స్తుతులు స్తోత్రాలు : బ్రహ్మదేవుని విష్ణు స్తుతి (క్లేశ హరం)
1
అనఘ! సర్వేశ్వరు నాద్యంతశూన్యుని-
ధన్యుని జగదేకమాన్యచరితుఁ
దన్నాభిసరసిజోద్భవసరోజంబును-
నప్పుల ననిలుని నంబరమును
మానిత భువననిర్మాణదృష్టినిఁ బొడ-
గనెఁ గాని యితరముఁ గానలేక
యాత్మీయకర్మబీజాంకురంబును రజో-
గుణయుక్తుఁ డగుచు నకుంఠితప్ర
2
జాభిసర్గాభిముఖత నవ్యక్తమార్గుఁ
డైన హరి యందుఁ దన హృదయంబుఁ జేర్చి
యమ్మహాత్మునిఁ బరము ననంతు నభవు
నజు నమేయుని నిట్లని యభినుతించె.
3
"నలినాక్ష మాయాగుణవ్యతికరమునఁ-
జేసి కార్యంబైన సృష్టిరూప
మునఁ బ్రకాశించు నీ ఘనరూపవిభవంబు-
రూపింప దేహధారులకు దుర్వి
భావ్యంబుఁదలపోయ భగవంతుఁడవునైన-
పద్మాక్ష నీ స్వరూపంబుకంటె
నన్యమొక్కటి సత్యమై బోధకంబైన-
యది లేదుగాన నీ యతులదివ్య
4
మైన రూపంబు నాకుఁ బ్రత్యక్ష మయ్యె
నదియుఁగాక వివేకోదయమునఁ జేసి
వరద! నీ రూప మజ్ఞాన గురుతమో ని
వారకం బయ్యె నాకు శశ్వత్ప్రదీప!
5
ఘన సత్పురుషానుగ్రహ
మునకై యమితావతార మూలం బగుచుం
దనరెడి నీ రూపము శో
భనమగు భవదీయ నాభిపద్మమువలనన్.
6
జననం బందిన నాచే
ననయము మొదలనె గృహీతమయ్యె జగత్పా
వన నీదు సుస్వరూపము
ఘనరుచిరంబై స్వయంప్రకాశక మగుటన్.
7
మఱియు, జ్ఞానానంద పరిపూర్ణమాత్రంబును, ననావృత ప్రకాశంబును, భేదరహితంబునుఁ, బ్రపంచజనకంబును, ప్రపంచవిలక్షణంబును, భూతేంద్రియాత్మకంబును, నేకంబును నైన రూపంబు నొందియు నెందునుఁ బొడగాన నట్టి నిన్ను నాశ్రయించెద; అదియునుంగాక జగన్మంగళ స్వరూపధరుండవై నీ యుపాసకుల మైన మా మంగళంబుకొఱకు నిరంతర ధ్యానంబుచేత నీ దివ్యరూపంబునం గానంబడితివి; ఇట్టి నీవు నిరయభాక్కు లై నిరీశ్వరవాదంబునంజేసి కుతర్కంబులు ప్రసంగించు భాగ్యరహితులచేత నాదృతుండవు గావు; మఱియుం గొందఱు కృతార్థు లైన మహాత్ములచేత భవదీయ శ్రీచరణారవిందకోశగంధంబు వేదమారుతానీతం బగుటంజేసి తమతమ కర్ణకుహరంబులచేత నాఘ్రాణించుచుందురు వారల హృదయకమలంబుల యందు భక్తిపారతంత్ర్యంబున గృహీత పాదారవిందంబులు గలిగి ప్రకాశింతువు; అదియునుం గాక ప్రాణులకు ద్రవ్యాగార సుహృన్నిమిత్తం బయిన భయంబునుఁ దన్నాశనిమిత్తం బయిన శోకంబును ద్రవ్యాది స్పృహయునుం దన్నిమిత్తం బయిన పరిభవంబును, మఱియు నందుఁ దృష్ణయు, నది ప్రయాసంబున లబ్ధం బైన నార్తిమూలం బగు తదీయం బైన వృథాగ్రహంబును, నీ శ్రీపాదారవిందంబు లందు వైముఖ్యం బెంత కాలంబు గలుగు నంతకాలంబు ప్రాప్తంబు లగుం గాని, మానవాత్మనాయకుండ వగు నిన్ను నాశ్ర యించిన భయనివృత్తిహేతు వైన మోక్షంబు గలుగు; మఱియునుం గొందఱు సకలపాపనివర్తకం బయిన త్వదీయ నామస్మరణ కీర్తనంబు లందు విముఖులై కామ్యకర్మ ప్రావీణ్యంబునంజేసి నష్టమతు లై యింద్రియపరతంత్రు లై యమంగళంబు లైన కార్యంబులు సేయుచుందురు; దానంజేసి వాతాది త్రిధాతుమూలం బైన క్షుత్తృడాది దుఃఖంబులచేతను శీతోష్ణ వర్ష వాతాది దుఃఖంబులచేతను నతి దీర్ఘం బైన కామాగ్నిచేతను నవిచ్ఛన్నం బగు క్రోధంబుచేతనుం దప్యమానులగుదురు వారలఁ గనిన నా చిత్తంబు గలంకం బొందు; జీవుండు భవదీయ మాయాపరిభ్రామ్యమాణుం డై యాత్మ వేఱని యెప్పుడు దెలియు నంతకాలంబు నిరర్థకంబై దుస్తరంబైన సంసారసాగరంబుఁ దరియింపఁ జాలకుండు; సన్మునీంద్రు లైనను భవదీయ నామస్మరణంబు మఱచి యితర విషయాసక్తు లైరేని, వారలు దివంబు లందు వృథాప్రయత్ను లై సంచరించుచు రాత్రుల యందు నిద్రాసక్తు లై, స్వప్న గోచరంబు లయిన బహువిధ సంపదలకు నానందించుచు శరీరపరిణామాది పీడలకు దుఃఖించుచుం బ్రతిహతంబు లైన యుద్యోగంబుల భూలోకంబున సంసారులై వర్తింతురు; నిష్కాము లై నిన్ను భజియించు సత్పురుషుల కర్ణమార్గంబులం బ్రవేశించి భవదీయ భక్తియోగ పరిశోధితం బైన హృత్సరోజకర్ణికాపీఠంబున వసియింతువు; అదియునుంగాక.
8
వరయోగీంద్రులు యోగమార్గముల భావంబందు నే నీ మనో
హరరూపంబుఁ దలంచి యే గుణగణధ్యానంబు గావింతు ర
ప్పురుషశ్రేష్ఠ పరిగ్రహంబునకునై పొల్పారఁ దద్ధ్యాన గో
చరమూర్తిన్ ధరియింతుఁ గాదె పరమోత్సాహుండవై మాధవా!
9
అరయ నిష్కామధర్ము లైనట్టి భక్తు
లందు నీవు ప్రసన్నుండ వైనరీతి
హృదయముల బద్ధకాములై యెనయు దేవ
గణము లందుఁ బ్రసన్నతఁ గలుగ వీవు.
10
అరయ సమస్త జీవహృదయంబుల యందు వసించి యేకమై
పరఁగి సుహృత్క్రియానుగుణభాసిత ధర్ముఁడవుం బరాపరే
శ్వరుఁడవునై తనర్చుచు నసజ్జన దుర్లభమైన యట్టి సు
స్థిర మగు సర్వభూతదయచేఁ బొడగానఁగవత్తు వచ్యుతా!
11
క్రతు దానోగ్రత పస్సమాధి జప సత్కర్మాగ్నిహోత్రాఖిల
వ్రతచర్యాదుల నాదరింప వఖిలవ్యాపారపారాయణ
స్థితి నొప్పారెడి పాదపద్మయుగళీసేవాభి పూజా సమ
ర్పిత ధర్ముండగు వాని భంగి నసురారీ! దేవచూడామణీ!
12
తవిలి శశ్వత్స్వరూప చైతన్య భూరి
మహిమచేత నపాస్త సమస్త భేద
మోహుఁడ వఖిల విజ్ఞానమునకు నాశ్ర
యుండ వగు నీకు మ్రొక్కెదనో రమేశ!
13
జననస్థితివిలయంబుల
ననయంబును హేతుభూతమగు మాయాలీ
లను జెంది నటన సలిపెడు
ననఘాత్మక! నీకొనర్తు నభివందనముల్
14
అనఘాత్మ! మఱి భవదవతార గుణకర్మ-
ఘన విడంబన హేతుకంబు లయిన
రమణీయ మగు దాశరథి వసుదేవకు-
మారాది దివ్యనామంబు లోలి
వెలయంగ మనుజులు వివశాత్ములై యవ-
సానకాలంబున సంస్మరించి
జన్మజన్మాంతర సంచిత దురితంబుఁ-
బాసి కైవల్యసంప్రాప్తు లగుదు
15
రట్టి దివ్యావతారంబుల వతరించు
నజుఁడ వగు నీకు మ్రొక్కెద ననఘచరిత!
చిరశుభాకార! నిత్యలక్ష్మీవిహార!
భక్తమందార! దుర్భవభయవిదూర!
16
జననవృద్ధివినాశ హేతుక సంగతిం గల యేను నీ
వును హరుండు ద్రిశాఖలై మనువుల్ మరీచిముఖామరుల్
ఒనర నందుపశాఖలై చెలువొంద నింతకు మూలమై
యనయమున్ భువనద్రుమాకృతివైన నీకిదె మ్రొక్కెదన్.
17
పురుషాధీశ! భవత్పదాబ్జయుగళీపూజాది కర్మక్రియా
పరతం జెందని మూఢచిత్తునిఁ బశుప్రాయున్ మనుష్యాధమున్
జరయున్ నాశము నొందఁ జేయు నతి దక్షంబైన కాలంబు త
ద్గురు కాలాత్ముఁడ వైన నీకు మది సంతోషంబునన్ మ్రొక్కెదన్.
18
సర్వేశ! కల్పాంతసంస్థిత మగు జల-
జాత మం దేను సంజనన మంది
భవదీయ సుస్వరూపముఁ జూడ నర్థించి-
బహువత్సరములు దపంబుఁ జేసి
క్రతుకర్మములు పెక్కు గావించియును నినుఁ-
బొడగానఁగాలేక బుద్ధి భీతిఁ
బొందిన నాకు నిప్పుడును నిర్హేతుక-
కరుణచే నఖిలలోకైకవంద్య
19
మాన సతత ప్రసన్న కోమల ముఖాబ్జ
కలిత భవదీయ దివ్యమంగళవిలాస
మూర్తి దర్శింపఁ గలిగె భక్తార్తిహరణ
కరణ! తుభ్యంనమో విశ్వభరణ! దేవ!
20
అమర తిర్యఙ్మనుష్యాది చేతన యోను-
లందు నాత్మేచ్ఛచేఁ జెందినట్టి
కమనీయ శుభమూర్తి గలవాడ వై ధర్మ-
సేతు వనంగఁ బ్రఖ్యాతి నొంది
విషయసుఖంబుల విడిచి సంతత నిజా-
నందానుభవ సమున్నతిఁ దనర్తు
వదిగాన పురుషోత్తమాఖ్యఁ జెన్నొందుదు-
వట్టి నిన్నెప్పుడు నభినుతింతు
21
నర్థి భవదీయపాదంబులాశ్రయింతు
మహితభక్తిని నీకు నమస్కరింతు
భక్తజనపోష! పరితోష! పరమపురుష!
ప్రవిమలాకార! సంసారభయవిదూర!
22
తలకొని పంచభూతప్రవర్తకమైన-
భూరిమాయాగుణస్ఫురణఁ జిక్కు
వడక లోకంబులు భవదీయ జఠరంబు-
లో నిల్పి ఘనసమాలోల చటుల
సర్వంకషోర్మి భీషణ వార్థి నడుమను-
ఫణిరాజభోగతల్పంబు నందు
యోగనిద్రారతి నుండగ నొకకొంత-
కాలంబు సనఁగ మేల్కనిన వేళ
23
నలఘు భవదీయనాభితోయజమువలనఁ
గలిగి ముల్లోకములు సోపకరణములుగఁ
బుట్టఁ జేసితి వతుల విభూతి మెఱసి
పుండరీకాక్ష! సంతతభువనరక్ష!
24
నిగమస్తుత! లక్ష్మీపతి!
జగదంతర్యామి వగుచు సర్గము నెల్లం
దగు భవదైశ్వర్యంబున
నగణిత సౌఖ్యానుభవము నందింతు గదే.
25
జలజాక్ష! యెట్టి విజ్ఞానబలంబునఁ-
గల్పింతు వఖిలలోకంబు లోలి
నతజనప్రియుఁడవు నా కట్టి సుజ్ఞాన-
మర్థిమైఁ గృపసేయు మయ్య వరద!
సృష్టినిర్మాణేచ్ఛఁ జెంది నా చిత్తంబుఁ-
దత్కర్మకౌశలిఁ దగిలి యుండి
యునుఁ గర్మవైషమ్యమునుఁ బొందు కతమున-
దురితంబుఁ బొరయక తొలగు నట్టి
26
వెఱవు నా కెట్లు కలుగు నవ్విధముఁ దలచి
కర్మవర్తను నను భవత్కరుణ మెఱసి
తగఁ గృతార్థునిఁ జేయవే నిగమవినుత!
సత్కృపామూర్తి! యో దేవచక్రవర్తి!
27
భవ దుదరప్రభూత మగు పద్మము నందు వసించి యున్న నే
నవిరళ తావకీన కలితాంశమునం దనరారు విశ్వముం
దవిలి రచించుచున్ బహువిధంబులఁ బల్కెడి వేదజాలముల్
శివతరమై ఫలింపఁ గృపసేయుము భక్తఫలప్రదాయకా!"
28
అని యనుకంపదోఁప వినయంబునఁ జాఁగిలి మ్రొక్కి చారులో
చన సరసీరుహుం డగుచు సర్వజగత్పరికల్పనా రతిం
దనరిన నన్నుఁ బ్రోచుటకుఁ దా నిటు సన్నిధి యైన యీశ్వరుం
డనయము నాదు దుఃఖము దయామతిఁ బాపెడు నంచు నమ్రుడై
29
వనరుహసంజాతుఁడు నె
మ్మనమున హర్షించె ననుచు"మైత్రేయమహా
ముని ఘనుఁడగు విదురునకున్
వినయంబున నెఱుఁగజెప్పి వెండియుఁ బలికెన్.
30
"వనజాతప్రభవుండు కేవలతపోవ్యాసంగుఁ డై పద్మలో
చను గోవిందు ననంతు నాఢ్యుఁ దన వాక్ఛక్తిన్ నుతింపన్ సుధా
శనవంద్యుండు ప్రసన్నుఁ డై నిఖిల విశ్వస్థాపనాలోకనం
బునఁ జూచెన్ విలయప్రభూత బహువాఃపూరంబులన్ వ్రేల్మిడిన్.
31
అట్లు వొడగని యార్తుఁ డైనట్టి పద్మ
భవుని వాంఛిత మాత్మఁ దీర్పగఁ దలంచి
యతని మోహనివారక మైన యట్టి
యమృతరసతుల్య మధురవాక్యముల ననియె.
32
"తలకొని నీ యొనర్చు పనిదప్పి మదిం దలపోయు దుఃఖముం
దలఁగుము నాదు లీలకుఁ బ్రధానగుణం బగు సృష్టికల్పనం
బలవడఁ జేయు బుద్ధి హృదయంబునఁ జొన్పి తపస్సమాధి ని
ష్ఠల నతిభక్తులన్ ననుఁ బ్రసన్నునిఁ జేయుము చెందు కోరికల్.
33
నీ వొనరించు తపోవి
ద్యావిభవ విలోకనీయ మగు నీ సృష్టిం
గావింపుము లోకంబుల
లో వెఁలిగెడి నన్నుఁ గందు లోకస్తుత్యా!
34
నాలోని జీవకోటులు
వాలాయము నీకుఁ గానవచ్చు నిపుడు నీ
వాలోకింపుము దారువి
లోల హుతాశనునికరణి లోకస్తుత్యా!
35
నలువొంద నఖిలజీవుల యందుఁ గల నన్నుఁ-
దెలిసి సేవింపుము నలినగర్భ!
భవదీయ దోషముల్ వాయును భూతేంద్రి-
యాశ్రయ విరహిత మై విశుద్ధ
మైన జీవుని విమలాంతరాత్ముఁడ నైన-
నను నేకముగఁ జూచు నరుఁడు మోక్ష
పదమార్గవర్తి యై భాసిల్లు బ్రహ్మాండ-
మందును వివిధకర్మానురూప
36
పద్ధతులఁ జేసి పెక్కురూపముల నొందు
జీవతతి రచియించు నీ చిత్త మెపుడు
మత్పదాంబుజయుగళంబు మరగి యున్న
కతన రాజసగుణమునఁ గలుగ దనఘ!
37
విను మదియుఁ గాక ప్రాణుల
కనయము నెఱుఁగంగరాని యనఘుఁడఁ దేజో
ధనుఁడఁ బరేశుఁడ నీచే
తను గానంబడితి నిదె పితామహ! కంటే.
38
మఱియు, భూతేంద్రియగుణాత్ముం డనియు జగన్మయుం డనియు నన్ను నీ చిత్తంబు నందుఁ దలంపుము; తామరసనాళవివర పథంబు వెంటం జని జలంబులలోనం జూడం గోరి నట్టి మదీయ స్వరూపంబు.
39
నీ కిప్పుఁడు గానంబడె
నాకులకును నురగపతి పినాకులకైనన్
వాకొనఁగం దలపోయను
రాకుండు మదీయ రూపరమ్యత్వంబుల్.
40
కావున మచ్చారిత్ర క
థా విలసిత మైన సుమహితస్తవము జగ
త్పావనము విగతసంశయ
భావుఁడ వై బుద్ధినిలుపు పంకజజన్మా!
41
సగుణుఁడ నై లీలార్థము
జగములఁ గల్పింపఁ దలచు చతురుని నన్నున్
సగుణునిఁగా నుతియించితి
తగ సంతస మయ్యె నాకుఁ దామరసభవా!
42
ఈ మంజుస్తవరాజము
నీ మనమునఁ జింతఁ దక్కి నిలుపుము భక్తిన్
ధీమహిత! నీ మనంబునఁ
గామించిన కోర్కు లెల్లఁ గలుగుం జుమ్మీ.
43
అనుదినమునుఁ ద్రిజగత్పా
వనమగు నీ మంగళస్తవంబుఁ బఠింపన్
వినినను జనులకు నేఁ బొడ
గనఁబడుదు నవాప్తసకలకాముఁడ నగుచున్.
44
వన తటా కోపనయన వివాహ దేవ
భవన నిర్మాణ భూమ్యాదివివిధదాన
జప తపోవ్రత యోగ యజ్ఞముల ఫలము
మామక స్తవఫలంబు సమంబు గాదు.
45
జీవావలిఁ గల్పించుచుఁ
జీవావలిలోనఁ దగ వసించుచుఁ బ్రియవ
స్త్వావలిలోపలఁ బ్రియవ
స్త్వావలి యై యుండు నన్ను ననిశముఁ బ్రీతిన్.
46
తలఁపుము మత్ప్రీతికి నై
కలిగించితి నిన్ను భువనకారణ! నాలో
పల నడగి యేకమై ని
శ్చలగతి వసియించి యున్న జగముల నెల్లన్.
47
తగ నహంకారమూలతత్త్వంబు నొంది
నీవు పుట్టింపు"మనుచు రాజీవభవుఁడు
వినఁగ నానతి యిచ్చి యవ్వనజనాభుఁ
డంత నంతర్హితుం డయ్యె ననఘచరిత!"
48
ఇతి బమ్మెఱ పోతనామాత్య కృత శ్రీమత్తెలుగు భాగవత తృతీయ స్కంధ అంతర్గత బ్రహ్మదేవుని విష్ణు స్తుతి (క్లేశ హరం)