స్తుతులు స్తోత్రాలు : :: మత్య్య స్తుతి::
సత్యదేవ మహారాజ కృత మత్స్యావతారుని స్తుతి (దయా ప్రదం)
1
"ఒక దినంబున శతయోజనమాత్రము-
విస్తరించెదు నీవు; వినము చూడ
మిటువంటి ఝషముల నెన్నఁడు నెఱుఁగము-
మీనజాతుల కిట్టి మేను గలదె?
యేమిటి కెవ్వఁడ? వీ లీలఁ ద్రిప్పెదు-
కరుణ నాపన్నులఁ గావ వేఁడి
యంభశ్చరంబైన హరివి నే నెఱిఁగితి-
నవ్యయ! నారాయణాభిధాన!
2
జనన సంస్థితి సంహార చతురచిత్త!
దీనులకు భక్తులకు మాకు దిక్కు నీవ;
నీదు లీలావతారముల్ నిఖిలభూత
భూతి హేతువుల్ మ్రొక్కెదఁ బురుషవర్య!
3
ఇతరులముఁ గాము చిత్సం
గతులము మా పాలి నీవుఁ గలిగితి భక్త
స్థితుఁడవగు నిన్ను నెప్పుడు
నతి చేసినవాని కేల నాశముఁ గలుగున్.
4
శ్రీలలనాకుచవేదికఁ
గేళీపరతంత్రబుద్ధిఁ గ్రీడించు సుఖా
లోలుఁడవు దామసాకృతి
నేలా మత్స్యంబ వైతి వెఱిఁగింపు హరీ!"
5
ఇతి బమ్మెఱ పోతనామాత్య కృత శ్రీమత్తెలుగు భాగవత అష్టమ స్కంధ అంతర్గత సత్యదేవ మహారాజ కృత మత్స్యావతారుని స్తుతి (దయా ప్రదం)