స్తుతులు స్తోత్రాలు : దేవహూతి చేసిన కపిల స్తుతి (జ్ఞావ ప్రదం)
1
"అనయంబు విను, మింద్రియార్థ మనోమయం-
బును భూతచయ మయంబును నశేష
భూరి జగద్బీజభూతంబును గుణప్ర-
వాహ కారణమును వలనుమెఱయు
నారాయణాభిఖ్యనాఁ గల భవదీయ-
దివ్యమంగళమూర్తిఁ దేజరిల్లు
చారు భవద్గర్భసంజాతుఁ డగునట్టి-
కమలగర్భుండు సాక్షాత్కరింప
2
లేక మనమునఁ గనియె ననేక శక్తి
వర్గములు గల్గి సుగుణప్రవాహరూప
మంది విశ్వంబు దాల్చి సహస్రశక్తి
కలితుఁడై సర్వకార్యముల్ కలుగఁజేయు.
3
అంత.
4
అతుల భూరి యుగాంతంబు నందుఁ గపట
శిశువవై యొంటి కుక్షినిక్షిప్త నిఖిల
భువననిలయుండవై మహాంభోధి నడుమ
జారు వటపత్రతల్పసంస్థాయి వగుచు.
5
లీల నాత్మీయ పాదాంగుళీ వినిర్గ
తామృతము గ్రోలినట్టి మహాత్మ! నీవు
గడఁగి నా పూర్వభాగ్యంబు కతన నిపుడు
పూని నా గర్భమున నేడు పుట్టితయ్య!
6
అట్టి పరమాత్ముండ వయిన నీవు.
7
వరుస విగ్రహపారవశ్యంబునను జేసి-
రఘురామ కృష్ణ వరాహ నార
సింహాది మూర్తు లంచితలీల ధరియించి-
దుష్టనిగ్రహమును శిష్టపాల
నమును గావించుచు నయమున సద్ధర్మ-
నిరతచిత్తులకు వర్ణింపఁ దగిన
చతురాత్మతత్త్వ విజ్ఞానప్రదుండవై-
వర్తింతు వనఘ! భవన్మహత్త్వ
8
మజున కయినను వాక్రువ్వ నలవిగాదు
నిగమజాతంబు లయిన వర్ణింప లేవ
యెఱిఁగి సంస్తుతి చేయ నే నెంతదాన
వినుత గుణశీల! మాటలు వేయునేల?
9
అదియునుం గాక.
10
ధీమహిత! భవన్మంగళ
నామస్మరణానుకీర్తనము గల హీనుల్
శ్రీమంతు లగుదు రగ్ని
ష్టోమాదికృదాళికంటె శుద్ధులు దలఁపన్.
11
అదియునుం గాక.
12
నీ నామస్తుతి శ్వపచుం
డైనను జిహ్వాగ్ర మందు ననుసంధింపన్
వానికి సరి భూసురుఁడుం
గానేరఁడు చిత్రమిది జగంబుల నరయన్.
13
ఈ విధ మాత్మలం దెలిసి యెప్పుడు సజ్జనసంఘముల్ జగ
త్పావనమైన నీ గుణకథామృత మాత్మలఁ గ్రోలి సర్వ తీ
ర్థావళిఁ గ్రుంకినట్టి ఫలమందుదు రంచు సమస్త వేదముల్
వావిరిఁ బల్కుఁ గావునను వారలు ధన్యులు మాన్యు లుత్తముల్.
14
అదిగావునఁ; బరబ్రహ్మంబవును, బరమపురుషుండవును, బ్రత్యఙ్మనో విభావ్యుండవును, సమస్తజన పాపనివారక స్వయంప్రకాశుండవును, వేదగర్భుండవును, శ్రీమహావిష్ణుడవును నగు నీకు వందనంబు లాచరించెదను"అని స్తుతించినం బరమపురుషుండును, మాతృ వత్సలుండును నగు కపిలుండు గరుణారసార్ద్రహృదయకమలుం డై జనని కిట్లనియె.
15
ఇతి బమ్మెఱ పోతనామాత్య కృత శ్రీమత్తెలుగు భాగవత తృతీయ స్కంధ అంతర్గత దేవహూతి చేసిన కపిల స్తుతి (జ్ఞావ ప్రదం)