" మనుచు
వగవఁ గొందఱు కాంతలా వనితఁ జూచి
"వరుఁడు మన్నింప గర్వించి వనజనేత్ర
చిక్కె నేఁ" డని వెఱఁగును జెంది రపుడు.
మఱియును.
"ఈ పొదరింటిలో నిందాఁకఁ గృష్ణుండు;
నాతోడ మన్మథనటన మాడె
నియ్యోల మగుచోట నిందాఁకఁ జెలువుండు;
గాఢంబుగా నన్నుఁ గౌఁగలించె
నీ మహీజము నీడ నిందాఁక సుభగుండు;
చిట్టంటు చేతల సిగ్గుగొనియె
నీ పుష్పలత పొంత నిందాఁక దయితుండు;
నను డాసి యధరపానంబు చేసె
నీ ప్రసూనవేది నిందాఁక రమణుండు
కుసుమ దామములను గొప్పుఁ దీర్చె"
ననుచుఁ గొంద ఱతివ లంభోజనయనుని
పూర్వలీలఁ దలఁచి పొగడి రధిప!
అని యిబ్బంగి లతాంగు లందఱును బృందారణ్య మం దీశ్వరున్
వనజాక్షుం బరికించి కానక విభున్ వర్ణించుచుం బాడుచున్
మనముల్ మాటలుఁ జేష్ఠలుం గ్రియలు న మ్మానాథుపైఁ జేర్చి వే
చని ర య్యామున సైకతాగ్రమునకున్ సంత్యక్త గేహేచ్ఛలై.
ఇది బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన శ్రీమత్తెలుగు భాగవతాంతర్గత దశమ - పూర్వ స్కంధములోని గోపికల తాదాత్మ్యత అను స్తుతి