స్తుతులు స్తోత్రాలు : శివకృత విష్ణు స్తుతి (సర్వ శ్రేయో కరం)
1
"దేవ! జగన్మయ! దేవేశ! జగదీశ! ;
కాలజగద్వ్యాపకస్వరూప!
యఖిల భావములకు నాత్మయు హేతువు-
నైన యీశ్వరుఁడ వాద్యంతములకు
మధ్యంబు బహియును మఱి లోపలయు లేక-
పూర్ణమై యమృతమై భూరిసత్య
మానంద చిన్మాత్ర మవికార మాద్య మ-
నన్య మశోకంబు నగుణ మఖిల
2
సంభవస్థితిలయముల దంభకంబు
నైన బ్రహ్మంబు నీవ; నీ యంఘ్రియుగము
నుభయ సంగ విసృష్టులై యున్నమునులు
గోరి కైవల్యకాములై కొల్తు రెపుడు.
3
భావించి కొందఱు బ్రహ్మంబు నీ వని-
తలపోసి కొందఱు ధర్మ మనియుఁ
జర్చించి కొందఱు సదసదీశ్వరుఁడని-
సరవిఁ గొందఱు శక్తి సహితుఁ డనియుఁ
జింతించి కొందఱు చిరతరుం డవ్యయుఁ-
డాత్మతంత్రుఁడు పరుం డధికుఁ డనియు
దొడరి యూహింతురు తుది నద్వయద్వయ-
సదసద్విశిష్ట సంశ్రయుఁడ వీవు;
4
తలఁప నొక్కింత వస్తుభేదంబుఁ గలదె
కంకణాదులు బసిఁడి యొక్కటియ కాదె?
కడలు పెక్కైన వార్థి యొక్కటియ కాదె?
భేద మంచును నిను వికల్పింప వలదు.
5
యద్విలాసము మరీచ్యాదు లెఱుంగరు-
నిత్యుఁడ నై యున్న నేను నెఱుఁగ
యన్మాయ నంధులై యమరాసురాదులు-
వనరెద రఁట! యున్నవారలెంత?
యే రూపమునఁ బొంద కేపారుదువు నీవు-
రూపివై సకలంబు రూపుచేయ
రక్షింపఁ జెఱుపఁ గారణమైన సచరాచ-
రాఖ్యమై విలసిల్లు దంబరమున
6
ననిలుఁ డే రీతి విహరించు నట్ల నీవు
గలసి వర్తింతు సర్వాత్మకత్వ మొప్ప;
జగములకు నెల్ల బంధమోక్షములు నీవ
నీవ సర్వంబుఁ దలపోయ నీరజాక్ష!
7
ఇతి బమ్మెఱ పోతనామాత్య కృత శ్రీమత్తెలుగు భాగవత అష్టమ స్కంధ అంతర్గత శివకృత విష్ణు స్తుతి (సర్వ శ్రేయో కరం)