స్తుతులు స్తోత్రాలు : ధ్రువుని విష్ణు స్తుతి (వాంచితార్థ ప్రదం)
1
ఇట్లు దండప్రణామంబు లాచరించి కృతాంజలి యై స్తోత్రంబు చేయ నిశ్చయించియు స్తుతిక్రియాకరణ సమర్థుండుఁ గాక యున్న ధ్రువునకును సమస్త భూతంబులకు నంతర్యామి యైన యీశ్వరుం డాతని తలంపెఱింగి వేదమయం బయిన తన శంఖంబు చేత నబ్బాలుని కపోలతలం బంటిన జీవేశ్వర నిర్ణయజ్ఞుండును, భక్తిభావ నిష్ఠుండును నగు ధ్రువుండు నిఖిలలోక విఖ్యాత కీర్తిగల యీశ్వరుని భగవత్ప్రతిపాదితంబు లగుచు వేదాత్మకంబులైన తన వాక్కుల నిట్లని స్తుతియించె “దేవా! నిఖిలశక్తి ధరుండవు నంతఃప్రవిష్టుండవు నైన నీవు లీనంబు లైన మదీయ వాక్యంబులం బ్రాణేంద్రియంబులం గరచరణ శ్రవణత్వ గాదులను జిచ్ఛక్తిచేఁ గృపంజేసి జీవింపం జేసిన భగవంతుం డవును, బరమపురుషుండవును నైన నీకు నమస్కరింతు; నీ వొక్కరుండవయ్యు మహదాద్యంబైన యీ యశేష విశ్వంబు మాయాఖ్యం బయిన యా త్మీయశక్తిచేతం గల్పించి యందుం బ్రవేశించి యింద్రియంబు లందు వసించుచుఁ దత్తద్దేవతారూపంబులచే నానా ప్రకారంబుల దారువు లందున్న వహ్ని చందంబునం బ్రకాశింతు; వదియునుం గాక.
2
వరమతి నార్తబాంధవ! భవద్ఝన బోధసమేతుఁడై భవ
చ్చరణముఁ బొంది నట్టి విధి సర్గము సుప్తజనుండు బోధమం
దరయఁగఁ జూచురీతిఁ గనునట్టి ముముక్షు శరణ్యమైన నీ
చరణములం గృతజ్ఞుఁడగు సజ్జనుఁ డెట్లు దలంపకుండెడున్?
3
మహితాత్మ! మఱి జన్మమరణ ప్రణాశన-
హేతు భూతుండవు నిద్ధకల్ప
తరువవు నగు నిన్నుఁ దగనెవ్వరే నేమి-
పూని నీ మాయా విమోహితాత్ము
లగుచు ధర్మార్థ కామాదుల కొఱకుఁ దా-
మర్చించుచును ద్రిగుణాభమైన
దేహోపభోగ్యమై దీపించు సుఖముల-
నెనయంగ మదిలోన నెంతు; రట్టి
4
విషయ సంబంధ జన్యమై వెలయు సుఖము
వారికి నిరయమందును వఱలు దేవ!
భూరి సంసార తాప నివార గుణ క
థామృతాపూర్ణ! యీశ! మాధవ! ముకుంద!
5
అరవిందోదర! తావకీన చరణధ్యానానురాగోల్లస
చ్చరితాకర్ణనజాత భూరిసుఖముల్ స్వానందకబ్రహ్మ మం
దరయన్ లేవఁట; దండ భృద్భట విమానాకీర్ణులై కూలు నా
సురలోకస్థులఁ జెప్పనేల? సుజనస్తోమైక చింతామణీ!
6
హరి! భజనీయ మార్గనియతాత్మకులై భవదీయ మూర్తిపై
వఱలిన భక్తియుక్తు లగువారల సంగతిఁ గల్గఁజేయు స
త్పురుష సుసంగతిన్ వ్యసనదుస్తర సాగర మప్రయత్నతన్
సరస భవత్కథామృత రసంబున మత్తుఁడనై తరించెదన్.
7
నిరతముఁ దావకీన భజనీయ పదాబ్జ సుగంధలబ్ధి నె
వ్వరి మది వొందఁగాఁ గలుగు, వారలు తత్ప్రియ మర్త్యదేహముం
గరము తదీయ దార సుత కామ సుహృద్గృహ బంధు వర్గమున్
మఱతురు విశ్వతోముఖ! రమాహృదయేశ! ముకుంద! మాధవా!
8
పరమాత్మ! మర్త్య సుపర్వ తిర్యఙ్మృగ-
దితిజ సరీసృప ద్విజగణాది
సంవ్యాప్తమును సదసద్విశేషంబును-
గైకొని మహదాది కారణంబు
నైన విరాడ్విగ్రహంబు నే నెఱుఁగుఁదుఁ-
గాని తక్కిన సుమంగళమునైన
సంతత సుమహితైశ్వర్య రూపంబును-
భూరిశబ్దాది వ్యాపార శూన్య
9
మైన బ్రహ్మస్వరూప మే నాత్మ నెఱుఁగఁ
బ్రవిమలాకార! సంసారభయవిదూర!
పరమమునిగేయ! సంతతభాగధేయ!
నళిననేత్ర! రమాలలనాకళత్ర!
10
సర్వేశ! కల్పాంత సమయంబు నందు నీ-
యఖిల ప్రపంచంబు నాహరించి
యనయంబు శేషసహాయుండవై శేష-
పర్యంక తలమునఁ బవ్వళించి
యోగనిద్రా రతి నుండి నాభీసింధు-
జస్వర్ణలోక కంజాత గర్భ
మందుఁ జతుర్ముఖు నమరఁ బుట్టించుచు-
రుచి నొప్పు బ్రహ్మస్వరూపి వైన
11
నీకు మ్రొక్కెద నత్యంత నియమ మొప్ప
భవ్యచారిత్ర! పంకజపత్రనేత్ర!
చిరశుభాకార! నిత్యలక్ష్మీవిహార!
యవ్యయానంద! గోవింద! హరి! ముకుంద!
12
అట్లు యోగనిద్రా పరవశుండ వయ్యును జీవులకంటె నత్యంత విలక్షణుండ వై యుండుదు; వది యెట్లనిన బుద్ధ్యవస్థాభేదంబున నఖండితం బయిన స్వశక్తిం జేసి చూచు లోకపాలన నిమిత్తంబు యజ్ఞాధిష్ఠాతవు గావున నీవు నిత్యముక్తుండవును, బరిశుద్ధుండవును, సర్వజ్ఞుండవును, నాత్మవును, గూటస్థుండవును, నాదిపురుషుండవును, భగవంతుండవును, గుణత్రయాధీశ్వరుండవును నై వర్తింతువు; భాగ్యహీనుండైన జీవుని యందు నీ గుణంబులు గలుగవు; ఏ సర్వేశ్వరునం దేమి విరుద్ధగతులై వివిధ శక్తి యుక్తంబు లైన యవిద్యాదు లానుపూర్వ్యంబునం జేసి ప్రలీనంబు లగుచుం; డట్టి విశ్వకారణంబు నేకంబు ననంతంబు నాద్యంబు నానందమాత్రంబు నవికారంబు నగు బ్రహ్మంబునకు నమస్కరించెద; మఱియు దేవా! నీవ సర్వవిధఫలం బని చింతించు నిష్కాము లయినవారికి రాజ్యాదికామితంబులలోనఁ బరమార్థం బయిన ఫలంబు సర్వార్థరూపుండవైన భవదీయ పాద పద్మ సేవనంబ; నిట్లు నిశ్చితంబ యైనను సకాములయిన దీనులను గోవు వత్సంబును స్తన్యపానంబు చేయించుచు, వృకాది భయంబు వలన రక్షించు చందంబునం గామప్రదుండవై సంసార భయంబు వలన బాపుదు;” వని యిట్లు సత్యసంకల్పుండును, సుజ్ఞానియు నయిన ధ్రువునిచేత వినుతింపంబడి భృత్యానురక్తుం డైన భగవంతుండు సంతుష్టాంతరంగుండై యిట్లనియె.
13
ఇతి బమ్మెఱ పోతనామాత్య కృత శ్రీమత్తెలుగు భాగవత చతుర్థ స్కంధ అంతర్గత ధ్రువుని విష్ణు స్తుతి (వాంచితార్థ ప్రదం)