స్తుతులు స్తోత్రాలు : * దేవతల నారాయణ స్తుతి (అభీష్ట ప్రదము)
1
"దుర్గమంబు లయిన స్వర్గాది ఫలములఁ
బుట్టఁజేయఁ జాలునట్టి గుణము
గలిగి మెలఁగుచున్న ఘనుఁడ వై నట్టి నీ
కరయ మ్రొక్కువార మాదిపురుష!
2
దండంబు యోగీంద్రమండల నుతునకు-
దండంబు శార్ఙ్ఘ కోదండునకును;
దండంబు మండిత కుండల ద్వయునకు-
దండంబు నిష్ఠుర భండనునకు;
దండంబు మత్తవేదండ రక్షకునకు-
దండంబు రాక్షసఖండనునకు;
దండంబు పూర్ణేందు మండల ముఖునకు-
దండంబు తేజః ప్రచండునకును;
3
దండ మద్భుత పుణ్యప్రధానునకును;
దండ ముత్తమ వైకుంఠధామునకును;
దండ మాశ్రిత రక్షణ తత్పరునకు;
దండ మురు భోగినాయక తల్పునకును.
4
చిక్కిరి దేవతావరులు చిందఱ వందఱలైరి ఖేచరుల్;
స్రుక్కిరి సాధ్యసంఘములు; సోలిరి పన్నగు లాజి భూమిలో;
మ్రక్కిరి దివ్యకోటి; గడు మ్రగ్గిరి యక్షులు వృత్రుచేత నీ
చిక్కినవారి నైన దయచేయుము నొవ్వకయండ నో! హరీ!
5
మొదలాఱిన రక్కసులకు
మొదలై మా కాపదలకు మూలం బగుచుం
దుద మొదలు లేని రక్కసు
తుది చూపఁ గదయ్య! తుదకుఁ దుది యైన హరీ!
6
అకట! దిక్కుల కెల్ల దిక్కైన మాకు
నొక్క దిక్కును లేదు కాలూనఁ నైన;
దిక్కుగావయ్య! నేఁడు మా దిక్కుఁ జూచి
దిక్కు లేకున్నవారల దిక్కు నీవ.
7
నీ దిక్కు గానివారికి
నే దిక్కును లేదు వెదక యిహపరములకున్
మోదింపఁ దలఁచువారికి
నీ దిక్కే దిక్కు సుమ్ము; నీరజనాభా!
8
అరయ మాతేజములతోడ నాయుధములు
మ్రింగి భువన త్రయంబును మ్రింగుచున్న
భీకరాకారు వృత్రునిఁ బీచ మడఁచి
యెల్ల భంగుల మా భంగ మీఁగు మభవ!
9
పరమపురుష! దుఃఖభంజన! పరమేశ!
భక్తవరద! కృష్ణ! భవవిదూర!
జలరుహాక్ష! నిన్ను శరణంబు వేఁడెద
మభయ మిచ్చి కావవయ్య! మమ్ము.
10
నమస్తే భగవన్నారాయణ! వాసుదేవ! యాదిపురుష! మహానుభావ! పరమమంగళ! పరమకళ్యాణ! దేవ! పరమకారుణికు లయిన పరమహంస లగు పరివ్రాజకులచేత నాచరితంబు లగు పరమసమాధి భేదంబులఁ బరిస్ఫుటం బయిన పరమహంస ధర్మంబుచేత నుద్ఘాటితం బగు తమః కవాటద్వారంబున రసావృతంబయిన యాత్మలోకంబున నుపలబ్ధమాతృండవై, నిజ సుఖానుభవుండ వై యున్న నీ వాత్మ సమవేతంబు లై యపేక్షింపఁ బడని శరీరంబులకు నుత్పత్తి స్థితి లయ కారణుండ వై యుండుదువు; గుణసర్గ భావితుండవై యపరిమిత గుణగణంబులుగల నీవు, దేవదత్తుని మాడ్కిఁ బారతంత్ర్యంబున నబ్బిన కుశల ఫలంబుల ననుభవించి చింతింతువు; షడ్గుణైశ్వర్యసంపన్నుండవైన నీ వాత్మారాముండ వయి యుండుదువు; గుణసర్గ భావితుండవయి యపరిమిత గుణగణంబు లర్వాచీన వితర్క విచార ప్రమాణభావంబులగు తర్కశాస్త్రంబులఁ గర్కశంబు లయిన ప్రజ్ఞలు గలిగి, దురవగ్రహవాదు లయిన విద్వాంసుల వివాదానుసరణంబుల యందు నుపరతంబులగు నస్తినాస్తీత్యాది వాక్యంబుల సమస్త మాయామయుండ వై నిజ మాయచేతఁ గానంబడక యుక్తిగోచరుండవై, సమస్త విషమ రూపంబులఁ బ్రవర్తింతువు; దేవా! రజ్జువు నందు సర్పభ్రాంతి గలుగునట్లు ద్రవ్యాంతరంబులచేత బ్రహ్మం బయిన నీ యందుఁ బ్రపంచ భ్రాంతి గలుగుచుండు సర్వేశ్వరా! సర్వజగత్కారణరూపం బైన నీవు సర్వభూత ప్రత్యగాత్మ వగుటంజేసి సర్వగుణాభావభాసోపలక్షితుడవై కానంబడుదువు, లోకేశ్వరా! భవన్మహిమ మహామృతసముద్ర విప్రుట్సకృత్పాన మాత్రంబున సంతుష్టచిత్తులై, నిరంతర సుఖంబున విస్పారిత దృష్ట శ్రుత విషయ సుఖ లేశాభాసులైన పరమభాగవతులు భవచ్చరణకమల సేవాధర్మంబు విడువరు; త్రిభువనాత్మభవ! త్రివిక్రమ! త్రినయన! త్రిలోక మనోహరానుభావ! భవదీయ వైభవ విభూతి భేదంబు లైన దనుజాదులకు ననుపమక్రమ సమయం బెఱింగి, నిజమాయాబలంబున సుర నర మృగ జలచరాది రూపంబులు ధరియించి, తదీయావతారంబుల ననురూపంబైన విధంబున శిక్షింతువు; భక్తవత్సలా! భవన్ముఖ కమల నిర్గత మధుర వచనామృత కళావిశేషంబుల, నిజ దాసులమైన మా హృదయతాపం బడంగింపుము; జగదుత్పత్తి స్థితి లయకారణ ప్రధాన దివ్య మాయా వినోదవర్తివై సర్వజీవనికాయంబులకు బాహ్యభ్యంతరంబుల యందు బ్రహ్మ ప్రత్యగాత్మ స్వరూప ప్రధానరూపంబుల దేశకాల దేహావస్థాన విశేషంబులఁ, దదుపాదాను భవంబులు గలిగి, సర్వప్రత్యయసాక్షివై, సాక్షాత్పరబ్రహ్మస్వరూపుండవై యుండెడి నీకు నేమని విన్నవించువారము? జగదాశ్రయంబై, వివిధ వృజిన సంసార పరిశ్రమోపశమనం బైన భవదీయ దివ్యచరణ శతపలాశచ్ఛాయ నాశ్రయించెద;"మని పెక్కువిధంబుల వినుతించి యిట్లనిరి.
11
"తేజంబు నాయువును వి
భ్రాజిత దివ్యాయుధములుఁ బరువడి వృత్రుం
డాజి ముఖంబున మ్రింగెను
మా జయ మింకెందుఁ? జెప్పుమా; జగదీశా! "
12
ఇతి బమ్మెఱ పోతనామాత్య కృత శ్రీమత్తెలుగు భాగవత షష్ఠ స్కంధ అంతర్గత దేవతల నారాయణ స్తుతి (అభీష్ట ప్రదము)