స్తుతులు స్తోత్రాలు : బ్రహ్మకృత హరిస్తుతి
బ్రహ్మకృత హరిస్తుతి
బ్రహ్మకృత హరిస్తుతి
1
Your browser does not support the audio element.
ఎవ్వని మాయకు నింతయు మోహించుఁ;
దఱమి యెవ్వని మాయ దాఁట రాదు;
తన మాయ నెవ్వఁ డింతయు గెల్చినట్టివాఁ;
డెవ్వనిఁ బొడగాన రెట్టి మునులు;
సర్వభూతములకు సమవృత్తి నెవ్వఁడు;
చరియించుఁ దనచేత జనితమయిన;
ధరణి పాదములు చిత్తము సోముఁ డగ్ని ము;
ఖంబు గన్నులు సోమకమలహితులు;
చెవులు దిక్కులు; రేతంబు సిద్ధజలము;
మూఁడు మూర్తులపుట్టిల్లు; మొదలి నెలవు
గర్భమఖిలంబు; మూర్థంబు గగన మగుచు;
మలయు నెవ్వఁడు వాని నమస్కరింతు.
2
Your browser does not support the audio element.
మఱియు నెవ్వని బలంబున మహేంద్రుండును; బ్రసాదంబున దేవతలును; గోపంబున రుద్రుండును; బౌరుషంబున విరించియు; నింద్రియంబులవలన వేదంబులును మునులును; మేఢ్రంబునఁ బ్రజాపతియును; వక్షంబున లక్ష్మియు; ఛాయవలనఁ బితృదేవతలును; స్తనంబులవలన ధర్మంబును; బృష్ఠంబువలన నధర్మంబును; శిరంబువలన నాకంబును; విహాసంబువలన నప్సరోజనంబులును; ముఖంబువలన విప్రులును; గుహ్యంబున బ్రహ్మంబును; భుజంబులవలన రాజులును బలంబును; నూరువులవలన వైశ్యులును నైపుణ్యంబును; బదంబులవలన శూద్రులును నవేదంబును; నధరంబున లోభంబును; పరిరదచ్ఛదనంబువలన బ్రీతియు; నాసాపుటంబువలన ద్యుతియు; స్పర్శంబునఁ గామంబును; భ్రూయుగళంబున యమంబును; బక్షంబునఁ గాలంబును సంభవించె; నెవ్వని యోగ మాయావిహితంబులు ద్రవ్యవయః కర్మగుణ విశేషంబులు; చతుర్విధ సర్గం బెవ్వని యాత్మతంత్రం; బెవ్వనివలన సిద్ధించి లోకంబులును లోకపాలురును బ్రతుకుచుందురు పెరుగుచుందురు; దివిజులకు నాయువు నంధంబు బలంబునై జగంబులకు నీశుండై ప్రజలకుఁ బ్రజనుండై ప్రజావన క్రియాకాండ నిమిత్త సంభవుండగు జాతవేదుం డై; యంతస్సముద్రంబున ధాతుసంఘాతంబులం బ్రపచించుచు బ్రహ్మమయుండై; ముక్తికి ద్వారంబై; యమృత మృత్యు స్వరూపుండై; చరాచరప్రాణులకుఁ బ్రాణంబై; యోజస్సహోబల వాయురూపంబులైన ప్రాణేంద్రి యాత్మ శరీర నికేతనుండై పరమ మహాభూతి యగు నప్పరమేశ్వరుండు మాకుం బ్రసన్నుండగుం గాక" యని మఱియును.
3
Your browser does not support the audio element.
మొదల జల మిడిన భూజము
దుది నడుమను జల్లదనము దొరకొను మాడ్కిన్
మొదలను హరికిని మ్రొక్కిన
ముద మొందుదు మెల్ల వేల్పుమూకలు నేమున్.
4
Your browser does not support the audio element.
ఆపన్నులగు దిదృక్షుల
కో! పుణ్య! భవన్ముఖాబ్జ మొయ్యన తఱితోఁ
బ్రాపింపఁ జేయు సంపద
నో! పరమదయానివాస! యుజ్జ్వలతేజా!
ఇది బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన శ్రీమత్తెలుగు భాగవతాంతర్గత అష్టమ స్కంధములోని బ్రహ్మకృత హరిస్తుతి అను స్తుతి