స్తుతులు స్తోత్రాలు : :: విష్ణుచక్ర స్తుతులు::
అంబరీషకృత విష్ణుచక్ర స్తోత్రము (సంకట విమోచనము)
1
"నీవ పావకుఁడవు; నీవ సూర్యుండవు-
నీవ చంద్రుండవు; నీవ జలము;
నీవ నేలయు; నింగి నీవ; సమీరంబు-
నీవ; భూతేంద్రియ నికర మీవ;
నీవ బ్రహ్మంబును; నీవ సత్యంబును-
నీవ యజ్ఞంబును; నీవ ఫలము;
నీవ లోకేశులు; నీవ సర్వాత్మయు-
నీవ కాలంబును; నీవ జగము;
2
నీవ బహుయజ్ఞభోజివి; నీవ నిత్య
మూలతేజంబు; నీకు నే మ్రొక్కువాఁడ
నీరజాక్షుండు చాల మన్నించు నట్టి
శస్త్రముఖ్యమ! కావవే చాలు మునిని.
3
హరిచే నీవు విసృష్టమై చనఁగ మున్నాలించి నీ ధారలన్
ధరణిన్ వ్రాలుట నిక్కమంచు మునుపే దైత్యేశ్వరవ్రాతముల్
శిరముల్ పాదములున్ భుజాయుగళముల్ చేతుల్ నిజాంగంబులం
దురులన్ బ్రాణసమీరముల్ వదలు నీ యుద్ధంబులం జక్రమా!
4
కలఁగి నిద్రపోవఁ గలలోన వచ్చిన
నిన్నుఁ జూచి దీర్ఘనిద్ర పోదు
రసురవరులు శయ్యలం దున్న సతులు ప్ర
భాతమందు లేచి పలవరింప.
5
చీఁకటిఁ బాపుచున్ వెలుఁగు జేయుచు సజ్జనకోటినెల్ల స
శ్రీకను జేయు నీరుచులు చెల్వుగ ధర్మసమేతలై నినున్
వాకున నిట్టి దట్టిదని వర్ణన చేయ విధాత నేరఁ డ
స్తోకము నీదు రూపు గలదుం దుది లేదు పరాత్పరాద్యమై.
6
కమలలోచనుండు ఖలుల శిక్షింపంగఁ
బాలు చేయ నీవు పాలు పడితి
వైన నింకఁజాలు నాపన్నుఁడై యున్న
తపసిఁ గావు మీవు ధర్మవృత్తి."
7
ఇతి బమ్మెఱ పోతనామాత్య కృత శ్రీమత్తెలుగు భాగవత నవమ స్కంధ అంతర్గత అంబరీషకృత విష్ణుచక్ర స్తోత్రము (సంకట విమోచనము)