స్తుతులు స్తోత్రాలు : భీష్మస్తుతి (భక్తి ప్రదం)
భీష్మస్తుతి (భక్తి ప్రదం)
ఆలాపంబులు మాని చిత్తము మనీషాయత్తముం జేసి దృ
గ్జాలంబున్ హరిమోముపైఁ బఱపి తత్కారుణ్యదృష్టిన్ విని
ర్మూలీభూత శరవ్యధా నిచయుఁడై మోదించి భీష్ముండు సం
శీలం బొప్ప నుతించెఁ గల్మషగజశ్రేణీహరిన్ శ్రీహరిన్.
ఇట్లు పీతాంబరధారియుఁ జతుర్భుజుండు నాదిపూరుషుండు బరమేశ్వరుండు నగు హరియందు నిష్కాముండై విశుద్ధం బగు ధ్యానవిశేషంబుచే నిరస్తదోషుఁ డగుచు ధారణావతియైన బుద్ధిని సమర్పించి, పరమానందంబు నొంది ప్రకృతివలన నైన సృష్టిపరంపరలఁ బరిహరించు తలపున మందాకినీ నందనుం డిట్లనియె.
"త్రిజగన్మోహన నీలకాంతిఁ దను వుద్దీపింపఁ బ్రాభాత నీ
రజబంధుప్రభమైన చేలము పయిన్ రంజిల్ల నీలాలక
వ్రజ సంయుక్త ముఖారవింద మతిసేవ్యంబై విజృంభింప మా
విజయుం జేరెడు వన్నెలాఁడు మది నావేశించు నెల్లప్పుడున్.
హయరింఖాముఖ ధూళి ధూసర పరిన్యస్తాలకోపేతమై
రయజాతశ్రమ తోయబిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో
జయముం బార్థున కిచ్చువేడ్క నని నాశస్త్రాహతిం జాల నొ
చ్చియుఁ బోరించు మహానుభావు మదిలోఁ జింతింతు నశ్రాంతమున్.
నరుమాటల్ విని నవ్వుతో నుభయసేనామధ్యమక్షోణిలో
బరు లీక్షింప రథంబు నిల్పి పరభూపాలావళిం జూపుచుం
బరభూపాయువు లెల్లఁ జూపులన శుంభత్కేళి వంచించు నీ
పరమేశుండు వెలుంగుచుండెడును హృత్పద్మాసనాసీనుఁడై.
తనవారిఁ జంపఁజాలక
వెనుకకుఁ బో నిచ్చగించు విజయుని శంకన్
ఘన యోగవిద్యఁ బాపిన
మునివంద్యుని పాదభక్తి మొనయున్ నాకున్.
కుప్పించి యెగసినఁ గుండలంబుల కాంతి;
గగనభాగం బెల్లఁ గప్పికొనఁగ;
నుఱికిన నోర్వక యుదరంబులో నున్న;
జగముల వ్రేఁగున జగతి గదలఁ;
జక్రంబుఁ జేపట్టి చనుదెంచు రయమునఁ;
బైనున్న పచ్చనిపటము జాఱ;
నమ్మితి నాలావు నగుఁబాటు సేయక;
మన్నింపు మని క్రీడి మరలఁ దిగువఁ;
గరికి లంఘించు సింహంబుకరణి మెఱసి
నేఁడు భీష్మునిఁ జంపుదు నిన్నుఁ గాతు
విడువు మర్జున యనుచు మద్విశిఖ వృష్టిఁ
దెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు.
తనకున్ భృత్యుఁడు వీనిఁ గాఁచుట మహాధర్మంబు వొమ్మంచు న
ర్జునసారథ్యము పూని పగ్గములు చేఁ జోద్యంబుగాఁ బట్టుచున్
మునికోలన్ వడిఁ బూని ఘోటకములన్ మోదించి తాడించుచున్
జనులన్మోహము నొందఁ జేయు పరమోత్సాహుం బ్రశంసించెదన్.
పలుకుల నగవుల నడపుల
నలుకల నవలోకనముల నాభీరవధూ
కులముల మనముల తాలిమి
కొలుకులు వదలించు ఘనునిఁ గొలిచెద మదిలోన్.
మునులు నృపులుఁ జూడ మును ధర్మజుని సభా
మందిరమున యాగమండపమునఁ
జిత్రమహిమతోడఁ జెలువొందు జగదాది
దేవుఁ డమరు నాదు దృష్టియందు.
ఒక సూర్యుండు సమస్తజీవులకుఁ దా నొక్కొక్కఁడై తోఁచు పో
లిక నే దేవుఁడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జ
న్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానావిధానూన రూ
పకుఁడై యొప్పుచునుండు నట్టి హరి నేఁ బ్రార్థింతు శుద్ధుండనై."
ఇది బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన శ్రీమత్తెలుగు భాగవతాంతర్గత ప్రథమ స్కంధములోని భీష్మస్తుతి అను స్తుతి