స్తుతులు స్తోత్రాలు : శివజ్వరం చేసిన కృష్ణస్తుతి (జ్వర హరం)
శివజ్వరం చేసిన కృష్ణస్తుతి (జ్వర హరం)
"అవ్యయు ననఘు ననంతశక్తిని బరు;
లయినట్టి బ్రహ్మ రుద్రామరేంద్ర
వరుల కీశ్వరుఁ డైనవాని సర్వాత్మకు;
జ్ఞానస్వరూపు సమానరహితు
వరదుని జగదుద్భవస్థితి సంహార;
హేతుభూతుని హృషీకేశు నభవు
బ్రహ్మచిహ్నంబులై పరఁగు సుజ్ఞాన శ;
క్త్యాదుల నొప్పు బ్రహ్మంబు నీశు
నజు షడూర్మిరహితు నిజయోగమాయా వి
మోహితాఖిలాత్ము ముఖ్యచరితు
మహితతేజు నాదిమధ్యాంతహీనునిఁ
జిన్మయాత్ము నిను భజింతుఁ గృష్ణ!
అదియునుం గాక లోకంబున దైవం బనేక ప్రకారంబులై యుండు; నది యెట్టిదనినం గళాకాష్ఠాముహూర్తంబులనంగల కాలంబును, సుకృత దుష్కృతానుభవ రూపంబు లైన జీవకర్మంబులును స్వభావంబును, సత్త్వరజస్తమోగుణాత్మకంబైన ప్రకృతియును, సుఖదుఃఖాశ్రయంబైన శరీరంబును, జగజ్జంతు నిర్వాహకంబైన ప్రాణంబును, సకలపదార్థ పరిజ్ఞాన కారణం బైన యంతఃకరణంబును, మహదహంకార శబ్ద స్పర్శ రూప రస గంధ తన్మాత్ర తత్కార్యభూత గగన పవ నానల సలిల ధరాది పంచభూతంబు లాదిగాఁ గల ప్రకృతి వికారంబులును, నన్నింటి సంఘాతంబును, బీజాంకుర న్యాయంబునం గార్యకారణరూప ప్రవాహంబును నై, జగత్కారణ శంకితం బై యుండు; నది యంతయు భవదీయ మాయా విడంబనంబు గాని యున్నయది కాదు; తదీయ మాయానివర్తకుండవైన నీవు నానావిధ దివ్యావతారాదిలీలలం జేసి దేవగణంబులను, సత్పురుషులను, లోకనిర్మాణచణులైన బ్రహ్మాదులను బరిరక్షించుచు లోకహింసాప్రవర్తకులైన దుష్టమార్గ గతులం గ్రూరాత్ముల హింసించుచుందువు; విశ్వ విశ్వంభరాభార నివారణంబు సేయుటకుఁ గదా భవదీయ దివ్యావతార ప్రయోజనంబు; గావున నిన్ను శరణంబు వేఁడెద.
శాంతమై మహితతీక్ష్ణ సుదుస్సహంబై యు;
దారమై వెలుగొందు తావకీన
భూరిభాస్వత్తేజమునఁ దాప మొందితిఁ;
గడుఁ గృశించితి, నన్ను గరుణఁజూడు
మితరదేవోపాస్తిరతి మాని మీ పాద;
కమలముల్ సేవించు విమలబుద్ధి
యెందాక మది దోఁప దందాఁకనే కదా;
ప్రాణులు నిఖిలతాపములఁ బడుట?
యవిరళానన్యగతికుల నరసి ప్రోచు
బిరుదుగల నీకు ననుఁ గాచు టరుదె? దేవ!
ప్రవిమలాకార! సంసారభయవిదూర!
భక్తజనపోషపరితోష! పరమపురుష!"
ఇది బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన శ్రీమత్తెలుగు భాగవతాంతర్గత దశమ - ఉత్తర స్కంధములోని శివజ్వరం చేసిన కృష్ణస్తుతి అను స్తుతి