స్తుతులు స్తోత్రాలు : బ్రహ్మదేవుని విష్ణుతత్త్వ స్తుతి. (భవభయ తారకం)
1
"రారా బుధులు; విరక్తులు
గారా; యీ రీతి నడుగఁగా నేరరు; వి
స్మేరావహము భవన్మత
మౌరా! నా విభుని మర్మమడిగితి వత్సా!
2
నానా స్థావరజంగమప్రకరముల్ నా యంత నిర్మింప వి
జ్ఞానం బేమియు లేక తొట్రుపడ నిచ్చన్ నాకు సర్వానుసం
ధానారంభ విచక్షణత్వము మహోదారంబు గా నిచ్చె ము
న్నే నా యీశ్వరు నాజ్ఞఁ గాక జగముల్ నిర్మింప శక్తుండనే?
3
అనఘా! విశ్వము నెల్ల దీప్తముగఁ జేయన్ నే సమర్థుండనే?
యిన చంద్రానల తారకా గ్రహగణం బే రీతి నా రీతి నె
వ్వని దీప్తిం బ్రతిదీప్తమయ్యె భువనవ్రాతంబు దద్ధీప్తిచే
ననుదీప్తం బగునట్టి యీశ్వరున కే నశ్రాంతమున్ మ్రొక్కెదన్.
4
వినుమీ; యీశ్వరు దృష్టిమార్గమున నావేశింప శంకించి సి
గ్గున సంకోచము నొందు మాయవలనం గుంఠీభవత్ప్రజ్ఞచే
నను లోకేశ్వరుఁ డంచు మ్రొక్కు మతిహీనవ్రాతముం జూచి నే
ననిశంబున్ నగి ధిక్కరింతు హరిమాయాకృత్య మంచున్ సుతా!
5
మఱియు దేహంబునకు ద్రవ్యంబులైన మహాభూతంబులును జన్మనిమిత్తంబులైన కర్మంబులునుఁ, గర్మక్షోభకంబైన కాలంబునుఁ, గాలపరిణామ హేతువైన స్వభావంబును, భోక్త యైన జీవుండును, వాసుదేవుండ కా నెఱుంగుము; వాసుదేవ వ్యతిరిక్తంబు లేదు; సిద్ధంబు నారాయణ నియమ్యంబులు లోకంబులు దేవతలు నారాయణశరీరసంభూతులు; వేద యాగ తపోయోగ విజ్ఞానంబులు నారాయణ పరంబులు జ్ఞానసాధ్యం బగు ఫలంబు నారాయణు నధీనంబు; కూటస్థుండును సర్వాత్మకుండును సర్వద్రష్టయు నయిన యీశ్వరుని కటాక్ష విశేషంబున సృజియింపంబడి ప్రేరితుండనై సృజ్యంబైన ప్రపంచంబు సృజించుచుండుదు; నిర్గుణుండైన యీశ్వరుని వలన రజస్సత్త్వతమోగుణంబులు ప్రభూతంబులై యుత్పత్తి స్థితిలయంబులకుం బాలుపడి కార్య కారణ కర్తృత్వ భావంబు లందు ద్రవ్యంబులైన మహాభూతంబులును జ్ఞానమూర్తు లయిన దేవతలును గ్రియారూపంబు లయిన యింద్రియంబులును నాశ్రయంబులుగా నిత్యముక్తుం డయ్యును మాయాసమన్వితుండైన జీవుని బంధించు; జీవునకు నావరణంబులయి యుపాధిభూతంబు లయిన మూఁడు లింగంబులు సేసి పరులకు లక్షితంబుగాక తనకు లక్షితంబైన తత్వంబుగల యీశ్వరుం డివ్విధంబున గ్రీడించుచుండు.
6
ఆ యీశుఁడ నంతుఁడు హరి
నాయకుఁ డీ భువనములకు, నాకున్, నీకున్,
మాయకుఁ బ్రాణివ్రాతము
కీ యెడలన్ లేద యీశ్వరేతరము సుతా!
7
వినుము మాయావిభుండైన యీశ్వరుండు దన మాయం జేసి దైవయోగంబునం బ్రాప్తంబులయిన కాలజీవాదృష్ట స్వభావంబులు వివిధంబులు సేయ నిశ్చయించి కైకొనియె; నీశ్వరాధిష్ఠితం బైన మహత్తత్త్వంబు వలన నగు కాలంబున గుణవ్యతికరంబును స్వభావంబునఁ బరిణామంబును జీవాదృష్టభూతంబయిన కర్మంబున జన్మంబును నయ్యె; రజస్సత్త్వంబులచే నుపబృంహితంబై వికారంబు నొందిన మహత్తత్త్వంబు వలనం దమఃప్రధానంబై ద్రవ్య జ్ఞాన క్రియాత్మకంబగు నహంకారంబు గలిగె; నదియు రూపాంతరంబు లొందుచు ద్రవ్యశక్తి యైన తామసంబునుఁ గ్రియాశక్తి యైన రాజసంబును జ్ఞానశక్తి యైన సాత్వికంబును నన మూఁడు విధంబు లయ్యె; నందు భూతాది యైన తామసాహంకారంబు వలన నభంబు కలిగె; నభంబునకు సూక్ష్మరూపంబు ద్రష్టృదృశ్యములకు బోధకంబైన శబ్దంబు గుణంబగు; నభంబువలన వాయువు గలిగె; వాయువునకుం బరాన్వయంబున శబ్దంబు స్పర్శంబు నను రెండు గుణంబులు గలిగి యుండు; నది దేహంబు లం దుండుటం జేసి ప్రాణరూపంబై యింద్రియ మనశ్శరీరపాటవంబునై యోజస్సహోబలంబులకు హేతువై వర్తించు; వాయువు వలన రూప స్పర్శ శబ్దంబు లనియెడు గుణంబులుఁ మూఁటితోడఁ తేజంబుఁ గలిగె; దేజంబు వలన రస రూప స్పర్శ శబ్దంబు లనియెడి నాలుగు గుణంబులతోడ జలంబు గలిగె; జలంబు వలన గంధ రస రూప స్పర్శ శబ్దంబు లనియెడు గుణంబు లయిదింటితోడం బృథివి గలిగె; వైకారికంబైన సాత్త్వికాహంకారంబు వలనఁ జంద్రదైవతంబయిన మనంబు గలిగె; మఱియు దిక్కులును వాయువును నర్కుండును బ్రచేతసుండును నాశ్వినులును వహ్నియు నింద్రుండు నుపేంద్రుండును మిత్రుండునుఁ బ్రజాపతియు ననియెడి దశదేవతలు గలిగిరి; తైజసంబైన రాజసాహంకారంబు వలన దిగ్దైవతంబైన శ్రవణేంద్రియంబును, వాయుదైవతంబైన త్వగింద్రియంబును, సూర్యదైవతంబైన నయనేంద్రియంబును, ప్రచేతోదైవతంబైన రసనేంద్రియంబును, నశ్విదైవతంబైన ఘ్రాణేంద్రియంబును, వహ్నిదైవతంబైన వాగింద్రియంబును, ఇంద్రదైవతంబైన హస్తేంద్రియంబును నుపేంద్రదైవతంబైన పాదేంద్రియంబును, మిత్రదైవతంబైన గుదేంద్రియంబును బ్రజాపతి దైవతంబైన గుహ్యేంద్రియంబును ననియెడి దశేంద్రియంబులును బోధజనకాంతఃకరణైక భాగంబయిన బుద్ధియుఁ గ్రియాజనకాంతఃకరణంబయిన ప్రాణంబునుం గలిగె; నిట్టి శ్రోత్రాదులగు దశేంద్రియంబులతోఁ గూడిన భూతేంద్రియ మనో గుణంబులు వేర్వేఱుగఁ బ్రహ్మాండ శరీరనిర్మాణంబునం దసమర్థంబు లగునపుడు గృహ నిర్మాణంబునకుం బెక్కు పదార్థంబులు సంపాదించినంగాని చాలని చందంబున భూతేంద్రియ మనోగుణంబుల వలన గృహంబు కైవడి భగవచ్ఛక్తి ప్రేరితంబులగుచు నేకీభవించిన సమిష్టి వ్యష్టాత్మకత్వంబు నంగీకరించి చేతనాచేతనంబులం గల బ్రహ్మాండంబు కల్పితం బయ్యె; నట్టి యండంబు వర్షాయుత సహస్రాంతంబు దనుక జలంబు నందుండెఁ; గాల కర్మ స్వభావంబులం దగులువడక సమస్తంబును జీవయుక్తంబుగఁ జేయు నీశ్వరుం డచేతనంబును సచేతనంబునుగ నొనర్చె; నంతఁ గాల కర్మ స్వభావ ప్రేరకుండయిన పరమేశ్వరుండు జీవరూపంబున మహావరణ జలమధ్య స్థితంబయిన బ్రహ్మాండంబులోను సొచ్చి సవిస్తారంబు గావించి యట్టి యండంబు భేదించి నిర్గమించె; నెట్లంటేని.
8
భువనాత్మకుఁ డా యీశుఁడు
భవనాకృతితోడ నుండు బ్రహ్మాండంబున్
వివరముతోఁ బదునాలుఁగు
వివరంబులుగా నొనర్చె విశదంబులుగన్
9
బహు పా దోరు భు జాన నేక్షణ శిరఃఫాలశ్రవోయుక్తుఁడై
విహరించున్ బహుదేహి దేహగతుఁడై; విద్వాంసు లూహించి త
ద్బహురూపావయవంబులన్ భువనసంపత్తిన్ విచారింతు; రా
మహనీయాద్భుతమూర్తి యోగిజన హృన్మాన్యుండు మేధానిధీ!
10
వినుము; చతుర్దశ లోకంబులందు మీఁది యేడు లోకంబులు శ్రీమహావిష్ణువునకుం గటి ప్రదేశంబున నుండి యూర్ధ్వదేహమనియునుఁ, గ్రింది యేడు లోకంబులు జఘనంబునుండి యధోదేహ మనియునుం, బలుకుదురు; ప్రపంచశరీరుండగు భగవంతుని ముఖంబువలన బ్రహ్మకులంబును, బాహువులవలన క్షత్రియకులంబును, నూరువులవలన వైశ్యకులంబునుఁ, బాదంబులవలన శూద్రకులంబును, జనియించె నని చెప్పుదురు; భూలోకంబు గటిప్రదేశంబు; భువర్లోకంబు నాభి; సువర్లోకంబు హృదయంబు; మహర్లోకంబు వక్షంబు; జనలోకంబు గ్రీవంబు; తపోలోకంబు స్తనద్వయంబు; సనాతనంబును బ్రహ్మనివాసంబునునైన సత్య లోకంబు శిరంబు; జఘనప్రదేశం బతలంబు; తొడలు విత లంబు; జానువులు సుతలంబు; జంఘలు తలాతలంబు; గుల్ఫంబులు మహాతలంబు; పాదాగ్రంబులు రసాతలంబు; పాదతలంబు పాతాళంబు నని లోకమయుంగా భావింతురు; కొందఱు మఱియుం బాదతలంబువలన భూలోకంబును నాభివలన భువర్లోకంబును; శిరంబున స్వర్లోకంబును; గలిగె నని లోకకల్పనంబు నెన్నుదురు; పురుషోత్తముని ముఖంబు వలన సర్వ జంతు వాచాజాలంబును, తదధిష్ఠాత యగు వహ్నియు నుదయించె; చర్మరక్తమాంసమేదశ్శల్యమజ్జాశుక్లంబులు సప్తధాతువు లని యందురు; పక్షాంతరంబున రోమ త్వఙ్మాంసాస్థి స్నాయు మజ్జా ప్రాణంబును సప్తధాతువు లని యందురు. అందు రోమంబు లుష్టి క్ఛందం బనియుఁ, ద్వక్కు ధాత్రీ ఛందం బనియు, మాంసంబు త్రిష్టు ప్ఛందం బనియు, స్నాయు వనుష్టు చ్ఛందం బనియు, నస్థి జగతీ ఛందంబనియు, మజ్జ పంక్తి చ్ఛందం బనియుఁ, బ్రాణంబు బృహతీ ఛందం బనియు, నాదేశింతురు; హవ్య కవ్యామృతాన్నంబులకు మధురాది షడ్రసంబులకు రసనేంద్రియంబునకు రసాధీశ్వరుండైన వరుణునికిని హరి రసనేంద్రియంబు జన్మస్థానంబు; సర్వ ప్రాణాదులకు వాయువునకు విష్ణునాసికా వివరంబు నివాసంబు; సమీప దూర వ్యాపి గంధంబులకు నోషధులకు నశ్విదేవతలకు భగవంతుని ఘ్రాణేంద్రియంబు నివాసంబు; దేవలోక సత్యలోకంబులకుఁ దేజంబునకు సూర్యునకు సకల చక్షువులకు లోకలోచనుని చక్షురింద్రియంబు స్థానంబు; దిశలకు నాకాశంబునకు శ్రుతి భూతంబులైన యంశంబులకు శబ్దంబునకు సర్వేశ్వరుని కర్ణేంద్రియంబు జన్మస్థానంబు; వస్తుసారంబులకు వర్ణనీయసౌభాగ్యంబులకుఁ బరమపురుషుని గాత్రంబు భాజనంబు; స్పర్శంబునకు వాయువునకు సకల స్నిగ్ధత్వంబునకు దివ్యదేహుని దేహేంద్రియంబు గేహంబు; యూప ప్రముఖ యజ్ఞోపకరణసాధనంబులగు తరుగుల్మలతాదులకుఁ బురుషోత్తముని రోమంబులు మూలంబులు; శిలాలోహంబులు సర్వమయుని నఖంబులు; మేఘజాలంబులు హృషీకేశుని కేశంబులు; మెఱుంగులు విశ్వేశ్వరుని శ్మశ్రువులు; భూర్భువస్సువర్లోక రక్షకు లైన లోకపాలకుల పరాక్రమంబులకు భూరాదిలోకంబుల క్షేమంబునకు శరణంబునకు నారాయణుని విక్రమంబులు నికేతనంబులు; సర్వకామంబులకు నుత్తమంబులైన వరంబులకుఁ దీర్థపాదుని పాదారవిందంబు లాస్పదంబులు; జలంబులకు శుక్లంబునకుఁ బర్జన్యునకుఁ బ్రజాపతి సర్గంబునకు సర్వేశ్వరుని మేఢ్రంబు సంభవనిలయంబు; సంతానమునకుఁ గామాది పురుషార్థంబులకుఁ జిత్తసౌఖ్యరూపంబు లగు నానందంబులకు శరీరసౌఖ్యంబునకు నచ్యుతుని యుపస్థేంద్రియంబు స్థానంబు; యమునికి మిత్రునికి మలవిసర్గంబునకు భగవంతుని పాయ్వింద్రియంబు భవనంబు; హింసకు నిరృతికి మృత్యువునకు నిరయంబునకు నిఖిలరూపకుని గుదంబు నివాసంబు; పరాభవంబునకు నధర్మంబునకు నవిద్యకు నంధకారంబునకు ననంతుని పృష్ఠభాగంబు సదనంబు; నదనదీ నివహంబునకు నీశ్వరుని నాడీ సందోహంబు జన్మమందిరంబు; పర్వతంబులకు నధోక్షజుని శల్యంబులు జనకస్థలంబులు; ప్రధానంబునకు నన్నరసంబునకు సముద్రంబులకు భూతలయంబునకు బ్రహ్మాండ గర్భుని యుదరంబు నివేశంబు; మనోవ్యాపారరూపంబగు లింగశరీరంబునకు మహామహిముని హృదయంబు సర్గభూమి యగు మఱియును.
11
నీలకంధరునకు నీకు నాకు సనత్కు
మార ముఖ్య సుతసమాజమునకు
ధర్మ సత్త్వ బుద్ధి తత్త్వములకు నీశ్వ
రాత్మ వినుము పరమమైన నెలవు.
12
నర సురాసుర పితృ నాగ కుంజర మృగ-
గంధర్వ యక్ష రాక్షస మహీజ
సిద్ధ విద్యాధర జీమూత చారణ-
గ్రహ తారకాప్సరోగణ విహంగ
భూత తటిద్వస్తు పుంజంబులును నీవు-
ముక్కంటియును మహామునులు నేను
సలిలనభస్థ్సలచరములు మొదలైన-
వివిధ జీవులతోడి విశ్వమెల్ల
13
విష్ణుమయము పుత్ర! వేయేల బ్రహ్మాండ
మతని జేనలోన నడఁగి యుండు;
బుద్ధి నెఱుఁగరాదు భూతభవద్భవ్య
లోకమెల్ల విష్ణులోన నుండు.
ఈ క్రింది యధిక పాఠము మూలమున “సోమృతస్యాభయస్య” అనుట మొదలుకొని, “పురుషస్తాభయాశ్రయః” అనువఱకు గల నాలుగు శ్లోకములకును వానికి శ్రీధరులు రచించిన వ్యాఖ్యానమునకునుఁ దెనుఁగై యీ ఘట్టమున నుండవలసినదియే. అయిన నిది పెక్కు వ్రాఁతప్రతులను నచ్చుప్రతులనుఁ గాన రాదు. ఒకానొక వ్రాఁతప్రతి యందే చూపట్టుచున్నది. మఱియుఁ బోతన మూలమున శ్రీధరవ్యాఖ్యాన సహితముగాఁ దెనిగించినవాఁడు. కనుకఁ క్రింది నాలుగు శ్లోకములు పోతనకు లభించిన మూలమున లేకుండవచ్చు నని తలంచినను వాని వ్యాఖ్యానము నం దైనను దప్పక కనుపట్టి యుండును. గాన వానినిఁ దెనిఁగింపకుండడు. అయిన నీ తెనిఁగింపు పోతన దాని యంత సమంజసమును బ్రౌఢమును గాకున్నది. వెలిగందల నారయ కవిత్వ మిందును గొంత చేరి యుండుననియుఁ గనుకనే యిది పోతన రచన వలె సమంజసమును బ్రౌఢమును గాదయ్యె ననియు నూహింపఁ దగి యున్నది. - తంజనగరము - తేవప్పెరుమాల్లయ్య వారి ప్రచురణ
3) 2-91/1-క.
ఏదోనొకకర్మఫల
ప్రాదుర్భావ మగు లోక పాలన కే
కా దేవుం డభయప్రతి
పాదక మగు మోక్షమునకుఁ బతి యె ట్లన్నన్.
4) 2-91/2-వ.
వినుము, పరమాత్మయు నానందేశ్వరుం డ(డున)గు నవ్విష్ణునకుఁ బ్రపంచమాత్రాధికత్వం బేమి యద్భుత మ ట్లగుటంజేసి, యతని మహిమాతిశయం బస్మదాదులు నెఱుంగనేర్తురె, స్థిత్యర్థపాదుం డగు నీశ్వరుని పాదాంశంబు లందు భూభువస్సువర్లోకంబులు గుదురుకొని యుండుఁ. దదీయ విలయ సమయంబునం దదుపరి మహర్లోకంబు దపియింప నందుఁ గల జనంబు లంతరాళంబు నందక మహర్లోకశిరఃస్థానం బైన జనలోకంబుఁ బ్రవేశించి యత్యంతం బగు నవినాశి సుఖంబు లనుభవింతురు. తపోలోకంబు సంకర్షణానల శక్తిచేత నధస్త్రిలోకంబులుం దందహ్యమానంబు లగు నప్పుడు తదూష్మలం జెందక విలక్షం బై, క్షేమంబు గలిమిఁ దజ్జనం బంద సుఖించు. జన్మజరామరణభయంబులు లేక ముక్తికిఁ బ్రత్యాసన్ను లగుటం జేసి సత్యలోకపువాసు లంద యానందింతురు. భూభువస్సువర్లోకంబు లవ్విరాట్పురుషుని పద స్థలం బగుట నేక పాద్విభూతి యయ్యె. మహర్లోకంబు మధ్యమవిభూతి యన నమరె. జన తపో సత్య లోకంబు లమ్మహాపురుషుని శిరఃస్థానంబు గావున, నది త్రిపాద్విభూతి యనంబడుఁ. దదీయ లోకంబు బ్రహ్మచర్య వానప్రస్థ యతులకు దక్క నితరుల కసాధ్యంబు. గృహస్థు లయ్యు నితర త్రివిధాశ్రమధర్మంబులు గలిగినం జేకుఱు. క్షేత్రజ్ఞుం డైన పురుషుండు స్వర్గాపవర్గ హేతుభూతం బైన దక్షిణోత్తర కర్మ జ్ఞాన మార్గంబులు సృజించి యంతయుఁ దాన యై యుండు.
14
మండలములోన భాస్కరుఁ
డుండి జగంబులకు దీప్తి నొసఁగెడి క్రియ బ్ర
హ్మాండములోపల నచ్యుతుఁ
డుండుచు బహిరంతరముల నొగి వెలిఁగించున్.
15
అట్టి యనంతశక్తి జగదాత్ముని నాభిసరోజమందుఁ నేఁ
బుట్టి యజింపఁగా మనసు పుట్టిన యజ్ఞపదార్థజాతముల్
నెట్టన కానరామికి వినిర్మల మైన తదీయ రూపమున్
గట్టిగ బుద్ధిలో నిలిపి కంటి నుపాయము నా మనంబునన్.
16
పశు యజ్ఞ వాట యూపస్తంభ పాత్ర మృ-
ద్ఘట శరావ వసంత కాలములును
స్నేహౌషధీ బహు లోహ చాతుర్హోత్ర-
మత నామధేయ సన్మంత్రములును
సంకల్ప ఋగ్యజుస్సామ నియుక్త వ-
షట్కారమంత్రానుచరణములును
దక్షిణల్ దేవతాధ్యాన తదనుగత-
తంత్ర వ్రతోద్ధేశ ధరణిసురులు
17
నర్పణంబులు బోధాయనాది కర్మ
సరణి మొదలగు యజ్ఞోపకరణసమితి
యంతయును నమ్మహాత్ముని యవయవములు
గాఁగఁ గల్పించి విధివత్ప్రకారమునను.
18
యజ్ఞాంగి యజ్ఞఫలదుఁడు
యజ్ఞేశుఁడు యజ్ఞకర్తయగు భగవంతున్
యజ్ఞపురుషుఁగా మానస
యజ్ఞముఁ గావించితిం దదర్పణ బుద్ధిన్.
19
అప్పుడు బ్రహ్మలు దమలోఁ
దప్పక ననుఁ జూచి సముచితక్రియు లగుచు
న్నప్పరమేశున కభిమత
మొప్పఁగఁదగు సప్తతంతు వొగిఁ గావింపన్.
20
మనువులు, దేవదానవులు, మానవనాథులు, మర్త్యకోటి, దా
రనయము వారివారికిఁ బ్రియంబగు దేవతలన్ భజించుచున్
ఘనతర నిష్ఠ యజ్ఞములఁ గైకొని చేసిరి; తత్ఫలంబుల
య్యనుపమమూర్తి యజ్ఞమయుఁడైన రమావరునందుఁ జెందఁగన్.
21
సువ్యక్త తంత్రరూపకుఁ
డవ్యక్తుఁ డనంతుఁ డభవుఁ డచ్యుతుఁ డీశుం
డవ్యయుఁడగు హరి సురగణ
సేవ్యుఁడు క్రతుఫలదుఁ డగుటఁ జేసిరి మఖముల్.
22
అగుణుండగు పరమేశుఁడు
జగములఁ గల్పించుకొఱకుఁ జతురత మాయా
సగుణుం డగుఁ గావున హరి
భగవంతుం డనఁగఁ బరఁగె భవ్యచరిత్రా!
23
విశ్వాత్ముఁడు, విశ్వేశుఁడు,
విశ్వమయుం, డఖిలనేత, విష్ణుఁ, డజుం, డీ
విశ్వములోఁ దా నుండును
విశ్వము దనలోనఁ జాల వెలుఁగుచు నుండన్.
24
అతని నియుక్తిఁ జెంది సచరాచర భూతసమేతసృష్టి నే
వితతముగా సృజింతుఁ బ్రభవిష్ణుఁడు విష్ణుఁడు ప్రోచుఁ బార్వతీ
పతి లయమొందఁ జేయు; హరి పంకరుహోదరుఁ డాదిమూర్తి య
చ్యుతుఁడు త్రిశక్తియుక్తుఁ డగుచుండును నింతకుఁ దానమూలమై.
25
విను వత్స! నీవు నన్నడి
గిన ప్రశ్నకు నుత్తరంబు కేవలపరమం
బును బ్రహ్మంబీ యఖిలం
బున కగు నాధార హేతుభూతము సుమ్మీ.
26
హరి భగవంతుఁ డనంతుఁడు
కరుణాంబుధి సృష్టికార్యకారణహేతు
స్ఫురణుం డవ్విభుకంటెం
బరుఁ డెవ్వఁడు లేడు తండ్రి! పరికింపంగన్.
27
ఇది యంతయును నిక్క మే బొంక నుత్కంఠ-
మతిఁ దద్గుణధ్యానమహిమఁ జేసి
పరికింప నే నేమి పలికిన నది యెల్ల-
సత్యంబ యగు బుధస్తుత్య! వినుము;
ధీయుక్త! మామకేంద్రియములు మఱచియుఁ-
బొరయ వసత్యవిస్ఫురణ మెందు;
నదిగాక మత్తను వామ్నాయ తుల్యంబు-
నమరేంద్ర వందనీయంబు నయ్యెఁ;
28
దవిలి యా దేవదేవుని భవమహాబ్ధి
తారణంబును మంగళకారణంబు
నఖిల సంపత్కరంబునై యలరు పాద
వనజమున కే నొనర్చెద వందనములు.
29
ఆ నళినాక్షు నందనుఁడ నయ్యుఁ, బ్రజాపతి నయ్యు, యోగ వి
ద్యా నిపుణుండ నయ్యునుఁ, బదంపడి మజ్జననప్రకారమే
యేను నెఱుంగ, నవ్విభుని యిద్ధమహత్త్వ మెఱుంగ నేర్తునే?
కానఁబడున్ రమేశపరికల్పితవిశ్వము గొంతకొంతయున్.
30
విను వేయేటికిఁ; దాపసప్రవర! యివ్విశ్వాత్ముఁ డీశుండు దాఁ
దన మాయామహిమాంతముం దెలియఁగాఁ దథ్యంబుగాఁ జాలడ
న్నను, నే నైనను మీరలైన సురలైనన్ వామదేవుండు నై
నను నిక్కం బెఱుఁగంగఁ జాలుదుమె జ్ఞానప్రక్రియాయుక్తులన్.
31
ఇతి బమ్మెఱ పోతనామాత్య కృత శ్రీమత్తెలుగు భాగవత ద్వితీయ స్కంధ అంతర్గత బ్రహ్మదేవుని విష్ణుతత్త్వ స్తుతి. (భవభయ తారకం)