పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తుతులు స్తోత్రాలు : శ్రీనాథనాథా -మహదాదుల హరి స్తుతి దండకం (భవ దుఃఖ హరం)

  1
శ్రీనాథనాథా! జగన్నాథ! నమ్రైకరక్షా! విపక్షక్షమాభృత్సహస్రాక్ష! నీరేజ పత్రేక్షణా! దేవదేవా! భవద్దాస వర్గానుతాపంబులం బాపఁగా నోపు దివ్యాతపత్రంబునాఁ బొల్చు యుష్మత్పదాంభోజ మూలంబు పుణ్యాల వాలంబుగాఁ బొంది యోగీంద్రు లుద్దామ సంసారతాపంబులం బోవఁగా మీటి వర్తింతురో తండ్రి! ఈశా! సమస్తాఘ నిర్ణాశ! ఈ విశ్వమం దెల్ల జీవుల్ భవోదగ్ర దుర్వార తాపత్రయాభీల దావాగ్నిచేఁ గ్రాగి దుఃఖాబ్ధిలోఁ దోఁగి యేకర్మమున్ ధర్మముం బొందఁగా లేక సంసారచక్రంబు నందుం బరిభ్రామ్యమాణాత్ములై యుందు; రమ్మూఢ చేతస్కులం జెప్పఁగా నేల యో దేవ! విజ్ఞానదీపాంకురం బైన మీ పాదపంకేరుహచ్ఛాయఁ బ్రాపింతు మబ్జాక్ష! సన్మౌని సంఘంబు లైకాంతికస్వాంతతం బేర్చి దుర్దాంత పాపౌఘ నిర్ణాశకాంబుప్రవాహాభ్ర గంగానివాసంబుగాఁ నొప్పు నీ పాద యుగ్మంబు యుష్మన్ముఖాంభోజ నీడోద్గతం బైన వేదాండజశ్రేణిచేతం గవేషించి సంప్రాప్తులై యుందు; రో నాథ! వైరాగ్యశక్తిస్ఫుటజ్ఞాన బోధాత్ములైనట్టి ధీరోత్తముల్ నిత్య నైర్మల్య భవ్యాంతరంగంబు లందే పరంజ్యోతి పాదాబ్జపీఠంబు గీలించి కైవల్యసంప్రాప్తులై రట్టి నిర్వాణమూర్తిం బ్రశంసింతు మింద్రాదివంద్యా! ముకుందా సమస్తంబుఁ గల్పింపఁ బాలింపఁ దూలింపఁగాఁ బెక్కు దివ్యావతారంబులం బొందు నీ పాద పంకేరుహధ్యాన పారీణ సుస్వాంతులై యొప్పు భక్తావళిన్ మోక్షదం బైన నీ పాదకంజాతముల్ కొల్తు; మీశా! రమాధీశ! పుత్రాంగనా మిత్ర సంబంధ బంధంబులం జెంది నిత్యంబు దుష్టక్రియాలోలురై దేహగేహంబులం దోలి వర్తించు దుర్మానవశ్రేణు లందంతరాత్ముండవై యుండియున్ దూరమై తోఁచు నీ పాదపద్మంబు లర్చింతు; మో దేవ! బాహ్యేంద్రియవ్యాప్తి నుద్వృత్తు లైనట్టి మూఢాత్ము లధ్యాత్మ తత్త్వప్రభావాఢ్యులై నీ పదాబ్జాత విన్యాస లక్ష్మీకళావాసముం గన్న యయ్యుత్తమశ్లోకులం గానఁగాఁజాల రప్పుణ్యు లా దుష్టులం జూడఁగా నొల్లరంభోధిరాట్కన్యకాకాంత వేదాంత శుద్ధాంత సిద్ధాంతమై యొప్పు నీ సత్కథాసార చంచత్సుధాసార పూరంబులం గ్రోలి సౌఖ్యోన్నతిన్ సోలి ధీయుక్తులై వ్రాలి తాపంబులం దోలి మోదంబులం దేలి సంపన్నులై మన్న నిత్యప్రసన్నుల్ మహోత్కంఠతం బేర్చి వైకుంఠధామంబు నల్పక్రియాలోలురై కాంతు రద్దివ్యవాసైక సంప్రాప్తికిం గోరుచున్నార; మో దేవ! వైరాగ్యవిజ్ఞాన భోధాత్మ యోగక్రియా రూఢి నంతర్బహిర్వ్యాప్తిఁ జాలించి శుద్ధాంతరంగంబుఁ గావించి హృత్పద్మ వాసుండ వై చిన్మయాకారమై యున్న నీ యున్న తానంత తేజో విలాసోల్లసన్మూర్తిఁ జిత్తంబు లం జేర్చి యానంద లోలాత్మతం బొల్చు యోగీశ్వరశ్రేణికిం దావకీ నానుకంపానులబ్ధస్ఫుటజ్ఞానముం గల్గుటం జేసి యాయాసముం జెంద; రో దేవతాచక్రవర్తీ! సదానందమూర్తీ! జగద్గీతకీర్తీ! లసద్భూతవర్తీ! భవద్దాసు లైనట్టి మమ్మున్ జగత్కల్పనాసక్త చిత్తుండవై నీవు త్రైగుణ్య విస్ఫూర్తిఁ బుట్టించినం బుట్టుటేకాక నీ దివ్య లీలానుమేయంబుగా సృష్టి నిర్మాణముం జేయ నేమెంతవారౌదు మీ శక్తి యుక్తిన్ భవత్పూజ గావింతు; మట్లుండె నీ సత్కళాజాతు లైనట్టి మమ్మెన్నఁగా నేల నధ్యాత్మ తత్త్వంబ వన్నం బరం జ్యోతి వన్నం బ్రపంచంబ వన్న న్నధిష్ఠాత వన్నన్ సదాసాక్షి వన్నన్ గుణాతీత! నీవే కదా పద్మపత్రాక్ష! సత్వాది త్రైగుణ్య మూలంబునా నొప్పు మాయాగుణం బందు నుద్యన్మహా తత్త్వ మైనట్టి నీ వీర్యముం బెట్టుటం జేసి నీ వింతకుం గారణం బౌదు; నాయాయి కాలంబులన్నీకు సౌఖ్యంబు లేమెట్లు గావింతు; మేరీతి నన్నంబు భక్షింతు; మెబ్భంగి వర్తింతు; మే నిల్కడన్నుందు; మీ జీవలోకంబె యాధారమై యుండి భోగంబులం బొందుచున్నున్న యిక్కార్య సంధాను లైనట్టి మాకుం జగత్కల్పనా శక్తికిన్ దేవ! నీ శక్తిఁ దోడ్పాటు గావించి విజ్ఞానముం జూపి కారుణ్య సంధాయివై మమ్ము రక్షింపు లక్ష్మీమనః పల్వలక్రోడ! యోగీంద్ర చేతస్సరో హంస! దేవాదిదేవా! నమస్తే! నమస్తే! నమః!

  2
ఇతి బమ్మెఱ పోతనామాత్య కృత శ్రీమత్తెలుగు భాగవత తృతీయ స్కంధ అంతర్గత శ్రీనాథనాథా -మహదాదుల హరి స్తుతి దండకం (భవ దుఃఖ హరం)