స్తుతులు స్తోత్రాలు : సనకాదుల హరి స్తుతి (భగవదనుగ్రహ ప్రదం)
1
"వనజదళాక్ష! భక్తజనవత్సల! దేవ! భవత్సుతుండు మ
జ్జనకుఁడు నైన పంకరుహజాతుడు మాకు రహస్య మొప్పఁ జె
ప్పిన భవదీయ మంగళగభీరపరిగ్రహ విగ్రహంబు మే
మనయముఁ జూడఁ గంటిమి కృతార్థులమై తగ మంటి మీశ్వరా!
2
దేవ! దుర్జనులకు భావింప హృదయ సం-
గతుఁడవై యుండియుఁ గానఁబడవు
కడఁగి నీ దివ్యమంగళవిగ్రహంబున-
జేసి సమంచితాశ్రితుల నెల్లఁ
జేఁకొని సంప్రీతచిత్తులఁగాఁజేయు-
దతిశయ కారుణ్యమతిఁ దనర్చి
కమలాక్ష! సర్వలోకప్రజాధిప! భవ-
త్సందర్శనాభిలాషానులాప
3
విదిత దృఢభక్తియోగ ప్రవీణు లగుచు
నర్థిమై వీతరాగు లైనట్టి యోగి
జనమనః పంకజాత నిషణ్ణమూర్తి
వని యెఱుంగుదురయ్య! నిన్నాత్మ విదులు.
4
యుక్తిం దలఁప భవద్వ్యతి
రిక్తము లైనట్టి యితర దృఢకర్మంబుల్
ముక్తిదము లయిన నీ పద
భక్తులు తత్కర్మములను బాటింప రిలన్.
5
కావున గీర్తనీయ గతకల్మష మంగళ తీర్థ కీర్తి సు
శ్రీవిభవప్రశస్త సుచరిత్రుఁడ వైన భవత్పదాబ్జ సే
వా విమలాంతరంగ బుధవర్గ మనర్గళభంగి నన్యమున్
భావమునం దలంచునె కృపాగుణభూషణ! పాపశోషణా!
6
పరమతపో విధూత భవపాపులమై చరియించు మాకు నేఁ
డరయ భవత్పదాశ్రితుల నల్గి శపించిన భూరి దుష్కృత
స్ఫురణ నసత్పథైక పరిభూతులమై నిజధర్మహానిగా
నిరయము నొందఁగావలసె నేరము వెట్టక మమ్ముఁ గావవే.
7
కరమనురక్తి షట్పదము గమ్రసుగంధమరందవాంఛచేఁ
దరమిడి శాతకంటకవృతస్ఫుటనవ్యతరప్రసూనమం
జరులను డాయు పోల్కిని భృశంబగు విఘ్నములన్ జయించునీ
చరణసరోజముల్గొలువ సమ్మతి వచ్చితిమయ్య కేశవా!
8
అలరు భవత్పదాంబుజ యుగార్పితమై పొలుపొందునట్టి యీ
తులసి పవిత్రమైనగతిఁ దోయజనాభ! భవత్కథాసుధా
కలితములైన వాక్కుల నకల్మషయుక్తిని విన్నఁ గర్ణముల్
విలసిత లీలమై భువిఁ బవిత్రములై విలసిల్లు మాధవా!
9
మహిత యశోవిలాసగుణమండన! సర్వశరణ్య! యింద్రియ
స్పృహులకుఁ గానరాక యతసీ కుసుమద్యుతిఁ నొప్పుచున్న నీ
సహజ శరీర మిప్పుడు భృశంబుగఁ జూచి మదీయ దృక్కు లిం
దహహ కృతార్థతం బొరసె నచ్యుత! మ్రొక్కెద మాదరింపవే."
10
ఇతి బమ్మెఱ పోతనామాత్య కృత శ్రీమత్తెలుగు భాగవత తృతీయ స్కంధ అంతర్గత సనకాదుల హరి స్తుతి (భగవదనుగ్రహ ప్రదం)